అమ్మకు ఉత్తరం..
నవంబర్ 17,2011న జీవిత, జీవితేతర ఖైదీలకు క్షమాదానం కోరుతూ రాజకీయ ఖైదీలమంతా ఒక రోజు నిరాహారదీక్షకు పిలుపునిచ్చాము. ఆరోజే హెచ్‌ఎం టీవీ వాళ్లు చర్లపల్లి జైల్లో ‘మార్మోగుతున్న పాట’ కార్యక్షికమాన్ని నిర్వహించారు. జీవిత- జీవితేతర ఖైదీల ముంద స్తు విడుదల గురించి ఖైదీలు కనిపించని చంద్రునితో మొరపెట్టుకునే పాటొకటి పాడటానికైనా మా బోటివాళ్లకు అవకాశం రాని మాట ఎలా ఉన్నా, ఖైదీల గురించి పాడిన పాటలన్నీ ఎంతో మందిని కన్నీళ్లు పెట్టించాయి. నిజానికవి కన్నీళ్లు కాదు. ఆరిపోతున్న జ్ఞాపకాలను కన్నీళ్లతో పదును పెట్టుకున్నారు. తమ ఆశలను చిగురింప చేసుకున్నారు. ఆశగా భవిష్యత్తు కోసం ఎదిరిచూస్తున్న వీరిని బాహ్య ప్రపంచం అక్కున చేర్చుకోవడానికి ఆహ్వానించాలి.
నేను పదిమందిలో కంటనీరు పెట్టుకోని విజేతనో, ఒంటరిగా విలపించే పరాజితనో గానీ.. ఆరాత్రి మా అమ్మ నన్ను నిద్రపోనివ్వలేదు. అందుకే మా అమ్మ మల్లమ్మకు ఉత్తరం రాస్తూ ఒక పాట రాశాను. సరిగ్గా ముప్పయ్యేళ్ల క్రితం ఆంటే 1981లో నేను కరీంనగర్ జైల్లో ఉండగానే మానాయన బాలయ్య గొంతు క్యాన్సర్‌తో మరణించాడు. అన్న రాజన్న రహస్య జీవితంలో ఉన్నాడు. కూత వేటు దూరంలోనే ఉన్నా కోర్టు ద్వారా నన్ను తండ్రి అంతిమ సంస్కారానికి తీసుకుపోయే ప్రయత్నం ఎవ్వ రూ చేయనట్టున్నారు. మా అమ్మనే తండ్రి చితికి అగ్గిపెట్టి అంతి మ సంస్కారాలు చేసింది. ఆ సమయంలో నేను జైల్లోనే మల్లోజుల వేణుగోపాల్‌రావు, పోరెడ్డి వెంకటడ్డి తదితరులతో కలిసి ఉన్నాము.
మా అమ్మ మల్లమ్మ 1977-78లో కోటేశ్వరరావుకు పలుమార్లు అన్నం పెట్టింది. మా అమ్మ కిషన్‌జీ జ్ఞాపకాలను పాటగా రాశాను. తిరిగి జైల్లో మార్మోగిన పాట తర్వాత మా అమ్మను పరామర్శిస్తున్న ఈ పాటను రెండు మాటలను ఉత్తరంగా రాస్తున్నాను. మా అమ్మకు చదువు రాదు. బహుషా పాటలను విని ఆనందించేందుకు వినికిడి కూడా లేదు. కానీ నా జ్ఞాపకం ఉన్న ది.. నా జాడను నీకు తెలుపుతున్నానన్న సంతృప్తి. నాలాంటి వేలాదిమంది ఖైదీ కొడుకుల తరఫున..
నీ మదిపై అక్షరాల చిత్రణం
అమ్మా మా యమ్మ
మల్లమ్మ నీకు రాస్తున్న ఉత్తరం
నీ చెమట కడవలల్లొ
కవ్వమేసి చిలుకలేక
ఏరుకున్న పరిగ్నై
నీ కడుపుకు అందిరాక
చెప్పలేక చెబుతున్నా నా చిరునామా
విప్లవిస్తే తప్పని చెరనుంచే
వీలునామా
అమ్మా మాయమ్మా
మల్లమ్మ నీకు రాస్తున్నా ఉత్తరం
//అమ్మ//
నీవేమో చెదిరి పోయిన
ఎదురు చూపువక్కడ
ఎటుజూసిన గోడలె
నలుదిక్కులిక్కడా
నువు పంచిన నెత్తురే
సిరాజేసి రాస్తున్నా
నీ కన్నీళ్లను తుడ్వలేక
అక్షరాలు జేస్తున్నా //అమ్మ//
బడుల బదులు జైళ్లన్ని
బడుగులతో నిండి ఉంటె
తెలుపు బట్ట నీలి గీత
శిక్షల ముద్రేసి ఉంటె
నేరాల ఘోరాల అధికారమే పగ్గాలతో
కోట్లాది జీవితాల వసంతాల్ని ఉరితీస్తే //అమ్మ//
ఎదిరి చూసె ములాఖతు
నెలలైనా కదిలిరాక
ఏండ్లనుంచి సెలవు లేక
బతుకులన్ని ముండ్లమీద
తప్పేదో ఒప్పేదో అప్పీలు తేల్చలేక
జీవిత ఖైదీలకు క్షమాదాన మందిరాక //అమ్మ//
గాలి మెడలో తాళియని
ఆలి కుమిలి పోతుంది
పంజరంలో బిడ్డలని
తల్లి మొత్తుకుంటుంది
ఏ పిల్లల తలరాతని నే రాయగలనులే
చూపులేని దేవతగా
న్యాయమై పాయెనే //అమ్మ//
అందీ అందని దూరం
అందుకోక చెప్పుకోక
నీ కడుపులో ప్రేమలన్ని
నా గడపకు చేరలేక
కనిపించని వెన్నెలతో కబురైతె పంపుతున్న
వినిపించని నీ గొంతును
వీణగా జేసుకున్న //అమ్మ//
మిలమిల చుక్కలు మెరిసె
ఆకాశపందిరుంది
రాలిపడిన కబురు వింటు
బరువుగా తెల్లారుతుంది
నా అంతరంగంలో
నీ కెంత చోటుందో
నీ లాంటి తల్లుల అంతరాత్మ
ఏమంటుందో //అమ్మ//
సుడులు తిరిగె మనసునిండ
కడలిలాగె ఆటు పోట్లు
అయ్యలేక కొడుకు రాక
గడిచి పోయె ముప్పయేండ్లు
బంధిగాని ఆశయాల్లో
బంధువై నీవుంటే
విశ్వమంత స్వేచ్ఛగా విహరిస్తూ వస్తానని //అమ్మ//
అమ్మా నీకందితే ఈ నా ఉత్తరం
నాజాడ దెల్సి కొంతైనా తీరునో శోకం
అమ్మా మా యమ్మా
మల్లమ్మ నీకు రాస్తున్నా ఉత్తరం //అమ్మ//
Other Articles