Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Friday, May 24, 2013
 


Home >> Features >> Aadabidda


ఎ డైరీ ఆఫ్ ఎ ఉమన్

mother-and talangana patrika telangana culture telangana politics telangana cinema1976, మే 12...
పదవతరగతి ఫలితాలు వచ్చాయి. న్యూస్ పేపర్లో ఫస్ట్ డివిజన్‌లో నా హాల్ టికెట్ నెంబరు చూసుకుని నేను మురిసిన క్షణాలు....! ఆ పేపర్ పట్టుకుని అమ్మా, నాన్న, నానమ్మ, తాత, కాకా(చిన్నాన్న), చిన్నమ్మ, తమ్ముళ్లు, చెల్లెళ్లకు చూపించాను. ఆ కాగితం పట్టుకుని వాడకట్టంతా కలియతిరిగాను..నా ఘనకార్యం వర్ణించాను. నా ఆనందాన్ని అంతా పంచుకున్నారు. నా ఆరాటం చూసి పెద్ద చదువులు చదువుతానని బయటవాళ్లంతా అనుకున్నారు.

1976, జూన్ 14...
మెమో తెచ్చుకోవడానికి స్కూల్‌కి వెళ్లాను. 380 మార్కులు వచ్చాయి. క్లాస్ సెకండ్! లెక్కల్లో 82 మార్కులు. నేనే ఫస్ట్! అంతా కంగ్రాట్స్ చెప్పారు. లెక్కల సర్ రాజేశ్వర్ సర్...ఇంటర్‌లో ఎమ్‌పీసీ తీసుకొమ్మని, మ్యాథ్స్‌లో ఎమ్మెస్సీ చేయమని పదేపదే చెప్పారు. నేను తలాడించాను. హరిత, వాసవి, స్వరూప....నా మార్క్స్ చూసి చాలా సంతోషించారు. నాలో ఎలాంటి ఆనందం కనపడ నిష్టూరమాడింది వాసవి. అలాంటిదేమీ లేదని నవ్వాను. ఇంటికి వచ్చేప్పుడు అడిగింది హరిత..‘ఎందుకంత ముభావంగా ఉన్నావని. పెళ్లి సంబంధం చూశారు. దాదాపు నిశ్చయమైనట్టే. రేపు కార్తీక మాసంలో పెళ్లి చేస్తారట’ చెప్పాను బాధగా. ఆశ్చర్యపోయింది. ఏమీ అనలేదు. ‘నీకు చదువంటే ఇంట్రస్ట్ కదా...చదువుకుంటానని చెప్పకపోయావా మీ నాన్నతో. మార్కులు కూడా బాగా వచ్చాయి’ సలహా ఇచ్చింది. తలూపాను.

1976, ఆగస్ట్ 18...
ఈ రోజు మగపెళ్లి వారు వచ్చి పూలుపండ్లు పెట్టి అబ్బాయి రాలేదు. కాబోయే అత్తగారు ఉంగరం, చీర పెట్టారు. ఆడపడచు...పక్కన కూర్చొని ఏదో సరసం ఆడింది. ఒక్క ముక్క అర్థం కాలేదు. పైగా ఏడుపొచ్చింది. ఈ రోజు కాలేజీలో ఇంప్టాంట్ క్లాస్ మిస్సయ్యాను. అమ్మతో అంటే ‘ఈ నాలుగు నెలలే కదా...నువ్ కాలేజీకి వెళ్లేది..పోతే పోయిందిలే క్లాస్’ అంది. ఇంకా దుఃఖమొచ్చింది. ‘అమ్మా...ఈ అబ్బాయినే చేసుకుంటాను. కానీ ఎమ్మెస్సీ అయ్యేదాకా ఆగమని చెప్పండి అమ్మా...!ప్లీజ్’ అని వేడుకున్నాను. ‘పిచ్చి వేషాలేయకు! మంచి సంబంధం. నీ చదువు అయ్యేదాకా వాళ్లు ఆగరు. అయినా బంగారంలాంటి మొగుడు దొరుకుతుంటే..చదు ఉద్యోగం చేయాలా? ఊళ్లు ఏలాలా? దీనికి గారం ఎక్కువైంది! రేపటి నుంచి కాలేజ్ మానిపించి రోటి పచ్చళ్లు రుబ్బడం, వేపుళ్లు చేయడం నేర్పించు’ నానమ్మ హుకుం జారీ చేసింది. ఆమె మాటకు ఈ ఇంట్లో తిరుగు లేదు. బహుశా రేపటి నుంచి నాకు కాలేజ్ బందేమో!
diary_w talangana patrika telangana culture telangana politics telangana cinema
1976, నవంబరు 15...
ఇంకో అయిదు రోజుల్లో నా పెళ్లి! ఈ రోజు హరిత, వాసవి, స్వరూప, రాధ వాళ్లు వచ్చారు. చాలా సేపు కూర్చొని వెళ్లారు. రాధ కొంచెం వేళాకోళమాడింది. హరిత చాలా బాధపడింది. స్వరూప, వాసవి ..‘కనీసం ఇంటర్ అయ్యాకైనా పెళ్లి చేసుకుంటే బాగుండేదేమోనే’ అన్నారు. ఏ భావాన్నీ నేను వ్యక్తం చేయలేదు. ఈ పెళ్లి నా ఇష్టవూపకారమే జరుగుతుందని వాళ్లు అనుకుంటున్నారని మాత్రం నాకర్థమైంది!

