ఇదీ అమృతమే...!

తల్లిపాలలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు... బిడ్డకు కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలూ ఉంటాయి. అందుకే శిశువులకు తల్లిపాలే సంపూర్ణ పోషకాహారం. అంతేకాదు.. పసితనంలో వచ్చే రకరకాల అనారోగ్యాలను ఎదుర్కోగలిగిన యాంటిబాడీలు కూడా ఉంటాయి. ముఖ్యంగా డయేరియా, న్యుమోనియా లాంటి వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల మరణాలకు దారితీస్తున్నాయి. ఇలాంటి వ్యాధులను ఎదుర్కోగలిగే సామర్థ్యం అమ్మపాలు తాగిన పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. యాంటీబాడీలతో పాటుగా వ్యాధి నిరోధక శక్తిని పెంచే కొన్ని రకాల ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. కాబట్టి తల్లిపాలు తాగి పెరిగిన పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఆస్తమా, అలర్జీల అవకాశాలు ఇలాంటివారిలో చాలావరకు తగ్గిపోతాయి. రెండేళ్ల వయసు వరకు అమ్మపాలు తాగిన పిల్లల్లో ఆస్తమా అవకాశం సగానికి సగం తగ్గిపోతుంది. బిడ్డకు పాలివ్వడం వల్ల తల్లులకు కూడా ఉపయోగకరమే. పాలు ఇవ్వడం ద్వారా తమ పిల్లలకు అచ్చమైన పోషకాహారాన్ని, ఇమ్యూనిటీని అందివ్వడమే కాకుండా తాము కూడా రొమ్ము క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోవచ్చు. మాస్టైటిస్ వల్ల రొమ్ములో వాపు ఉన్నవాళ్లు బిడ్డకు పాలివ్వడం ద్వారా తీవ్రత తగ్గించవచ్చు.
ఎప్పటి నుంచి.. ఎప్పటి వరకు...?
మొట్టమొదట వచ్చే పాలను కొలెస్ట్రమ్ (ముర్రుపాలు) అంటారు. పసుపు రంగులో ఉండే ఈ పాలను ఇవ్వకూడదు. పడేయాలంటారు. నిజానికి ఈ ముర్రుపాలే మరింత శ్రేష్ఠమైనవి. కొలెస్ట్రమ్‌లో చాలా రకాల యాంటీబాడీలు ఉంటాయి. కాబట్టి బిడ్డ పుట్టిన గంట నుంచి పాలు ఇవ్వడం మొదలుపెట్టాలి. రాత్రయినా, పగలైనా బిడ్డ ఎన్నిసార్లు అడిగితే అన్ని సార్లు పాలు ఇవ్వాల్సిందే. బిడ్డ అడిగినా, అడగకపోయినా ప్రతి రెండు గంటలకు ఒకసారి ఇవ్వడం మంచిది. ఆరు నెలల వరకు తప్పనిసరిగా ఇవ్వాలి. ఆరు నెలల తరువాత ఇతర ఆహారంతో పాటు పాలు కూడా ఇవ్వాలి. ఇలా బిడ్డకు ఒకటిన్నర, రెండేళ్ల వయసు వచ్చేవరకు తల్లిపాలు ఇవ్వడం ఆపకూడదు. ఆరో నెల తరువాత పాలు అందించే కేలరీలు సరిపోవు. అందువల్ల తప్పనసరిగా అదనపు ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆరు నెలల వయసు వచ్చేవరకు తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వడం ద్వారా ఏటా మిలియన్‌కి పైగా శిశుమరణాలను నివారించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 40 శాతం కన్నా తక్కువ మంది శిశువులు మాత్రమే ఆరునెలల వయసు వచ్చేవరకు అమ్మపాలకు నోచుకుంటున్నారు. ఉద్యోగినులైనవాళ్లు బిడ్డ పుట్టిన తరువాత కనీసం 16వారాలు సెలవులో ఉండడం మంచిది.
బిడ్డ తాగితేనే...
రొమ్ములో ముందు భాగంలో ఉండే గ్రంథుల నుంచి విడుదలయ్యే పాలను ఫోర్‌మిల్క్ అంటారు. దీనిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ, కొవ్వులు తక్కువ ఉంటాయి. వీటి వెనుకవైపు ఉండే గ్రంథులు విడుదల చేసే పాలను హిండ్ మిల్క్ అంటారు. దీనిలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. బిడ్డ తనకు తానుగా తాగకుండా రొమ్ము నుంచి పాలను విడిగా తీసి బిడ్డకు తాగించడం వల్ల ఫోర్‌మిల్క్ కన్నా హిండ్‌మిల్క్ ఎక్కువగా వస్తాయి. అందువల్ల బిడ్డ తనకు తానుగా తాగడమే మంచిది. చాలా అరుదుగా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. బిడ్డ పాలు తాగడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ సంకేతాలు మెదడుకు చేరి హార్మోన్లు ఉత్తేజితం అవుతాయి. అప్పుడు క్షీరగ్రంథులు పాలను విడుదల చేస్తాయి. అందువల్ల మొట్టమొదట బిడ్డ తనకు తానుగా పాలు తాగడం ప్రారంభిసేే్త పాలు ఇంకా బాగా వస్తాయి.
సరిపోతున్నాయా..?
