సాహితీ సోపతి...
స్నేహానికి చిరునామా కృష్ణుడు, కుచేలుడే!
వాళ్లను తలపించేవాళ్లు యుగానికి కొందరుంటారు...
కలియుగంలో ఏవి కలుషితం అయినా కల్తీ ఫ్రెండ్‌షిప్ దాఖలాలు తక్కువే!
కలిమిలేములు, కష్టసుఖాలు, చదువుసంధ్యల అంతరాలను మరిచి చెలిమిని ప్రేమించేవాళ్లు కొనసాగుతునే ఉన్నారు అందుకే ఈ కాలానికి ఇంకా కాలం చెల్లలేదని పెద్దలు అభిప్రాయపడుతుంటారు
వాళ్ల అభిప్రాయానికి అడ్రస్‌లా ఈ ఇద్దరు మిత్రులు కనిపించారు నిజామాబాద్‌లో....
ఘనపురం దేవేందర్, తిరుమల శ్రీనివాస్...శ్రీకృష్ణుడు, కుచేలుడిలా....!
పాతికేళ్ల కిందట...
ఘనపురం దేవేందర్ ఏడో తరగతి చదువుతున్నాడు. చదువుమీద కన్నా కవిత్వం మీదే ధ్యాస ఎక్కువ ఆ అబ్బాయికి. స్కూల్‌ని కూడా తన కవితలకు వేదిక చేసుకునేంత పిచ్చి కవిత్వం అంటే! ఇంట్లో రాసిన కవితలను తన తెలుగు మాష్టారుకు వినిపించాలనే వంకతోనే రోజూ స్కూల్‌కి వెళ్లేవాడు. మాష్టారు వాటిని విని శభాష్ అనగానే ఆనందంతో ఉప్పొంగిపోయేవాడు. రెట్టించిన ఉత్సాహంతో మరో కవితకు అక్షరాలు అల్లేవాడు. ఓ వైపు కుల వృత్తి అయిన క్షవరం, ఇంకోవైపు చదువు, మరోవైపు కవిత్వం..ఈ మూడింటిలో కవిత్వం అంటేనే మనసు పె దాంతో ఏడో తరగతి పబ్లిక్ పరీక్షలో తప్పాడు. ఆంగ్లం పట్టు తప్పించింది. ఇంట్లో వాళ్లంతా కన్నెర్ర చేశారు. చదువుమీదే దృష్టి పెట్టమన్నారు. అది శ్రీనివాస్‌కు కష్టమైంది. అయినా ఎలాగోలా టెన్త్ దాకా లాగించాడు. కానీ సెవెన్త్ సీనే మళ్లీ రిపీట్ అయింది. ఈసారీ ఇంగ్లీషే కొంపముంచింది. ఇంకా చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టమన్నారు పెద్దలు. కత్తి, కత్తెర ఇచ్చి సెలూన్‌కి పంపించారు. అయినా కవిత్వం ఆయన్ని వీడలేదు. చదువు రాలేదని ఆ ప్రియురాలు వదిలిపోలేదు. ఆయనతో బంధాన్ని గాఢంగా పెనవేసుకుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా క్షురకుడిగా సెలూన్‌లో బిజీగా ఉన్న రాత్రి ఊళ్లో జరిగే కవి సమ్మేళనాలకు కచ్చితంగా హాజరయ్యేవాడు.. వాటిల్లో తాను రాసిన కవితలను చదివి వినిపించాలని ఉవ్విళ్లూరేవాడు. కానీ ఆ అవకాశం వచ్చేది కాదు. నిరాశతో వెనుదిరిగేవాడు.
సరిగ్గా ఆ సమయంలోనే...
