చైతన్య నెల్లి, ప్రకృతి జంటగా బ్రహ్మానందం టైటిల్ పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘గజదొంగ’. భవాని మూవీస్ పతాకంపై యు. శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆర్.ఎస్. సురేష్ దర్శకుడు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తొలిషెడ్యూల్ జరుపుకుంటున్న ఈ చిత్రం విశేషాలను దర్శకుడు తెలియజేస్తూ ‘కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్ర చుట్టే కథ నడుస్తుంది. ఈ నెల 23 నుంచి హైదరాబాద్‌లో హీరో, హీరోయిన్, ఇతర ముఖ్యతారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. ఈ నెల 5 వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. ఈ నెల 10నుంచి మరో షెడ్యూల్ ప్రారంభిస్తాం. ముళ్లపూడి రచనలంటే ఇష్టపడే కథానాయకుడు అనుకోకుండా ఓ అమ్మాయి ప్రేమలోపడతాడు. వారి ప్రేమకు ఓ గజదొంగ ఎలా సహకరించాడన్నదే ఈ చిత్రంలో ఆసక్తికరం’ అన్నారు. ‘రెండున్నర గంటల పాటు ప్రేక్షకులని ఎంటర్‌టైన్ చేసే సినిమా ఇది’ అన్నారు. అలీ, జీవా, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, చిత్రం శ్రీను, కొండవలస, తాగుబోతు రమేష్, ధన్‌రాజ్, శివన్నారాయణ, రాజ్యలక్ష్మి, లక్ష్మి, ప్రియ, మధుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: శ్రీనివాస్.డి, మాటలు: మరుధూరి రాజా, రచనా సహకారం: నరేంద్ర, సంగీతం: ఆది, కెమెరా: రాహుల్, ఎడిటింగ్: ఉపేంద్ర, ఆర్ట్: గోవింద్, సహ నిర్మాత: బొడ్డు నాగేశ్వరరావు.
| |
|