చాలామంది తల్లులు బిడ్డకు పాలు సరిపోవడం లేదేమో అని అనుమానం వ్యక్తం చేస్తుంటారు. కానీ సాధారణంగా బిడ్డకు సరిపడినన్ని పాలు తప్పనిసరిగా ఉత్పత్తి అవుతాయి. రోజులో 8 నుంచి 10 సార్లు మూత్రవిసర్జన జరుగుతున్నా, ఒకట్రెండు సార్లు మలవిసర్జన చేస్తున్నా, రోజుకి 10 గ్రాముల /కేజీ బరువు పెరుగుతున్నా, పాలు ఒక రొమ్ము నుంచి ఇచ్చేటప్పుడు రెండవ రొమ్ము నుంచి పాల చుక్కలు వస్తున్నా బిడ్డకు పాలు సరిపోవట్లేదన్న బెంగ అక్కర్లేదు. వీటిలో ఏ మూడు లేకున్నా సరిపోవట్లేదేమోనని ఆలోచించాలి.
ఇవీ జాగ్రత్తలు..
- బిడ్డ పుట్టిన మొదటి మూడు రోజుల వరకు పాలు రావనీ, అప్పటి వరకు తాగించొద్దనీ అంటారు. కానీ దీనివల్ల బిడ్డకు అందివ్వాల్సిన పోషకాహారాన్ని మూడు రోజుల పాటు దూరం చేసినట్టే అవుతుంది.
- పడుకుని పాలు ఇవ్వొద్దు. ఒకచేతిపై ఏటవాలుగా పడుకోబెట్టుకుని మరోచేత్తో బిడ్డను పట్టుకుని పాలివ్వాలి. పడుకుని ఇస్తే పాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.
- తల్లిపాలు కాకుండా పౌడర్ పాలు తాగించడం అంత మంచిది కాదు. ఈ పాలలో తల్లిపాలలో ఉండే యాంటిబాడీలుండవు. అంతేగాక నీటి ద్వారా వ్యాపించే అనేక రకాల ఇన్‌ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. దీని ఖర్చు కూడా ఎక్కువే. పోషకాహారలేమి ఏర్పడవచ్చు.
- ఆరో నెలలో ఇతర ఆహారాన్ని ఇవ్వడం మొదలుపెట్టినప్పటికీ తల్లిపాలు ఇవ్వడం తగ్గించకూడదు.
- హెచ్‌ఐవి/ఎయిడ్స్ తప్ప జ్వరం ఉన్నా, ఇంకా ఏ జబ్బు ఉన్నా తల్లిపాలు ఇవ్వవచ్చు.
- పాలు ఇచ్చేముందు నిపిల్‌ని శుభ్రం చేయాలి. లేకుంటే ఇన్‌ఫెక్షన్ అవకాశం ఉంటుంది. పాలు ఇవ్వడం అయిపోయిన తరువాత భుజం మీద ఎత్తుకుని వెన్నులో చేత్తో రాయాలి. దీనివల్ల గ్యాస్ ఏర్పడకుండా ఉంటుంది.
అమ్మల ఆహారం..
పాలిచ్చే తల్లులు ఎక్కువ కేలరీలు ఉండే స్వీట్లు, పాల ఉత్పత్తి, నెయ్యి లాంటివి ఎక్కువ మొత్తంలో తీసుకోవాలంటుంటారు పెద్దవాళ్లు. కానీ ఇప్పటి ఆధునిక జీవనవిధానాన్ని బట్టి బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం వేరుగా ఉంటుంది. తల్లి తీసుకునే ఆహారమే బిడ్డ ఎదుగుదలకు కీలకం అని గుర్తించాలి.
- పాలిచ్చే తల్లులు రోజూ తప్పనిసరిగా 500 నుంచి 700 కేలరీల కన్నా ఎక్కువ ఆహారం తీసుకోవాలి
- సరళమైన చక్కెరలు ఉండే స్వీట్లు, పండ్లరసాలు, కాక్‌టైల్స్ లాంటివి ఎక్కువ తీసుకోవద్దు.
- మైదా లాంటి కార్బోహైడ్రేట్లు, బేకరీ ఉత్పత్తులు వద్దు.
- చక్కెర కన్నా తేనె, బెల్లం వాడటం మంచిది. డ్రైఫ్రూట్లు, పండ్లు, గోధుమల్లాంటివి తీసుకోవాలి.
- కొవ్వు పదార్థాలను కొద్దిగా తీసుకోవాలి. కూరల్లో నూనె కనిపించేంత ఎక్కువ వాడొద్దు.
- పాలు, పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవాలి. ప్రొటీన్లు ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినాలి.
- పండ్లు, కూరగాయలు, గింజలు తప్పనిసరిగా తీసుకోవాలి.
- తగినన్ని మంచినీళ్లు తాగాలి.
ఆస్తమా మాత్రమే కాదు.. అమ్మపాలు తాగి పెరిగిన పిల్లల్లో అధిక బరువు, స్థూలకాయ సమస్యలు చాలావరకు ఉండవు. కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు కూడా తక్కువ. అందువల్ల మధుమేహం, గుండెజబ్బుల అవకాశాలు కూడా తగ్గిపోతాయి. అమ్మపాలు తాగిన పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. ఈ పిల్లల ఐక్యు విలువ ఎక్కు అని ఈ అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి.
- ప్రపంచ ఆరోగ్య సంస్థ
Other News