మనసు కథ
రోజూ లాగే ఆ రోజు కూడా లైబ్రరీకి వెళ్లాడు జగన్. ఓ పుస్తకం చేతిలో పట్టుకుని రోజూ తాను కూర్చునే ప్లేస్‌కు వెళ్లాడు. కానీ అంతకుముందే అక్కడ ఒక అమ్మాయి కూర్చుని ఉంది. అతను వెళ్లి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. పుస్తకం తెరవబోయాడు. అంతలోనే మరో ఇద్దరు అమ్మాయిలు లైబ్రరీలోకి వస్తూ కనిపించారు. వైట్ డ్రెస్‌లో కుందనపు బొమ్మల్లా ఉన్నారు. వాళ్ల మొహాలు ఎందుకో సంతోషంతో వెలిగిపోతున్నాయి. ఆ కళ్లల్లో ఆనందం చూడగానే తెలిసిపోతున్నది. వాళ్ల అడుగుల్లోని వేగం ఎవరినో కలవాలన్న ఆరాటాన్ని చెప్పకనే చెబుతున్నాయి.
అలానే చూస్తుండిపోయాడు జగన్... వాళ్లు తనకు చాలా దగ్గరగా వచ్చారు. ‘కొంపదీసి నా కోసమా?’ అన్న అనుమానంతో అటూ ఇటూ చూశాడు.ఆ అమ్మాయిలు తన ఎదురుగా కూర్చున్న అమ్మాయి దగ్గర ఆగిపోయారు.అందంగా నవ్వుతూ ఆమెకు ‘హాయ్’ చెబుతున్నట్టు చేయి ఊపారు.చాలా రోజుల తరువాత కలిసినట్టుంది చూడటానికి. ముగ్గురూ సైగలతోనే మాట్లాడుకున్నారు.
బహుషా వాళ్లున్నది లైబ్రరీలో కాబట్టి... పక్కవాళ్లను డిస్టర్బ్ చేయడం ఎందుకని అలా చేస్తున్నారేమో!అయినా లైబ్రరీలో ఉన్నవాళ్లంతా ఆ ముగ్గురినే చూస్తున్నారు. వాళ్లు ఎవరినీ డిస్టర్బ్ చేయకుండా, ఎవరికీ వినిపించకుండా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఎదురుగా ఉన్న జగన్ వాళ్లను అలాగే చూస్తూ ఉండిపోయాడు.వాళ్లు సైగలతోనే అంతబాగా ఎలా మాట్లాడుకోగలుతున్నారు అని ఆశ్చర్యపోయాడు. ఓ పావుగంట తరువాత వాళ్లు గుసగుసగా, ముసిముసిగా నవ్వుకుంటూ అక్కణ్ణుంచి వెళ్లిపోయారు. జగన్‌లో ఆశ్చర్యం! చాలా రోజులుగా ఆ గ్రంథాలయానికి వెళ్తున్నా వాళ్లనెప్పుడూ చూళ్లేదు. నిజానికి లైబ్రేరియన్ నుంచి మొదలు అక్కడికొచ్చే చాలామంది అతనికి తెలుసు. ‘వీవ్లూవరబ్బా?’ అనుకున్నాడు. అప్పటిదాకా ఆ అమ్మాయిల్నే చూసిన చాలామంది మళ్లీ తమ పనుల్లో మునిగిపోయారు.జగన్ కూడా పుస్తకం తెరిచాడు. సరిగ్గా అదే సమయంలో లైబ్రేరియన్ అటు వైపు వచ్చాడు.
‘బాబాయ్. ఇప్పుడు వెళ్లిపోయిన అమ్మాయిపూవరు? ఉన్న కాసేపు హంగామా చేసి వెళ్లారు.వాళ్ల ఎదురుగానే కూర్చున్నానా? నాకు ఒక్కమాట కూడా వినిపించలేదు తెలుసా?’ అన్నాడు‘వాళ్లు మూగవాళ్లు బాబు! ఎక్కడుంటారో తెలియదు కానీ, అప్పుడప్పుడూ ఇక్కడికి వస్తుంటారు’ అని చెప్పాడాయన. జగన్ మనసు చివుక్కుమంది. తిరిగి ఏం మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయాడు.చేతిలోని పుస్తకం మూసేశాడు. అప్పుడు కనిపించింది అతనికి ఆ పుస్తకం పేరు ‘దేవుడు చేసిన మనుషులు’ అని!అతను కుర్చీలో నుంచి లేచాడు. అడుగులు బయటకు దారి తీశాయి.
Other News