మనసు కథ
‘‘కుక్క పిల్లలు అమ్మబడును’’
బోర్డు చూసి ఆగిపోయాడు రోహిత్. వాడికి కుక్కపిల్లలంటే చాలా ఇష్టం. వెంటనే జేబులు తడుముకున్నాడు. 300 వందల రూపాయలున్నాయి. ఎలాగైనా ఓ కుక్క పిల్లను కొందామని షాప్ దగ్గరికి వెళ్లాడు.
‘‘ఏం కావాలి?’’ అంటూ బయటికి వచ్చాడు ఆ షాప్ యజమాని.
‘‘నాకు ఓ కుక్క పిల్ల కావాలి అంకుల్...’’ ముద్దు ముద్దు మాటలతో సమాధానమిచ్చాడు రోహిత్.
‘‘నువ్వే కొంటావా? మరి సరిపడా డబ్బులున్నాయా?’’ అడిగాడు యజమాని.
‘‘కుక్కపిల్లకు ఎంత?’’ అడిగాడు రోహిత్. ‘‘500 రూపాయలు ’’ అని చెప్పాడు యజమాని. కానీ నా దగ్గర మూడు వందల రూపాయలే ఉన్నాయే? అని ఆలోచనలో పడిపోయాడు రోహిత్. ‘‘పర్లేదులే నీకే కుక్క పిల్ల కావాలో వచ్చి తీసుకో’’ అని పెట్స్ కేజ్ తెరిచాడు యజమాని. లోపలికి వెళ్లిన రోహిత్‌కు నడవడానికి ఇబ్బంది పడుతున్న పప్పీ కనిపించింది.
‘‘అది కావాలి అంకుల్.’’ అంటూ మూలన ఉన్న కుక్క పిల్లను చూపించాడు. అందుకు షాప్ యజమాని వెంటనే ‘‘ఓ... అదా ... ఆ కుక్క పిల్ల అయితే ఫ్రీగా ఇచ్చేస్తాను’’ అన్నాడు. ‘‘నాకు ఫ్రీగా వద్దు... డబ్బులు ఇస్తాను. ఇప్పుడు మూడు వందల రూపాయలు ఇచ్చి కుక్కపిల్లను తీసుకుని .. తరువాత నెలకో వంద రూపాయల చొప్పున రెండు నెలల్లో పూర్తిగా ఇచ్చేస్తా...’’ అన్నాడు రోహిత్.
‘‘అన్ని డబ్బులు ఇచ్చేట్లయితే ఆ కుంటి కుక్కపిల్లను ఎందుకు తీసుకుంటున్నావు... మంచి దానినే తీసుకో. ఆ కుంటిదయితే నీతో ఆడలేదు... ఎగరలేదు.. గెంత లేదు... అట్లాంటిదాన్ని ఏం చేసుకుంటావ్?!’’ అన్నాడు యజమాని.
‘‘అట్లా అనుకుంటే మా అమ్మ నన్నెప్పుడో బయటపారేసేది! కానీ... నన్ను ఎంతో గారాబంగా పెంచుతుంది. అవిటివాణ్ణయిన నాకు కావాల్సింది అలాంటి కుక్కపిల్లే. అదయితేనే నన్ను బాగా అర్థం చేసుకుంటుంది’’ అంటూ డబ్బులు షాప్ యజమానికి ఇచ్చి... ఒక చేతితో పప్పీని జాగ్రత్తగా పొదివిపట్టుకుని... కర్రసాయంతో నడుస్తూ వెళ్తున్న రోహిత్ వంక చూస్తూ ఉండిపోయాడు షాప్ ఓనర్.
Other News