మనసు కథ
శారద తన కూతురు అత్తగారు బాలేశ్వరికి కాల్ చేసింది మధ్యాహ్నం లంచ్‌కి ఇంటికి ఆహ్వానిస్తూ! తర్వాత కొడుకు అత్తగారు భారతికీ ఆహ్వానం పంపింది భోజనానికి. భారతికి విషయం అర్థమైంది కానీ బాలేశ్వరికే అర్థం కాలేదు. ‘ఇప్పుడేమీ పండగలు, ప్రత్యేక దినాలూ లేవే...మరెందుకు రమ్మన్నట్టు? పైగా ఇంట్లో తనను ఒక్కదాన్నే భోజనానికి రమ్మంది, ఏంటో విషయం?’ అనుకుంది. ఇంట్లో కొడుకు, కోడలు, భర్త ఆఫీస్‌లకు వెళ్లిపోగానే శారద దగ్గరికి బయలుదేరింది.
బాలేశ్వరి వెళ్లేసరికే శారద, భారతి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. బాలేశ్వరిని సాదరంగా ఆహ్వానించింది. మంచినీళ్ల గ్లాసు అందుకుంటూ అడిగింది బాలేశ్వరి ‘సడన్‌గా ఈ భోజనాల ప్రోగ్రాం ఏంటీ వదినా’ అని! ‘ఏంలేదులే..మనం ముగ్గురమే సరదాగా మన పిల్లల గురించి మాట్లాడుకుందామని’ అంది శారద నవ్వుతూ! ‘ఏంటీ....నా మీదేమైనా కంప్లయింటా మీ అమ్మాయి దగ్గర నుంచి?’ కనుబొమపూగరేస్తూ అడిగింది బాలేశ్వరి! ‘కంప్లయింటూ లేదు, కాంప్లిమెంటూ లేదు!’ చెప్పింది శారద. ఆ మాటలతో ఆ రోజును చెప్పాలనుకున్న వాటికి నాంది పలికింది శారద. ‘మా అమ్మాయి మీ గురించి నా దగ్గర ఎలాంటి కామెంట్స్ పాస్ చేస్తుందో... నా కోడలూ నా గురించి భారతి దగ్గర అలాంటి కామెంట్సే పాస్ చేస్తోందని తెలిసింది. మన పిల్లల పెళ్లిళ్లు అయ్యే వరకు మనం బంధువులం కాదుకదా కనీసం స్నేహితులం కూడా కాదు.
ఈ పెళ్లిళ్లతోనే మన మధ్య బంధుత్వం ఏర్పడింది. దాన్ని మరింత సన్నిహితంగా మార్చుకుందామనుకుంటున్నాను. అత్తాకోడళ్ల మధ్య చిన్న చిన్న కోపాలు, తగాదాలు సహజమే. సర్దుకుపోయేంత ఓపిక ఈ తరానికి లేదు. అందుకే ఆ ఓపికను మనమే తెచ్చుకుందాం. పెళ్లి కొత్త బంధాలను ఏర్పర్చి కుంటుబాన్ని విస్తృతం చేస్తుందంటారు. అలాంటి మన బంధాన్ని మంచి అనుబంధంగా మార్చుకుందాం! అందుకే మన కోడళ్లు ఎవరిమీద ఏమీ చెప్పినా మనం పట్టించుకోకుండా ముగ్గురం మంచి స్నేహితులుగా ఉందాం! మన పిల్లలూ హ్యాపీగా ఉండేలా చూద్దాం! ఇది నా మాట. మీరేమంటారు?’ అంటూ ఇద్దరి వైపు చూసింది శారద. ఆ ఇద్దరూ భారతి చేయిలోచేయి వేశారు.
Other News