Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Sunday, May 19, 2013
 


Home >>
వో సుబహ్ కభీ థో ఆయేగీ...!?

దాదాపు నూటా పదిహేనేళ్ల క్రితం ఒక ఆదివాసీ యువకుడు అప్పటి బ్రిటీష్ పాలకులకు ముచ్చెమటలు పట్టించాడు. అప్పటికి సరిగ్గా ఇరవైయ్యేళ్లు కూడా నిండని ఆ యువకుడు ‘ఈ అడవి మాది, అడవి మీద సర్వహక్కులు మావే’ అని నినదించాడు. ఆ నినాదం అడవి బిడ్డల్ని మేల్కొలపడమే కాదు, అప్పటి వలస పాలకులకు నిద్రలేకుండా చేసింది. తమ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు సాగిస్తోన్న దోపిడీని, మతం పేరుతో మాయ చేస్తోన్న మిషనరీలను తరిమికొట్టాలని అతను నిర్ణయించుకున్నాడు. ఆదివాసుల గుండెల్లో ఆత్మగౌరవ జ్యోతిని వెలిగించాడు. ఒక నూతన సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించి భూమినీ, అడవినీ కాపాడుకోవాలని కర్తవ్య బోధ చేశాడు. సంఘం పెట్టాడు.

గుట్టకొకరు, పుట్టకొకరుగా ఉన్న గిరిజన తెగలను సంఘటిత పరిచాడు. కేవలం నాలుగైదేళ్లలో నే యావత్ ఆదివాసీ జాతులకు అతనొక ఆరాధ్య దైవమైపోయాడు. ప్రభు త్వం బెంబేపూత్తింది. జైలులో నిర్బంధించింది. నానా చిత్రహింసలు పెట్టింది. చివరకు ఇరవై ఐదేళ్ల నవయవ్వనంలోనే ఆ యువకుడు 1900 సంవత్సరం లో రాంచీ జైలులో ‘అనుమానాస్పద స్థితి’లో మరణించాడు. ఆదివాసుల చీకటి జీవితాల్లో తొలిపొద్దుగా నిలిచిపోయిన ఆ యువకుడే బిర్సాముండా. అతను జార్ఖండ్ ఆదివాసులకు ఒక జానపద వీరుడు. ఒక్క ఆదివాసులకే కాదు పోరాడే అందరికీ అతనొక స్ఫూర్తి ప్రదాత. ఇప్పటికీ అతని ఆత్మ అక్క డ సంచరిస్తూనే ఉందని, తమకు దారిచూపే దేవుడు అతనే అని అక్కడి ఆదివాసుల నమ్మకం. బిర్సాముండా మరణించాక అతని ఆశయాల సాధన కోసం ఏర్పడ్డ చోటానాగ్‌పూర్ ఉన్నతి సమాజమే, ఆదివాసీ మహాసభగా, ఆ తరువాత జార్ఖండ్ పార్టీగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి పునాదులు వేసింది.

జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి బిర్సా మూల పురుషుడు. అందుకనే అక్కడి ఆదివాసులు తమ ప్రతి పోరాటంలో భగవాన్ బిర్సా ప్రతిరూపాన్ని చూసుకుంటారు. ఆదివాసుల ఓట్ల మీద బతికే రాజకీయ పార్టీ లు, నేతలైతే అతన్ని నిజంగానే దేవుణ్ణి చేశారు. ఇప్పుడు జార్ఖండ్‌లో రోడ్లకు, విమానాక్షిశయాలకు, విశ్వవిద్యాలయాలకు, కార్యాలయాలకు అనేక ప్రభుత్వ భవనాలకు బిర్సాముండా పేరే కనిపిస్తుంది. అలాగే ప్రధాన నగరాలలోని కూడళ్లలో ఆయన విగ్రహాలే దర్శనమిస్తాయి. చివరకు జార్ఖండ్‌లో అతను నిర్బంధంలో మరణించిన రాంచీ జైలుకు కూడా బిర్సాముండా సెంట్రల్ జైలు అనే పెట్టుకున్నారు. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే ఇప్పుడు అదే జైలులో అతను ప్రబోధించిన మార్గంలో ఇప్పటి ప్రభుత్వాల వనరుల దోపిడీని, అణచివేతను ఎదిరించిన నలుగురు ఆదివాసీ యువకులు ఉరికంబం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు.

