మనసు కథ
సంతోష్‌కు గుండె ఆగినంత పనైంది...వాళ్ల పెద్దక్కకు యాక్సిడెంట్ అయిందని తెలియగానే. అప్రయత్నంగానే కళ్లల్లోంచి నీళ్లు కారుతున్నాయి. కన్నీళ్లతో దారి మసక మసకగా కనపడుతుంటే తన బైక్ దగ్గరకు నడిచాడు. వేగంగా వెళ్తున్నాడు...ఇప్పటివరకు అంత స్పీడ్‌గా తానెప్పుడూ బైక్ నడపలేదు. తనను ‘బంధమే’ నడిపిస్తుంది. కాదు పరిగెత్తిస్తుంది. పది నిమిషాల్లో హాస్పిటల్‌లో వాళ్లక్క దగ్గరున్నాడు. త్రీవమైన గాయాలతో బైడ్‌పై స్పృహ లేకుండా పడుకుని ఉందామె. ‘మా అక్కకు ఏం కావొద్దు భగవంతుడా’ అని మనసులో దేవుణ్ణి పదే పదే ప్రార్థిస్తున్నాడు. ఆమెకు ట్రీట్‌మెంట్ జరుగుతోంది.
బంధువులంతా ఓ చోట కూర్చున్నారు. సంతోష్ వాళ్లందరికీ కాస్త దూరంలో ఓ బెంచిపై కూర్చున్నాడు. అతడి మనసు గతంలోకి వెళ్లిపోయింది.
చిన్పప్పటి నుంచి అక్కతో సంతోష్‌ది అమితమైన అనుబంధం. నిజానికి తనకు ఇద్దరు అక్కలు, ఒక చెల్లె. కానీ పెద్దక్కతోనే ఎక్కువ సాన్నిహిత్యం. తినిపించడం నుంచి తల దువ్వటం వరకు అన్నీ ఆమెతోనే చేయించుకునేవాడు. ఏ పనైనా పెద్దక్క చెప్తేనే వినేవాడు.
ఒకరోజు సంతోష్‌వాళ్ల చిన్నక్క అడిగింది..‘ఏంట్రా! అక్క చెప్తేనే వింటవ్. మేం చెప్తే వినవా?’ అని.
‘నేను వినను. మీరైతే కొడతరు. అక్క నన్నెప్పుడూ కొట్టదు’ అంటూ అక్కణ్ణుంచి పరిగెత్తాడు.
ఒకరోజు వాళ్ల డాడీ మామిడిపండు తెచ్చి ‘కత్తి తీసుకురా పో. అందరికీ సమానంగా కోసిస్తా’ అన్నాడు. సంతోష్ పరుగున వెళ్లి కత్తి తెచ్చాడు. కానీ మామిడి పండు డాడీ చేతుల్లో నుంచి తీసుకుని వాళ్ల పెద్దక్కకు ఇచ్చాడు. ‘ఎందుకు అక్కకు ఇస్తున్నవ్’ అన్నాడు వాళ్ల డాడీ.
‘అక్క అయితేనే అందరికీ సమానంగా పంచుతుంది. నువ్ అయితే నాకో, చెల్లెకో ఎక్కువ ఇస్తవ్’ అన్నాడు. అతనికి అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇంతలో డాక్టర్ వచ్చి ‘షీ ఈస్ అవుటాఫ్ డేంజర్’ అని. సంతోష్ సహా అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరుసటి రోజు వాళ్లక్కతో మాట్లాడాక అతని మనసు కుదుట పడింది. అప్పటిదాకా సంతోష్ పడిన కంగారు, అనుభవించిన వేదన, గమనించిన అతని భార్య ‘ఎందుకు మీ అక్కంటే అంత ఇష్టం నీకు’ అని అడిగింది నవ్వుతూ.
‘చిన్నప్పటి నుంచి అక్క చేతుల్లోనే పెరిగాను. అమ్మానాన్నలు ఎప్పుడూ బావి దగ్గర పనుల్లో ఉండేవారు. తనదీ ఆడుకునే వయసైనా మమ్మల్ని అమ్మలా చూసుకునేది. ఆటలు, పాటలు, వస్తువులే కాదు తన నోటికాడి ముద్ద కూడా మా కోసం త్యాగం చేసింది. తను నాకు అక్క మాత్రమే కాదు అమ్మ కూడా’ అంటూ చెప్పుకుపోతున్నాడు సంతోష్.
‘అందుకేనా ఎప్పుడూ ఇంటికి తొలి సంతానం ఆడపిల్ల కావాలంటారు మీరు’ అని పెద్ద ప్రశ్నకు జవాబు దొరినట్టు సంబరపడిపోతోంది సంతోష్ భార్య.
Other News