మనసు కథ
శనివారం కావడంతో స్కూల్ నుంచి పిల్లలు తొందరగా వచ్చేశారు. పిల్లలిద్దరికీ అన్నం తినిపించింది శిరీష. ఆమె అలా తినిపించి ఇలా చేయి కడుక్కునేలోపే పిల్లలు అపార్ట్‌మెంట్‌లోని ఇతర పిల్లలతో కలిసి ఆటకు ఉరికారు. వాళ్లమ్మకు కూడా అన్నం పెట్టి ఇల్లంతా సర్ది టీవీ ముందు కూర్చుంది శిరీష. కొద్దిసేపట్లోనే వర్షం ప్రారంభమయ్యింది. పిల్లపూక్కడ ఉన్నారో ఏంటో ఈ వర్షంలో తడిస్తే లేనిపోని జ్వరాలు. జ్వరం వస్తే స్కూల్ డుమ్మా... అనుకుంటూ వెళ్లి లాన్‌లో ఆడుతున్న పిల్లలను ఇంట్లోకి లాక్కొచ్చింది శిరీష. ఏవైనా బుక్స్ తీసుకుని చదువుకోండి ... లేదంటే ఇంట్లోనే ఆడుకోండి. బయటికి వెళ్తే మాత్రం ఈవినింగ్ ఐస్‌క్రీం ఉండదు అంటూ బెదిరించింది శిరీష. ఐస్‌క్రీం పేరు వినగానే పిల్లలు అటు బయటకు వెళ్లలేక... ఇంట్లో ఆడుకోలేక.. బాల్కనీలో ఉన్న అమ్మమ్మ దగ్గరికి వెళ్లారు ‘అమ్మమ్మా ఏదైనా కథ చెప్పు..!’ అంటూ. బాల్కనీలోకి పడుతున్న జల్లుకు పిల్లలు తడవకుండా లోపలికి చైర్‌లాక్కొని ఇద్దరినీ చెరోపక్క కూర్చోబెట్టుకుని చెప్పడం మొదలుపెట్టింది. ‘‘అనగనగా ఓ పల్లెటూరు.
ఆ ఊరిలో ఓ అమ్మాయి. అమ్మాయి రోజూ బడికి వెళ్లేది. వర్షం అంటే ఆ అమ్మాయికి చాలా ఇష్టం. అందుకే వాన పడిందంటే చాలు... తన స్నేహితురాళ్లతో కలిసి ఆడుకోవడానికి పరుగెత్తేది. వాళ్ల బడి పక్కనే ఓ పిల్ల కాలువ వెళ్లేది. వానపడిందంటే కురుస్తుందని చెప్పి... బడి వదిలేశేవారు. వెంటనే బడి ఎదురుగా ఉన్న స్నేహితుల ఇళ్లలో పుస్తకాల బ్యాగు వేసి ఆ కాలువ దగ్గరకు వెళ్లేది. కాలువ నెమ్మదిగా వస్తున్నప్పుడు స్నేహితులతో కలిసి అందులో గంతులేసేది. మేతకు వెళ్లి వస్తున్న మేకపిల్లలను, గొర్రెపిల్లలను కాలువ దాటించేది. కాలువ ఒరవడి పెరిగి హోరున శబ్దం వచ్చేసరికి భయపడి ఇంటికొచ్చేది. బట్టలన్నీతడుపుకున్నవని వాళ్లమ్మ తిడుతుందని ... ఆ బట్టలు ఆరేదాక బయటనే ఉండి ఆ తరువాత ఇంటికెళ్లేది. మరునాడు బడి వదిలేయగానే స్నేహితురాళ్లతో కాలువ వదిలి వెళ్లిన ఇసుక దగ్గరికి స్నేహితురాళ్లతో కలిసి వెళ్లి... ఇసుకలో గూళ్లు కట్టుకునేది. ఫ్రెండ్స్ అందరికంటే ఆమె ఇసుక గూడే చాలా పెద్దగా ఉండేది. అందుకోసం ఎంత కష్టమైనా పడేది. స్కూలు బ్యాగులో తెచ్చుకున్న గ్లాసులో ఇసుక నింపి దాన్ని బోర్లా కొట్టి... ఇసుక గోపురాలు కట్టేది. కొంచెం ఎండిన ఇసుకలో కట్టెపుల్ల దాచి... దొరికించుకోని వాళ్ల చెంపను కొట్టే ముక్కు చెంపలాట... ఇలా చాలా ఆటలు ఆడుకునేది.
ఆ ఇసుకలో దొరికిన గవ్వలన్నీ ఏరుకొచ్చి బొమ్మలు చేసేది. ఇంట్లో ఉన్నప్పుడు వర్షం పడితే.. చూరుకింద నీటి ధారలకు తడవకూడదని స్నేహితులతో పోటీ పెట్టుకునేది. ఒక్క చినుకు తనపైనా పడకుండా తప్పించుకుని... గెలిచేది. కాగితపు పడవలు చేసి వాననీళ్లలో వేసేది. బడిపక్కనే షావుకారు ఇల్లు ఉండేది. వాళ్లు పాడైపోయిన టమాటాలు, దోసకాయలు పడేసేవాళ్లు. వర్షం పడ్డ కొన్నిరోజులకు అవి మొలకలొచ్చేవి. బడి వదలగానే అందరికంటే ముందు వెళ్లి ఆ టమాట మొక్కలను తవ్వుకుని తెచ్చి ... ఇంటిముందున్న దొడ్లో వేసేది. ఇంకా చాలా ఆటలు ఆడుకునేది తెలుసా!’’ అంటూ ముగించింది. వీడియోగేమ్స్, కంప్యూటర్ గేమ్స్, క్రికెట్ తెలుసుకానీ... ఈ ఇసుక ఆటలేంటి అమ్మమ్మా అంటూ అమాయకంగా ప్రశ్నించారు పిల్లలు.
Other News