1980, డిసెంబరు 9....
నాకు రెండో కూతురు పుట్టి 21 రోజులైంది. డెలివరీకి అమ్మదగ్గరకే వచ్చాను. పెద్దదాన్ని చెల్లి వాళ్లు చూసుకుంటారని. ఆనవాయితీ ప్రకారం ఈ రోజు ఉయ్యాల ఫంక్షన్ చేశారు. అత్తయ్య, ఆడపడచు ఎవరూ రాలేదు. అసలు అది పుట్టినప్పటి నుంచీ దాన్ని ఒక్కసారైనా చూడ్డానికి రాలేదు. ఆయన కూడా ఫంక్షన్‌కి గంట ముందు వచ్చి సాయంవూతానికల్లా వెళ్లిపోయారు. చిన్నదాన్ని కనీసం ఎత్తుకోనైనా లేదు. పెద్దదాన్నే దగ్గరకు తీసుకుని కాసేపు ముద్దు చేసి వెళ్లిపోయారు. వెళ్లేప్పుడు కూడా మాటమాత్రం నాకు చెప్పలేదు. చిన్నది...ఏం పాపం చేసింది? నా కడుపున బిడ్డగా పుట్టడమే దాని తప్పా?

1984, జూన్ 8...
చిన్నదాని అడ్మిషన్! ఎలాంటి ఆర్భాటం లేకుండా నేనొక్కదాన్నే ఉదయం గుడిలో దానికి అక్షర అభ్యాసం చేయించి ఇంటి దగ్గరి స్కూల్లో జాయిన్ చేశాను. మధ్యాహ్నం దాకా కూర్చోబెట్టి దాన్ని తీసుకుని ఇంటికొచ్చాను. సాయంత్రం వాళ్ల నాన్న రాగానే బుజ్జిబుజ్జి మాటలతో తన బడి ఆనందాన్ని పంచుకోవాలని చూసింది అది. వాళ్ల నాన్న వినకపోయినా..పట్టించుకోకపోయినా..ఆయన వెనకాలే తిరిగింది.... ఏదో చెప్తూ! ఆ ఇంట్లో అంతమంది ఏ ఒక్కరూ దాని ఆనందాన్ని పంచుకోలేదు సరికదా...కసురుకున్నారు. అలిగి, అన్నం తినకుండా ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి నిద్రలోకి జారుకుంది.

1991, జూన్ 12...
చిన్నదాని సెవెన్త్ రిజల్ట్స్ వచ్చాయి. క్లాస్ ఫస్ట్! 478 మార్కులు! దాని కన్నా నాకు సంతోషంగా ఉంది. కాలుగాలిన పిల్లిలా ఇల్లంతా తిరిగాను. ఆ ఆనందాన్ని ఊరంతా పంచుకోవాలనిపించింది. కాని అది నేను తప్ప ఎవరూ మా సంతోషాన్ని పంచుకునే మనిషే లేరు ఆ ఇంట్లో! కనీసం పెద్దది కూడా తన చెల్లికి కంగ్రాట్స్ చెప్పలేదు. పెద్ద గొప్పా అన్నట్టు చూసింది. చిన్నది విలవిల్లాడింది. సర్ది చెబితే ఊరుకోలేదు. అలిగింది ఎప్పటిలాగే. అన్నం తినకుండా పడుకుంది.

