మనసు కథ
‘రా..రా..రా... కమాన్ మై బోయ్’ అంటూ చేతులు చాచాడు నరేంద్ర.
అతని కొడుకు పరుగెత్తుకొస్తున్నాడు. పక్కనే ఉన్న నరేంద్ర స్నేహితుడు మల్లేష్ వైపు నరేంద్ర గర్వంగా చూశాడు. చిన్నగా నవ్వుకున్నారు ఇద్దరూ. ఆ అబ్బాయి నరేంద్ర ఒళ్లో వాలిపోతూనే ఆయన చేతిలోని చాక్లెట్ లాక్కుని, అది తినడం అయిపోయేంత వరకు మెదలకుండా ఉన్నాడు. చాక్లెట్ అయిపోగానే అతని దగ్గర్నుంచి బయటకు పరిగెత్తాడు ఆ పిల్లాడు. అప్పటికి నరేంద్ర, మల్లేష్ మాట్లాడుకుంటూ ఆ అబ్బాయిని పెద్దగా పట్టించుకోలేదు.
ఈ ఇద్దరు స్నేహితులు చాలా రోజుల తర్వాత అనుకోకుండా రోడ్డు మీద కలిశారు. అక్కణ్నుంచి మాట్లాడుకుంటూ ఇంటికి తీసుకొచ్చాడు నరేంద్ర. ఆ ఇంటిని చూడగానే నరేంద్ర కోటిశ్వరుడు అని మల్లేష్‌కు అర్థమైంది. తిరిగి వెళ్లేటప్పుడు కాస్త తటపటాయిస్తూ, సంశయిస్తూ, మొహమాటపడుతూ...‘మీరూ ఒకసారి మా ఇంటికి రావాలి నరేంద్ర’ అన్నాడు మల్లేష్. దానికి చిన్నగా నవ్విన నరేంద్ర ‘చూద్దాం లే’ అన్నాడు.
మల్లేష్ ఇంటి ముందు కారు ఆగింది. కారు దిగిన నరేంద్ర, మల్లేష్‌లు గేటు తీసుకుని లోపలికి వెళ్లారు.
అంతలోకే తన కొడుకు కనిపించడంతో చేతులు చాచాడు మల్లేష్ పరుగున వచ్చి చంకనెక్కాడు ఆ అబ్బాయి. తండ్రి కొడుకులిద్దరి కళ్లల్లోనూ చెప్పలేనంత ఆనందం! ఆ అబ్బాయి తండ్రికి రెండు ముద్దులిచ్చి వెళ్లిపోబోతుంటే.. నరేంద్ర ఆ పిల్లాణ్ణి చేతుల్లోకి తీసుకుంటూ..‘ఏరా! రోజుకో చాక్లెట్ కూడా పెట్టలేవా మీ అబ్బాయికి’ అంటూ నవ్వాడు. ఆ నవ్వులో కొంచెం వెటకారం కూడా ఉంది. ఆ రోజు ఆతిథ్యం బాగానే జరిగినా నరేంద్ర రేంజ్‌కు తగినది కాదు.
మరుసటి రోజు..
తన కంపెనీలో విషయంలో ఏదో చిన్న ఒత్తిడి! నరేంద్ర మనసు గందరగోళంగా ఉంది.
సాయంత్రం నేరుగా ఇంటికి వెళ్లాడు. సోఫాలో ఆడుకుంటూ కనిపించాడు అతని కొడుకు. బలవంతంగా మొహంలో నవ్వు పులుముకుని ‘కమాన్ మై బోయ్...’ అన్నాడు రోజూ లాగే. ఆ పిల్లాడు పరుగున వచ్చాడు. కానీ నరేంద్ర చేతుల్లో చాక్లెట్ కనిపించకపోయేసరికి ‘నా చాక్లెట్ ఏది?’ అంటూ అలిగి వెళ్లిపోయాడు. అప్పుడు గుర్తొచ్చింది అతనికి చాక్లెట్ కొనలేదన్న సంగతి. ‘సారీ నానా మరిచిపోయాను’ అంటూ ఎంత బుజ్జగించినా ఫలితం లేదు. అప్పటికప్పుడు చాక్లెట్ తెప్పించాడు. కానీ ఆయన ఆలోచనలు ఎక్కడో ఆగిపోయాయి. మల్లేష్, అతని కొడుకే గుర్తుకొస్తున్నారు. నిద్రపట్ట మెల్లగా లేచి డైరీ ఓపెన్ చేసి రాస్తున్నాడు...
‘నిజమైన ధనవంతుడివి నువ్వే మల్లేష్. ఎందుకంటే నేను కనపడగానే ప్రేమగా పరిగెత్తుకొచ్చి నా ఒళ్లో వాలిపోయే పిల్లల్లేరు నాకు. నేను నిర్మించుకున్న చాక్లెట్ బంధం నా మనసును మెలిపెడుతోంది....’ !
Other News