కంటి కిరణాలు.. ఈ చికిత్సలు
మత్తుమందు కూడా లేకుండా శరీర భాగాలను అవసరమైన చోట కోసేయడమే ఒకప్పటి సర్జరీ... మరిప్పుడు.. సర్జరీ చేస్తున్నట్టు కూడా తెలియకుండా ఓ అర్ధగంటలో ఆపరేషన్ ముగించేయవచ్చు. లోపలి భాగాలను తెలుసుకోవడానికి ఎక్స్‌రేలే ఒకప్పటి ఆధారం.. ఇప్పుడు.. రకరకాల స్కాన్‌లు.. కంటిచూపు కోసం సోడాబుడ్డి కళ్లద్దాల నుంచి లేసిక్ ట్రీట్‌మెంట్స్ వరకు ఎన్నెన్నో మజిలీలు. ఇలాంటి ఎన్నో ఆధునిక వైద్యాల వెనుక ఉన్నది.. టెక్నాలజీ. ఒక వైద్య రంగంలోనే కాదు.. చీకట్లో దీపం వెలిగించుకుని పనులు చేసుకునే కాలం నుంచి లేజర్ కాంతుల మిల మిలల వరకు.. గ్రామ్‌ఫోన్ రికార్డుల నుంచి ఎంపీత్రీ ప్లేయర్ల వరకు... భూతద్దాల నుంచి మైక్రోస్కోపుల వరకు... టెక్నాలజీ అందించిన సౌకర్యాలు అన్నీ ఇన్నీ కాదు. కంటికి సంబంధించిన చికిత్సల్లో ఈ సాంకేతిక నైపుణ్యం అందించిన విజయాల అడుగులు...
19వ శతాబ్ద కాలం...
ఒక వ్యక్తి మంచం మీద వెల్లకిలా పడుకుని ఉన్నాడు.. తలకు ఇరుపక్కల రెండు ఇసుక సంచులు.. ఎటూ కదలలేని స్థితి. అతడు పక్షవాత రోగి కాదు.. కంటికి శస్త్రచికిత్స చేయించుకున్న శుక్లాల పేషెంట్.
20వ శతాబ్దపుతొలి రోజులు..
సోడాబుడ్డి కళ్లద్దాలతో వృద్ధులు అవస్థలు పడుతున్నారు. కళ్లద్దాలు ఉండడం వల్ల పెళ్లి కుదరని కన్నెపిల్లలు.. సరైన మందులు లేక కంటిరోగులు...
మరిప్పుడు...
ఎటువంటి కంటిజబ్బైనా సమస్యల్లేవ్. కళ్లద్దాలు లేకుండా అన్ని పనులూ చకచకా చేసుకోవచ్చు. చత్వారంతోనూ నో ప్రాబ్లం. శుక్లాలు.. నీటికాసులు.. మెల్లకన్ను.. మధుమేహం వల్ల వచ్చే రెటినోపతి.. సమస్య ఏదైనా సరే.. కంటిచూపును కాపాడుకోవడం మరింత సులభం. అందుబాటులో ఆధునిక చికిత్సలు.. ఆధునిక మందులు.. వెరసి కంటిజబ్బులపై అద్భుత విజయం. ఈ విజయం వెనుక ఉన్నది మాత్రం అద్భుతమైన సాంకేతిక నైపుణ్యమే. అడుగడుగునా జరుగుతున్న శాస్త్ర ఆవిష్కరణలే.
రెటినోపతి.. ఇదీ పురోగతి
మధుమేహం వల్ల శరీరంలోని అన్ని అవయవాలూ ప్రభావితం అవుతాయి. దీనికి కళ్లు మినహాయింపేమీ కాదు. నిజానికి షుగర్ వ్యాధిని కనిపెట్టడానికి సహాయపడే మొట్టమొదటి భాగాలు కళ్లే. రక్తంలో చక్కెరలు పెరగడం వల్ల రక్తనాళాలు దుష్ప్రభావానికి లోనవుతాయి. కంటిలో ఉండే రక్తనాళాలు కూడా అదేవిధంగా ప్రభావితం అవుతాయి. పెరిగిన చక్కెరలు రక్తనాళాల గోడలను దెబ్బతీస్తాయి. దాంతో నాళం చిట్లిపోయి రక్తం లీక్ అయి చూపు మసకబారుతుంది. రక్తనాళాలు దెబ్బతిన్నప్పుడు వాటికి ప్రత్యామ్నాయ రక్తనాళాలను తయారుచేస్తుంది మన శరీరం. కంటిలో దెబ్బతిన్న భాగాలు నియోవాస్కులర్ పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ పదార్థాలు కొత్త చిన్న చిన్న రక్తనాళాలు పుట్టుకురావడాన్ని ప్రేరేపిస్తాయి. అయితే ఈ రక్తనాళాలు చాలా బలహీనంగా ఉంటాయి. దగ్గినా, తుమ్మినా లీక్ అయ్యే అవకాశాలుంటాయి. దాంతో సమస్య మరింత జటిలం అవుతుంది.
