Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Friday, May 24, 2013
 


Home >> Zindagi >> Silsila


మధుసూధన్యుడు

madhusudhan_1వరంగల్‌లో ఈతరం విద్యాలయాల నిర్మాణం కోసం ఇటుకలు పొందిచ్చిన ఇల్లు అది. హైదరాబాద్ తరువాత విద్యాకేంవూదంగా వరంగల్‌ను మార్చడానికి పరితపించిన కుటుంబం అది. ఒకప్పటి ఆర్‌ఈసీ ప్రస్తుత జాతీయ సాంకేతిక విద్యాలయం (నిట్), కాకతీయ మెడికల్ కాలేజీ ఇలా ఎన్నో విద్యాసంస్థల్ని ఇక్కడికి తీసుకురావడంలో క్రీయాశీలకంగా పనిచేసిన, దేశ తొలి ప్రధానిని వరంగల్‌కు రప్పించిన దార్శనికుడి కుటుంబం అది. ఫోటోలో కనిపిస్తోన్న ఈ ఇద్దరు అన్నదమ్ములు రాష్ట్రపతి భవన్‌లో కలియతిరిగినవారు. దేశాన్ని ఐదేళ్లపాటు ప్రధానిగా ఏలిన పీవీ నర్సింహారావుకు పార్లమెంట్ లైబ్రరీలో తమ సొంత పూచీకత్తుతో పుస్తకాలు ఇప్పించిన పిల్లలు వీళ్లు. వాళ్ల నాన్న రజాకార్ ఉద్యమంలో ప్రధానభూమికను పోషించి, 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన తెలంగాణ వాది. వరంగల్ ఈ తరం నాయకులకు చుక్కాని. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని దాశరథి రాసిచ్చిన ప్రశ్నను పార్లమెంట్‌లో చదివి పోచంపాడు అవసరాన్ని లోకానికి చాటిన మాన్యుడు... ఆయనే ఇటిక్యాల మధుసూధనరావు. ఇప్పటి తరానికి ఆయన తెలియకపోవచ్చు... కానీ ఆయన వదిలిన జాడలు ఆర్.ఇ.సి, కేఎంసీ, పాలిటెక్నిక్ కాలేజీలు. నీలం సంజీవడ్డిని సైతం ఎదిరించి ఆ విద్యాకేంవూదాలను వరంగల్‌కి వరాలుగా తెచ్చిన ఘనత ఆయనది.

వరంగల్ పోచమ్మ మైదాన్... పోచమ్మ గుడి దగ్గరనే ఇల్లు. ఆ చుట్టుపక్కల వారికి ఇంట్లో వాళ్లు తెలుసు. కానీ వారి చరిత్ర తెలియదు. కుటుంబ నేపథ్యం అసలే తెలియదు. వారి గడపలో అడుగుపెడితే.. దేశనాయకుల ఫోటోలతో ఇంటిగోడలు నిండిపోయాయి. తొలి ప్రధాని నెహ్రూ, తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, బాబూ జగ్జీవన్‌రామ్ ఇలా ఎంతో మంది చిత్రపటాలు. వాటిలో ఒక్కొక్క ఫొటోకు ఒక్కో చరిత్ర ఉంది. వారి ఇళ్లంతా వేవేల జ్ఞాపకాలు. ఆ గుర్తులతోనే తాము కాలం వెళ్లదీస్తున్నారు ఆ అన్నదమ్ములిద్దరు. అన్న ఇటిక్యాల కృష్ణదేవ్, తమ్ముడు ఇటిక్యాల నర్సింహారావు. కృష్ణదేవ్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో పనిచేసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా రిటైరయ్యారు. నర్సింహారావు తన తండ్రి పేరుమీద (ఇటిక్యాల మధుసూధనరావు మెమోరియల్) ఒక స్కూల్‌ను 32 ఏళ్లపాటు నడిపి ప్రస్తుత ఫీజుల పోటీ ప్రపంచంలో అధిక ఫీజులు వసూలు చేయలేక దాన్ని ఇటీవలే మూసేశారు. తెలంగాణ ప్రాంతానికి వన్నెతెచ్చిన గొప్ప నాయకుడి బిడ్డలుగా తాము గర్వపడుతున్నామంటున్నారిద్దరూ...

