నక్క తెలివి
ఒక ఊరిలో ఒక నక్క ఉండేది. దానికి పెళ్లయింది. దాని భార్య పుట్టింటికి వెళ్లింది. భార్యను చూడడానికి ఈ నక్క బయలుదేరింది. అలా.. అలా నడుచుకుంటూ అడవి దాటుకొని కొండ దారి పట్టింది. అప్పుడు మధ్యాహ్నమైంది. కాసేపు ఇక్కడ ఒక కునుకు తీసి వెళ్తాను అని ఒక పెద్ద బండరాయి కింద పడుకుంది. అలా పడుకుందో లేదో ఎక్కడి నుంచో దూరంగా పులి గాండ్రింపు వినిపించింది. ఒక్కసారి ఉలిక్కిపడి లేచింది. ఎటువైపు నుంచి పులి వస్తుందో అని తేరిపార చూసింది. దూరంగా పులి నడుచుకుంటూ వస్తోంది. ‘అయ్యోయ్యో! ఎలా ఇప్పుడు? నేను బతికేది? ఈ పులి నన్ను తప్పక చంపుకు తింటుంది’ అంటూ ఆలోచించసాగింది. వెంటనే ఒక ఉపాయం తట్టింది. అంతే.. వెంటనే లేచి ఆ పెద్ద కొండకు దిగువన తన రెండు కాళ్లను నేలకు తన్ని పట్టి ఉంచి వీపును కొండకు ఆనించి ఎంతో కష్టపడి కొండను మోస్తున్నట్లు అపసోపాలు పడుతూ, చెమటలు కారుతున్నట్లు నటిస్తూ ఉంది. ఇంతలో పులి రానే వచ్చింది. నక్క కష్టాలు చూడనే చూసింది.
‘ఏం నక్కబావ! ఏంటి ఆ కొండను మోస్తున్నావ్?’ అని నక్కని పులి అడిగింది. ‘ఏం చెయ్యను పులి మావా! నేను ఈ కొండ దగ్గరికి రాగానే ఇది నా మీద పడబోయింది. పడితే నేను చస్తాను. అందుకని పడకుండా ఆపుతున్నాను. పొద్దటి నుంచి అన్నం, నీళ్లు లేవు. దాహం, ఆకలితో నోరు పిడచకట్టి పోతోంది’ అని పులితో బాధగా అన్నది నక్క. పాపం పులికి జాలి కలిగింది. నక్కతో ‘సరే! అదిగో అక్కడ నీళ్ల గుంట ఉంది. వెళ్లి తాగిరా. అప్పటిదాకా నేను ఈ కొండను మోస్తాను. నువ్వు రాగానే ఈ కొండ భారం నీకే ఇస్తాను. త్వరగా వెళ్లి రా’ అంటూ పులి నక్కకు సలహా ఇచ్చింది. నక్క తను వేసిన పాచిక పారిందని తనలో తాను నవ్వుకుంటూ పులికి తన భారం అప్పచెప్పింది. ఇక పులి కూడా ఆ కొండ ఎక్కడ మీద పడుతుందోనని కాళ్లు తన్ని పట్టి వీపుని కొండకు ఆనించి గట్టిగా నిలబడింది. అప్పుడు నక్క మెల్లగా తన భారాన్ని దింపుకున్నట్లు నట్టిస్తూ.. ‘వస్తా పులి మామా! నీళ్లు తాగంగానే వచ్చేస్తా.. నిన్ను ఇబ్బంది పెడతానా? వచ్చి నా భారం నేను మోస్తాలే’ అంటూ నీరసంగా మాట్లాడింది. ‘పాపం వెళ్లి రా..’అంటూ నక్కమీద పులి జాలిపడింది. అంతే కొద్దిగా ముందుకు నడిచి ఒక్క ఉదుటున ముందుకు దూకింది. వెనక్కి చూడకుండా పరుగు లంకించుకొని పారిపోయింది. గంట.. గంటా గడిచిపోతోంది.
నక్క ఎంతకీ రావట్లేదు. పాపం ఆ కుంటలో పడి చచ్చిపోయి ఉంటుందనుకుంటూ ఇక నేను మాత్రం ఎందుకు ఇంత బరువును ఆపాలి అని అనుకుంది. మెల్లగా కొండ నుంచి తన శరీరాన్ని కదుపుతూ ఎక్కడ మీద పడుతుందో అని ఒక్కసారి పక్కకు దూకింది పులి. ఆశ్చర్యం... కొండ కొద్దిగా కూడా కదలలేదు. నక్క చేసిన మోసం తెలిసి వచ్చింది పులికి. ఈ సారికి బతికిపోయింది అనుకుంటూ తన దారిన తాను వెళ్లిపోయింది.
Other News