ధన వ్యామోహం - ఇస్లాం
నేడు సమాజంలో దోపిడీ, దౌర్జన్యం, దగా, మోసం, అవినీతి అక్రమాలతో నిండి ఉన్నది. దానికిగాను తమకు తోచిన విధంగా రకరకాల పద్ధతులను అనుసరిస్తున్నారు. అసలీ చెడులకు మూల కారణం గురించి సమాజంలో ఒక అభివూపాయం ఉన్నది. ఆర్థికంగా వెనుకబాటు తనమే అని బలంగా ఉంది. విచ్చలవిడిగా డబ్బు సంపాదించాలని, సంపాదించిన డబ్బును కూడబెట్టడము, లేదా ఇష్టమొచ్చిన రీతిలో విచ్చలవిడిగా ఖర్చు చేయడం అనే తప్పుడు ఆలోచన సర్వసాధారణంగా సమాజంలో ప్రబలి ఉంది. డబ్బు పట్ల విపరీతమైన ప్రేమ, వ్యామోహం కలిగి ఉండటం అవసరానికి మించిన కోరికలను తీర్చుకోవడానికి డబ్బు ఖర్చు పెట్టడం సమాజం అంతటా ఉంది. ఈ రెండు దృక్పథాలతో మానవుడు చెడు దిక్కుగా వెళ్లి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ చెడు మానవుని మెదడులో దూరి వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరికను జనింపచేస్తుంది.
అది ఎంతగా అంటే ధర్మ అధర్మాలు, పాప పుణ్యాల గురించి ఆలోచింపనీయకుండా ఆర్థికంగా బలపడితేనే అన్నిబలపడతాయని భ్రమను కలిగిస్తుంది. ఆ చెడునే ఇస్లామిక్ పరిభాషలో ‘షైతాన్’ అంటారు. ఎక్కడైతే ఇది ప్రవేశించిందో అక్కడ నిజమైన ఆధ్యాత్మిక అభివృద్ధి కుంటుబడినట్లే. ఈ చెడు మార్గంలో మానవుని దగ్గరకు వచ్చే డబ్బు, అతని కోరికలకు బలం చేకూర్చుతుంది. భోగభాగ్యాలకు, పేరు ప్రఖ్యాతుల కోసం ఖర్చు చేయమని మనసుని పురమాయిస్తుంది. అంతేగానీ పుణ్య కార్యాలకు, నిరుపేదలకు, ధర్మ సంస్థలకు దానం చేయకుండా చెడు నిలువరిస్తుంది. అది ఎలాగంటే కష్టార్జితాన్ని అనవసరంగా తగపూట్టుకోకు అని, నీవు పేదలకు పంచినట్లయితే పేదవాడిపోతావని, నిన్ను ఆపద వచ్చినట్లయితే ఎవ్వరూ ఆదుకోరని, రోగమొచ్చినా, చివరికి ముసలివాళ్లయ్యాక డబ్బే కదా నిన్ను కాపాడగలిగేదని ఇటువంటి భయాలన్ని మానవుని మనసుల్లో జనిస్తాయి. ఇలా చెడు (షైతాన్) మనిషి మనసులో తిష్టవేసి కూర్చొని, ఆ మనిషి సమాజం పట్ల తన బాధ్యతను విస్మరించి డబ్బే ప్రధానమైనదిగా భావించి ప్రవర్తిస్తాడు.
ఈ ప్రమాదకరమైన ధోరణి గురించి అల్లాహ్ ఖురాన్‌లో హెచ్చరించాడు. షైతాన్ (చెడు) చర్యల పట్ల జాగ్రత్తగా ఉండండి. అది మీ మనసును చెడగొట్టడానికి అనుక్షణం మీ వెనకే కాచుకుని ఉంటుంది. డబ్బు కూడబెట్టకపోతే ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసి వస్తుందని రకరకాలుగా భయపెడుతుంది. అంతటితో ఊరుకోక విలాసవంతమైన జీవితం గడపడానికి, దుబారా ఖర్చు చేయడానికి కొత్త మార్గాలు మెదడులో జనిస్తాయి. షైతాన్ పంజాలో చిక్కుకున్న వాళ్లు విలాసాల కోసం వేల రూపాయలు ఖర్చు పెడతారు. కానీ నిరుపేదల ఆకలిని ఏమాత్రం పట్టించుకోరు. చెడు అనేది మనిషిలో ముఖ్యంగా దారిద్య్ర భయాన్ని కలిగిస్తుంది. అది ఎంతగా అంటే తమ సంతానాన్ని కూడా హతమార్చుకునేవారు (ఇస్లామ్‌కు పూర్వం). వారు తమ ఉపాధిలో పిల్లలు భాగతస్తులయితే తమకు లభించే సుఖ సంతోషాలు తరిగిపోతాయని, ఆర్థికంగా దెబ్బ తింటామని భావించేవారు. నేడు వాటి రూపురేఖలు మారాయి. భ్రూణహత్యల రూపంలో పిల్లలను చంపే కొత్త మార్గాలు వచ్చాయి.
