మనసు కథ
బ్యాచిలర్స్‌గా ఉన్నప్పుడు రాజేష్ అతని ముగ్గురు మిత్రులు కలిసి తెగ ఎంజాయ్ చేసేవాళ్లు. నలుగురూ అన్ని విషయాలను పంచుకునేవారు. కానీ రాజేష్‌ది కాస్త భిన్నమైన వ్యక్తిత్వం. అతడు పర్సనల్ అంటూ కొన్ని విషయాలు దాచుకునేవాడు. అలాంటి వాటిలో తన ప్రేమ విషయం ఒకటి అంటే... తన ప్రేమ గురించి మిత్రులతో చాలా విషయాలే పంచుకునేవాడు కానీ, అమ్మాయి ఎవరో చూపించలేదు. ఎందుకంటే అతనిది వన్‌సైడ్ లవ్. అందుకే తన ప్రేమ గురించి మాత్రం చెప్పేవాడు. ఆ అమ్మాయి తనతో మొదటి సారి మాట్లాడిన విషయం, ఎలా పరిచయం అయిన విషయం...అన్నీ చెప్పేవాడు. అతని ఫ్రెండ్స్ తమ ప్రియురాళ్లతో బైక్‌లపై తిరుగుతూ ఖాళీగా కనిపించిన రాజేష్ బైక్‌ను చూసి ఏడిపించేవారు సరదాగా.
‘నా ప్రేమ కూడా గెలుస్తుంది లే’ అనేవాడు రాజేష్.
కాలం గడిచిపోయింది. చదువు అయిపోయింది. కాలేజీ నుంచి వెళ్లిపోయే రోజు రాజేష్ మిత్రులు అడిగారు ‘అమ్మాయి ఎవరో చెప్పలేదు. కనీసం మన కాలేజేనా?’ అని.
‘కాదు ఉమెన్స్ కాలేజ్’ అని మాత్రం చెప్పాడు. ఆమెతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు రాజేష్. కానీ ఆ విషయం సదరు అమ్మాయికి అస్సలు తెలియదు.
కొన్ని నెలల తరువాత...
వరుసగా అందరి పెళ్లిళ్లయ్యాయి. ముగ్గురు స్నేహితుల పెళ్లికి హాజరయ్యాడు రాజేష్.
అందరి దగ్గర ఒకే ప్రశ్న ఎదురైంది అతనికి...‘నీ లవ్ సక్సెసా?’ అని. అతను ఏం చెప్పలేకపోయాడు.
సడెన్‌గా ఒకరోజు...పెళ్లికార్డు చేతిలో పెట్టాడు తన స్నేహితులకు. ‘ఆంజ్డ్ మ్యారేజా?’ అని తలపట్టుకున్నారు.
కానీ రాజేష్‌లోని ఉత్సాహం, ఆనందం చూసి ఆశ్చర్యపోయారు.
ఒక సంవత్సరం తరువాత...
నలుగురు మిత్రులు ఫ్యామిలీస్‌తో ఒక చోట కలిశారు. పిక్నిక్‌లా ఉంది వాతావరణం.
తమ ప్రేమకథలు చెప్పుకుంటూ అదృష్టవంతులుగా తమను తామే పొగుడుకున్నారు.
‘ప్రపచంలో లక్కీయెస్ట్ లవర్ ఎవరో తెలుసా?’ అనే మాట వినిపించడంతో అందరూ అటువైపు చూశారు. వెనకాల రాజేష్ వాళ్లనాన్న. నేనంటే నేనని ముగ్గురూ ముందుకొచ్చారు.
‘మీవరూ కాదు...రాజేషే లక్కీయెస్ట్ లవర్’ అని తన కొడుకు వైపు వేలు చూపించాడు.
‘ఎలా? వాడిది అరేంజ్డ్ మ్యారేజ్ కదా’ అన్నారు ముగ్గురూ.
‘అవును నేను అనుకోకుండా మాట్లాడిన సంబంధమే కానీ అంతకుముందే నుంచే వీడు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ విషయం అమ్మాయికి కూడా తెలియదు’ అన్నాడు రాజేష్ వాళ్లనాన్న. రాజేష్ గర్వంతో కూడిన సంతోషంతో నవ్వుతున్నాడు. అతని భార్య ఆశ్చర్యంతో నోరు తెరిచింది.
‘అందుకే చెప్తున్నా ఎప్పటికైనా వన్‌సైడ్ లవ్ చేసిన అమ్మాయినే అరెంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నవాడు లక్కీయెస్ట్ లవర్’ అంటూ అక్కణ్ణుంచి వెళ్లాడు రాజేష్ వాళ్ల నాన్న.
Other News