తెలంగాణ గజల్
కలిసుందామంటూనే కాళ్లకింద నిప్పు!
ముందింకా ముసురుతుంది ముదురుతున్న ముప్పు!!
అన్యజాతులెన్ని కలిసి అలరె తెలంగాణ!
సీమాంధ్రులతో ఎందుకు కలుగుతున్న ముప్పు!!
పిట్టలవలె రాలుతున్న తెలంగాణ కూనలు!
గుట్టలవలె రాసులయిరి చుట్టుకొనెను ముప్పు!!
ఒకే భాష కలిగియున్న ఎన్నో దేశాలు!
ఎన్నో రాష్ట్రాలున్నా కలిగెనేమి ముప్పు!!
విశ్వామిత్రుని తనయులు ఆంధ్ర, పుళిందాదులు!
నచ్చకనే పారద్రోలె కలుగునంచు ముప్పు!!
అంటుకున్న వారికెల్ల కంటగింపులయిరి!
తరిమేసిరి తమిళనాట తలచి నాడె ముప్పు!!
ఆపార్టీ ఈ పార్టీ ఆంధ్రులంత ఒకటే!
తెలంగాణ ఏకమైతె తొలగునింక ముప్పు!!
అలసి సొలసి ఆత్మత్యాగ బలిదానాలొద్దు!
ఆంధ్రపెత్తనాల అంతు చూడకున్న ముప్పు!!
భాషొక్కటి యంచు బుదగరించిరి ‘కాసోజు’
తరుమకున్న వదలదింక తెలంగాణ ముప్పు!!
-కాసోజు లక్ష్మీనారాయణ
Other Articles