వైద్యప్రసాద్
ఖమ్మం జిల్లా కామేపల్లికి చెందిన సత్రామ్ నాయక్, సోనాభాయ్‌లకు పది మంది సంతానం. నలుగురు ఆడపిల్లలు, ఆరుగురు మగపిల్లలు. ఐదవ సంతానం వసంత ప్రసాద్. సత్రామ్ నాయక్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే వ్యవసాయం కూడా చేసేవాడు. సంతృప్తిలేక ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశాడు. తన ఊరి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో అడుగుపెట్టాడు. ఊళ్లో ప్రజల కష్టాలన్నీ తన కష్టాలుగానే భావించేవాడు. అధికారుల వెంటపడి మరీ పనులు పూర్తి చేయించేవాడు. అలా వాళ్ల తలలో నాలుకలా మారాడు. మరోవైపు వ్యవసాయం చేస్తూనే పిల్లలందరినీ గవర్నమెంటు స్కూల్‌లో చదివించాడు.
వసంత ప్రసాద్‌కు చిన్నప్పటినుంచే లెక్కలు అంటే భయం. దాంతో లెక్కల టీచర్ అన్నా భయపడేవాడు. 25 మార్కులకు ఆరో, ఏడో వచ్చేవి. సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగించినా మార్పు లేదు. ‘వీడికి చదువు చెప్పించడం శుద్ధ దండగ, పుస్తకాలకు, బట్టలకు పెట్టే ఖర్చు మీ కుటుంబానికి మరోలా ఉపయోగపడుతుంది. చెప్పింది విని వీడిని పొలం పనులకు పంపించండి’ అన్నాడు లెక్కల టీచర్ ఓరోజు స్కూల్‌కు వచ్చిన సత్రామ్ నాయక్‌తో. దానికి ఆయన చిన్న నవ్వు నవ్వి ‘వాడు చిన్నపిల్లాడు.. మీరే దారిలో పెట్టాలి’ అని చెప్పి వెళ్లిపోయాడు. అలా అతికష్టంగా అత్తెసరు మార్కులతో 7వ తరగతి గట్టెక్కాడు వసంతప్రసాద్.
టర్నింగ్ పాయింట్...
మహబూబాబాద్‌లోని గవర్నమెంట్ స్కూల్‌లో చేర్పించారు. పదో తరగతి వరకు చదువులో మార్పు లేదు. ఇది గమనించిన తండ్రి కొడుకు వసంతప్రసాద్‌ను కూర్చోబెట్టుకుని... చదువుకోవడం వల్ల కలిగే లాభాలను ఓపికగా వివరించాడు. ఆ బోధ అతనిలో మార్పు తెచ్చింది. పదో తరగతిలో డిస్టింక్షన్‌లో పాసయ్యాడు. మరి ఇంటర్? వసంత ప్రసాద్ ముందు పెద్ద క్వశ్చన్. ఏ గ్రూప్ తీసుకోవాలి? బైపీసీనా? ఎంపీసీనా? ఒక్కసారిగా లెక్కల పుస్తకం, లెక్కల టీచర్ కళ్ల ముందు మెదిలారు. బైపీసీ తీసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అదే విషయాన్ని తన తండ్రితో చెప్పాడు. అది విన్న అతని తండ్రి ‘బైపీసీ తీసుకుని సాదాసీదాగా చదివితే సరిపోదు. బాగా కష్టపడాలి. అది ప్రజల ప్రాణాలు నిలిపే అత్యంత శక్తి వంతమైన డాక్టర్లకు దారి’ అని చెప్పాడు. ఆ మాటలే వేద మంత్రాల్లా పనిచేశాయి.
ఇంటర్మీడియట్ పూర్తి కాగానే వసంత్‌కు గాంధీ మెడికల్ కాలేజీలో ఎమ్‌బీబీఎస్ సీటు దొరికింది. ఇతర వ్యాపకాల జోలికి పోకుండా జాగ్రత్తగా చదివి అందులోనూ మొదటి స్థానంలో ఉత్తీర్ణత సాధించాడు. మాట నిలబెట్టుకున్న విజయగర్వంతో తండ్రి దగ్గరకు వెళ్లాడు. అందుకు తండ్రి వసంత్‌తో ‘‘నువ్వు సాధించింది రవ్వంత.. సాధించాల్చింది కొండంత. నువ్వు కేవలం డాక్టర్‌వు మాత్రమే అయ్యావు. అది సంతోషమే కానీ పది మందికి సేవ చేయగలిగితేనే దానికి సార్థకత ఉంటుంది’’ అని చెప్పాడు.