నిజామాబాద్ పట్టణంలోని గాజుల్‌పేట్ ప్రాంత నివాసి తిరుమల శ్రీనివాస్ ఇంటర్ చదువుతున్నాడు. ఆయనకూ కవిత్వమంటే మహాపిచ్చి. అయితే ఆయనకు ఇంకో షోకు కూడా ఉండేది. టౌన్‌లోని ఫేమస్ సెలూన్‌లో కటింగ్ చేయించుకోవాలని. ఆ అన్వేషణలో దేవేందర్‌కి పరిచయమయ్యాడు శ్రీనివాస్. అప్పుడే ఒకసారి ఊళ్లో కవిసమ్మేళనం అయింది. దేవేందర్‌కూ కవితలు రాసే అలవాటు ఉండడంతో ఆ సమ్మేళనానికి వెళ్లాడు. శ్రోతల్లో కూర్చున్నాడు. ఎందుకో తలతిప్ప పక్కకు చూస్తే శ్రీనివాస్ కనిపించాడు. ‘అరే..నువ్వు..ఇక్కడా?’ ప్రశ్నించాడు దేవేందర్. తన కవితాభిమానం గురించి చెప్పాడు. అప్పుడు తెలిసింది ఇద్దరి అభిరుచి ఒక్కటే సాహిత్యమని. అంతే... మాటా మాటా కలిసింది. పరిచయం పెరిగింది. ఇంకేం..ఆ ఒక్కటి సరిపోయింది వాళ్ల స్నేహం ముదరడానికి. కటింగ్ షాపులో కూర్చొని సాహిత్యం మీద గంటలు గంటలు చర్చించుకునేవాళ్లు. శ్రీనివాస్‌కు తెలియని పుస్తకాలు, కవితా సంపుటిల గురించి వివరించేవాడు దేవేందర్. అయితే ఆ సమ్మేళనంలో దేవేందర్‌కు కవిత చదివే అవకాశం వచ్చింది. యథావిధిగా శ్రీనివాస్‌కు రాలేదు. కానీ తన స్నేహితుడు చదివితే తానే చదివినంత సంబరపడ్డాడు ఆ నాడు.(ఆ ఒక్కరోజే దేవెందర్‌కు ఛాన్స్ వచ్చింది. మళ్లీ ఎప్పుడూ రాలేదు).
వైతాళిక...
కాలం గడుస్తోంది...వీళ్లు ప్రాణస్నేహితులుగా మారారు. కానీ ఎంత ప్రయత్నించినా ఏ కవిసమ్మేళనంలో వీళ్ల ఇద్దరికీ కవితలు చదివే అవకాశం రావడం లేదు. వీళ్ల కవితలు స్థానిక పత్రికల్లో ప్రచురితమవుతున్నా ఇందూరు సాహితీ సమాజం మాత్రం వీళ్లను పట్టించుకోలేదు. లాభం లేదనుకుని ఈ ఇద్దరు ఇంకో ఇద్దరితో కలిసి ‘సాగర్ సాహితీ సంస్థ’ను ఏర్పాటు చేశారు. వినాయక చవితి నవరావూతులప్పుడు మండపాల్లో కవిసమ్మేళనాలను ఏర్పాటు చేయడం...ఔత్సాహిక కవులతో కవితలు చదివించడం చేసేవారు. వీళ్లూ ఎన్నో కవితలు రాస్తున్నారు. అయిన తాము చేస్తున్న అక్షరసేద్యం కావల్సినంతంగా పండడంలేదనే బాధ వెంటాడ సాగింది ఇద్దరినీ. ఏం చేద్దామనే ఆలోచనల్లోంచే ఇందూరు వైతాళిక అనే పత్రిక పుట్టింది. దీన్ని ఓ సాహితీ మాస పత్రికలా నడపాలని నిధులనూ సమకూర్చుకున్నారు. తిరుమల శ్రీనివాస్ సంపాదకుడిగా, దేవేందర్ సతీమణి గంగమణి డైరెక్టర్‌గా పత్రికను మొదలుపెట్టారు. మంచి ఆదరణ లభించసాగింది. నాలుగేళ్లపాటు నిరాటంకంగా ముద్రించారు. కానీ ఆ తర్వాత వచ్చిన ఆర్థికపరమైన ఇబ్బందులు ఆ పత్రికను మూతపడేలా చేశాయి. ఇప్పుడు దానిని పునరుద్ధరించాలనే ఆలోచనల్లో ఉన్నారు.
ప్రస్తుతం...
