ఒక తల్లి కథ
-నా పదో తరగతి రిజల్ట్ వచ్చింది. సాయంత్రం వచ్చిన పేపర్‌లో 390 మార్కులతో ఫస్ట్‌క్లాసులో పాసయ్యాను. మా ఊళ్లో పదో తరగతి పాసైన ఏకైక అమ్మాయిని. మొత్తం 20 మందిలో ఐదుగురు మాత్రమే పాసయితే అందులో ఒకే ఒక అమ్మాయిని నేను. ఆడపిల్లకు పదో తరగతి చాలులే.. ఇంకా ఏం చదివిస్తారు అన్నారందరూ. అమ్మ కూడా ‘నిజమే కదా! తనతోటి పిల్లలకు ఐదో తరగతిలోనే పెళ్లయ్యింది. పెద్దోళ్లలాగే దీనికి పెళ్లి చేద్దాం. ఎక్కువ చదివిస్తే అంతటి సంబంధం చూసి కట్నం ఎక్కువిచ్చే స్థోమత నాకు లేదు’ అని అమ్మకూడా అన్నది. కానీ అమ్మమ్మ ససేమిరా అన్నది. ‘‘ఇప్పుడేం వయసు పోయిందని పెళ్లి చేయడానికి? అది చదువుకున్నంతవరకు చదవనిద్దాం’’ అని పట్టుబట్టింది. అమ్మమ్మ మాటలకు అందరూ తలొంచారు.
-ఇంటర్ చదవడం కోసం కాలేజీలో అడుగుపెట్టిన రోజు. అప్పటిదాకా చదివిన హైస్కూల్‌కు... కాలేజీకి చాలా భిన్నమైన వాతావరణం. టీనేజ్ .. కొత్త అనుభూతులు. చిన్నప్పుడే నాన్న చనిపోవడంతో అమ్మమ్మ వాళ్లింటి దగ్గరే పెరిగాను. చదువులూ అక్కడే. పెద్దగా బయటి ప్రపంచమే తెలియదు. ఒక్కసారిగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీకి ఒక్కదాన్ని బస్సులో వచ్చి చదువుకోవడం ఎంతో స్వేచ్ఛగా ఉంది. అందులోనూ మా ఊరినుంచి కాలేజీ చదువుకోసం బయటికి వచ్చిన మొట్టమొదటి అమ్మాయిని. ఒకింత గర్వం కూడా. ఒక్కరిద్దరు అమ్మాయిలు స్నేహితులయ్యారు.
-కాలేజ్‌లో ఒకబ్బాయి నన్ను ప్రేమిస్తున్నానన్నాడు. నువ్వే నాప్రాణం.. నీతోటే నాలోకం అంటూ ఏదేదో చెప్పాడు. పట్టించుకోలేదు. మళ్లీ మళ్లీ వెంటపడ్డాడు. నేను ఊరినుంచి బయలుదేరింది మొదలు, తిరిగి ఇంటికొచ్చేదాక నన్ను, నేను ఉన్న బస్సునూ బజాజ్ చేతక్ మీద వెంబడిస్తూనే ఉండేవాడు. మొట్టమొదటిసారి నాకు భయం అయింది. అందరూ వద్దన్నా... పట్టుబట్టి కాలేజీకి వచ్చినదాన్ని... ఒకబ్బాయితో మాట్లాడటం, ప్రేమ వ్యవహారం తెలిస్తే ఇంట్లో ఏమవుతుంది? ‘‘తండ్రి లేకపోయినా రాధమ్మ పిల్లలను బాగా పెంచిందని’’ ఇప్పటిదాకా ఉన్న పేరు ఏమయిపోతుంది. అందరితో కొట్లాడి కాలేజ్‌కి పంపిస్తే.. నువ్వు చేసే పనులు ఇలాంటివా? అని ప్రశ్నించే అమ్మమ్మకు ఏమని చెప్పాలి. అయినా వాళ్ల కులం ఎక్కువ. మా కులం తక్కువ. పెళ్లి చేసుకుంటాడో? కొన్నాళ్లు తిరిగి మోసం చేస్తాడో తెలియదు. అసలు కాలేజికి వెళ్లడం మానేస్తే... మంచిది కదా! మరి ఎందుకు వెళ్లడం లేదని అడిగితే అమ్మమ్మకు ఏం సమాధానం చెప్పాలి?
-కాలేజీలు మళ్లీ తెరిచారు. తను నా వెంటపడటం మానలేదు. తను చూడటమే నాకు ఇబ్బంది తప్ప... నాకు కష్టం కలిగించే ఏ పనీ చేయకపోయేవాడు. అందుకేనేమో నాకు తెలియకుండానే నెమ్మదిగా తనను ఇష్టపడటం మొదలుపెట్టాను. అయితే కళ్లతో ఆరాధించడమే తప్ప. ఏనాడూ తను చేయిని కూడా తాకింది ఎరుగను. నేను అతడిని ఇష్టపడటానికి మరో కారణం అతను బాగా పాటలు పాడటం.
-ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయాయి. చాలా బాగా రాశాం. కచ్చితంగా పాస్ అవుతామన్న ధీమా ఉంది. కానీ ఇద్దరం విడిపోవాల్సిన పరిస్థితి. ఇన్ని రోజులు కాలేజీ ఉంది కాబట్టి ఒకరినొకరం చూసుకోవడానికి అవకాశం కలిగేది. కానీ ఇక నుంచి ఎట్లా? పెళ్లి చేసుకుందామన్నాడు. ఇంట్లో వాళ్లందరినీ ఒప్పించినా... మా మామయ్య అసలు ఒప్పుకోడు. ఫ్రెండ్స్ సహకారంతో గుళ్లో పెళ్లి చేసుకున్నాం. వాళ్లద్వారానే టౌన్‌లో ఒక రూమ్‌కు అద్దెకు తీసుకున్నాం. తను స్పోర్ట్స్‌లో దిట్ట. ఓ ప్రైవేటు స్కూళ్లో నేను టీచర్‌గా, తను స్పోర్ట్స్ టీచర్‌గా జాయినయ్యాం.
-మా పెద్దలకు, వాళ్ల పెద్దలకు విషయం తెలిసిపోయింది. స్కూల్ దగ్గరికి వచ్చిన మామయ్య తనను బెదిరించాడు. స్కూల్లో మిగిలిన టీచర్లు అడ్డుకోవడంతో వెళ్లిపోయాడు. అమ్మమ్మ బాధపడ్డా... ‘నా బిడ్డ ఎప్పుడో చచ్చిపోయిందని’ మా అమ్మ గుండె రాయి చేసుకుంది. ఇక తన వైపు వాళ్ల నుంచి ఏ స్పందనా లేదు. ఇక ఏ సమస్యా లేదు చాలా సంతోషమైన జీవితం. ఇక్కడే అసలు కథ మొదలైంది.
-ఒక ఐదు నెలల తరువాత మేం స్కూల్‌కు వెళ్లడానికి తయారవుతుండగా వాళ్ల బాబాయ్ మా ఇంటికి వచ్చాడు. ప్రశాంతంగా ఉన్నాడు. మంచినీళ్లు ఇస్తే తాగాడు. అన్నం తినమంటే వద్దన్నాడు. ‘‘పెళ్లి చేసుకున్నవాళ్లు చేసుకున్నారు... ఓసారి ఇంటికి వచ్చిపోండి. అన్న రమ్మన్నాడు’’ అని చెప్పాడు. ఆయన అలా పిలవడం చాలా సంతోషమనిపించింది. వెళ్దామనుకున్నాం. అయితే ‘‘బాబాయ్ మాత్రమే రమ్మని చెప్పాడు.. అమ్మానాన్న పరిస్థితి ఎలా ఉందో తెలియదు కదా! ముందు నేను వెళ్లి వస్తా...! తర్వాత పరిస్థితి చూసి ఇద్దరం వెళ్దాం’’ అన్నాడు. నాకు నిజమే అనిపించింది.
-ఆదివారం రోజు తను వాళ్ల ఇంటికి వెళ్లాడు. మూడు రోజులయ్యింది. తన జాడ లేదు. ఏం జరిగిందో తెలియదు. ఎవరినైనా అడుగుదామా అంటే ఎవరినడగాలో తెలియదు. వాళ్ల ఇంటికే సరాసరి వెళ్దామంటే ధైర్యం చాలలేదు. నాలుగోనాడు జాడ వచ్చింది తను ఉరేసుకుని చనిపోయాడు. నేను నిట్టనిలువునా కూలిపోయాను. నేను అందంగా అల్లుకున్న కల చెదిరిపోయింది. భవిష్యత్ మీద నా ఆశలన్నీ ఆవిరయిపోయాయి. వెంటనే చచ్చిపోవాలనుకున్నాను. కానీ అప్పటికే తన ప్రతిరూపం నా కడుపులో ఉంది. నేను చచ్చి కడుపులో పిండాన్ని చంపుకోలేక ఆగిపోయాను. తన జ్ఞాపకాలతో గదిలో ఒంటరిగా నేను. బతకాలి. బతకాలంటే తినాలి. తినాలంటే పనిచేసుకోవాలి. అందుకే యాంత్రికంగా స్కూల్‌కు వెళ్లివచ్చేదాన్ని. అలా అలా ఆరోగ్యం క్షీణించిపోయింది.
