మక్కీకి మక్కీ
అవి నేను కాలేజ్‌లో చదివే రోజులు. ఓ రోజు మా తెలుగు లెక్చరర్‌గారు పాఠం చెబుతుంటే అటెండరు ఒక ప్రకటన కాగితం తెచ్చి మా లెక్చరర్ గారికి అందించాడు. ఆయన మాకు అర్థమయ్యేలా చదివి వినిపించాడు. అందులోని సారాంశం.. కాలేజీ మ్యాగజైను ఆ సంవత్సరానికి గాను త్వరలో విడుదల చేస్తారట. ఏ విద్యార్థి అయినా అందులో పాల్గొనదలిస్తే వారు సొంతంగా రాసిన కథలు, కవితలు గానీ లేదా ఇతర అంశాలను గానీ సొంత దస్తూరీతో రాసి చివర వారి పేరు, క్లాస్‌తో పాటు ఫలానా తేదీలోపల కాలేజీ కార్యాలయంలో అందచేయాలని ఉంది. ఆ రోజుల్లో నాకు కాలేజీలో గుర్తింపు సంపాదించాలని కోరికగా ఉండేది. అందుకే ఎలాగైనా ఆలోచించి ఓ కథ రాయాలని నిర్ణయించుకున్నాను. ఇక లెక్చరర్లు చెప్పే పాఠాలపై ధ్యాస ఉంచక కథ గురించే ఆలోచించేవాడిని. రెండు, మూడు రోజులు అలాగే గడిచిపోయాయి. ఆ రోజు కాలేజ్ వదిలాక నోటీసు బోర్డుపై ఉన్న ప్రకటన చదివాను. రేపటిలోగా ఆర్టికల్స్ అందివ్వాలని ఉంది.
నాలో ఆత్రుత పెరిగిపోయింది. ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. ఆ రాత్రి అందరూ పడుకున్నాక బీరువాలన్ని వెదికితే మా అన్నయ్య కాలేజ్ రోజుల్లో వెలువడిన పదేళ్ల కింది మ్యాగజైన్ దొరికింది. అందులోని ఓ కథని ఎంచుకొని అందులో ఎలా ఉందో అలాగే పేపరులో రాశాను. మరునాడు కాలేజ్ ఆఫీసులో ఆ కథని ఇచ్చాక ఊపిరి పీల్చుకున్నాను. ఇక నా పేరు మా స్నేహితులు అంతా చదివి నాకు శుభాకాంక్షలు చెబుతారని అలాగే ఇంట్లో అమ్మా, నాన్న, అన్నయ్యలు, అక్కయ్యలు అందరూ నన్ను మెచ్చుకుంటారని ఊహించుకుంటున్నాను. ఓ వారం రోజుల తర్వాత కాలేజ్ మ్యాగజైన్ రిలీజు చేశారు. ఆ సాయంత్రం ఓ కాపీ తీసుకొని ఎవ్వరితో మాట్లాడకుండా ఇంటికి వెళ్లిపోయాను. అందరినీ పిలిచి నేను తెచ్చిన మ్యాగజైన్‌లోని ఒక్కొక్క పేజీ తిప్పసాగాను. అందరూ ఆత్రుతతో చూడసాగారు. ఇంతలో నా కథ రాగానే ఎగిరి గంతేశాను. కానీ మా అమ్మా, నాన్న, అన్నయ్యల మొహల్లో నవ్వు ఏ మాత్రం కనపడలేదు. వారి నో రియాక్షన్‌కి కారణం.. కథ కింద నా పేరుకు బదులు వేరే పేరు ఉంది. ఇక నాకు ఏడుపు ఆగలేదు. ఆ రాత్రి అందరూ పడుకున్నాక గదిలోకి వెల్లి ఆ పాత మ్యాగజైన్ చూశాక అర్థమైంది. నేను కథని ‘మక్కీకి మక్కీ’గా కాపీ చేసేటప్పుడు చివరగా అందులో ఉన్న పేరునే పొరపాటుగా రాసేశాను. అదీ జరిగింది. ఏం చేస్తాను. హతోస్మి అంటూ పడుకున్నాను.
- పి. రవీందర్‌రావు, వనస్థలిపురం, హైదరాబాద్
Other News