వాణి కళల బాణి
మహావృక్షం...తన నీడన ఎంతోమందికి ఆశ్రయమిస్తే పర్లేదు
కానీ ఇంకే మొక్కను ఎదగనీయకపోతేనే కష్టం, నష్టం!
పీవీ నరసింహారావూ మహావృక్షంలాంటి వారే!
అయితే ఆయన నీడ ఆశ్రయమిచ్చేది కాదు కొత్త మొక్కలకు ప్రాణం పోసేది! సొంత వ్యక్తిత్వంతో ఎదిగిన ఆయన పిల్లలే ఇందుకు సాక్ష్యం! విద్య విచక్షణనెరుగు, కళలు ఆత్మానందాన్నిచ్చు అన్న సూత్రాన్ని తన సంతానానికి ఉగ్గుపాలతో పట్టించారు కాబట్టే పిల్లలు ఈ రెండింటిలో మాస్టర్స్ అయ్యారు. తండ్రే రోల్‌మోడల్‌గా ఆయన నీడలో ఎదగడం మొదలుపెట్టారు అయితే పాములపర్తి నరసింహారావు ఎనిమిది మంది పిల్లల్లో ఆర్టిస్ట్‌గా వాణికున్న బాణి వేరు. నాన్న రాజకీయ చతురత కన్నా వ్యక్తిగా ఆయన ఆచరించిన విలువలే ఆమెకు ఆదర్శమయ్యాయి. ఆ వాక్కునే శ్రీవెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్ ప్రిన్సిపల్
వాణి గర్వంగా చెప్తారు....
‘అసలు నాన్న మమ్మల్ని పెంచిన తీరే వేరు. ఆడపిల్లలు, మగపిల్లలు అన్న వివక్ష ఉండేదికాదు. అన్నయ్యలతో పాటుగా మేమూ ఈతకు వెళ్లేవాళ్లం. సైకిల్ తొక్కేవాళ్లం. అబ్బాయిలాడే ఆటలన్నీ ఆడేవాళ్లం. మేమిలా చేస్తున్నామని అమ్మ ఒకరోజు నాన్నతో కంప్లయింట్ ఇచ్చింది. ‘తప్పేముంది?’ అంటూ చాలా తేలిగ్గా తీశేశారు నాన్న అమ్మ కంప్లయింట్‌ను. మా అన్నయ్యలతో సమానంగా మమ్మల్ని చదివించారు. నాది తప్ప అందరివీ పెద్ద చదువులే. నా ఎకడమిక్ చదువుకు బీఏతోనే ఫుల్ స్టాప్ పడింది. నాకు చిన్నప్పటి నుంచి పెయింటింగ్ అంటేనే ఎక్కువ ఆసక్తి. ఐదో తరగతి వరకు వంగరలోనే చదివాను. మా ఊళ్లో ఉన్న ఇనుపరాతి గుట్టలు, మిరప తోటలు, కాల్వలు...అన్నీ నా మనసులో ముద్రవేసుకునుండిపోయాయి.
ఆ వాతావరణమే...
