కీళ్ల మార్పిడి మాంత్రికుడు
తండ్రి సుప్రీంకోర్టు జడ్జి అయినా ఆ పిల్ల జమిందారు కళ్లలో ఎటువంటి దర్పం కనిపించదు. పుట్టింది జమిందారీ కుటుంబం.. కానీ పేద రోగుల నొప్పులను సైతం తనవిగా ఫీలవుతారాయన. ఎదురుగా ఉన్నది రోజు కూలీ చేసుకునే పేదరోగి అయినా.. కోట్లతో సహవాసం చేసే వ్యక్తి అయినా.. ఆయనకు పేషెంటు మాత్రమే కనిపిస్తాడు. తను అందించాల్సిన చికిత్స పైనే మనసు ఉంటుంది. ఏడు పదులు దాటినా కీళ్లను చకచకా మార్చేస్తారు. అలవోకగా కృత్రిమ కీళ్లను అమర్చేస్తారు. కీళ్లవ్యాధులకు టెర్రర్‌గా, నిరంతరం రోగులు.. కీళ్లు తప్ప మరో ధ్యాస లేని ఆయనే డాక్టర్ జయరాంచందర్ పింగిళి. సంపన్నుల ఇళ్లల్లో మూలుగుతున్న సంపదను పేదవూపజల ఆరోగ్యానికి వెచ్చించాలంటున్న డాక్టర్ జయరాంచందర్‌తో మాట.. ముచ్చట.
‘ఈ చేత్తో లక్ష పైనే ఆపరేషన్లు చేశాను. ఆరోజు నా కెరీర్‌లో మరిచిపోలేని రోజు. హడావుడిగా ఒక పేషెంట్‌ను తీసుకొచ్చారు. చాలా అర్జెంట్‌గా చూడాలంటే ఏ యాక్సిడెంటో అయ్యిందా ఏంటని కంగారుగా వెళ్లాను. ఆ పేషెంట్‌ను చూసి డాక్టర్‌నైన నాకే మనసంతా ఏదోలా అయిపోయింది. పద్దెనిమిదేళ్ల అమ్మాయి, లేచి నిలబడలేకపోతోంది. ఒక్క కీలు కూడా కదల్చలేకపోతోంది. కదలలేని ఆ అమ్మాయిని స్ట్రెచర్‌లో ఆసుపవూతికి చేర్చారు. కారణం భయంకరమైన కీళ్ల వ్యాధి ‘రుమటాయిడ్ ఆర్థరైటిస్’. చేతి వేళ్లలోని చిన్నచిన్న కీళ్ల నుంచి మోకాలు, తుంటి వంటి పెద్దపెద్ద కీళ్ల వరకు అన్ని కీళ్లను వ్యాధి కబళించి వేసింది. ‘డాక్టర్ నా బిడ్డ నడిచే అవకాశం లేదా..? తనకు పెళ్లి ఎలా అవుతుంది..? మేము పోయాక ఎవరు చూసుకుంటారు..? ఏదైనా చేసి నా బిడ్డ నడిచేలా చేయండి....’ తల్లిదండ్రుల ఆవేదన షాక్‌లో ఉన్న నాలో చురుకుదనాన్ని తెచ్చాయి. వెను చికిత్స ప్రారంభించాను.
సాధారణంగా ఏ తుంటి కీలో, మోకాలి కీలో మార్చి కొత్తది కృత్రిమంగా తయారుచేసిన కీలు అమరుస్తాం. ఈ అమ్మాయికి ప్రతీ కీలు మార్చాలి. ఆపరేషన్ విజయవంతం అవుతుందా లేదా అన్న ఆందోళనలో ఉన్న తల్లిదంవూడులకు ధైర్యం చెప్పి, అన్ని కీళ్లు మార్చాను. స్ట్రెచర్‌పై ఆసుపవూతికి వచ్చిన ఆ అమ్మాయి కొద్దిరోజుల్లోనే నడుచుకుంటూ ఇంటికి వెళ్లగలిగింది. ఆ అమ్మాయి వేసే ప్రతి అడుగూ నాలో ఒకింత గర్వాన్ని, సంతోషాన్ని నింపింది....’ అంటూ తన అనుభవాలు గుర్తుచేసుకున్నారు డాక్టర్ జయరాంచందర్ పింగిళి. ఈ ఒక్క పేషెంటే కాదు.. కాళ్లు కదల్చలేక, వీల్‌చెయిర్‌లో వచ్చినవాళ్లు అలా నడిచి వెళుతూ రాల్చే ఆనందబాష్పాలే తనకు మంచి ముత్యాల్లా అనిపిస్తాయంటారాయన. చికిత్స విజయవంతం అయినప్పుడు కలిగే ఆనందాన్ని ఏ సంపదతోనూ పోల్చలేం. నేను ఎంతో డబ్బు సంపాదించి ఉండొచ్చు. కానీ అది సుఖాన్ని మాత్రమే ఇస్తుంది. సక్సెస్ అయిన ఆపరేషన్ మాత్రం సంతోషాన్నిస్తుందంటారు డాక్టర్ జయరాంచందర్.
