ప్రయత్నం మన విధి
విశ్వసించే వారికి దివ్య ఖురాన్‌లో అల్లాహ్ మహావూపవక్త మహ్మద్ (స.అ.స)ను ఇతర ప్రవక్తలను ఆదేశించడం జరిగింది. ‘‘ ఓ ప్రవక్తా! ఈ గ్రంథాన్ని విశ్వసించి (దీని బోధనలకు అనుగుణంగా) తమ నడవడికను సరిదిద్దుకొనేవారికి సెలయేరులు ప్రవహించే స్వర్గవనాలు ఉన్నాయని శుభవార్త వినిపించు’’ (సూరె బఖరా) అని ఉంది. దీని అర్థం ఏమిటంటే... ఇస్లామ్‌ను విశ్వసించే వారే పరలోకంలో సాఫల్యం చెందుతారు. అక్కడే శాశ్వత జీవితం, మహాభాగ్యాలను అనుభవిస్తూ గౌరవవూపదమైన జీవితం గడుపుతారు. మోమీన్ (విశ్వాసి) దృక్పథం కేవలం ప్రపంచం వరకే పరిమితంగా లేదు. అతడు పరలోకాన్ని విశ్వసించాడు. కాబట్టి అతను కష్టకాలంలో నిరాశ నిస్పృహలకు గురికాకుండా ఎల్లప్పుడూ ధైర్యసాహసాలను ప్రదర్శిస్తూ పరిస్థితులకు ఎదురీదాలి. దైవమార్గంలో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. ప్రతివిషయంలో అల్లాహ్, ఆయన ప్రవక్త మహ్మద్ (స.అ.స)లపై ఆధారపడి భరోసాతో ముందుకు సాగాల్సి ఉంటుంది. ప్రపంచంలో ప్రతి విషయం అల్లాహ్ అధీనంలో ఉందన్న యదార్థాన్ని గుర్తుంచుకోవాలి.
అల్లాహ్ తలచుకుంటే పరిస్థితులు మారడానికి ఎంతోసేపు పట్టదని దృఢంగా విశ్వసించాలి. ఇలాంటి విశ్వాసం, మనోధైర్యం కల మోమీన్ కష్టాలొచ్చినప్పుడు ఆందోళన చెందడు. ప్రాపంచిక జీవితంలో కష్టాలను కాస్త ఓర్చుకుంటే ఆ తర్వాత పరలోకంలో అతనికి అంతా సుఖమయమైన జీవితం ప్రాప్తమవుతుంది.
దైవమార్గంలో పనిచేసే విశ్వాసికిఅనేక అవాంతరాలు ఎదురవుతాయి. ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆందోళన చెందకుండా, ధైర్యం వీడకుండా దైవకార్యాన్ని ముందుకు సాగించినవారు ఎంతో అదృష్టవంతులు. విశ్వాసి ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిరాశ, నిస్పృహలకు గురికాడు. ఎందుకంటే తాను చేయగలిగిందేదో చేస్తూ ఉండటమే తన బాధ్యతని అతను భావిస్తాడు. ఫలితాలను గురించి అతడు ఆలోచించడు. వాటిని అల్లాహ్‌పై వదిలివేస్తాడు. నిజానికి ఫలితాలు ఎప్పుడూ దేవుని అధీనంలోనే ఉంటాయి. దైవమార్గంలో బేషరతుగా కృషి చేయడమే మోమీన్ (విశ్వాసి) కర్తవ్యం. తన కృషివల్ల చెడు తప్పకుండా పోతుందని అతను ఎప్పుడూ అనుకోడు. ఒకవేళ తన ప్రయత్నం వల్ల ఏ ఒక్క మంచిపనీ జరగకపోతే తాను విఫలమయ్యానని కూడా తాను భావించడు. విశ్వాసి ముందు ఒకే ఒక విషయం ఉంటుంది. దైవం తనపై మోపిన బాధ్యతల ప్రకారం తాను ధర్మసంస్థాపన కోసం, తన శక్తిసామర్థ్యాలన్నీ ఉపయోగించి పాటుపడాలి. ప్రజల్ని మంచి వైపునకు పిలవాలి.
