చీమ-రాజు
మహేంద్పుర రాజ్యాన్ని విజయసింహుడు పరిపాలించేవాడు. అతను ప్రజలను తన బిడ్డల్లా చూసుకుంటూ ప్రజారంజకంగా పాలించేవాడు. విజయసింహుని తర్వాత అతని కుమారుడు విక్రమసింహుడు ఆ రాజ్యానికి రాజయ్యాడు.
విక్రమసింహుడు కూడా తన తండ్రిలాగే పరిపాలించాలనుకున్నాడు. కానీ మంత్రి, తక్కిన అధికారులు అతనికి సహకరించేవారు కాదు. దాంతో చాలా బాధపడ్డాడు. ఒకరోజు రాత్రి ‘నా తండ్రి ఎంత ప్రజారంజకంగా పరిపాలించాడు. నేను అలా పరిపాలిద్దాం అనుకుంటే మంత్రి, అధికారులు సహకరించడం లేదే? ప్రజలకు నా మీద నమ్మకం పోతుందేమో. నేను ఈ బాధ్యత మోయలేనేమో, ఎక్కడికైనా దూరంగా పారిపోవాలి’అని మనసులో అనుకుంటూ మంచం మీద నుంచి లేచాడు. రాజభవనం ద్వారం బయటకు వచ్చాడు. ‘ఎంత దూరం పారిపోగలను? నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలు నన్ను గుర్తుపడతారు’అని మళ్లీ తన మనసులో అనుకొని, తిరిగి మందిరానికి వచ్చాడు. అలా కొంచెం సేపు ఆలోచించి, చివరికి రాజభవనం మీద నుంచి దూకి చనిపోదామని నిర్ణయించుకున్నాడు. ప్రజలను బాగా పరిపాలించలేకపోతున్నానే బాధ అతను ఆ నిర్ణయం తీసుకునేలా చేసింది. ఆలోచన రాగానే.. విక్రమసింహుడు రాజభవనం మీదకు చేరుకున్నాడు. ఆ భవనం గోడ దగ్గర నిలబడ్డాడు. అక్కడ అతనికి ఒక చీమ కనిపించింది.
అది తన నోటితో చక్కెరను కరుచుకొని గోడ వారగా వెళ్లడం చూశాడు. ఆ చీమ అలా గోడ పగుళ్లలో ఉన్న తన నివాసంలోకి వెళ్లిపోయింది. ‘ఔరా! ఈ చీమ రాజభవనంలో ఎక్కడో మూలన ఉన్న వంట గది నుంచి చక్కెర పలుకుని కరుచుకొని, మూడు అంతస్తులు ఉన్న రాజభవనం మీదకు చేరింది. ఒక చిన్న చీమనే ఇంతపైకి రాగలిగితే, దానికన్నా ఎన్నో రెట్లు పెద్దగా, బలంగా ఉన్న నేను నా ప్రజల సంక్షేమం కోసం పాటుపడలేనా?’ అనుకున్నాడు విక్రమసింహుడు. ఆ ఆలోచనతో అతనిలో ఉన్న నిరాశ పటాపంచలయ్యింది.
చనిపోదాం అనుకున్న విక్రమసింహుడు తన మనసు మార్చుకొని, కొత్త ఉత్సాహంతో తన మందిరానికి చేరుకున్నాడు. అప్పటి నుంచి మంత్రులను, అధికారులను తనకు సహకరించేలా చేసుకొని ప్రజారంజకంగా పరిపాలించసాగాడు.
Other News