మొదటి డాక్టర్..
నిజాం కాలంలో సుప్రీం కోర్టు జడ్జిగా పనిచేసిన పింగిళి జగన్మోహన్ రెడ్డి, రుక్మిణిలకు 1941లో పుట్టిన డాక్టర్ జయరాం చదువంతా దాదాపుగా హైదరాబాద్‌లోనే సాగింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్య, నిజాం కాలేజిలో ఇంటర్.. తరువాత జీవశాస్త్రం మీద ఉన్న ఆసక్తి ఆయన్ని ఉస్మానియా మెడికల్ కాలేజికి పంపించింది. అప్పటివరకు పింగిళి వంశంలోనే వైద్యుపూవరూ లేరు. అలా మొట్టమొదటి డాక్టర్ అయ్యారు. అంతేకాదు సోదరి కూడా వైద్యవిద్యను అభ్యసించేందుకు స్ఫూర్తిగా నిలిచారు. కొడుక్కి తన ఆర్థోపెడిక్ వైద్యాన్నే వారసత్వంగా ఇచ్చారు. డాక్టర్ జయరాంచందర్ పింగిళి 1965లో హౌస్ సర్జన్ పూర్తి చేసిన తర్వాత పైచదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్లారు. దాదాపు 7 సంవత్సరాలపాటు లండన్, స్కాట్ లాండ్‌లలో తన సేవలు అందించడమే కాదు, జాయింట్ రీప్లేస్‌మెంట్‌లో శిక్షణ కూడా పొందారు. ఆర్థోపెడిక్స్ ఎంచుకోవడానికి తనకు స్ఫూర్తినిచ్చింది మాత్రం తమ గురువు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రంగాడ్డి అని అంటారు డాక్టర్ జయరాంచందర్. 1972లో మాతృదేశానికి తిరిగి వచ్చారు. నిజాం ఇనిస్టిట్యూట్‌లో మళ్లీ తన గురువు డాక్టర్ రంగారావు దగ్గరే చేరారు.
ఇండియా తిరిగి వచ్చాక 1976 లో మొదటి తుంటి కీలు రీ ప్లేస్‌మెంట్ సర్జరీ చేశారు. దీనికి సంబంధించి ఆయన సమర్పించిన పేపర్‌కు ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ వారు గుంటూరులో గోల్డ్ మెడల్ ఇచ్చారు. కీహోల్ సర్జరీ వచ్చే వరకు సర్జరీ అనేది చాలా సంక్టిష్టమైన ప్రక్రియ. ఆంధ్రవూపదేశ్‌లో ఆర్థ్రోస్కోపీని పరిచయం చేసింది కూడా డాక్టర్ జయరాం పింగిళినే. 1984లో వెన్నెముక వంగిపోయి గూని సరిచేసే సర్జరీ కూడా నిర్వహించారు. 1989లో మొదటిసారి సిమెంట్ లేకుండా హిప్ రీప్లేస్‌మెంట్ కూడా చేశారు.
నిత్య విద్యార్థి
వైద్యరంగం నిత్యనూతనమైంది. కొత్త కొత్త పరిశోధనలు, అధ్యయనాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. జబ్బులను మట్టుబెట్టాలంటే వైద్యరంగంలో నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉండాలి. వైద్యరంగ ప్రతినిధులైన డాక్టరుల ఈ పరిశోధనాంశాల స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోకపోతే నూతన చికిత్సలు అందించడం కష్టం. అందువల్ల డాక్టర్లు నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలని అంటారు డాక్టర్ జయరాంచందర్. శరవేగంతో అభివృద్ధి చెందుతున్న వైద్యరంగ పరిజ్ఞానం పట్ల అవగాహన లేకపోతే డాక్టర్‌గా వెనుకబడి పోవడమే కాదు తన వద్దకు వచ్చే వారికి అందించే సేవల్లో కూడా నాణ్యత తగ్గుతుందంటారాయన.
