ప్రాణాంతకం పల్మనరీ ఎంబోలిజం
ఇరవైఆరేళ్ల మోహన్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. కాలి ఎముక విరిగింది. విరిగిన కాలుకు సర్జరీ చేశారు. రెండు రోజుల వరకు ఎటువంటి సమస్యా లేదు. అందరూ మోహన్ కోలుకుంటున్నాడనే అనుకున్నారు. కానీ ఉన్నట్టుండి మూడోరోజున ఆయాసంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. ఆక్సిజన్ పెట్టిన కొంతసేపటికి ఆయాసం కొంత తగ్గింది. అయితే ఆదేరోజు రాత్రి మళ్లీ ఆయాసం తిరగబెట్టి వెంటిపూటర్ అమర్చాల్సి వచ్చింది. మరో రెండురోజులు మృత్యువుతో పోరాడాడు. కానీ గెలవలేకపోయాడు. కోలుకుంటున్నాడనుకున్న మోహన్ మరణానికి కారణం పల్మనరీ ఎంబోలిజం.
కాళ్లలో ఉండే రక్తనాళాల్లో రక్తం కొన్ని సందర్భాల్లో గడ్డ కడుతుంది. ఇలా గడ్డలుగా మారిన రక్తం అక్కడే ఉండిపోతే పెద్ద ప్రమాదం లేదు, కానీ రక్త ప్రవాహం తోపాటు ఈ గడ్డలు ఊపిరి తిత్తులకు కానీ గుండెకు కానీ చేరితే చాలా ప్రమాదం. ఇటువంటి పరిస్థితినే పల్మనరీ ఎంబోలిజం అంటారు.
ఎవరిలో ఎక్కువ
- పెద్దపెద్ద సర్జరీలు జరిగిన వారికి, ప్రత్యేకించి కాలి ఎముకలకు ఆపరేషన్ జరిగిన వారికి
- ఎక్కువ కాలం మంచంలో ఉండాల్సిన అవసరం వచ్చిన వారికి
- గర్భనిరోధక మాత్రలు తీసుకునే వారికి
- కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చిన వారికి
- రక్తం గడ్డ కట్టేందుకు ప్రేరేపించే జన్యుపరమైన సమస్యలు ఉన్న వారికి ఇలా కాళ్లలో రక్తం గడ్డ కంటే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఎలా గుర్తించాలి
ఈ సమస్య వచ్చే అవకాశం ఉన్న వారిలోఅకస్మాత్తుగా ఊపిరి పీల్చడం కష్టమైన వారికి పల్మనరీ ఎంబోలిజం వచ్చిందేమోనని అనుమానించాలి. వీరి రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. రక్త పరీక్ష ద్వారా దీన్ని నిర్థారించాలి.
- కాళ్లకు డుప్లెక్స్ స్కానింగ్ పరీక్ష చేయడం ద్వారా కాళ్లలోని రక్తనాళాల్లో రక్తం గడ్డలను గమనించాలి.
- ఈసీజీ, ఎకో పరీక్షల ద్వారా గుండెమీద దీని ప్రభావం ఉందనేది తెలుసుకోవాలి.
- సీటీ పల్మనరీ యంజియోగ్రాం పరీక్ష ద్వారా పల్మనరీ ఎంబోలిజం సమస్యను కచ్చితంగా నిర్థారించవచ్చు.
చికిత్స
చాలా సందర్భాల్లో పల్మనరీ ఎంబోలిజం ప్రాణాంతకమవుతుంది. దీనిని త్వరగా గుర్తించి సరైన చికిత్స చేయడం ద్వారా ఈ ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించవచ్చు.
రక్తనాళాల్లోని గడ్డలను కరిగించే హెపారిన్‌ను ఇంజక్షన్ ద్వారా ఇస్తారు. బీపీ తగ్గిపోతుంటే, గుండే కొట్టుకునే రేటు తగ్గుతుంటే మాత్రం ఇంకా ఎక్కువ ప్రభావం చూపే మందులు వాడాల్సి ఉంటుంది. వీటిని థ్రాంబోలైటిక్ ఎంజెంట్స్ అంటారు. వీటి వల్ల కూడా దుష్ప్రభావాలుంటాయి. ఒక్కొసారి రక్తవూసావం జరగొచ్చు. ఇలా రక్తవూసావం మెదడులో జరిగితే పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఈ ఇంజక్షన్ వాడటం మంచిది.
నివారణ సాధ్యమే
రక్తం రక్తనాళాల్లో ప్రసారం తగ్గి ఎక్కువ సమయం నిలకడగా ఉన్నపుడు మాత్రమే రక్తం గడ్డకట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుండె నుంచి శరీర భాగాలకు రక్తాన్ని తీసుకు రక్తనాళాలలో రక్తం కదలికలకు గుండె ద్వారా జరిగే పంపింగ్ తోడ్పడుతుంది. గుండె కొట్టుకోవడం వల్ల రక్త ప్రసారం జరుగుతుంది. శరీర భాగాల నుంచి గుండెకు రక్తం చేరటానికి మాత్రం ఇలా సహకరించే పరికరమేది మన శరీరంలో ఉండదు. శరీరం పైభాగం నుంచి వచ్చే రక్తానికి గురుత్వాకర్షణ శక్తి తోడ్పడుతుంది. అయితే కాళ్లనుంచి గుండెకు వెళ్లడానికి ఏ విధమైన పంపింగ్ ఉండదు. అందుకే కాలి కండరాలే పంపులుగా పనిచేస్తాయి. నడవడం, పరుగెత్తడం వల్ల రక్తం గుండెకు చేరుతుంది.
సర్జరీలు జరిగిన తర్వాత త్వరగా నడక ప్రారంభించడం వల్ల పల్మనరీ ఎంబోలిజం రాకుండా ఆపవచ్చు. దీన్ని అరికట్టడానికే ఈ రోజుల్లో సర్జరీ తర్వాత త్వరగా నడిపించే ప్రయత్నం చేస్తున్నారు.
కొన్ని సర్జరీల తర్వాత రక్తం గడ్డ కట్టడాన్ని నివారించడానికి హెపారిన్ ఇంజక్షన్లు ఇవ్వాలి.
బిగుతుగా ఉండే సాక్సులు (స్టాకింగ్స్) వేయటం ద్వారా కొంత మందిలో రక్తం గడ్డ కట్టటాన్నినివారించవచ్చు.
ఆస్ప్రిన్ వంటి రక్తం పలుచగా చేసే మందులతో కూడా దీన్ని నివారించవచ్చు.
చిన్న జాగ్రత్తలు, చిన్న చిన్న వ్యాయామాల ద్వారా ఈ పరిస్థితిని దాదాపుగా నివారించ వచ్చు.
Other News