వెన్నునొప్పికి ఉపశమనం-2

బ్యాక్ పెయిన్ ఇంతకుముందు వృద్ధాప్యంతో ముడిపడి ఉండేది. కానీ ఇప్పుడు చిన్నవయసు వారిని కూడా బాధపెడుతున్నది. దీనికి చాలా కారణాలున్నాయి. ఏ విధమైన ఎక్సర్‌సైజ్ శరీరానికి లేకపోవడం, ఒకేచోట కూర్చుని పనిచేయటం, ఇంట్లో పనులకు విపరీతంగా మెసీన్లను వాడటం వల్ల శరీరానికికావాల్సిన వ్యాయామం కలగకపోవడం వంటివి. ఇవి కాకుండా హై స్ట్రెస్ లెవెల్స్‌తో కొన్ని ముఖ్యమైన కండరాల కదలికలు కుంచించకుపోవడం వలన కూడా వెన్నునొప్పి వస్తుంది. దీనికి శలభాసనం, ఏకపాద శలభాసనం, పూర్ణ శలభాసనం ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ముందుగా ఏకపాద శలభాసనంతో మొదలుపెట్టి పూర్ణ శలభాసనం ప్రయత్నించవచ్చు. గొల్లభామను పోలి ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది.
ఏకపాద శలభాసనం (అర్థ శలభాసనం)
బోర్లా పడుకుని చుబుకం నేలకు ఆన్చాలి. పిడికిలి బిగించి చేతులు శరీరానికి సమాంతరంగా కాళ్లకిందుగా ఉంచాలి. నెమ్మదిగా గాలి పీల్చుకుని కుడికాలును వీలున్నంతపైకి లేపి 5 నుంచి 8 సెకన్లపాటు ఆ స్థితిలో ఉంచాలి. గాలి వదులుతూ నెమ్మదిగా కాలు కిందికి తీసుకురావాలి. కాలు పైకి లేపి ఉంచినప్పుడు మోకాలి వద్ద వంచకుండా ఉండాలి. ఇలా మూడు సార్లు చేయాలి. ఇదే విధంగా ఎడమకాలితో కూడా మూడు సార్లు చేయాలి.
పూర్ణ శలభాసనం
ముందు బోర్లా పడుకోవాలి. చుబుకం నేలకు ఆనేట్లుగా ఉంచాలి. చేతులు కాళ్ల కిందుగా ఉంచాలి. నెమ్మదిగా గాలి పీల్చుకుని రెండు కాళ్లను మోకాలి దగ్గర వంచకుండా వీలున్నంత పైకి ఎత్తాలి. ఆ స్థితిలో ఉండగలిగినంత సేపు ఉండాలి. మొదట్లో కొద్దిగా మాత్రమే కాళ్లను ఎత్తగలిగినా, సాధన చేసే కొద్దీ ఎక్కువ పైకి ఎత్తగలుగుతారు. నడుము, పొట్ట దగ్గర కండరాలు శక్తివంతం అవుతున్న కొద్దీ కాళ్లు ఎక్కువగా లేపి ఉంచగలుగుతారు. ఎక్కువ సమయం కూడా ఉంచగలుగుతారు.
ఉపయోగాలు :
- కాళ్లను, కాలి కండరాలను శక్తివంతం చేస్తుంది.
- ఋతు సంబంధమైన సమస్యలను నివారిస్తుంది.
- బ్యాక్‌పెయిన్, సయాటికా నొప్పిని తగ్గిస్తుంది.
- వెన్నెముక దృఢంగా ఉంచుతుంది.
- జీర్ణ వ్యవస్థ ఉత్తేజితం చేస్తుంది.
- మూత్రాశయాన్ని శక్తివంతం చేస్తుంది.
- ప్రసవం తరువాత మహిళల్లో వచ్చిన నడుంనొప్పి నివారణకు బాగా ఉపయోగపడుతుంది.
నోట్ :- వార్మప్ చేసిన తరువాతనే ఈ ఆసనాలు చేయాల్సి ఉంటుంది.
Other News