ఈ అడవిలో బుట్టి...
ఈ అడవిలో బుట్టి- ఈ అడివిలో పెరిగి
ఈ కొండ కోనల్తో- కలసి జీవించాము
పోలవరం కడతరా- పాలకులు
పాడే మాకు గడుతరా- పాలకులు
ఏ పచ్చులయి పోదుమో- ఈ అడివిలో
ఎటుగాని బతుకాయెను- ఈ అడివిలో
॥ ఈ అడవి॥
తాత తండ్రుల నుంచి- తావరం జేసుకొని
గుట్టల్లో చెట్లల్లో- గూడు కట్టుకోని
పోడుగొట్టి బతికినాం- అడివోల్లం
గోడు మాకు పెడుతరా- పాలకులు
॥ ఈ అడవి॥
మా నోర్లు మూసి- ఊర్లన్ని ముంచేసి
మా భూములు దోసి- మోసము చేసి
పోలవరం గట్టితే- పాలకులు
ఇల్లంబులే ఎత్తుతాం- అడివోల్లం
॥ ఈ అడవి॥
ఆకు తేనే బంక - కలప గొట్టుకోని
పూటకెళ్ళక మేము- వేట కెళ్ళినాము
మా ఆకలి కేకలినలే- ఊ పాలకులు
అడవికే ఎసరు బెట్టే- ఈ పాలకులు
॥ ఈ అడవి॥
శరణు గోరినం- మా శబరి తల్లమ్మా
ఆదివాసులాను- అడివి వూపాణులాను
గోదాట్ల ముంచుతరా- ఈ అడివోళ్ల
గోసబుచ్చు కుంటరా- పాలకులు
॥ ఈ అడవి॥
మా బీడు భూములు- పడావు బడి ఉంటె
మా కొండ కోయోళ్ల- గిరిజన జాతుల
ఎతలాను ఎవడినలే- పాలకులు
కత లీడ నడవవనే- అడివోళ్ల
॥ ఈ అడవి॥
రాముడా దేవుడా - నీకే దిక్కెలేదు
నీళ్లల్లో మునిగితె- నిన్నెట్ల మొక్కుదుం
సీతమ్మా చెరలోచ్చెనా- అడివోళ్లకు
సేప్పరాని ఎతలోచ్చెరా- అడివోళ్లకు
॥ ఈ అడవి॥
మేమాది వాసులం - ఈ అడివిమాదే
భీము, రాంజీ - భీర్సాముండా దార్లో
తోడగొట్టి చెపుతున్నము- అడివోళ్లం
తిరుగు బాటే చేస్తము- అడివోళ్లం
పోరుదారి బడతము- అడివోళ్లం
పోలవరం ఆపుతాం- అడివోళ్లం
॥ ఈ అడవి॥
- పయిలం సంతోష్
Other Articles