మనసు కథ
‘మొఘల్ ఎ ఆజం’..పేమ జంట దిలీప్‌కుమార్, మధుబాల..రియల్‌లైఫ్‌లో కూడా లవ్ బర్డ్సే! ఇది జగమెరిగిన సత్యం. అయితే వీళ్ల లవ్‌స్టోరీకి సినిమాలో ఉన్నన్ని ట్విస్ట్‌లు ఉన్నాయి. విలనూ ఉన్నాడు. మధుబాల వాళ్ల నాన్న. మొఘల్ ఎ ఆజం సినిమా పూర్తవడానికి పదేళ్లు పట్టింది. ఈ పదేళ్లలో దిలీప్ కుమార్, మధుబాలల ప్రేమ చిగురించిందీ...వాడిపోయింది! తనంటే మధుబాలకున్న ఆరాధనకు దిలీప్ చలించిపోయాడు. మొఘల్ ఎ ఆజంలో దిలీప్, మధుబాలల మధ్య ఉన్న ప్రేమ సన్నివేశాల్లో మధుబాల జీవించేది. అయితే దిలీప్ అంటే మధుబాల వాళ్ల నాన్నకు ఇష్టంలేదు. అందుకే వాళ్ల ప్రేమను ఆయన ఒప్పుకోలేదు. అంతేకాదు ప్రేమ సన్నివేశాల చిత్రీకరణ అప్పుడు మధుబాల హద్దులు మీరకుండా ఉండాలని ఆమెకు ఎదురుగ్గా కుర్చీ వేసుకుని కుర్చొనే వాడట. దీంతో మధుబాల ఇబ్బంది పడి షాట్ సరిగా వచ్చేది కాదట. విషయాన్ని గ్రహించిన డైరెక్టర్.. మధుబాల వాళ్ల నాన్న పేకాట మమకారాన్ని సాకుగా తీసుకుని అసిస్టెంట్ డైరెక్టర్లకు చెప్పి బయట పేకాట ఆడించేవాడు ఆయనతో. ఇక్కడ సన్నివేశాలూ ఒకే ఓకే అయిపోయేవి. మధుబాలకు తనమీద ఉన్న ఇష్టాన్ని పెళ్లిగా మార్చాలనుకున్నాడు దిలీప్ కుమార్.
మొఘల్ ఎ ఆజం షూటింగ్ జరుగుతున్న టైమ్‌లోనే ఆ ప్రపోజల్ కూడా ఆమె ముందుంచాడు. అయితే వాళ్ల నాన్నతో అనుబంధాన్ని పూర్తిగా తెంచేసుకోవాలనే షరతు పెట్టాడు. మధుబాల ఆ ధైర్యం చేయలేక పోయింది. అలాగని దిలీప్‌నూ మర్చిపోలేక పోయింది. కానీ తన ప్రపోజల్‌ను మధుబాల కాదన్న తర్వాత ఆమెతో మాట్లాడ్డం మానేశాడు దిలీప్. ఇదంతా మొఘల్ ఎ ఆజం షూటింగ్ అవుతున్న కాలంలో జరిగిన పరిణామమే. ఇద్దరి మధ్య సంబంధం తెగిపోయాక కూడా షూటింగ్ కొనసాగింది. దిలీప్‌తో జరిగే ప్రతి షాట్‌లో తన కళ్లల్లో ప్రేమ కురిపించేది మధుబాల. మధుబాలను చెంప మీద కొట్టే సీన్ ఉంటుంది ఆ సినిమాలో. దిలీప్‌కుమార్ ఆమెను నిజంగానే కొట్టాడట. ఆ దెబ్బకు కళ్లు తిరిగి పడిపోయింది మధుబాల (అప్పటికే ఆమె హార్ట్ పేషంట్). ఆమె కోలున్నాక ఆ సినిమా డైరెక్టర్...మధుబాలతో..‘యూసుఫ్(దిలీప్)కు నీ మీద ఇంకా ప్రేమ పోలేదు’ అన్నాడట.
గుండెలవిసేలా ఏడ్చిందట మధుబాల.
ఆ తర్వాత మధుబాలను కిషోర్‌కుమార్ ప్రేమించడం మొదలుపెట్టాడు. తనను పెళ్లి చేసుకోకపోతే ఫ్యాన్‌లో చేయి పెడతానని..ఇలా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసేవాడు. అప్పటికే మధుబాల ఆరోగ్యమూ క్షీణించసాగింది. లండన్‌లో ఆమెకు హార్ట్ సర్జరీ చేయాల్సి ఉండింది. తనను పెళ్లి చేసుకుంటే లండన్ తీసుకెళ్లి ఆపరేషన్ చేయిస్తానని ప్రామిస్ చేశాడు కిషోర్. సరే నంది మధు. ఇద్దరి పెళ్లయింది. విషయం తెలిసిన దిలీప్ మొదట నమ్మలేదు. తర్వాత షాక్ అయ్యాడు. అప్పుడు సైరాబాను ఆయనను ప్రపోజ్ చేసింది. మధుబాల కొట్టిన దెబ్బతో తనకన్నా 20 ఏళ్లు చిన్నదైన సైరాబాను ప్రపోజల్‌కు సై అన్నాడు. ఆ ఇద్దరికీ పెళ్లయింది. లండన్‌లో మధుబాలకూ ఆపరేషన్ అయింది. కానీ తర్వాత నుంచి కిషోర్ ఆమెను నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు. ఒక దశలో ఆమెను డబ్బులకు కూడా ఇబ్బంది పెట్టాడట. దాంతో కుదుట పడాల్సిన మధు ఆరోగ్యం మరింత క్షీణించసాగింది. .కిషోర్‌ను పెళ్లి చేసుకున్నా మధుబాల దిలీప్‌ను మర్చిపోలేక పోయింది. చివరిసారిగా దిలీప్‌ను కలవాలని చాలా ఆరాటపడింది. ఆయనకు ఫోన్ చేసింది. ‘నేను బాగయ్యాక నీతో మళ్లీ ఒకసారి నటించాలనుంది. నాతో సినిమా చేస్తావా?’ అని అడిగిందట. కళ్లనీళ్ల పర్యంతం అయిన దిలీప్..‘నీ ఆరోగ్యం తప్పకుండా బాగవుతుంది...నేను నీతో మళ్లీ నటిస్తాను. ముందు నువ్ కోలుకో!’ అని చెప్పాడట. కానీ మధుబాల కోలుకోలేదు. దిలీప్‌ను తలచుకుంటూనే తుది శ్వాస విడిచింది. మధుబాల చనిపోయాక ఆమె తండ్రి వాళ్ల ప్రేమను రియలైజ్ అయ్యాడు. కానీ అప్పటికి మధు సమాధి మిగిలింది. అందుకే ఆ పశ్చాత్తాపంతో ఆయన చనిపోయే వరకు మధుబాల సమాధి దగ్గరే గడిపాడట.
Other News