రక్షణ మార్గం
బైబిలు పాతనిబంధన గ్రంథంలోని మొదటి ఐదు అనగా ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితియోపదేశకాండం మోషేద్వారా మనకు అనుక్షిగహించబడినవి. దేవుడైన యెహోవా ముఖాముఖిగా ఎరిగిన మోషెవంటి ఇంకో ప్రవక్తి ఇశ్రాయేలీయులలో ఇది వరకు పుట్టలేదు అని బైబిలు గ్రంధం బోధించుచున్నది.
ద్వితియోపదేశకాండం 2వ అధ్యాయంలో దేవుని దీవెన వచనములు, శాప వచనాలు రాయబడియున్నవి. ఇశ్రాయేలు జనం దేవుడు ఏర్పరుచుకొన్న జనం. దేవుని సేవకుడైన మోషె ఇశ్రాయేలు ప్రజలతో - ‘‘నేడు మీరు మీ దేవుడైనా యెహోవాకు స్వజనమైతిరి. గనుక మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినండి. నేడు మీకు నేను ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలన్నింటిని అనుసరించి, నడుచుకొన్నట్లయితే మీదేవుడైన యెహోవా భూమిమీద ఉన్న సమస్త జనుల కంటే మిమ్ములను హెచ్చించును. మీరు మీ దేవుడైన యెహోవా మాట వినినట్లయితే అనగా- ఆయనిచ్చిన ఆజ్ఞలను, కట్టుబాట్లను తెలుసుకుని నడుచుకున్నట్లయితే ఆయన దీవెనలన్నియూ మీ మీదకు వచ్చి ప్రాప్తించును.’’(ద్వితీ 2 : 1-3) అని చెప్పెను.
ఎప్పుడైతే మనం కూడా దేవుని మాట విని, ఆయనిచ్చిన ఆజ్ఞలను పాటిస్తామో, ఆయన చెప్పిన కట్టుబాట్లను అనుసరించి పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ నడుచుకుంటామో అప్పుడు ఈ దీవెనలన్నియూ మనకు కూడా ప్రాప్తించును.
నీవు పట్టణాలలో దీవింపబడుదువు. మనముండు ప్రాంతంలో మనముండు స్థలాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో దీవింపబడతాం. మనం పొలంలో ఉన్నట్లయితే సకల పంటలతో ఆ పొలం దీవింపబడుతుంది. సంతానం లేకున్నట్లయితే సంతానం కూడా దీవింపబడును. పశువుల మందలు, దుక్కిటెద్దులు, గొర్రెలు, మేకల మందలు దీవింపబడి రెట్టింపగును. నీ చేపల గంపయు, నీవు రొట్టె చేయుటకు ఉపయోగించే పిండి రెట్టింపగును. చేతుల్లో కష్టార్జితం, ఆహారంతో దీవించబడుదుము. ఇంటినుంచి బయటికి వెళ్లినప్పుడు, బయటినుంచి ఇంటికి వచ్చిన ప్రతిసారీ దీవింపబడుదువు. ప్రయాణమందలి ప్రతిస్థలముంలోనూ, వచ్చేపోయే మార్గాల్లోనూ ఆయన మనకు కంచెగా యుండి మనలను కాపాడును. మనమీదకు ఎవరైనా దాడికి వచ్చినా, మనమీద పడే శత్రువులే హతమగునట్లు దేవుడు మనకు తోడుగా యుండి చేయును.
దేవుడు మనచెంతనున్నప్పుడు శత్రువులు మనవైపు వచ్చినా వారికి తోవ తెలియక ఏడు దోవలలోనుంచి మన ఎదురుగానే పారిపోతారు. మన శత్రువుల నుంచి ఎల్లప్పుడూ మనకు రక్షణ ఉండును. మనం చేయు ప్రతి ప్రయత్నం సఫలమగునట్లు, విజయం మనతోనే ఉండునట్లు మనలను దీవించును. మనమున్న ప్రాంతమును వర్షాలతో దీవించును.
దేవునియందు విశ్వాసం ఉంచి, ఆయనే సజీవుడైన దేవుడని గ్రహించి ఆరాధించినట్లైన మనం ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలమని పిలువబడుతాం. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా మనలను బలపరిచి సమృద్ధితో మనలను దీవించును. సంఘంలో, సమాజంలో, కుటుంబంలో, వ్యక్తిగతంగా మనలను అధికంగా దీవించును. ఎల్లప్పుడూ, ప్రతి విషయంలో మనం పైవారిగా ఉండేట్లు ఆయన మనలనుదీవించును.
యెహోవా రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, మొదటి కొన్ని వచనాలు ఈ విధంగా ఉన్నాయి. జీవవాక్యం ఆదినుంచి ఏది ఉండెనో, ఆదినుంచి మేమేది వింటిమో, అదినుంచి మేమేమి కన్నులారా చూసితిమో, ఏదానిని నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూసెనో, అది మీకు తెలియజేస్తున్నాం. ఆ జీవం ప్రత్యక్షమాయెను. తండ్రియొద్దనుంచి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవాన్ని మేం చూసి, ఆ జీవాన్ని గూర్చి సాక్షమిచ్చుచూ దానిని మీకు తెలియపరుస్తున్నాం. గనుక మనం దేవుడిచ్చిన ఆజ్ఞలను, కట్టుబాట్లను అనుసరించి నడుచుకొనుచు దేవుని సాక్షంగా ఉండుటకు దేవుడు మనలను దీవించి, పైపేర్కొనిన దీవెనవచనాలను ప్రాప్తించునుగాక!
- కె.యేసుదాసు, 949046937
Other News