విజయ ప్రస్థానం...
వసంత్ ఎమ్‌బీబీఎస్ పూర్తి చేయగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి అందులో విజయం సాధించాడు. వర్గల్‌లోని 30 పడకల ఆసుపత్రిలో ఎమ్‌డీగా విధుల్లో చేరాడు. అక్కడ 1985 నుంచి 1988 వరకు పనిచేశాడు. తర్వాత 1988లో అసిస్టెంట్ ఫ్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్, 1998లో గుంటూర్ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో అసోసియేట్ ఫ్రొఫెసర్, 2003 నుంచి ఓయూలో ఫ్రొఫెసర్, 2008 నుంచి 2009హెచ్‌ఓడీ, 2011లో అడిషనల్ సూపరిండెంట్, ఆరు నెలలు సూపరిండెంట్‌గా పని చేసి కోఠిలోని వైద్య విద్యా విధాన పరిషత్‌లో 2011, నవంబర్ 1న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌గా పదవీ బాధ్యతలను స్వీకరించాడు. ఆ స్థాయికి చేరుకున్న తెలంగాణ తొలి వ్యక్తి వసంత ప్రసాద్ మాత్రమే. అంతే కాదు ఇప్పటిదాకా 16 రాష్ట్రాల్లో పలు డయాబెటిక్ సెమినార్‌లలో పాల్గొని సేవలందించారు.
స్వీట్ మెమరీ...
తన క్లాస్‌మేట్ అహల్యా దేవిని ప్రేమించాడు. కానీ ఆ విషయం ఆమెకు చెప్పడానికి ధైర్యం రాలేదు. ఇది గమనించిన తన బంధువుల్లో ఒకరు ఈ విషయాన్ని తన తండ్రి చెవిలో వేశారు. ఇరు కుటుంబాల పెద్దలు కూర్చొని మాట్లాడుకొని వీరిద్దరికీ వివాహం చేశారు. వసంత్ అహల్యా దేవిని ప్రేమించాడనే మాటే కానీ ఓ షరతును విధించాడు. నాతోపాటు పేదలకు వైద్య సేవలు అందించడానికి ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటానని మెలిక పెట్టాడు. అందుకామె చిరునవ్వుతో అంగీకరించింది. అహల్య కూడా చదువులో తెలివైనది కావడంతో ఉద్యోగం కూడా తొందరగానే వచ్చింది. కానీ తన భర్తకు ఇచ్చిన మాట కొరకు ప్రభుత్వోద్యోగాన్ని వదులుకుని, ఓ క్లినిక్ పెట్టి వైద్య సేవలు అందిస్తున్నది. ఆ వైద్యదంపతులకు ఒక కొడుకు, ఒక కుమార్తె. ఇద్దరూ తల్లిదండ్రుల బాటలోనే నడిచారు. వాళ్లుకూడా వైద్యవృత్తిలోనే ఉన్నారు.
నేలను మరవకూడదు
ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా మూలాలను మరవకూడదన్నదే వసంత్ పాలసీ. అందుకే తండ్రి వ్యవసాయం చేస్తూ పడిన కష్టాన్ని ఆయనేనాడు మరవలేదు. వీలు చిక్కినప్పుడుల్లా ఊరికి వెళ్తాడు. వ్యవసాయ పనుల్లో పాలుపంచుకుంటాడు.
కష్టే ఫలి...
‘‘అది కావాలి.. ఇది కావాలి అని కలలు కంటూ కూర్చుంటే వాటిని చేరుకోం. మనం అనుకున్న దాన్ని చేరుకోవాలంటే దృఢ నిశ్చయంతో కష్టపడాలి. అప్పుడే విజయ శిఖరాలను అధిరోహిస్తాం. కానీ ఒక్క విషయం. మనం ఆ విజయాలను చేరుకోవడానికి మనకు ఎంతో మంది సాయమందించి ఉంటారు. మరెంతో మంది దిశానిర్ధేశం చేసుంటారు. మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాక మనం తిరిగి వారికి ఏమీ ఇవ్వనక్కర్లేదు. వాళ్లను మరువకుండా ఉంటే చాలు’’ అంటాడు వసంత్‌ప్రసాద్.
Other News