madhusudhan_2తమ్ముణ్ణి పోగొట్టుకున్నాం...
మా నాన్న ఆర్యసమాజ్ కార్యకర్త. ఆయన ఢిల్లీలో సైతం శిక్షణ తీసుకున్నాడు. తరువాత వరంగల్ జిల్లా కెప్టెన్‌గా వచ్చాడు. ఇక్కడకు వచ్చిన తరువాత ఆయన ఎంతోమంది యువకులకు మార్గదర్శకం చేశాడు. ఆయన నాయకత్వంలో వరంగల్ నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేపట్టారు. రజాకార్లకు నాన్న పేరు వింటేనే కంటిమీద కునుకు ఉండేది కాదు. ఆయన కోసం వేట మొదలుపెట్టారు. మా అమ్మ (అనసూయా దేవీ)కు చెప్పకుండానే వెళ్లిపోయాడు. నాన్న కోసం రజాకార్ మూకలు పెద్ద సంఖ్యలో మా ఇంటిని చుట్టుముట్టాయి. అప్పుడు మా ఇల్లు బట్టల బజార్‌లో ఉండేది. ముందు మూడు రూములు, వెనుక మూడు రూములు. అన్నింటికీ తలుపులు పెట్టి మమ్మల్ని మధ్యరూంలో ఉంచింది. మా ఇంట్లో ఉన్న తుపాకులు, బరిసెలు, కత్తులు అన్నింటినీ బావిలో వేసింది. కాగితాలను కాలబెట్టింది. అలా ఆ గండం గడిచిపోయింది. కానీ ఆ సంఘటనతో ‘నా పిల్లల్ని వీళ్లు చంపేస్తారు’ అని చెప్పి మా అమ్మ కొంతకాలం మమ్మల్ని విజయవాడకు తీసుకెళ్లింది. అక్కడ ఉండగానే మా చిన్నతమ్ముడికి తీవ్రమైన జ్వరం వచ్చి చనిపోయాడు. కొంతకాలానికి మా నాన్న పట్టుబడ్డాడు. 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. నాన్న నాయకుడిగా ఎన్నోపోరాటాలు నడిపాడు. ఒకసారి వరంగల్ రైల్వే గేటు ప్రాంతంలో ర్యాలీ నిర్వహిస్తోంటే పోలీసులు చెదరగొట్టాలని చూశారు. కాల్పులు జరుపుతామని హెచ్చరించారు. అంతే ఆయనకు కోపం వచ్చి సర్కిల్ సాబ్‌ను పెళ్లున చెంపమీద కొట్టిండట. దాంతో పోలీసులకు ఏం చేయాలో తోచకుండా ‘శాంతియుతంగా నిర్వహిస్తోన్న ర్యాలీపై కాల్పులు జరిపితే బాగుండదని అక్కడిని నుంచి వెళ్లిపోయారట. ఎంత సంయమనం పాటించేవాడో... కోపం వస్తే అంత కఠినంగా ఉండేవారు నాన్న .