దేవేందర్ చదువు కొనసాగించి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డాడు. శ్రీనివాస్ నగరం నడిబొడ్డున సాగర్ హేర్ కటింగ్ సెలూన్‌ను పెట్టి కుల వృత్తిని కంటిన్యూ చేస్తున్నాడు. అయినా వాళ్ల స్నేహానికి ఈ అంతరాలు అడ్డుగా నిలువలేదు. పైగా గడిచిన కాలం వీళ్ల చెలిమిని పెంచింది. ఇప్పుడు తిరుమల శ్రీనివాస్, ఘనపురం దేవేందర్ ఇద్దరు మాత్రమే స్నేహితులు కాదు. వాళ్ల కుటుంబాల మధ్య కూడా గాఢమైన అనుబంధం అల్లుకుంది. వాళ్ల పిల్లలూ ఆ మైత్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఏ ఇబ్బందుల్లో అయినా ఒకరికొకరు అండగా ఉంటారు. ఎవరికి మనసు బాగాలేకపోయినా సైకిళ్ల మీద మల్లారం(నిజామాబాద్‌కు దగ్గర్లో ఉన్న) అనే అటవీ ప్రాంతానికి వెళ్లి అక్కడి మష్రూమ్ కొండ మీద కూర్చొని...కర్రీ పఫ్‌లు తింటూ మనసు విప్పి మాట్లాడుకుంటారు. ఒకరి బాధలు ఒకరు పంచుకుంటారు. చేతనైన సాయం చేస్తారు. ‘శ్రీనివాస్ ఆర్యసమాజ్ బ్యాక్‌క్షిగౌండ్ నుంచి వచ్చాడు. ఆయన వైదిక పురోహితుడు. ఆర్యసమాజ్ పద్ధతులను తు.చ తప్పకుండా పాటిస్తాడు. అవంటే నాకూ ఆసక్తే. ఈ విషయంలో కూడా ఇద్దరి ఆలోచనలు కలిశాయి. ఆంగ్లం...శ్రీనివాస్ చదువుకు ఆటంకంగా మారింది. లేకుంటే ఆయనా కచ్చితంగా ఉన్నత స్థానంలో ఉండేవాడు. అయినా ఇప్పటికీ తన వృత్తని గౌరవిస్తున్నాడు. అందుకే శ్రీనివాస్ అంటే నాకు అంత గౌరవం’ అంటాడు దేవేందర్. ‘ఒకసారి జూనియర్ లెక్చరర్ పరీక్ష రాయడానికి హైదరాబాద్ వెళ్లాడు దేవేందర్. అదే టైమ్‌లో ఇక్కడ వాళ్ల నాన్న చనిపోయాడు. కబురు పెడదామంటే పరీక్ష మానుకుని వస్తాడు. అందుకని ఆయన పరీక్ష అయిపోయే టైమ్‌కల్లా ఇక్కడ జరగాల్సిన కార్యక్షికమాలు చూసిన. తర్వాత విషయం చేరవేసిన. ఆయనొచ్చేసరికల్లా కావల్సిన ఏర్పాట్లన్నీ చేశాను. అంతా అయిపోయాక నన్ను పట్టుకుని ఏడ్చేశాడు. సుఖాల్లో ఎవరైనా తోడుంటారు. కష్టాల్లోనే కదా స్నేహితుల అవసరం ఎక్కువ’ అంటాడు ఆ మాటను అమలు చేసి చూపిన శ్రీనివాస్.
హరిద రచయితల సంఘం..
తెలంగాణ అంటే ఇద్దరికీ ప్రాణమే. కలాలను కత్తులు చేసి అక్షర యుద్ధం చేస్తారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమ కవితా సంపుటిని ‘నుడుగు పిడుగులు’ పేరుతో ప్రచురించారు. దీనిని గత యేడాది నందిని సిధాడ్డి చేతులమీదుగా ఆవిష్కరింపచేశారు. తెలంగాణ జాతిపిత ఆచార్య జయశంకర్‌కు అంకితమిచ్చారు. ఆ సంపుటిలో ‘సీమవాని నోట ధిక్కారముండురా...ఆంధ్రవాని నెట అహంకారముండురా..తెలంగాణ పలుకులో సంస్కారం పొంగురా’ అంటాడు శ్రీనివాస్. ‘ యాదిడ్డి యాది నుంచి అగ్నిజ్వాల పుట్టెలే... జయశంకర్ చితి నుంచి వజ్రాయుధం పుట్టెలే.. తెలంగాణ జనమంతా ఉడుం పట్టు పట్టాలే’ అంటాడు ఘనపురం దేవేందర్. నిజామాబాద్ జిల్లా త్రివేణి సంగమం. గోదావరి, మంజీర, హరిద్ర నలుదు కలిసే పవిత్ర ప్రాంతం. జిల్లాలో పుట్టిన హరిద్ర నది పేరిట హరిద రచయితల సంఘాన్ని ఏర్పాటు చేసి కొత్తవారిని ప్రోత్సహిస్తామంటున్నారు ఈ ఇద్దరు స్నేహితులు. ‘ దేహపురంలో..ఘనపురం సగం. కాబట్టి మా ఇద్దరిలో ఎవరు పలికినా ఒకటే అనేది నా భావన’ అంటాడు తిరుమల శ్రీనివాస్. ‘అందుకే చిన్నప్పటి నుంచి ఇద్దరిలో ఎవరికి కవిత వినిపించే అవకాశం వచ్చినా ఇద్దరం ఆనందపడేవాళ్లం’ అంటాడు ఘనపురం దేవేందర్! వీరి స్నేహం ఇలాగే కలకాలం సాగాలిని పదిమందికీ స్ఫూర్తిగా నిలవాలని ఆశిద్దాం!
ఎం.ఎస్. నర్సింహాచారి,
టీ మీడియా ప్రతినిధి, నిజామాబాద్.
ఫోటోలు : ఎల్. రవీందర్
Other News