నేర్చుకున్న పాఠం
ఒక అడవిలో ఒక చిట్టి కుందేలు ఉండేది. దానికి పిరికితనం ఎక్కువ. పెద్ద జంతువులను చూడాలం భయం. తనకంటే పెద్ద జంతువులు వస్తున్నట్లు తెలిస్తే చాలు.. ఏ చెట్టు వెనకో, పుట్ట వెనకో దాక్కునేది. చిన్న శబ్దం వచ్చినా, చివరకు ఆకులు గలగలమన్నా కూడా బెదిరిపోయి పరిగెత్తేది. దానిని మిగతా కుందేళ్లు పిరికిదని వెక్కిరించేవి. అలా రోజులు గడిచిపోతున్నాయి. కొన్ని రోజుల తర్వాత కుందేలుకు తన ప్రవర్తన మీద తనకే విసుగొచ్చేసింది. జీవితం మీద విరక్తి కలిగింది. ‘ఛీ.. ఛీ.. నా అంత పిరికివాళ్లు ప్రపంచంలో ఇంకెవరూ ఉండరేమో! అనుక్షణం భయపడుతూ బతికేకంటే చచ్చిపోయినా బాగుండను’ అనుకొని ఆత్మహత్య చేసుకోవడానికి బయలుదేరింది. ఎలా ప్రాణాలు తీసుకోవాలో కాసేపు ఆలోచించింది. నీటిలోకి దూకి ప్రాణం తీసుకోవాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా.. సరస్సు వైపు వెళ్లింది. ఆ సరస్సు ఒడ్డున కొన్ని కప్పలు ఉన్నాయి. పెద్ద కప్పలు తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నాయి. చిన్న కప్పలు నీటిలోంచి ఒడ్డుకు, ఒడ్డు నుంచి నీటిలోకి గెంతుతూ ఆడుకుంటున్నాయి. కుందేలు రాకను పసికట్టిన ఒక కప్ప ‘అటు చూడండి. ఒక కుందేలు ఇటువైపే వస్తోంది’అని గట్టిగా అన్నది. దాంతో కప్పల్లో కలకలం బయలుదేరింది.
‘అమ్మో ఇక్కడుంటే ప్రమాదం. పదండి. దాక్కుందాం.. పదండి’అని ఒక దానిని మరొకటి హెచ్చరించుకున్నాయి. వెంటనే దబ్బు, దబ్బుమని సరస్సులోకి దూకాయి. కుందేలు నోరు వెళ్లబెట్టింది ‘ఇదేమిటి, అవి నన్ను చూసి ఎందుకు భయపడ్డాయి. నేను వాటినేం చేయనుగా!’అనుకొని ఆశ్చర్యపోయింది. అప్పుడు కుందేలుకు ఒక సత్యం బోధపడింది. ‘ఈ ప్రపంచంలో తనకన్నా బలహీనమైన ప్రాణులు ఎన్నో ఉన్నాయి. ప్రతిదానికీ భయపడటం సరైనది కాదు. ఆపద కలిగినప్పుడు దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. అంతేకానీ ఆపద కలుగుతుందేమోనని ఊహించి భయపడటం మూర్ఖత్వం’ అనుకుంటూ అక్కడ నుంచి తన స్థావరానికి బయలుదేరింది. ఆ సంఘటన కుందేలులో ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. అప్పటి నుంచి ధైర్యంగా జీవించాలని నిర్ణయించుకుంది.
ఇక ఆ రోజు నుంచి చీటికీ మాటికీ భయపడకుండా, హాయిగా ఉండసాగింది. కుందేలులో వచ్చిన మార్పు మిగిలిన కుందేళ్లకు ఆశ్చర్యం కలిగించింది. అన్నీ దాన్ని మెచ్చుకోసాగాయి.
Other News