లక్షకు పైగా సర్జరీలు చేసినప్పటికీ ఇక అనుభవం వచ్చింది కదా అని వెనక్కి తగ్గడం నాకు ఇష్టం ఉండదు. ఇప్పటికీ కొత్త పరిజ్ఞానం గురించి జరిగే సెమినార్లకు హాజరవుతుంటానంటారు డాక్టర్ జయరాంచందర్. జనసామాన్యంలో చాలా మందికి వారికి వచ్చిన జబ్బుల పట్ల సరియైన అవగాహన ఉండటం లేదు. ముఖ్యంగా ఆర్థోపెడిక్ సమస్యలకు సంబంధించిన అవగాహన అసలు లేకపోవడం వల్ల చాలా మంది వ్యాధి ఎంతో ముదిరిపోయాక గానీ వైద్యులను సంప్రదించడం లేదు. అందువల్ల చాలా సులభంగా చికిత్స చేయగలిగే సందర్భాల్లో సైతం సమస్య క్లిష్టతరమౌతోందంటారు బాధగా. ఆర్థోపెడిక్ విభాగంలో అభివృద్ధి చాలా వేగంగా జరుగుతోందని ఆయన అన్నారు. స్టెమ్ సెల్ థెరపీ పరిశోధనలు వయసు తక్కువగా ఉన్న వారిలో కీలులో ఉండే కార్టిలేజ్ సమస్యలు ఏర్పడినపుడు కార్టిలేజ్ తిరిగి తయారు చేసే దిశగా సాగుతున్నాయి. ఆ పరిశోధనలు త్వరగా పూర్తయి చికిత్సలు త్వరలో అందుబాటులోకి వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
కార్పోరేట్ ఆసుపవూతులు లేని రోజుల్లో ఆధునిక వైద్య విధానాలు చాలా వరకు జన సామాన్యానికి అందుబాటులో లేవు. కానీ ఇప్పుడు ఇండియా ఆసియాలోనే ఒక హెల్త్ హబ్‌గా రూపుదిద్దుకుంటోంది. ‘కార్పొరేట్ వైద్యం కొంత ఖర్చుతో కూడుకున్నదే! ఎందుకంటే ఇక్కడ వాడే యంత్రసామాగ్రి చాలా ఖరీదైనదీ... నాణ్యమైనది కూడా’ అని చెప్తారు డాక్టర్ జయరాంచందర్. ఇది వరకు ఇటువంటి యంత్రాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉండేది. చాలా ఎక్కువ పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం పన్నుల విధానాన్ని సులభతరం చేయడం వల్ల ఎక్కువ మందికి నాణ్యమైన వైద్యం అందించడం సాధ్యమవుతోంది. ‘ఖర్చు భరించలేని వారి కోసం ఆరోగ్య శ్రీ వంటి పథకాలను అమలులోకి తేవడం అభినందనీయం. పేదలకు సైతం మంచి వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చినందుకు మాత్రమే కాదు, కస్టమ్స్ విధానాన్ని సులభం చేసినందుకు కూడా మనం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి’ అని అంటారు ఆయన. ‘కానీ ప్రభుత్వ ఆసుపవూతుల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించగలిగితేనే ఎక్కువ లాభం. ఎందుకంటే అక్కడ చాలా మంది యువ సర్జన్లు ఉంటారు. వారికి వృత్తి పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఎక్కువ మంది రోగులకు వారు సేవలు అందించ గలుగుతారు. అలాంటి వారిని ప్రోత్సహించాలని సూచించారు డాక్టర్ జయరాంచందర్.