బిర్సాముండా ఉద్యమానికి భయపడ్డ అప్పటి బ్రిటీష్ పాలకులు ఆయన మరణానంతరం అతని ఉద్యమ స్ఫూర్తికి తలొగ్గి అటవీ భూముల మీద ఆదివాసుల హక్కులను స్థిరపరుస్తూ చట్టాలను తయారు చేశారు. కానీ ఇవాళ భారత ప్రభుత్వమే ఆ చట్టాలను తుంగలో తొక్కి అడవిని, భూములనే కాదు అక్కడి భూగర్భ గనులను కూడా ప్రైవేట్ వ్యక్తులకు, స్థానికేతరులకు, గిరిజనేతర వ్యాపారులకు, విదేశీ బహుళజాతి కంపెనీలకు కట్టబెడుతోంది. దీన్ని ప్రశ్నించిన పాపానికి మన స్వతంత్ర ప్రభుత్వాలే జీతన్ మరాండి, అనిల్ రామ్, ఛత్రపతి మండల్, మనోజ్ రాజ్వర్ అనే నలుగురు ఆదివాసీ యువకులపై హత్యానేరం మోపి ఉరిశిక్ష ఖరారు చేశాయి. 2007లో జార్ఖండ్ ముఖ్యమంవూతిగా ఉన్న బాబూలాల్ మరాండి కుమారుడితో సహా మరికొందరిని మావోయిస్టు పార్టీ చంపేసిందని, ఆ కేసులో ఈ నలుగురికి సంబంధం ఉందనీ ప్రభుత్వ ఆరోపణ!

రాంచీ కోర్టు ఉరిశిక్ష విధించిన ఈ నలుగురిలో జీతన్ మరాండి సరిగ్గా బిర్సాముండాను తలపించే సాంస్కృతిక సేనాని. అటు ఇటుగా అదే వయసులో ఉన్న ఆయన జార్ఖండ్ జాగృతి (జార్ఖండ్ అభేన్) అనే సంస్థకు నాయకుడు. దశాబ్ద కాలంగా ఆయన జార్ఖండ్‌లో సాగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా ఆదివాసీ భాషల్లో వేలాది పాటలు రాసిన రచయిత, కవి, గాయకుడు. ఆటా పాటలతో సంతాలి సిరింగ్ జానపద బాణీలతో, వీధి నాటకాలతో తన జాతి ని జాగృతం చేసిన కళాకారుడు. సహజంగానే జాతిని జాగృతం చేసే ఏ కళాకారుడైనా రాజ్యం కంటికి నలుసులాగే కనిపిస్తాడు. అతన్ని రెచ్చగొట్టే రచన లు చేశాడని, ఉద్రేకపరిచే ఉపన్యాసాలు చేశాడని 2008లో అరెస్టు చేశారు. అప్పటికి హత్యానేరం మోపలేదు. ఆ తరువాత ఏడాదికి అంటే 2009 ఏప్రిల్‌లో అతను మావోయిస్టు అని, బాబూలాల్ కొడుకు హత్యలో అతనూ ఉన్నాడని నేరారోపణ చేసి గత జూన్ నెలలో మరండికి మరణశిక్ష విధించారు. ఈ శిక్షను చూసి జార్ఖండ్ ఆదివాసీలే కాదు మరాండిని ఎరిగిన వారం తా అవాక్కయ్యారు.

అన్యాయమన్నారు. అతను నిరంతరం ఆదివాసుల హక్కుల కోసం తపించే ఒక సాంస్కృతిక కార్యకర్త తప్ప నక్సలైట్ కాదని, మాట, ఆట, పాట తప్ప మరో ఆయుధం తెలియని మృదుస్వభావి అని చాలా మంది చెప్పారు. అతనెప్పుడూ తన ప్రజలను, అడవిని వదిలి అజ్ఞాత వాసం చేయలేదు. చివరకు బాబూలాల్ మరాండి కూడా ఒకవేళ జీతన్ తన కొడుకును చంపాడని కోర్టు భావించినా తాను క్షమిస్తానని, మరణ దండన వద్దని అన్నాడు. కానీ న్యాయమూర్తికి మాత్రం అతను నక్సలైటుగానే కనిపించాడు. ఈ మరణ దండన పట్ల ఇప్పుడు దేశవ్యాప్తంగా మానవహక్కుల సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. కవులు, రచయితలు, కళాకారులు ఇది అన్యాయమని ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ ఆందోళనను అన్నాహజారే హంగామా ముందు ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. నిజాని కి అన్నా హజారే ప్రస్తావిస్తోన్న అవినీతికి మూలాలను వెతికి చూపించి, ప్రశ్నించిన వ్యక్తి జీతన్ మరాండి.