ఇస్లాం ఇటువంటి చర్యలపట్ల కఠినమైన ఆదేశాలు రూపొందించింది. ఇస్లాం 1400 సంవత్సరాల క్రితమే ఇలాంటి చర్యలను నిషేధించింది. ఇస్లాంలో అల్లాహ్ మానవులకు మార్గదర్శి అయిన ఖురాన్ ద్వారా మహావూపవక్త (స.అ.స) ఆచరణల ద్వారా వివరించడం జరిగింది. మహావూపవక్త (స.అ.స) సమాజాన్ని ఉద్దేశించి ‘‘మీరు సంపాదించేదంతా ధర్మ సమ్మతమయి ఉండాలి. అలా కాకుండా ఇతరుల హక్కులను కాజేసిగానీ, మోసగించిగానీ సంపాదించినట్లయితే మీ ఒక్కరి ఖజానా నిండవచ్చు గానీ, సామూహిక శ్రేయస్సును, మొత్తం జాతి ప్రయోజనాలను ఈ వైఖరే హరించివేస్తుంది. అది ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుంది’’ అని బోధించారు.
అంతేకాకుండా ఒక జాతి ఆర్థిక వ్యవహారాల్లో ఈ పరిస్థితి ఉన్నంతవరకు దాని సమస్యలకు దొరకదని అన్నారు. ఒక సమస్యను పరిష్కరించబోతే కొత్త సమస్య పుట్టుకొస్తుందని, మంచి-చెడు, నీతి-అవినీతి అనే విషయాలను ఖాతరు చేయకుండా ప్రజలు విచ్చలవిడిగా ధనాన్ని సంపాదించడం ప్రారంభిస్తే మొత్తం ఆర్థిక వ్యవస్థే అస్థవ్యస్తమయి అనేక సామాజిక సమస్యలకు ఆలవాలమైపోతుందని గ్రహించాల్సి ఉన్నది.
ధనాన్ని సంపాదించే విషయంలో కాకుండా దాన్ని ఖర్చుపెట్టే విషయంలో కూడా ఇస్లాంలో అల్లాహ్ మనకు మార్గదర్శకత్వం చేశారు. సమాజంలో ప్రజల పరస్పర హక్కులేమిటి? ఎవరిపై ఎవరికి హక్కులున్నాయి? అనే స్పృహ గనుక ప్రజల్లో లేకపోతే శాసనబలంతో (షరియత్) సమానత్వం నెలకొల్పే ప్రయత్నాలు ఎన్ని చేసినా ఆర్థిక సమస్యలకు పరిష్కారం సాధ్యం కాదు. ఉదా : తీవ్రమైన జ్వరం వచ్చినప్పుడు మనిషి నుదుటిపై ఓ మంచుగడ్డ పెట్టి ఇక రోగం నయమయ్యిందని భావిస్తే... నిజంగానే జ్వరం పోతుందా?! అసలు మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉన్నది. నేడు పెద్ద పెద్ద ఆర్థికవేత్తలు నిపుణులు సమానత్వంతో సమస్యలు పరిష్కరించగలమని అనుకుంటారు. కానీ సాధ్యాసాధ్యాలను గమనించరు. ఇస్లాం మాత్రం ఇలాంటి సమస్యల పట్ల లోతుగానే చర్చించింది.
అసలు సమాజం పట్ల ప్రజల భాగస్వామ్యం పెంచాలని, వారిని నైతికంగా ఉన్నతంగా తీర్చిదిద్దాలని, ప్రతివ్యక్తి హృదయంలో ఇతరుల పట్ల ప్రేమ, సానుభూతి జనింపచేయాలని, ప్రేమ సానుభూతులకు ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకూడదని, ఇతరులకు మేలు చేయదలిస్తే నిస్వార్థ బుద్ధితో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చేయాలని బోధించింది. ఏ సమాజంలో అయితే ఇలాంటి మనస్తత్వం సర్వసాధారణం అవుతోంది ఆ సమాజంలో ఆర్థిక మస్య అనేది కనిపించదు. ఆ సమాజంలో సహాయం చేసేవాళ్లే గానీ, స్వీకరించేవాళ్లు మాత్రం చాలా తక్కువగా కనిపిస్తారు. ఇస్లాం మొదట్లో పరిపాలకులు (ఖలీఫాలు) ఈ విధానాన్ని ఆచరించి చూపారు. వారు తమకు సొంత ఆస్తులు మిగిల్చుకోకుండా పరిపాలన కొనసాగించారు. అదే విధంగా నాటి సమాజంలో ప్రజలు కూడా అదే విధంగా ఉండేవారు.
ఇలాంటి ఆలోచన వైఖరిని ప్రజలు, రాజకీయ పక్షాలు, అధికారులు సామూహికంగా అవలంబిస్తే మనకు సామూహిక ప్రయోజనాలు ప్రతిఫలిస్తాయి. వ్యక్తిగతంగా ఎవరైనా ఈ వైఖరిని అవలంబిస్తే అతను తప్పనిసరిగా ఇహపర లోకాలందు సుఖసంతోషాలు, స్వర్గ సౌఖ్యాలు అనుభవిస్తాడు. ఇటు ప్రాపంచిక జీవితంలోనూ అతనికి ఏ ధనికునికీ లభించని శాంతి, సంతృప్తి లభిస్తాయి. ఈ సహజమైన మౌళిక సూత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఆశిస్తూ... ఆమీన్.. సుమ్మా ఆమీన్...
- ఎం.డి. బాబర్‌ఖాన్, వలిగొండ,
నల్లగొండ జిల్లా. 9849897589
Other News