సంతోషమైన ముఖం
ఒక ఊరిలో సంతోష్ అనే అబ్బాయి ఉండేవాడు. మంచి పిల్లవాడు. స్కూలుకు సెలవులు కావడంతో ఒకరోజు ఇంట్లో ఏం తోచక గదులన్నీ కలియ తిరుగుతున్నాడు. అలా తిరుగతూ.. పాత సామాన్లు ఉన్న గదిలోకి వెళ్లాడు. అక్కడ ఎన్నో పనికి రాని వస్తువులు కనిపించాయి. తిరిగి రాబోతుండగా ఒక అద్దం కనిపించింది.
నగిషీలు చెక్కి ఉన్న చెక్క ఫ్రేమ్‌లో ఆ గుండ్రటి అద్దం సంతోష్‌కి బాగా నచ్చింది. దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి తల్లికి చూపించి, ‘అమ్మా! నేను ఈ అద్దాన్ని తీసుకుంటాను’ అని చెప్పాడు. తల్లి ‘సరే నాయనా! కానీ జాగ్రత్తగా కాపాడాలి. దాని మీద చిన్న గీత కూడా పడకూడదు. ఇది మన పూర్వీకులది. పాడు చేయకూడదు’అని చెప్పింది. సరేనన్నాడు సంతోష్.
ఆ అద్దాన్ని తీసుకొని సంతోష్ శుభ్రంగా తుడిచి అందులో ముఖం చూసుకున్నాడు. అతని ముఖం దిగులుగా కనిపించింది. ‘అదేంటి నా ముఖం ఎందుకు దిగులుగా ఉంది’అనుకున్నాడు. ఏమీ అర్థం కాలేదు. ఆటవస్తువుల్ని తీసుకొని ఆడుకున్న తర్వాత మళ్లీ వెళ్లి అద్దంలో చూసుకున్నాడు. అప్పుడు కూడా ముఖంలో దిగులు కనిపించింది. కాసేపటి తర్వాత తనకిష్టమైన తిండి తిన్నాడు. తిన్న తర్వాత అద్దంలో ముఖం చూసుకున్నా ముందులాగే కనిపించింది.
‘ఛీ! ఈ అద్దంలో ముఖం చూసుకోకూడదు’అని తనను తాను తిట్టుకున్నాడు. ఆ రోజు సాయంత్రం తల్లికి చెప్పి పార్కులో ఆడుకోవడానికి వెళ్లాడు. అక్కడ ఆడుకుంటుండగా సంతోష్‌కి ఒక బాబు ఏడుస్తూ కనిపించాడు. ఆ బాబు పక్కన పెద్దవాళ్లు ఎవరూ లేరు. బాబు తప్పిపోయాడని గ్రహించాడు సంతోష్. తన దగ్గర ఉన్న డబ్బులతో బాబుకి పల్లీలు కొని వాటిని తినిపించాడు. మంచినీళ్లు తాగించాడు. అప్పుడు కాస్త ఏడవడం ఆపాడు ఆ బాబు. బాబును ఆడిస్తూ తల్లిదంవూడుల కోసం వెతకసాగాడు. ఈలోగా బాబు తల్లిదంవూడులు కనిపించారు. బాబుని చూసి చాలా సంతోషించారు. జాగ్రత్తగా చూసుకున్నందుకు సంతోష్‌ని మెచ్చుకున్నారు. తమ ఇంటికి ఎప్పుడైనా రావచ్చని ఆహ్వానించారు.
ఇంటికి వెళ్లి ఆ విషయాన్ని తల్లికి చెప్పాడు. తల్లి కూడా సంతోషించింది. అప్పుడు అద్దం గుర్తుకు వచ్చింది. అద్దంలో ముఖం చూసుకున్నాడు. ముఖం అద్దంలో వెలిగిపోతూ కనిపించింది. అప్పుడు అర్థమైంది ఇంతసేపు అద్దంలో ఎందుకు అలా కనిపించాడోనని.
నీతి : ఇతురలకు సహాయం చేయడం భగవంతుడిని పూజించడంతో సమానం. అప్పుడు కలిగే ఆనందం అనిర్వచనీయం.
Other News