1993... ఏప్రిల్ 8...
చిన్నది పెద్దయింది. ఇంట్లో శాపనార్థాలు మొదలయ్యాయి. అది భయంతో బిక్కచచ్చిపోయింది. దగ్గరికి తీసుకుని భోరున ఏడ్వాలనిపించింది. అది ఇంకా బెంబేలు పడుతుందని లేని ఆనందాన్ని మొహం మీదకు తెచ్చుకుని చేయాల్సిన తతంగమంతా చేశాను. అప్పుడప్పుడు మ్యాగజైన్లలో చదివినవి గుర్తొచ్చి దానితో ఓ స్నేహితురాలిలా మెలగాలని నిర్ణయించుకున్నాను. ఓ ఫ్రెండ్‌లా అన్నీ విడమర్చి చెప్పాను. ఏం అర్థం చేసుకుందో ఏమో...కళ్లు మాత్రం పెద్దవి చేసి అన్నీ శ్రద్ధగా వింది!

1993...డిసెంబర్ 27...
ఆశ్చర్యంగా ఉంది. చిన్నదాన్ని చూస్తుంటే! ఈ ఆరు నెలల్లో దాని ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఆరిందాలా ప్రవర్తిస్తున్నది. వాళ్ల నానమ్మ, నాన్న, అత్త, అక్కకు తగ్గట్లుగా నడుచుకుంటోంది. ఇదివరకులా ఎవరికీ ఎదురు మాట్లాడ చిన్నదానికీ పెద్దదానికీ అన్నం మీద అలగడం లేదు. అసలు అలకే మానేసింది. నాపట్లయితే మరీ...ఇదిగా ఉంటోంది. ‘అమ్మా అన్నం తిన్నావా?’ అని అడుగుతున్నది. ఇంట్లో పనికి నాకు సాయం చేస్తున్నది. విసిగించ ఏంటో దాని బాల్యాన్ని బలవంతంగా అణచి లేని పెద్దరికాన్ని తెచ్చుకుంటుందేమోనన్న భయం పట్టుకుంది. చిన్నది...ఇలా బాగా లేదు. అది అల్లరిగా....సందడి చేస్తేనే ముద్దుగా ఉండేది. ఆ మాటే ఈ రోజు దానితో అన్నాను. నవ్వి ఊరుకుంది. ఎందుకో ఆ క్షణం అది నాలాగే అనిపించింది.

1994..మే 14..
చిన్నది టెన్త్‌లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. దాని మొహంలో ఏ ఆనందమూ లేదు. వాళ్ల నాన్న మాత్రం అందరితో దాని గురించి ఒకటే పొగుడ్తున్నాడు. నేను ఏ భావాన్నీ వ్యక్త పర్చలేదు.

1994 మే 20...
విజయవాడ చైతన్య కాలేజీలో చిన్నదానికి ఎంపీసీలో ఫ్రీ సీట్ దొరికింది.

1994 అక్టోబర్ 20...
చిన్నది ఉత్తరం రాసింది. అంతాబాగానే ఉంది అని. భోజనం నచ్చ చివరిగా ఓ వాక్యం రాసింది. ‘అమ్మా..నీకు ఎమ్మెస్సీ చదవాలనుండేది కదా...ఇప్పుడెందుకు నువ్ చదువు మొదలుపెట్టకూడదు’ అని! అది చదివాక మొదట నవ్వుకున్నాను కానీ ....ఆ చిన్న మనసు పొద్దుటి నుంచి నాలో లేని ఆశలను రేపుతోందనేది అర్థమైంది. నెగటివ్ నుంచి పాజిటివ్ ఆలోచనలు మొదలవుతున్నాయా....!?

1994...నవంబర్ 1...
చిన్నది ఉత్తరం రాసింది. అంతా మామూలే! ‘అమ్మా నేను చెప్పింది ఆలోచించావా’ అంటూ మళ్లీ ఏదో కోరికను తట్టి లేపుతోందది. అయ్యే పనేనా?

1995 జనవరి 1...
చిన్నది ఉత్తరం రాసింది. మళ్లీ చదువు మొదలుపెట్టమని. ఇంటర్‌కి ప్రిపేర్ అవమని. ఎగ్జామినేషన్ ఫీజు కట్టమని. ‘నీ చదువు విషయం మామయ్యతో మాట్లాడాను. చాలా సంతోషపడ్డాడు. పరీక్ష ఫీజు మామయ్యే కడతానన్నాడు. చదవడమే నువ్ చేయాల్సిన పని. పరీక్షల టైమ్‌లో నాలుగు రోజులు అమ్మమ్మ వాళ్లింటికి వెళ్తున్నానని చెప్పి ఎగ్జామ్స్ రాసి వచ్చేయ్’ అని రాసిన దాని రాతలు నన్ను ఆజ్ఞాపిస్తున్నట్టే అనిపించాయి.

