జె.డి.చక్రవర్తితో సంభాషిస్తే ఆయన మాటల్లో సునిశితమైన హాస్యంతో పాటు కాస్త వ్యంగ్యం తొణికిసలాడుతుంది. ఏదీ దాచుకోకుండా ఉన్నదున్నట్లు చెప్పడం తన మనస్తత్వమని చెబుతారాయన. ‘హోమం’ ‘సిద్ధం’...గత ఏడాది ‘మనీ మనీ మోర్ మనీ’ తర్వాత తెలుగులో ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆల్ ది బెస్ట్’ నేడు ప్రేక్షకులముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఆయన చెప్పిన సంగతులివి..
ఇంతకి ‘ఆల్ ది బెస్ట్’ ఎవరికి చెబుతున్నారు?
సినిమా విడుదలవుతుంది కాబట్టి వాస్తవానికి అందరూ నాకు ఆల్ ది బెస్ట్ చెప్పాలి. ఇక కథాపరంగా ఈ చిత్రంలో 63 పాత్రలుంటాయి. ఇందులో ఎవరికి ఎవరు ఎందుకోసం ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నారన్నదే సినిమాలో ఆసక్తికరమైన అంశం. ఇన్ని రోజులు కథను కాకుండా కథనాన్ని నమ్మి సినిమాలు తీశాను. మొదటిసారిగా నేను ‘కథ’ను నమ్మి తీసిన చిత్రమిది.
అసలు చిత్ర ఇతివృత్తమేమిటి?
ఇందులో నా పాత్రపేరు చందు. శ్రీకాంత్ పాత్ర పేరు రవి. చందు మాటల గారడీతో డబ్బులు సంపాదిస్తూ జీవితాన్ని అనుకున్న రీతిలో ఎంజాయ్ చేస్తుంటాడు. అదే సమయంలో ఆనారోగ్యం పాలైన తన నాన్న వైద్యానికయ్యే డబ్బుల్ని సంపాదించడం కోసం రవి సిటీకి వస్తాడు. ఇద్దరూ ఓ సందర్భంలో కలుసుకుంటారు. వారిద్దరూ మంచి స్నేహితులుగా మారినా ఒకరిపై ఒకరు పై ఎత్తులు వేసుకుంటుంటారు. వారిద్దరి మధ్య ఆ గేమ్ ఏంటనేదే సస్పెన్స్‌గా వుంటుంది. మా ఇద్దరి నడుమ 63 పాత్రలు అల్లుకొని వుంటాయి. ఈ చిత్రంలో లవ్‌స్టోరీ వుంది..కానీ చూసేవాళ్లకు లవ్‌స్టోరీలా అనిపించదు. అసలు సినిమాలో ఏదైతే చూస్తున్నామో అది నిజం కాదు. ఈ విషయాలన్నీ సినిమా చూస్తే మీకే అర్థమవుతాయి.
మళ్లీ హిందీలో దర్శకత్వం ఎప్పుడు?
హిందీలో ఓ త్రీడీ సినిమాకు దర్శకత్వం చేయబోతున్నాను. హిందీ, తెలుగు భాషల్లో నిర్మాణం వుంటుంది. దీంతో పాటు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘భూత్’ సీక్వెల్‌లో హీరోగా నటిస్తున్నాను. ఈ చిత్రం కూడా త్రీడీలో నిర్మాణం అవుతోంది.
హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్నారు కదా...ఎక్కువగా ఏ భాషకు ప్రాధాన్యం ఇస్తారు?
అన్ని భాషల్లో అవకాశాలు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నాను. విశాల్‌తో ఓ చిత్రంతో పాటు కె.వి.ఆనంద్ శిష్యుడి దర్శకత్వంలో ‘కట్రై’ అనే చిత్రాన్ని చేస్తున్నాను. దీంతో పాటు మమ్ముట్టితో కలసి మళయాలంలో ఓ సినిమా చేస్తున్నాను.
‘శివ’ దగ్గరి నుంచి మీ అప్పీరియన్స్‌లో పెద్దగా మార్పులు రాలేదు. ఆ రహస్యమేమిటి?
నిజం చెప్పనా..పెళ్లి చేసుకోకపోవడమే.! అయితే నేను పెళ్లికి వ్యతిరేకం కాదు. పెళ్లంటే నాకు గౌరవముంది. నేను పెళ్లి చేసుకోకపోవడానికి ప్రత్యేక కారణాలేవీ లేవు. అలా జరిగిపోయిందంతే!
| |
|
![]() |
|