నాకు ఊహ తెలిసినప్పటి నుంచే నాన్న రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అయినా మా ఇల్లు రాజకీయవేత్తలతో కాక విశ్వనాథ సత్యనారాయణ, రావి శాస్త్రి, డాక్టర్ సినారే లాంటి సాహితీవేత్తలు, కళాకారులతో నిండి ఉండేది. ఆ వాతావరణమే గమ్మత్తుగా ఉండేది. అసలు పొలిటీషియన్స్ అంతా ఇలాగే ఉంటారని అనుకునే వాళ్లం. ఆ పరిసరాలు మామీద చాలానే ప్రభావం చూపాయి. నిజానికి నేను ఆర్టిస్ట్‌ను కావడానికి ఒకరకంగా నాన్నే కారణం. 1961లో మేము హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యాం. నేను ఆరోతరగతి. అప్పటి నుంచే నా పెయింటింగ్ ప్రస్థానం మొదలైంది. వంగర దృశ్యాలను గుర్తుకు తెచ్చుకుంటూ పెన్సిల్‌తో బొమ్మలేసేదాన్ని. నేను వేసిన ప్రతి బొమ్మను ఫస్ట్ నాన్నకే చూపించేదాన్ని. బాగుంది అని, ఇంకా బాగా వేయాలని ఎంకరేజ్ చేసేవారు. పెయింటింగ్ వల్ల నా చదువు బీఏతో ఆగినా ఏమీ అనలేదు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే... నాన్న ఏ దేశం వెళ్లినా...మిగతా వాళ్లకు ఏం తెచ్చినా తేకపోయినా నాకు మాత్రం కలర్ సెట్టో, స్కెచెసో ఏదో ఒకటి తప్పకుండా తెచ్చేవారు. అన్నయ్యలను, అక్కయ్యలను వాళ్ల చదువు గురించి, కెరీర్ గురించి వాకబు చేయకపోయినా నన్ను మాత్రం తప్పనిసరిగా అడిగేవారు...‘ఏమ్మా....కొత్తగా ఏం బొమ్మ గీశావ్?’ అని. అయితే చదువుతో పాటు ఏదో ఒకటి తప్పకుండా నేర్చుకోవాలని చెప్తుండేవారు నాన్న. మేము ఖాళీగా ఉండడం అసలు ఇష్టం ఉండకపోయేది. సాయంత్రం నాలుగున్నరకు బడి నుంచి రాగానే ఆడుకుంటూ కనిపిస్తుంటే...‘ఆ దంతాలే దగ్గరకు వెళ్లి సంగీతం నేర్చుకోండి’ అని పంపేవారు.
ఆ ముగ్గురూ...
దంతాలే మ్యూజిక్ కాలేజ్‌కు అప్పటి ప్రిన్స్‌పల్. నాన్నకు మంచి స్నేహితుడు. అలా సంగీతమూ నేర్చుకున్నాం. పెయింటింగ్‌లో అయితే నరేంవూదరాయ్ శ్రీవాత్సవ, శేషగిరిరావులే రోల్‌మోడల్స్, గురువులు, అన్నీ! ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. ఇంతటి మహామహుల దగ్గర నా కళకు మెరుగులు దిద్దుకునే అవకాశం దొరికినందుకు! పెయింటింగ్‌లో డిప్లమా చేయడానికి ప్రోత్సహించింది జేఎన్‌టీయూ ఆర్ట్స్ డిపార్ట్‌మెంట్ హెడ్ వాసుదేవరావు గారే. నేను టీచింగ్ ప్రొఫెషన్లోకి రావడానికి కారణం కూడా ఆయనే.
ఐదేళ్ల డిప్లమా అయిపోయాక..ఖాళీగా ఉన్నాం ఏదైనా బ్రిడ్జ్ కోర్సును స్టార్ట్ చేయండి సర్ అంటూ చాలా సతాయించేవాళ్లం. తప్పించుకోవడానికి ఆయన..‘ఖాళీగా ఉండడం ఎందుకు? ఇదిగో ఈ పేపర్స్ కరెక్ట్ చెయ్ ’ అంటూ తన పేపర్స్ ఇచ్చేవారు. అప్పుడప్పుడూ క్లాసెస్ తీసుకోమనేవారు. మమ్మల్ని ఖాళీగా ఉండనివ్వకుండా ఇలా ఏదో ఒక పని అప్పజెప్పవారు. అట్లా టీచింగ్ వృత్తిలో స్థిరపడిపోయాను. బొమ్మలు వేయడం, వాటి గురించి బోధించడం నాకు చాలా నచ్చే పని. అయితే ఇదంతా ఆషామాషీగా సాగిన వ్యవహారం కాదు. పెయింటింగ్ మన బ్లడ్‌లో ఉన్నా నైపుణ్యం, ప్రాక్టీస్ ద్వారానే వస్తుంది. అదిరావాలంటే ఆర్ట్ అయినా దానికి అకడమిక్ చదువు తప్పనిసరి. మామూలు చిత్రకారుడికి, ఓ యూనివర్శిటీ నుంచి ఫైన్ ఆర్ట్స్‌లో పట్టా పుచ్చుకుని బయటకు వచ్చిన ఆర్టిస్ట్‌కి బయట సమాజం ఇచ్చే గౌరవంలో చాలా తేడా ఉంటుంది. ఇది నేను జేఎన్‌టీయూలో జాయిన్ అయ్యాక నేర్చుకున్నాను. ఇప్పుడు నేను పని చేసేది కూడా ఫైన్ ఆర్ట్స్ చదువు మీద అవేర్‌నెస్ పెంచడానికే!