చెడులనుంచి నిరోధించాలి. వారిని నీతిమార్గాన నడిపించాలి. అని మాత్రమే అతను ఆలోచిస్తాడు. ప్రయత్నాల పర్యవసానాన్ని గురించి ఆలోచించకుండా దీక్షతో ధర్మసంస్థాపన కృషిలో ముందుకు సాగిపోవడమే తన బాధ్యతని భావిస్తాడు. బాధ్యతల నిర్వహణలో స్థిరంగా ఉంటేనే దైవ ప్రసన్నత ప్రాప్తమవుతుందని విశ్వసిస్తాడు. ఎన్ని కష్టాలొచ్చినా సహించడానికి, ఎన్ని అవాంతరాలు ఎదురైనా అధిగమించడానికి ఈ విశ్వాసమే అతనికి దృఢచిత్తం, శక్తిని ఇస్తుంది.
మనమంతా ఇలాంటి విశ్వాసం, దీక్ష, ఆకాంక్షలనే మనలోనూ జనింపచేసుకోవాలి. ఇవి లభించిన తరువాతే భయం, పిరికితనం, నిర్లిప్తత, నిరాశ, నిస్పృహలు మన దరిదాపులకే రావు. ఈ మహాభాగ్యం పొందిన మనిషి ఇతరుల సహకారం, ప్రోత్సాహాలు లేకపోయినా ఒంటరిగానే యావవూత్పపంచాన్ని ఎదిరించగలడు. ఎలాంటి భయం, సంకోచం లేకుండా చెడుకు వ్యతిరేకంగా పోరాటం సాగించగలడు.
ఒక విషయాన్ని ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి. మంచికోసం చేసే ఏ పనీ వృథాపోదు. చెడు నిర్మూలనకోసం ‘మేం చేస్తున్న ఈ చిన్న ప్రయత్నాల వల్ల లాభం ఏమిటి?’ అంటారు కొందరు. కానీ ఇలా ఎన్నటికీ అనుకోకూడదు. ధర్మసంస్థాపన మార్గంలో కృషి ఎంత చిన్నదయినా సరే వృథాపోదు. ఇది అల్లాహ్ వాగ్దానం. దాని ప్రభావం కొంత కాలానికైనా సమాజం మీద కనబడుతుంది. ప్రభావం అనేది వెంటనే వ్యక్తం కావచ్చు లేదా కొంత కాలం తర్వాత అయినా కావచ్చు. మొత్తం మీద ఫలితం మాత్రం తప్పక ఉంటుంది. అల్లాహ్ దృష్టిలో సంకల్ప శుద్ధి అన్నింటికంటే విలువైంది. మన ప్రయత్నాల ఫలితం ఆయన అధీనంలో ఉంది. కాబట్టి సత్‌సంకల్పంతో చేసే ఏ ప్రయత్నమయినా వృథాపోదు.
పరలోకంలో లభించే పుణ్యఫలాన్ని దృష్టిలో పెట్టుకుంటే నిరాశానిస్పృహలకు ఆస్కారమే ఉండదు. నిజానికి ఏ మంచి పనిచేసినా దాని వెనుక మన ఉద్దేశం దైవ ప్రసన్నత, పరలోక సాఫల్యం పొందాలన్నదే. ప్రాపంచిక ఫలితాల దృష్ట్యా కూడా మనం, మన ప్రయత్నాలు వృథాపోవని, ఎప్పటికైనా అవి తమ ప్రభావాన్ని చూపగలవని విశ్వసించాలి. అందుకే దైవమార్గంలో అధైర్యపడకుండా కృషి చేయాలి. ఫలితాల గురించి ఆలోచించకుండా దైవమార్గంలో, మహావూపవక్త మహ్మద్ (స.అ.స) బోధనలు అనుసరిస్తూ మనం చేయగలిగిన పనుల్ని మనం చేస్తూనే పోవాలి. సమాజం నుంచి చెడు అంతమయినా, కాకపోయినా మన ప్రయత్నాన్ని విరమించకుండా మంచి కొరకు నిరంతరం కృషిచేస్తూ పోవాలి. తప్పక అల్లాహ్ కరుణించి ప్రపంచంలో, పరలోకంలో ఫలతాన్ని ప్రసాదిస్తాడు. ఎందుకంటే అల్లాహ్ అనంత కరుణామయుడు. అపార కృపాశీలుడు. ఆమీన్... సుమ్మా ఆమీన్...
- ఎం.డి.బాబర్‌ఖాన్, వలిగొండ,
నల్లగొండజిల్లా, 9849897589
Other News