madhusudhan_5పీవీకి సూట్ ఇచ్చాడు...
పీవీ నర్సింహారావు, మా నాన్న ఇద్దరూ మంచి స్నేహితులు. ఆయనను మేము మామా అనేది (బంధువులు కూడా). ఓసారి పీవీ సాబ్ ఢిల్లీకి వచ్చిండు. ఆయన పుస్తకాల పురుగు. ఢిల్లీలో విపరీతమైన చలి ఉండేది. పీవీ దోవతి కట్టుకొని వచ్చాడు. మా నాన్న ‘ఏమ్రా! ధిమాక్ ఉందా ఏమన్నా? ఇంత చలిలో ఎట్లా వచ్చావురా? ఇది హైద్రాబాద్ అనుకున్నావా? ఢిల్లీ. ఎట్లుండాలో గట్టే ఉండాలె. నా సూట్ వేసుకొని పో’ అని మా నాన్న తిట్టిండు. ‘ఆ ఏమైతది లేరా?’ అని ఆయన అనేది. ఓసారి నాకు బాగా గుర్తు. 1958-59 అనుకుంటా. పీవీ స్పానిష్ నేర్చుకుంటున్నడు. ఆ పుస్తకాలు కావలసి వస్తే నేనే పార్లమెంట్ లైబ్రరీకి తీసుకుపోతనని పోతూ ఉంటే గేట్ దగ్గర సెక్యూరిటీ పీవీని ఆపిండు (నేను మా తమ్ముడు పార్లమెంట్ సెంట్రల్‌హాల్, రాష్ట్రపతి భవన్ అంతా కలియతిరిగేది మేము వారికి గుర్తే). నేను వెళ్లి ‘యే మేరా మామా హై ఛోడ్‌దే’ అని లోపలికి తీసుకెళ్లాను. లైబ్రరీ అంతా చూసుకొని ఆయనకు నచ్చిన పుస్తకాలు తీసుకున్నాడు. నేనే వాటికి పూచీకత్తుగా సంతకం చేశాను. ఢిల్లీలో పీవీకి మా నాన్నే అందరినీ పరిచయం చేసిండు. అప్పటి రాష్ట్రపతి, ప్రధాని నెహ్రూ ఇలా ఎంతోమందిని. నా గ్రాడ్యుయేషన్ అయిపోయాక... ప్రభుత్వ ఉద్యోగానికి రిటర్న్ టెస్ట్‌లో పాసయ్యాను. నా పేరు వెయిటింగ్ లిస్ట్‌లో ఉంది. పీవీకి అప్పుడు ఒక అప్లికేషన్ ఇచ్చి, ఒక్క చిన్న సహాయం చేయమంటే ‘అరే మీరు ఇక్కడిదాకా ఎందుకొచ్చారు. నాకొక మాట చెబితే అయిపోయేది కదా అన్నాడే కానీ సిఫారసుమాత్రం చేయలేదు. చివరికి ఎలాగోలా నేనే ఉద్యోగం సంపాదించుకున్నాను అంటూ ముగించాడు కృష్ణదేవ్.