శ్రీవెంక కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్
మన దగ్గర ఇంజనీరింగ్, మెడిసిన్ కున్న విలువ ఫైన్ ఆర్ట్స్‌కు లేదు. అసలు వాటి మీద అవగాహన కూడా లేదు. కూటి కొస్తాయా, గుడ్డ కొస్తాయా అనుకుంటారు. కానీ కళలు లైఫ్‌ని బ్యాలెన్సింగ్ చేసుకోవడం నేర్పుతాయి. అదీగాక ఇప్పుడు ఆర్టిస్ట్‌లకు మంచి డిమాండు ఉంది. వాళ్లకు శిక్షణనిస్తే అద్భుతంగా తయారవుతారు. ఈ ఆలోచనతోనే శ్రీ వెంక ఫైన్ ఆర్ట్స్ కాలేజ్‌ను మొదలుపెట్టాను. దీనికంటే ముందే 1994లో ఫార్మసీ కాలేజ్ స్టార్ట్ చేశాను. దానికెప్పుడూ డిమాండ్ ఉంటుంది. కానీ కళల కాలేజీ నడపాలం చాలా కష్టం. అందుకే నా దృష్టంతా ఇప్పుడు ఈ కాలేజ్ మీదే. నిజానికి నాన్నకు కూడా ఇష్టమైంది ఫైన్ ఆర్ట్స్ కాలేజీయే. అయితే ఈ కాలేజీ నాకు శాంక్షన్ కావడానికి నాన్న పరపతిని రవ్వంత కూడా వాడుకోలేదు. అసలు అలాంటివి ఆయనకు ఇష్టముండదు కూడా. ఆ మాటకొస్తే నాన్న ప్రధానమంత్రి అయ్యేదాకా మేము లో ప్రోఫైల్‌గానే ఉన్నాం. ఎదగడానికి కావల్సింది తగిన చదువు. అది చెప్పించారు. ఎవరికి వారే ఎదగాలి, స్వతంవూతులుగానే బతకాలి అని చెప్పేవారు ఆయన. అలాగని నాన్న ప్రధానిగా ఉన్నప్పుడు మేము ఢిల్లీ వెళ్లలేదని కాదు. ప్రతి సెలవులకు చిన్నప్పుడు వంగరకెలా వెళ్లేవాళ్లమో తర్వాత ఢిల్లీకి అలాగే వెళ్లాం.
మాతో కలిసి భోంచేసేవారు, మాతో కాసేపు గడిపేవారు. ఢిల్లీ చుట్టుపక్కలున్న ప్రదేశాలకు వెళ్లమని చెప్పేవారు. అంతవరకే. ఆయన రాజకీయాల్లో మమ్మల్ని జోక్యం చేసుకోనిచ్చేవారు కాదు. మా వ్యక్తిగత జీవితాల్లో ఆయన జోక్యమూ ఉండేది కాదు. ఆ గీతను చివరవరకూ పాటించారు నాన్న. అలాగే నా వెంక ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ విషయంలో కూడా ఆయన ఫేవర్ లేదు, కాకపోతే అప్లికేషన్ కాస్త కదలడానికి ఏమైనా సాయపడి ఉంటుంది అంతే. ఇందులో బ్యాచ్‌లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పెట్టడానికి ఒకరకంగా శివానంద మూర్తి కారణం. దరఖాస్తులో అది ఉండేలా చూడమని సూచించింది ఆయనే. ఆ దరఖాస్తు రిజెక్ట్ కూడా అయింది. తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్ హెడ్ దగ్గరకు వెళ్లాం. అదంతా అయ్యాకే అన్నీ పరిశీలించాకే వాళ్లుక్షిగీన్ సిగ్నల్ ఇచ్చాకే నాకీ కాలేజ్ అలాట్ అయింది. పీవీ కూతురుననే పైరవీతో కాదు.
రామానంద తీర్థ కమిటీ..
