మనసు కథ
ఈసారి బోనాల పండగకు మళ్లీ ఊరొచ్చిన. చిన్నప్పుడు నేను తిరిగిన ఊరు... నా చిన్న పాదాలకు మట్టి స్పర్శను తెలిపిన ఊరు... దోస్తులతో ఆటలాడిన ఊరు. నాన్న భుజాలపై ఎక్కి కలియ దిరిగిన ఊరు. నేను, అమ్మా, నాన్న. ఇదే మా కుటుంబం. భార్యాపిల్లలతో ఇంట్లోకి అడుగుపెట్టగానే అమ్మ ఎదురొచ్చి చిన్నారిని ఎత్తుకుంది. పేపర్ చదువుకుంటూ అరుగు మీద కూర్చున్న నాన్న కళ్లద్దాలు సవరించుకుంటూ ఇంట్లోకి వచ్చాడు. పలకరింపులు అయిపోయాక పడమటి అర్రలోకి వెళ్లాను. ఎదురుగా దిగూడు. అందులో గాజు సీసా నా మనసును 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లింది.నేను మా ఊళ్లో ఉన్న ప్రైమరీ స్కూల్‌కు వెళ్తున్న రోజులు. నాన్న ఊరిపక్కనే ఉన్న రైస్ మిల్లులో రోజూవారీ కూలి. నన్ను మోసిన భుజాలపైనే... బియ్యం బస్తాలు మోశాడు. ఒకటా రెండా... కొన్ని వేల బస్తాలు మోశాడు. ఇంటికి రాగానే బట్టలు మార్చుకుని, కాళ్లూ చేతులు కడుక్కునేవాడు. ఆ బట్టలు మార్చుకునేటప్పుడు ఆయన జేబులో ఉన్న పైసలన్నీ సీసాలోకి వెళ్లేవి. ఆ సీసాకి చరిత్ర ఉంది. అది నానమ్మ పచ్చడి పెట్టిన సీసా. పచ్చడి అయిపోయాక ఆ సీసాని నా చదువులకోసం డబ్బు దాయడానికి పెట్టాడు నాన్న. నాన్న అందులో బిల్లలు వేసేటప్పుడు వచ్చే సంగీతం నా చెవుల్లో మోగుతూనే ఉంది. ఖాళీ సీసాలో డబ్బులు వేసేటప్పుడు ఒకరకమైన చప్పుడు..
అది సగం నిండాక ఒక చప్పుడు... చివర్లో ఒక చప్పుడు. అది నిండిపోయాక ఆ డబ్బులన్నీ ఒక కవర్‌లో సీలు చేయడం... వాటిని మరో సంచిలో వేసి, దానిని జాగ్రత్తగా నాన్న నడుముకు కట్టుకుని సైకిల్‌పై తను.. వెనుక నేను. పట్నం బ్యాంకుకు వెళ్లేవాళ్లం. చదువురాని నాన్న బ్యాంకులో డబ్బులు దాచడం మరో వింత. రెగ్యులర్‌గా వెళ్తుండటం వల్ల అక్కడా ఆయనకు పరిచయస్తులున్నారు. నాన్న చేత వేలిముద్ర వేయించుకోవడం తప్ప మిగిలిన పనులన్నీ నాన్నకు తెలిసిన క్లర్క్ చేసేవాడు. ఇంటిదగ్గర లెక్కపెట్టినా సరే... మళ్లీ అక్కడా అన్నీ లెక్కపె నాన్న. డిపాజిట్ ప్రాసెస్ పూర్తయ్యాక...
మొత్తం ఎంతయ్యిందని అడిగేవాడు. ‘ఇప్పటివరకూ ఎన్ని డబ్బులయినయి అయ్యా’ అని.. వచ్చిన ప్రతీసారీ అడిగేవాడు. గతంలో దానికి ఇది జత చేస్తే ఎంతవుతుందని ఆయనకు తెలిసినా వాళ్ల నోటిగుండా విని... ఇంకొంచెం ధైర్యం తెచ్చుకునేవాడు. ఆ తరువాత నావైపు చూసిన చూపుల్లో ఎన్ని అర్థాలో. నేను చేస్తున్న కష్టం నుంచి నిన్ను దూరం చేయడానికేరా నాన్న ఇదంతా అన్నట్టు ఉండేదా చూపు. కొన్ని పైసలు మిగిల్చి వచ్చేదారిలో నాకు ఐస్‌క్రీం కొనిచ్చేవాడు. వెనుకగా నాన్న వస్తుండటంతో మళ్లీ ఈలోకంలోకి వచ్చా... ‘ఏంటీ నాన్న మళ్లీ ఈ పొదుపు. ఇప్పుడు ఏం తక్కువైందని నీకు?’ అంటూ నా నోటినుంచి కొంచెం కోపం, ఆయనను బాధపెట్టొద్దన్న ఆలోచననుంచి వచ్చిన విసుగు. ‘నీకు మంచి ఉద్యోగం వచ్చినంత మాత్రాన నా బాధ్యత అయిపోలేదురా! ఇదిగో ఈ చిట్టితల్లి ఉంది కదా!’ అంటూ పాపను గాల్లోకి ఎగరేస్తూ... నా నాన్నతనాన్ని గుర్తు చేస్తూ నాన్న.
Other News