- తను చనిపోయిన ఐదు నెలలకు నొప్పులతో బాధపడుతుంటే పక్కింటివాళ్లు తీసుకెళ్లి ప్రభుత్వ ఆస్పవూతిలో చేర్పించారు. మరునాడు పాప పుట్టింది. కొన్నాళ్లకు అమ్మవాళ్లు దగ్గరికి వచ్చారు. ఇంటికి రమ్మన్నారు. కష్టాల్లో వాళ్ల దగ్గరకు వెళ్లడం నాకు నచ్చలేదు. ‘‘పాపను మేం పెంచుకుంటాం, నీకు మరో సంబంధం చూస్తాం, నువ్వు ఇంకో పెళ్లి చేసుకో’’ అన్నాడు మామయ్య. ఇక వాళ్ల అమ్మానాన్నయితే ‘ఆ కులం తక్కువదానికి పుట్టింది మాకు మనవరాలు ఎలా అవుతుంది’ అన్నారు. కొన్నాళ్లు ఇంట్లోనే ఉండటంతో పూట గడవడమే కష్టమైంది. పాపను తీసుకునే స్కూల్‌కు వెళ్లేదాన్ని. అలా స్కూల్లో పాఠాలు చెబుతూనే డిస్టెన్స్‌లో డిగ్రీ పూర్తి చేశాను. పాప పెద్దదైంది. నా బీఈడీ కూడా పూర్తయ్యింది. ప్రభుత్వ పాఠశాలలో టీచర్ జాబ్ వచ్చింది. పాపకు ఏ లోటు రాకుండా చూసుకోవచ్చు అన్న ధీమా వచ్చింది.
- కొన్నాళ్లకు మా స్కూల్‌లోనే టీచర్ పెళ్లి చేసుకుంటానన్నాడు. నాకు ముందే పెళ్లయ్యిందని చెప్పాను. అయినా సరేనని ఆదర్శాలు ఒలకబోశాడు. నాకో పాప ఉందని.. మరో పెళ్లి ఆలోచనే లేదని చెప్పాను. అయినా నెమ్మదిగా పాపకు దగ్గరయ్యాడు. చాలాసార్లు ‘అమ్మా! నాకు నాన్న ఎందుకు లేడు?’ అన్న నా బిడ్డ ప్రశ్నకు సమాధానం ఎలా చెప్పాలో తెలిసేది కాదు. దానికి తండ్రిలేని లోటు తీర్చడానికి... పెళ్లి చేసుకున్నాను. కానీ నేను అనుకున్నదొక్కటి, జరిగిందొక్కటి. పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టుగా అయ్యింది పరిస్థితి. ఏం చేసినా... ఈ టైమ్‌లో తనైతే ఎలా ఉండేవాడు? సినిమాకెళ్తే... హీరో ప్లేస్‌లో నన్ను కాకుండా తనను ఊహించుకుంటున్నావు కదా! నీకు నా మీద ప్రేమ లేదు. కేవలం అసవరం కోసం చేసుకున్నావు అనేవాడు. ప్రతిరోజూ వేధింపులు. నరకం. పాప కోసమని అన్నీ భరించేదాన్ని. ఒక్కోసారి విపరీతంగా కొట్టడం, శారీరకంగా, మానసికంగా వేధింపులు. పాప విపరీతంగా భయపడేది. ఏడ్చేది. పాప మానసిక స్థితి ఎలా తయారవుతుందోనన్న భయం.
- నన్ను ఈ సమాజం ‘‘మొదట్లో లేచిపోయింది’’ అన్నది. మళ్లోసారి ‘‘కులం తక్కువది’’ అన్నది. ఇంకోసారి ‘‘భర్తపోయినా బిడ్డతోని ఒక్కతే బతుకుతున్నది ఎంత మొండిదో’’ అన్నది. మళ్లీ పెళ్లి చేసుకుంటే ‘‘మొగుడు సచ్చిపోయినా... మళ్లీ పెళ్లి చేసుకుంది.. బిడ్డను చూసుకుంటూ ఉంటే ఏమయ్యేది’’ అన్నది. ఈ సమాజం ఆడది ఎలా ఉన్నా... ఏదో ఒక రకంగా మాటలంటూనే ఉంటుంది. అందుకే వేటినీ లెక్కచేయక విడాకులు తీసుకున్న. ఇప్పుడు నాపాపతో నేను ప్రశాంతంగా బతుకుతున్నా. చిన్న కష్టం ఎదురైతేనే అంతా అయిపోయింది, ఇక జీవితం ఏమీ లేదనుకునే వాళ్లెందరికో స్ఫూర్తినివ్వాలనే లేఖ. చిన్న గీత పక్కన పెద్ద గీత లాగా... మన సమస్యలు చాలా చిన్నవి. భయపడటం మొదలుపెడితే మరింత భయపెడతాయి. ఎదురించి నిలబడితే అవే పారిపోతాయి.
Other News