1960వ దశకం వరకు డయాబెటిక్ రెటినోపతికి అసలు చికిత్సే లేదు. క్రయోపిక్సీ అని చేసేవాళ్లు గానీ అది అంతగా విజయవంతం కాలేదు. ఆ తరువాత గ్జినాన్ లేజర్ చికిత్స కొంత ఉపశమనం కలిగించింది. 1970వ దశకంలో వచ్చిన ఇంట్రా విట్రియల్ ఎవాస్టిడ్ మందులు, లేజర్ చికిత్సలు విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాయి. లేజర్ చికిత్స వచ్చేదాక ఓపెన్ సర్జరీ తప్పనిసరి అయ్యేది. కన్నుమొత్తం తెరిచి ఆపరేషన్ చేయాల్సి రావడంతో కోలుకోవడానికి కూడా నెలల కొద్దీ సమయం పట్టేది. నొప్పి బాధ ఒకటైతే... కన్ను ఎర్రగా మారడం, వాపు లాంటి సమస్యలూ ఉండేవి. ఇన్ని ఇబ్బందులున్నా సక్సెస్ రేటు కూడా యాభైశాతమే ఉండేది. ఇంట్రా విట్రియల్ ఎవాస్టిడ్ మందును ఇంజెక్షన్ ద్వారా రెటీనాలోకి పంపడం మరింత ఆధునిక చికిత్స. అదనంగా పుట్టుకొచ్చిన రక్తనాళాలను ఈ మందులు వెనక్కి పంపిస్తాయి. లేజర్ చికిత్సలో గ్జినాన్ లేజర్ తరువాత వచ్చింది గ్రీన్ లేజర్. ఇంజెక్షన్ తరువాత లేజర్ చేస్తే అతి త్వరగా పూర్తిగా రోగి కోలుకుంటాడు. అయితే ఎంత త్వరగా చికిత్స చేయించుకుంటే అంతగా చూపును కాపాడడానికి వీలవుతుంది. అందుకే షుగర్ ఉన్నవాళ్లు ప్రతి మూడు నెలలకు ఒకసారి కంటిపరీక్ష చేయించుకోవడం మంచిది.
శుక్లాలు.. ఇక మరింత ఈజీ
కంటిలోని లెన్సుపై ఏర్పడే తెల్లమచ్చలే శుక్లాలు. శుక్లం వల్ల దెబ్బతిన్న లెన్సును తీసేసి కొత్తది వేయడమే దీనికి చేసే సర్జరీ. ఒకప్పుడు శుక్లాలకు ఆపరేషన్ చేయించుకుంటే పదిహేనురోజులు మంచానికే అతుక్కుపోయి ఉండాల్సి వచ్చేది. కుట్లు కూడా ఉండేవి కావు. కోసిన భాగాలు సహజంగా వాటికవి అతుక్కోవాల్సిందే. వెల్లకిలా పడుకోబెట్టి తలకు రెండు పక్కల ఇసుక సంచులు పెట్టేవాళ్లు. చూపు వస్తే అదృష్టమే. ఆ తరువాత కుట్లు వేయడం వచ్చింది. దాంతో ఎప్పటికీ పడుకోనవసరం లేకుండా కూర్చోవడం సాధ్యమయింది. కానీ రికవరీకి మాత్రం కనీసం పదిహేను రోజులన్నా పట్టేది. 90వ దశకంలో అందుబాటులోకి వచ్చిన కీహోల్ సర్జరీ విప్లవాత్మకమైన మార్పును తెచ్చింది. కన్ను తెరిచే అవసరం లేకుండా చిన్న రంధ్రంతో చేసే ఈ సర్జరీలో కూడా మెరుగైన చికిత్సపూన్నో వచ్చాయి.
మొట్టమొదట 5 మిల్లీమీటర్ల రంధ్రంతో మొదలైన ఈ సర్జరీ క్రమంగా 3 మి.మీ., 2.8 మి.మీ., 1.8 మి.మీ. వరకు వచ్చింది. ఇప్పుడు 1 మి.మీ. రంధ్రంతోనే చికిత్స చేయగలుగుతున్నారు. ఈ సర్జరీలో చిన్న రంధ్రం ద్వారా ఒక ప్రోబ్‌ను పంపిస్తారు. ఇది కంపనం చెందుతూ ఉంటుంది. దీని సహాయంతో పాడయిపోయిన లెన్సును తొలగించివేస్తారు. చేత్తో ప్రోబ్‌ని పట్టుకుని ఆ లెన్సును తీసి కన్నును శుభ్రం చేస్తారు. ఫేకో పరికరం ద్వారా ఈ సర్జరీ చేసేవాళ్లు. ఇటీవలే వచ్చిన మరింత ఆధునిక పద్ధతి ఫెమ్టోసెకండ్ లేజర్. దీని ద్వారా శుక్లాల ఆపరేషన్ మరింత సులువైంది. ఇక్కడ చేత్తో ప్రోబ్‌ను పట్టుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం కంప్యూటరే చూసుకుంటుంది. ఒక రకంగా దీన్ని రోబోటిక్ సర్జరీగా చెప్పవచ్చు. 2010లో అందుబాటులోకి వచ్చిన ఈ లేజర్ కాటరాక్ట్ చికిత్స అటు డాక్టర్లకు సర్జరీ సులువు చేయడమే కాదు.. పేషెంట్లకూ మరింత సమర్థవంతమైన వైద్యాన్ని అందిస్తుంది. ఈ సర్జరీలో ఆపరేషన్ థియేటర్‌కి కూడా వెళ్లకముందే చిన్న రంధ్రాలతో కన్ను లోపలి లెన్సును పగులగొడతారు. తరువాత థియేటర్‌లోకి వెళ్లిన తరువాత పగిలిన లెన్సును తీసేసి కొత్త లెన్సు వేస్తారు.
వైద్యచికిత్సల్లో ఉపయోగించినంత మాత్రాన లేజర్ అనేది సురక్షితమైనది అని అనుకోవడానికి లేదు. అందువల్ల లేజర్ చికిత్స నిపుణులైన వైద్యుడు మాత్రమే చేయాలి. లేకుంటే అసలుకే ఎసరు రావచ్చు. కార్నియా మందం 500 మైక్రాన్ల కన్నా తక్కువ ఉంటే లేజర్ చికిత్స చేయడానికి వీలుపడదు. చేత్తో చేస్తే చిన్న చిన్న లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇది పూర్తి కంప్యూటర్ ఆధారిత చికిత్స కాబట్టి ఎటువంటి లోపాలు లేకుండా కచ్చితమైన చికిత్స అందించవచ్చు.
కళ్లజోడుకు సెలవ్..
కంటిచికిత్సల్లో ప్రత్యేకంగా చెప్పుకోదగిన లేజర్ చికిత్స దృష్టిదోషాలను సరిచేసే జైయాప్టిక్స్. కార్నియా పైన ఉండే మచ్చలు, లోపాలను సవరించడానికి ఒకప్పుడు ‘రేడియల్ కెరటెక్టమీ’ ద్వారా చికిత్స అందించేవాళ్లు. ఈ పద్ధతిలో కార్నియా పైన రేడియల్‌గా గాట్లు పెడతారు. కానీ దీనివల్ల లోపాలను పూర్తిగా కనుక్కోలేం. గాట్లు పెట్టడం వల్ల ఇన్‌ఫెక్షన్లూ రావచ్చు. ఈ అవరోధాలను అధిగమింపజేసింది లేజర్ చికిత్స. కంప్యూటర్‌తో చేసే ఈ చికిత్స ద్వారా లోపాలను కచ్చితంగా తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఆ తరువాత ఎక్సైమర్ లేజర్‌ను ఉపయోగించి చేసే ఫొటోరివూపాక్టివ్ కెరటెక్టమీ బాగానే ఉన్నా ఎక్కువ పవర్ ఉన్న దృష్టిలోపాలను సవరించడంలో విఫలమైంది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన అత్యంత ఆధునిక చికిత్స లేసిక్. దీనిద్వారా స్పష్టమైన ప్రతిబింబాలు ఏర్పడతాయి. ఈ పద్ధతి ద్వారా రెండు హీనీ లేజర్ కిరణాలను కంటిలోకి పంపిస్తాయి.
ఇవి ఒకదానికొకటి ఏటవాలుగా, సమాంతరంగా ప్రయాణించి రెటీనా ప్రాంతంలో కలుసుకుని కాంతిని పుట్టిస్తాయి. ఈ కాంతి కిరణాలు రెటీనా నుంచి కార్నియా వైపుగా కంటి బయటకు వెళ్తాయి. ఈ క్రమంలో కార్నియా పైన ఉండే మచ్చలు, ఇతర లోపాలను ప్రతిబింబ రూపంలో చూపిస్తాయి. కాబట్టి ఎక్కడ ఏ లోపం ఉన్నా ఇట్టే తెలిసిపోతుంది. ఈ హీనీ లేజర్ కాంతి పుంజాలను లెన్స్‌పూట్స్ అనే అతి చిన్న అల్ట్రామైక్షికోస్కోపిక్ కెమరాలు గ్రహిస్తాయి. ఇవి కిరణాల తీవ్రతను విశ్లేషించి వాటి లోపాలను సరిచేస్తాయి.
గ్లకోమా.. అయినా ధీమా!
కంటి లోపల ఉండే ద్రవాలకు కొంత పీడనం ఉంటుంది. ఈ పీడనం 21 మి.మీ. మెర్క్యురీ కన్నా ఎక్కువైతే ఆ ఒత్తిడి కంటి నరంపై పడుతుంది. ఫలితంగా నరం దెబ్బతిని చూపు తగ్గిపోతూ ఉంటుంది. దీన్నే గ్లకోమా లేదా నీటికాసులు అంటారు. ఏ వయసులోనైనా ఇది రావచ్చు. ఈ పీడనాన్ని తగ్గించడానికి రకరకాల కంటి చుక్కల మందులు అందుబాటులో ఉన్నాయి. పెరిగే పీడనాన్ని బట్టి వాడాల్సిన మందుల సంఖ్య పెరుగుతుంది. ఎన్ని మందులు వాడినా తగ్గకుంటే లేజర్ ద్వారా ఎక్కువైన ద్రవాన్ని తీసేస్తారు. తెలుపు నలుపు కనుగుడ్లు కలిసేచోట నుంచి పంపించే లేజర్ ఈ అదనపు ద్రవాన్ని తెల్లగుడ్డు పొరల్లోకి వెళ్లేలా చేస్తుంది. లేజర్ చికిత్స కూడా పనిచేయకుంటే సర్జరీ చేయాలి. దీన్నే డ్రైనేజీ ఆపరేషన్ అంటారు. దీని ద్వారా కంటి లోపల్నుంచి తెల్లగుడ్డు పొరల్లోకి స్టెంట్ లాంటి దాన్ని అమరుస్తారు. దీన్ని షంట్ అంటారు. పీడనం పెరిగినప్పుడు ఈ షంట్ తెరుచుకుంటుంది. ద్రవం వెళ్లిపోగానే వెంటనే మూసుకుంటుంది.
ఈ దారి ఒకవైపే ఉంటుంది కాబట్టి ఒకసారి అటువైపు వెళ్లిన ద్రవం మళ్లీ ఇటువైపు రాలేదు. కంటి పరీక్షలు, చికిత్సల గురించి అవగాహన ఉండి, సకాలంలో వస్తే తప్ప ఎన్ని ఆధునిక చికిత్సలున్నా ఏమీ చేయలేం. సైన్సు ఎన్నో ఆధునిక చికిత్సలను అందుబాటులోకి తెచ్చింది. అయితే వాటిని సరిగ్గా సకాలంలో వినియోగించుకోగలిగితేనే వాటివల్ల ఉపయోగం.
Other News