ఆయన తన జార్ఖండ్ జాగృతి ద్వారా స్థాని క వనరులను స్థానికేతర కంపెనీలు, వ్యాపారులు, పెట్టుబడిదారులు ఎలా దోచుకుంటున్నది, పాలకులు అక్కడి మైనింగ్ మాఫియాతో కలిసి కోట్లకు కోట్లు ఎలా సంపాదిస్తున్నది, ఎదిరించిన ప్రజలను కేంద్ర, రాష్ట్ర బలగాలతో ఎలా అణచివేస్తున్నది, ప్రజాస్వామ్యాన్ని ఈ రాజ్యం ఎలా నవ్వులపాలు చేస్తున్నదీ, ఈ అవినీతి వల్ల ఆదివాసుల జీవితాలు, సంస్కృతి ఎట్లా ధ్వంసమైపోతున్నదీ తన పాటల ద్వారా చెప్పాడు. అన్నాహజారే లాగా ఢిల్లీలో ఏదో ఒక వేదిక మీద బాసింపట్టు వేసుకుని తన అనుచరులతో భజనలు చేస్తుంటే అతను కూడా మీడియా, చట్టం, కోర్టులు, రాజకీయ పార్టీల దృష్టిలో దేశభక్తుడే అయి ఉండేవాడు. కానీ అతను ప్రజాస్వామ్యమంటే ప్రభుత్వాన్ని హైజాక్ చేయడమని అనుకోలేదు. ప్రజల గొంతులను సవరించడమని, ప్రశ్నించే అధికారం నేర్పడమని అనుకున్నాడు. ఏ ఉద్యమకారుడైనా చేసేది అదే.

ఇవాళ తెలంగాణ ఉద్యమం చేస్తున్నది కూడా అలాంటి పనే. సరిగ్గా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయు లు, ఉద్యోగులు ఇట్లా అందరూ నక్సలైట్లుగా కనిపించినట్టే పాలకులకు మరాండి కూడా కనిపిస్తున్నాడు. జార్ఖండ్ ప్రజల పోరాటానికి, తెలంగాణ ఉద్యమానికి అనేక పోలికలు ఉంటాయి. రెండు ప్రాంతాల ప్రజలదీ సుదీర్ఘమైన పోరాట అనుభవం. రెండూ ఆత్మగౌరవ నినాదంతో దోపిడీకి, వలసవాదుల పీడనకు వ్యతిరేకంగా పుట్టినవే. కాకపోతే జార్ఖండ్ ప్రజలది మనకంటే సుదీర్ఘమైన అనుభవం. బిర్సాముండాతో మొదలైన పోరాటం అక్కడ ఇంకా కొనసాగుతోంది. ఆ పోరాట క్రమంలో జీతన్ మూడో తరం వాడు. మొదటి తరం బిర్సా బాటలో తమ జాతిని కాపాడుకుంటూ బ్రిటిష్ వాళ్లతో పోరాడింది. రెండో తరం తమ స్వపరిపాలన కోసం తపిస్తూ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించింది.

ఇప్పుడు మూడో తరం తమ రాష్ట్రాన్ని సంపదను దోచుకుంటోన్న దళారులతో పోరాడుతోంది. జార్ఖండ్ ప్రజలు ప్రత్యేక రాష్ట్రమైతే సాధించుకున్నారు గానీ అవినీతి మూలంగా అక్కడి వనరులన్నీ వలస వ్యాపారుల చేతిలోనే ఉన్నాయి. జార్ఖండ్ రాష్ట్రం అడవులకు నిలయం. అస లు జార్ఖండ్ అంటేనే అడవి ఖండం అని అర్థం. అ అడవి నిండా అనేక ఖనిజ నిక్షేపాలున్నాయి. బొగ్గు, ఇనుప ఖనిజం, బాకె్సైట్, మైకా, సున్నపురాయి, రాగి, వెండి మొదలు యురేనియం దాకా అక్కడలేని నిధి లేదు. అందుకే అప్పుడు బ్రిటీష్ పాలకుల కన్ను ఆ ప్రాంతం మీద, అక్కడి సంపద మీద పడింది. ఆ సంపద చేజిక్కుంచుకోవాలంటే ముందుగా అక్కడి ఆదివాసులను తరిమేయాలి. బిర్సాముండా వాళ్ల ఆటలు సాగనీయలేదు. విదేశీయు లు ఆ గడ్డ మీద అడుగు పెట్టకుండానే వెనుదిరిగారు. కానీ ఆ వెంటనే దేశీయ షావుకార్లు డబ్బు సంచులతో అక్కడ దిగారు.

