క్యాన్సర్ - నిజాలు
విజ్ఞానం, వైద్యం ఎంతో అభివృద్ధి చెందినా ఇప్పటికీ కొన్ని వ్యాధులకు కచ్చితమైన పరిష్కారాన్ని కనుక్కోలేకపోతున్నాం. జీవిత కాలాన్ని పొడిగించుకోగలిగిన మానవుడు క్యాన్సర్‌కు ఆన్సర్ తెలుసుకోలేకపోతున్నాడు. ఇప్పటికీ తెలిసిన వారికో, బంధువులకో క్యాన్సర్ అన్న పదం వినగానే ఒళ్లు జలదరిస్తుంది. ఎన్నో సందేహాలు, భయాలు, అనుమానాలు వెంటాడుతాయి.
లక్షణాలు
క్యాన్సర్ లక్షణాలు.. అది వచ్చిన అవయవాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అందరిలో అన్ని రకాల క్యాన్సర్‌లు కనిపించే సాధారణ లక్షణాలు అంటే క్యాన్సర్ ముదిరాక కనిపించే లక్షణాలు అని అర్థం చేసుకోవచ్చు. అవి తీవ్రమైన అలసట, జ్వరం, రోగనిరోధక శక్తి తగ్గటం, ఆకలి తగ్గటం, వాంతులు, విరోచనాలు, అకారణంగా బరువు తగ్గడం, రక్తహీనత.
గుర్తించడం ఎలా?
ముందే తెలుసుకోవడం లేదా శరీరం మొత్తంలో ఎక్కడైనా క్యాన్సర్ కణం ఉందా అని మొత్తంగా తెలిపే పరీక్షలు లేవు. ఏ అవయవానికి వచ్చిందని అనుమానం ఉంటే ఆ అవయవానికి సంబంధించిన పరీక్షలు వేర్వేరుగా ఉంటాయి. వీటిలో బయాప్సీ, ఎఫ్.ఎన్.ఎ. టెస్ట్, బ్లడ్ మార్కర్స్, ఎక్స్-రే, సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, పీఈటీ స్కాన్ ఇలా రకరకాలుగా అవసరాన్ని బట్టి చూస్తూ ఉంటారు. ఒక్క సర్వైకల్ క్యాన్సర్‌ను మాత్రమే పాప్‌స్మీయర్ ద్వారా చాలా ముందుగా గుర్తించవచ్చు.
వ్యాక్సిన్ ఉందా
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు కారణం కచ్చితంగా హెచ్‌పీవీ వైరస్ అని తెలుసు కాబట్టి ఇది రాకుండా అమ్మాయిలకు వ్యాక్సిన్ ఉంది. 9 సంవత్సరాల నుంచి పెళ్లికాని అమ్మాయిలందరూ అంటే శృంగార జీవితం ప్రారంభం కాకముందే ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే ఈ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అండాశయం, (గొంతు క్యాన్సర్ రాకుండా కూడా ఈ వ్యాక్సిన్ పనిచేయవచ్చని 40 ఏళ్ల వరకు స్త్రీలు ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చని డాక్టర్స్ సలహా ఇస్తుంటారు) హెపటైటీస్ సి వైరస్ తరచూ రూపాంతరం చెందుతూ ఉండటం వల్ల ఆ వైరస్ వచ్చే లివర్ క్యాన్సర్‌కు ఇంకా టీకాను కనుక్కోలేక పోయారు.
నివారణ లేదా?
సర్వైకల్ క్యాన్సర్‌కు తప్పితే మిగతా ఏ క్యాన్సర్‌కు కచ్చితమైన కారణం తెలియదు కాబట్టి నివారణ మన చేతుల్లో లేనట్లే. అయితే బాగా పీచు పదార్థాలుండే ఆహారం, వ్యాయామం, కాలుష్యానికి, కెమికల్స్‌కు దూరంగా ఉండటం, పొగతాగడం, ఆల్కహాల్ వంటి అలవాట్లకు దూరంగా ఉండడం, తరచూ ఇన్‌ఫెక్షన్‌కు గురికాకుండా చూసుకోవటం ద్వారా క్యాన్సర్ రాకుండా మన చేతుల్లో ఉన్నంత ప్రయత్నం చేసిన వారమవుతాము.
వంశపారంపర్యమా
కచ్చితంగా చెప్పలేము కాని, రొమ్ము క్యాన్సర్ రక్త సంబంధికులలో ఉంటే మిగతా ప్రజలకంటే వీరిలో వచ్చే రిస్క్ ఎక్కువ. బీఆర్‌సీఏ-1, బీఆర్‌సీఏ-2 వంటి జీన్ మ్యూటేసణ పరీక్షల ద్వారా రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పసిగట్టవచ్చు. రొమ్ము క్యాన్సర్ బాధితులు 0 శాతం వంశపారంపర్యంగా లేనివారే కాబట్టి ప్రతి స్త్రీ 20 ఏళ్ల నుంచే రొమ్ము క్యాన్సర్ పై అవగాహన పెంపొందించుకొని, నెలసరి అయిన ఏడవ రోజున సబ్బు చేతులతో వేళ మధ్య భాగంతో రొమ్ములను పరీక్షించుకుని చిన్న, చిన్న గడ్డలు ఏమైనా తగులుతున్నాయా అని గమనించుకోవాలి. 30 ఏళ్ల నుంచి ఇతర పరీక్షలు, 40 ఏళ్లు పైబడ్డాక మమోగ్రాం వంటివి డాక్టర్ సలహా మేరకు ఏడాదికి కానీ, మూడు ఏళ్లకు ఒక సారి కానీ చేయించుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించి వెంటనే చికిత్స తీసుకోగలుగుతారు.
Other News