నమ్మకం ముఖ్యం
ఇది వరకు డాక్టర్లను నడిచే దేవుళ్లుగా చూసేవారు జనం. కానీ ఈ రోజుల్లో డాక్టర్, పేషంట్ సంబంధంలో ఒక చిన్న అపనమ్మకం ఉంటోంది. డాక్టర్ల సేవలను కూడా ఇప్పుడు వినియోగదారుల హక్కుల కిందకి చేర్చారు. అది నిజానికి చాలా మంచి ఉద్దేశ్యంతో ఏర్పరిచిన చట్టం కానీ ఎక్కువ సందర్భాల్లో అది దుర్వినియోగం కావడం వల్ల మెడికోలీగల్ సమస్యలు చాలా తరచుగా కనిపిస్తున్నాయంటారు డాక్టర్ జయరాం పింగిళి. ‘ఈరోజుల్లో డాక్టర్లు పేషెంట్లతో ఎక్కువ సమయం వెచ్చించలేకపోతున్నారన్నది నిజమే. అయితే అదేవిధంగా డాక్టర్‌కు ఇవ్వడానికి పేషెంట్ దగ్గర కూడా కనీసం 15 నిమిషాల సమయం ఉండటం లేదు. అందరి జీవితాలు వేగవంతమై పోయాయి. అదీ కాక డాక్టర్లు పేషెంట్ కు వారి సమస్య గురించి కూలంకషంగా మాట్లాడి పూర్తి అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అనవసరంగా ఈ పరీక్షలు చేయిస్తారన్న అపవాదు కూడా ఇప్పటి డాక్టర్లు మోయాల్సి వస్తోంది. కారణం కొంత మంది పేషంట్లు చిన్న నొప్పికే ఎక్కువగా ఆందోళన చెందుతారు, అపోహ పడుతారు. వారి అపోహ నిజం కాదని వారికి రుజువు చేయడానికి, నమ్మకం కలిగించడానికి కూడా కొన్ని సార్లు పరీక్షలు చేయించాల్సి వస్తోంది. అలాంటి సందర్భాల్లో అనవసరపు పరీక్షలు చేయించారన్న అపవూపథ తప్పదు’ అంటారాయన. ఏది ఏమైనా పేషెంట్, డాక్టర్ల మధ్య నమ్మకం చాలా ప్రధానమని, అది చాలా సందర్భాల్లో ప్రాణాలను కూడా నిలబెడుతుందని అంటారు డాక్టర్ పింగిళి.
అన్నింటికీ ఒకే పరిష్కారం
‘ఒక్క మైలు రోడ్డు వేయడంలో జరిగే అవినీతిని నిరోధించి, ఆ డబ్బును ప్రజల ఆరోగ్యం కోసం ఖర్చుపెడితే చాలు.. చాలావరకు రాష్ట్రాన్ని ఆరోగ్యవంతం చేయొచ్చు.’ ఓ సందర్భంలో నిజాయితీపరుడైన ఒక రాజకీయనాయకుడు అన్న మాటలివి. ఈ మాటలతో ఏకీభవిస్తానంటారు డాక్టర్ జయరాం. కొన్ని వేల కోట్ల డబ్బు అక్రమ ఆస్తుల రూపంలో దుర్వినియోగం అవుతోంది. ఎక్కడ, ఏ రంగంలో చూసినా కుంభకోణాలు.. అవినీతి స్కామ్‌లూ... ఇలాంటివాళ్ల ఇనప్పెట్టెల్లో ఉన్న నల్లడబ్బులో కొంత భాగాన్ని పేద ప్రజల ఆరోగ్యం కోసం వినియోగించినా చాలు. పేదప్రజలకు ఉచితంగా వైద్యసేవలందించవచ్చు. బడ్జెట్‌లో ఆరోగ్యరంగం కోసం కేటాయించే మొత్తాన్ని పెంచాలి. దేశం దాటిపోతున్న సంపదను కాపాడి ప్రభుత్వ ఆసుపవూతుల పునరుద్ధరణ కోసం వినియోగించాలి. ఇలాంటివి అమలుపరచగలిగితే.. ఎక్కడా.. ఏ మారుమూల పల్లెల్లో సైతం డబ్బు లేకపోవడం వల్ల వైద్యం అందక ఎవరూ ప్రాణాలు కోల్పోరు. మురికివాడల జీవితాలను సైతం ఆరోగ్యం ఆనందమయం చేస్తుందంటూ సూచనలందించారు డాక్టర్ జయరాంచందర్ పింగిళి.
- భవాని దేవినేని
ఫొటోలు: ఆనంద్
Other News