madhusudhan_4నీలం సంజీవడ్డితో..
మొదటి నుంచి ఆంధ్రా, రాయలసీమ నాయకులది తెలంగాణకు అన్యాయం చేసే స్వభావమే. ఒకసారి దాశరథిగారు మా ఇంటికి వచ్చారు. ‘మధుసూధన్ పోచంపాడు ప్రాజెక్టు గురించి పార్లమెంట్‌లో మాట్లాడాల్రా!’ అని ఆయన కవిత రాస్తే దాన్ని ఆయన పార్లమెంట్‌లో ప్రస్తావించారు. అంతేకాదు కచ్చితంగా పోచంపాడు తెలంగాణకు రావలసిందే అని పట్టుబట్టారు. ఈ విషయం తెలుసుకున్న అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవడ్డి శ్రీశైలం కోసం పట్టుబట్టారు. దేశంలో ఆరు ఆర్‌ఈసీలను పెట్టాలని కేంద్రం నిర్ణయిస్తే అందులో ఒకదాన్ని వరంగల్‌లో పెట్టాలని ఆయన చేసిన పోరాటం మాములుది కాదు. ఆర్.ఇ.సి శంకుస్థాపనకు నాటి ప్రధాని నెహ్రూను నాన్న తీసుకొచ్చాడు. దాన్నప్పుడు తిరుపతిలో పెట్టాలని కుట్రలు చేశారు. వాటిని అందరి సహకారంతో నాన్న ఛేదించగలిగాడు. ఆయన చేసిన పోరాటాన్ని గుర్తించి సముచిత స్థానం కల్పిస్తామని స్వర్ణోత్సవాల సందర్భంగా నిట్ వాగ్దానం చేసింది. ఆయన కొడుకుగా ముగింపు ఉత్సవాల్లో నన్ను ఘనంగా సన్మానించింది. నిట్ ఎదుట మా నాన్నగారి విగ్రహాన్ని పెడతామని మాటిచ్చింది. కానీ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. కాకతీయ మెడికల్ కాలేజీ విషయంలో నానా యాగీ చేశారు. నీలం సంజీవడ్డి నాన్నను పిలిచి ‘అన్నీ మీ ప్రాంతానికే కావాలా? మెడికల్ కాలేజీనీ అనంతపురానికి ఇవ్వండి. ఇట్లా చేస్తే మీకు భవిష్యత్ ఏమీ ఉండదు’ అని హెచ్చరిస్తే ‘మా ప్రాంత భవిష్యత్ నాకు ముఖ్యం. నా భవిష్యత్ నాకు అక్కరలేదు. నీకు చాతనైంది చేసుకో’ అంటూ సమాధానం చెప్పి ఢిల్లీలో కొట్లాడి కేఎంసీకి గ్రాంటు తెచ్చిండు. అసలు ఒక ఎంపీగా ఉండి అండర్ బ్రిడ్జి కోసం ... రైల్ పట్టాల మీదికెళ్లి పడుకొని ఉద్యమం చేసిండు మానాన్న. ఆయన బిడ్డలుగా పుట్టడం మా పూర్వజన్మ సుకృతం అంటూ తండ్రి జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా గుర్తుచేసుకున్నాడు నర్సింహారావు.

madhusudhan_3ఇంతకీ ఎవరీయన..?
ఇటిక్యాల మధుసూధనరావు మహబూబాబాద్ నుంచి (1957-64) రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, నెహ్రూ, బాబూ జగ్జీన్‌రావు, అనంతశయనం అయ్యంగార్ లాంటి ఉద్ధండ నాయకులతో ఆయనకు సత్ససంబంధాలున్నాయి. రజాకార్ ఉద్యమంలో ఆర్యసమాజ్ కార్యకర్త నుంచి ఆర్యవీర్‌దళ్ నాయకుడిగా పనిచేశారు. వరంగల్ కెప్టెన్‌గా వ్యవహరించారు. 14 ఏళ్లు జైలు జీవితం అనుభవించారు. ఆయనను వరంగల్ జిల్లా తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడంటారు. స్వాతంవూత్యానంతరం ఎంతోమందిని రాజకీయాల్లోకి తెచ్చారు. పీవీ నర్సింహారావు లాంటి వాళ్లు రాజకీయాల్లోకి రాకముందే ఇటిక్యాల క్రియాశీల రాజకీయాల్లో ఉండటమే కాదు... నెహ్రూ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండేది వీరి కుటుంబం. ఒక స్వాతంత్ర సమరయోధుడిగా, తొలితరం రాజకీయ యోధుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారాయన. ఆయన కుటుంబం ఇవ్వాళ్టికీ స్వాతంత్య్ర సమరయోధుల కోసం సర్కారు ఇస్తోన్న భూమి జాగకు నోచుకోలేదు. కాకతీయ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగంలో విజయ అనే స్కాలర్ ఇటిక్యాల మధుసూధనరావుపై ఎంఫిల్ పూర్తిచేసింది.

నూర శ్రీనివాస్
(టీమీడియా ప్రతినిధి-వరంగల్)
ఫోటోలు: గొట్టె వెంకన్న, చకినాల శ్యామ్

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine