మనసు కథ
డిగ్రీ వరకు తన ఊర్లోనే చదివిన నీరజ ఎమ్మెస్సీ కోసం సిటీకి వచ్చింది. తడబడే అడుగులతో క్లాస్‌రూమ్‌లో అడుగుపెట్టింది. అందరూ కొత్తవాళ్లే ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు తనకు. ఎక్కడ కూర్చోవాలని బిక్కమొహంతో ఆమె వెదుకుతుండగా చివరి బెంచీలో ఉన్న అమ్మాయి రమ్మంటూ సైగ చేంది. కూర్చోగానే ‘హాయ్! అయామ్ సంధ్య..’ అంటూ చొరవగా పరిచయం చేసుకుంది. సంధ్య కూడా ఆ కాలేజ్‌కు కొత్తే కానీ... తనలో భయం లేకపోవడం, అందరితో కలిసిపోవడం చూసి ముచ్చ నీరజకు. పరిచయం స్నేహంగా మారింది. నీరజలో ఉన్న భయాన్ని కూడా పోగొట్టింది సంధ్య. ఎప్పుడూ నవ్వుతూ అందరితో కలుపుగోలుగా ఉండే సంధ్య అంటే అందరూ ఇష్టపడేవారు. ఇక నీరజ అయితే చెప్పక్కర్లేదు. సంధ్యే ఆమెకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. సెమిస్టర్ నుంచి సెమ్టిర్‌కి వాళ్లు ప్రమోట్ అయినట్టే వాళ్ల స్నేహం కూడా పెరిగింది. అందరు స్నేహితుల్లానే వాళ్లమధ్యా అలకలు ఉండేవి. అప్పుడు కూడా సంధ్యే ముందు మాట్లాడేది. తన నవ్వులతో వాతావరణాన్ని మార్చేసేది. కలిసే ప్రాజెక్ట్ చేశారు. ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోగానే ఇద్దరూ... ఒకే కంపెనీలో జాబ్ చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్టు... క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో చెరో కంపెనీకి వెళ్లిపోవాల్సి వచ్చింది. మంచి జాబ్ వచ్చినందుకు సంతోషపడ్డా... విడిపోవడమే కష్టమయ్యింది.
మరో నెలరోజుల్లో జాయినింగ్ అనగా... పక్కరూమ్మేట్ నీరజతో... ‘సంధ్య నిన్ను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడుతుందే... నువ్వేమో స్నేహం అంటూ ఎప్పుడూ అమె వెంటే ఉంటావ్...!’ అంది. నీరజలో సంశయం. నాటినుంచి సంధ్య ఏదైనా మంచి చేయబోయినా తానంటే చిన్నచూపని ప్రతీదానికి అపార్థం చేసుకునేది. నీరజ తీరు అర్థం కాని సంధ్య.. ఎప్పటిలాగే బతిమాలింది. ‘నేను తెలిసి నీ విషయంలో ఏ తప్పూ చేయలేదు. తెలియక ఏదైనా పొరపాటు చేస్తే మన్నించు ...’ చివరి మాటగా చెప్పి జాబ్‌కోసం వేరే సిటీ వెళ్లిపోయింది సంధ్య.
అక్కడ ఉన్నా రోజుకు ఒక్కసారయినా నీరజకు ఫోన్ చేసేది. నీరజ అంటీముట్టనట్లుగా మాట్లాడేది. కొన్నిసార్లు అసలు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేది. నెలలు గడిచిపోయాయి. సంధ్య నుంచి కాల్స్ రావడం కూడా తగ్గిపోయాయి. ఓరోజు రూమ్‌లో ఫోన్ మరిచిపోయి ఆఫీస్‌కెళ్లింది నీరజ. ఇంటికొచ్చి చూసేసరికి చాలా మిస్స్‌డ్ కాల్స్ ఉన్నాయి. ఓ కొత్త నంబర్.. సంధ్య నుంచి చాలా కాల్స్ వచ్చాయి. అయినా పట్టించుకోలేదు. కొత్తనంబర్‌కు కాల్ చేసింది నీరజ. సంధ్య గురించి చెప్పిన పక్క రూమ్మేట్ మాట్లాడుతోంది ‘సారీ నీరజ... నన్ను క్షమించండి. సంధ్య నీగురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. మీ స్నేహం చూసి కుళ్లుతో అలా చెప్పాను. నన్ను క్షమించు’ అని ఫోన్ పెట్టేసింది. నీరజలో పశ్చాత్తాప భావం. వెంటనే ఫోన్ అందుకుని సంధ్యకు కాల్ చేసింది. అవతలినుంచి ఏడుపు. ఇంత ఘోరం జరుగుతదనుకోలేదు అని ఎవరో ఏడుస్తున్నారు. ఇంకెవరో ఫోన్ తీసుకుని... ఇక సంధ్యకు ఫోన్ చేయాల్సిన పనిలేదమ్మా. తను ఈ లోకంలోనే లేదు’ అంటూ ఫోన్ పెట్టేశారు. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది నీరజ.
తెల్లారే నీరజకు లెటర్ అస్తవ్యస్థమైన అక్షరాలతో...
‘నీరూ... నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయ ఫోన్‌లో మాటలు వినకపోయినా... లెటరయితే కచ్చితంగా చదువుతావుగా. అందుకే... ఇది. ఇప్పుడు హాస్పిటల్‌లో ఉన్నా. మాయదారి జ్వరమేదో నన్ను బాధిస్తుంది. ఈ బాధ కంటే నువ్వు మాట్లాడటం లేదనే బాధ ఎక్కువగా ఉందే. నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావో అర్థం కావడం లేదు. నేను ఏదైనా తప్పు చేస్తే సరిదిద్దు. కానీ ఆ తప్పు కారణంగా నాతో స్నేహం మానేయకు. ఈ క్షణమే వచ్చి నిన్ను చూడాలని ఉంది. కానీ నా ఆరోగ్యం అందుకు సహకరించడం లేదు. ఒక్కసారి వచ్చి వెళ్లు. ప్లీజ్...!’ నీరజ కన్నీళ్లతో ఉత్తరం తడిసిపోయింది.
Other News