నాన్న రాజకీయ గురువు రామానందతీర్థ. ఈ రామానందతీర్థ కమిటీ నాన్న ఉన్నప్పుడే ఏర్పడింది. అయితే అప్పటిదాకా నేను సాధారణ సభ్యురాలినే. మొన్నీమధ్యనే జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాను. ఆ కమిటీ తరపున మహిళలు, పిల్లల కోసం పనిచేస్తున్నాం. అమ్మాయిలకు స్వయం ఉపాధి కోసం శిక్షణనిస్తున్నాం. కేవలం కుట్లు అల్లికలే కాకుండా బయట ఉన్న ఉద్యోగ అవకాశాలను దృష్టిలో పెట్టుకునే తగిన కోర్సులను అందిస్తున్నాం. అలాగే బేగంపేట్ చుట్టుపక్కల స్లమ్‌లోని పిల్లల కోసం సమ్మర్‌క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఈసారైతే 150 మంది పిల్లలు జాయిన్ అయ్యారు. చిత్రలేఖనం, డాన్స్, మ్యూజిక్, ఆటలు లాంటివన్నీ ఉంటాయి. ఈ విషయంలో చందనాఖాన్ నాకు చాలా సహాయపడింది. స్వతాహాగా తనూ ఆర్టిస్ట్ కావడంతో నా ఆలోచనలను బాగా అర్థం చేసుకుంది. ఇప్పటికీ సాయంత్రం నాలుగు నుంచి ఏడు గంటలదాకా ఆ పిల్లలకు అభిరుచి ఉన్న రంగాల్లో శిక్షణనిస్తున్నాం. రామానంద తీర్థ కమిటీ నాన్న కలల రూపం. మున్ముందు కూడా ఈ కమిటీ తరపున బృహత్తర కార్యక్షికమాలు చేపట్టాలని ప్లాన్ చేస్తున్నాం. ముఖ్యంగా గ్రామీణ యువత, మహిళలకు ఉపయోగపడే కార్యక్షికమాల పట్ల శ్రద్ధపెట్టాలనుకుంటున్నాం.
ఆర్టిస్ట్‌గా...
ఇప్పటికీ రోజూ ఏదో ఒక బొమ్మ వేయందే నిద్రపోను. ఏది చేసినా చిత్తశుద్ధి, ఏకాక్షిగత అవసరం అని నాన్న చెప్పిన మాటలే నాకు శిరోధార్యం. నా ఈ ఉన్నతికి ఒకటి మా నాన్న, రెండు మా ఆయన పి. దయాకర్ రావు కారణం. నాకు ముగ్గురు కూతుళ్లు. రెండో అమ్మాయి అజితకు నా వారసత్వం అబ్బింది. తను కూడా మంచి ఆర్టిస్ట్. అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరినైనా... సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయమే జీవితంలో నిలబెడుతుంది. మహిళల విషయమే తీసుకుంటే ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్. అయితే అవకాశం కోసం ఎదురుచూడకుండా అవకాశాలను మనమే వెదుక్కోవాలి. వచ్చిన అవకాశంతో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. దీన్ని మించిన సక్సెస్ మంత్రం లేదు. దేనికైనా షార్ట్ కట్ లేదు. హార్డ్ వర్కింగ్ ఒక్కటే ఏకైక మార్గం’ అని చెప్పారు శ్రీ వెంక కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ప్రిన్సిపల్ శ్రీమతి ఎస్. వాణీదేవి.
జర్నీ
ఆర్టిస్ట్‌గా 35 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం వాణీదేవిది. ఇప్పటి వరకు దేశవిదేశాల్లో పదిహేనుకు మించిన సోలో ప్రదర్శనలిచ్చారు. అమెరికా, వాషింగ్‌టన్‌లోని గాంధీ మెమోరియల్ సెంటర్‌లో ఆమె ఇచ్చిన ‘సారే జహాసే అచ్ఛా’ ఆర్ట్ ఎగ్జిబిషన్ మరిచిపోలేనిది. పూణెలోని భారతీ విద్యాపీఠ్ వాళ్ల పురస్కారం నుంచి పెయింటింగ్‌లో ఇచ్చే స్త్రీమాలా అవార్డుదాకా ఎన్నో సత్కారాలు అందుకున్నారు. పొట్టి శ్రీరాములు యూనివర్శిటీ జ్యూరీ సభ్యురాలిగా, సెలక్షన్ కమిటీ మెంబర్‌గా కూడా పనిచేశారు.
జిందగీ డెస్క్
ఫోటోలు: కంది కపిల్‌ప్రసాద్
Other News