మనసు కథ
‘ఒరేయ్...ఈ బట్టల బకెట్ డాబా మీదికి మోసుకెళ్లాలి కొంచెం సాయం పట్టరా...!’ పదహారేళ్ల కొడుకును కేకేసింది అమృత.‘సరే..నాకేంటి?’ ప్రశ్నించాడు. ‘నీకేంటా? అంటే?’ అర్థంకాక తిరిగి ప్రశ్నించింది అమృత. ‘అదే...మమ్మీ...ఇప్పుడు ఈ బట్టల బకెట్‌ను తీసుకెళ్లి టెర్రస్ మీద పెడ్తాను కాని బదులుగా నాకేమిస్తావ్ అని’ వివరించాడు కొడుకు. ఈ బట్టలు నీవేరా...మొద్దుల్లాంటి జీన్ పాంట్లను జబ్బలు పడిపోయేలా ఉతికాను...ఇంకేం కావాలి బదులుగా’ అయోమయంగా అడిగింది. ‘సాయంత్రం పార్టీ చేసుకోవాలనుకుంటున్నాం...ండువేలు కావాలి’డైక్టుగా మ్యాటర్ డీల్ చేశాడు. ఈ బకెట్ టెర్రస్ మీదకి వెళ్లడానికి రెండువేలు. ఊ...ఖరీదే అనుకుంది. ‘సరే..కానీ’ అంది. బకెట్ తీసుకెళ్లడమే కాదు చక్కగా దులిపి ఆరేశాడు కూడా!సాయంత్రం ఏడైంది...అమృత కొడుకు పార్టీ కోసం రెడీ అవుతున్నాడు. అమృతవాళ్లాయనేమో భార్య చేసిన వేడివేడి పకోడి, టీ కోసం ఎదురుచూస్తున్నాడు. పకోడీ కోసం ఉల్లిపాయలు కోసిపెట్టినందుకు కూతురు రెండువందలు అడిగింది. పకోడీ వేయడం అయ్యాక ఇస్తానంది అమృత! అందరూ తమకు కావల్సిన వాటికోసం ఎదురుచూస్తున్నారు. అమృత మాత్రం ప్లేట్‌లో వేడివేడి పకోడి వేసుకుని సోఫాలో నింపాదిగా కూర్చుని టీవీ చూస్తూ వాటిని ఆరగించసాగింది. ‘అదేంటీ నాకేది పకోడి?’ అడిగాడు.
‘నాకేంటి?’ క్వశ్చన్ చేసింది అమృత. ‘నీకేంటా...అంటే?’ అయోమయంగా అడిగాడు భర్త. ‘ఉండండి చెప్తా’ అంటూ పకోడి ముక్కనోట్లో వేసుకుంది. ఈ లోపు కొడుకు వచ్చాడు ‘అమ్మా..నా రెండువేలియ్’ అంటూ! ‘నాకేంట్రా’ అడిగింది అమృత. ‘అదేంటమ్మా...బకెట్ డాబా మీద పెడ్తే ఇస్తానన్నావ్’ కంగారు పడ్డాడు. ‘అవున్నాన్నా...నిన్ను భూమ్మిద పడేసి, ప్రతిదానికి నాకేంటి అని అడిగేలా పెంచిపెద్ద చేసినందుకు నాకేంటి అని. ముందు ఆ లెక్క తీరుస్తే నేను నీ రెండువేలు ఇచ్చేస్తాను. ఓకెనా బంగారం!’ అంటూ పకోడీ తినడంలో పడిపోయింది అమృత. తేలు కుట్టిన దొంగలా అక్కడి నుంచి మెల్లగా జారుకుంది కూతురు. నవ్వుతూ అమృత పక్కన కూర్చుంటూ ప్లేట్‌లోని పకోడి తీసుకున్నాడు ఆమె భర్త!
Other News