2001 సెప్టెంబర్ 15...
ఈ రోజు నా ఎమ్మెస్సీ రిజల్ట్స్ వచ్చాయి. డిస్టింక్షన్ వచ్చింది. నా టెన్త్ రిజల్ట్స్ వచ్చినంత సంబరపడ్డాను. పంచుకోవడానికి ఊరువాడ పరుగెత్తలేదు కానీ శాన్‌వూఫాన్సిస్కోలో ఉన్న నా చిన్నకూతురుతో పంచుకున్నాను. థాంక్స్ చెప్పాను. ‘అమ్మా.....’ అని ముద్దుగా విసుక్కుంది. దాన్ని ముద్దులతో ముంచేయాలన్న ఆరాటాన్ని బలవంతంగా ఆపాను. నా పెద్ద కూతురు యాజ్‌యూజువల్‌గా....నా మీద చాలా జోకులేసింది. ‘42 ఏళ్ల వయసులో రిజల్ట్స్‌కి కూడా అంత ఆనందమా అమ్మా...’అంటూ!

2001, అక్టోబర్ 4...
చిన్నదాని ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారం కంప్యూటర్స్ కోర్సులో జాయిన్ అయ్యాను. పెద్దదాని వెటకారం షరామామూలే. ‘ మీ అమ్మ లేటు వయసులో లేటెస్ట్ కోర్సులు చదవుతుందిరోయ్’ అంటూ! మా ఆయనా దానికి వంత పాడారు. కీళ్లు అరిగే వయసులో కంప్యూటర్ ‘కీ’లు ఎందుకు గానీ...హాయిగా మనవళ్లని ఆడిస్తూ శేష జీవితం గడపొచ్చు కదా...అని జోకేశారు. నవ్వి ఊరుకున్నాను. చిన్నదానితో చెప్పాలనిపించీ కూడా చెప్పలేకపోయాను.

2003, మార్చి 2..
నిన్ననే ఇండియా నుంచి శాన్‌వూఫాన్సిస్కో వచ్చాను. కాలిఫోర్నియాలో ఉద్యోగం వచ్చింది. జావా ప్రోగ్రామర్‌గా! ఇది నా ఎచీవ్‌మెంట్ కన్నా కూడా నా చిన్న కూతురు ఎచీవ్‌మెంట్ అంటే బాగుంటుందేమో! రేపు ఉదయం ఫ్లైట్‌కి కాలిఫోర్నియా ప్రయాణం!

2003, ఏప్రిల్ 6...
ఈ రోజు నా మొదటి జీతం తీసుకున్నాను. ఇంటికి వచ్చేసరికి చిన్నది ఉంది. గట్టిగా వాటేసుకుంది. దాని గుండెల్లో ఒదిగి పోయి పసిపిల్లలా ఏడ్చేశాను. ‘ఏంటమ్మా..ఇది ఊరుకో’ అని అది ఓదారుస్తున్నా.... నా కన్నీళ్లు ఆగడం లేదు. ఇన్నాళ్లూ నా గుండెల్లో దాగిన చేదు జ్ఞాపకాన్ని దానికి చెప్పేశాను.

చిన్నది కడుపులో పడిన మూడో నెలకే అది ఆడపిల్ల అని తెలిసింది. ఇంట్లో అందరూ అబార్షన్ చేయించుకోమని ఒత్తిడి తెచ్చారు. ఒకానొక టైమ్‌లో నేను తలవంచాను. కానీ.... హాస్పిటల్‌కు వెళ్లాక నా మనసు ఒప్పుకోలేదు. వద్దని ఇంటికి వచ్చేశాను. అత్తగారిదే కాదు, మా ఆయన కోపాన్నీ భరించాను. దానికి జన్మనిచ్చా. ఆ రోజు దాన్ని చంపేసి ఉంటే...ఈ రోజు నాకీ పునర్జన్మ ఉండేది కాదు. ‘అమ్మా....అందరినీ ఎదురించి నన్ను కన్నావ్! అందుకు నేనే నీకు రుణపడి ఉంటానమ్మా....ఈ జన్మంతా!’ అని కళ్లనీళ్లతో అది అంటుంటే అదే నాకు అమ్మలా కనిపించింది!

Other News
    Most Viewed galleries


    Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
    © 2011 Telangana Publications Pvt.Ltd
    News Photo Galleries Features
    Latest News
    Telangana News
    Seemandhra News
    National News
    International News
    Festivals gallery
    Actress gallery
    Cinema gallery
    Fashion gallery
    Political gallery
    Sports gallery
    Zindagi
    Turning Point
    Mee Features
    Life Style
    Sunday magazine