బిర్సా చనిపోయిన నాలుగైదేళ్లకే ఆ అడవిలో పెట్టుబడి జెంషడ్ జీ టాటా రూపంలో ప్రత్యక్షమయింది. ఆయన పేరుతో జెంషడ్‌పూర్ ఉక్కు నగరమే వెలిసింది. అప్పటి నుంచి ఇప్ప టి దాకా అక్కడి ఆదివాసులు తమ అడవిలో తామే పరాయివాళ్లయి బతుకుతున్నారు. ఇప్పుడు ఆ చిన్న రాష్ట్రం దేశపు ఖనిజ ఉత్పత్తులలో పది శాతం వాటాతో ఉంది. ఈ వాటా ఇంకా పెంచి, తమ వాటాలు పంచుకుంటూ రాజకీయ నాయకులు ప్రైవేట్ పెట్టుబడికి ఆ రాష్ట్రాన్ని పూర్తిగా అమ్మేశారు. గడిచిన పదేళ్లలో వేలాది కంపెనీలకు అక్కడి భూములు లీజుకివ్వడం మొదలుపెట్టారు. 2008 నాటికే లీజుకిచ్చి 730 కంపెనీలకు జార్ఖండ్‌ను అమ్మేసుకున్నారు. ఆ కాలంలో రెండేళ్ళ పాటు ముఖ్యమంవూతిగా ఉన్న మధుకోడా నాలుగువేల కోట్ల అవినీతికి పాల్పడి దొరికిపోయాడంటే అక్కడ దొరకకుండా సాగుతోన్న దోపిడీ ఎంత ఉంటుందో పోల్చుకోవచ్చు.

సరిగ్గా జీతన్ మరాండి ప్రశ్నించింది ఈ దోపిడీనే. కేవలం తను ప్రశ్నించడం మాత్రమే కాదు, ప్రజలకు అలా ప్రశ్నించి, ఎదిరించే బిర్సాముండా తత్వాన్ని బోధిస్తున్నాడు. ఈ దేశాన్ని, దేశంలో ఉన్న సహజ వనరులను అవినీతిపరుల పాలు కానీయవద్దని ప్రజలను జాగృత పరిచాడు. ఆ ప్రశ్నలకు, వాదానికి ఎలా సమాధానం చెప్పాలో తెలియని పాలకులు ఇప్పుడు ఆ ప్రశ్నిస్తున్న గొంతుకు ఉరి బిగించే పనిలో ఉన్నారు. నిజానికి ప్రజల ఆస్తుల్ని పీల్చి పిప్పిచేసిన మధుకోడా ఇవాళ అదే జైలులో మామూలు ఖైదీలాగే ఉన్నాడు. మన దేశంలో అతనికి ఉరిశిక్ష చట్టం లేదు. దేశంలో ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడికి, ఏ పెట్టుబడిదారుడికి, మరే ఇతర కార్పొరేట్ మోసగాడికి ఉరిశిక్ష పడలేదు. కానీ ఆకలికి, నిరుద్యోగానికి, పేదరికానికి బలిపశువులై చిల్లర నేరాలు చేసినవాళ్లు, తమ స్థితికి కారణమైన దోపిడీని ఎదిరించిన వాళ్లు, ప్రశ్నించిన వాళ్లు, కొత్త విలువల్ని కోరుకున్నవాళ్లు మాత్రమే ఉరికంబం ఎక్కారు.

పాలక వర్గాల రాజకీ య సిద్ధాంతాలను ప్రశ్నించిన వాళ్లు, ప్రతీకారం తీర్చుకున్న వాళ్లూ ఈ జాబితాలో ఉన్నారు. మరీ ముఖ్యంగా పేదలు, దళితులూ, ఆదివాసులు, అధికా ర పీడితులు లక్షలాదిగా ఏటేటా అనధికారికంగా అమలవుతోన్న మరణ దండనకు బలి అవుతూనే ఉన్నారు. అలా కుదరనప్పుడు వారిని ఏదో ఒక కేసులో తోసేసి చట్టబద్ధంగా ప్రాణాలు తీసేస్తున్నారు. ఈ సంగతి గుర్తించే ప్రపంచ వ్యాప్తంగా మానవహక్కుల సంఘాలు మరణశిక్షను రద్దు చేయాల ని కోరుతున్నాయి.

మరణశిక్షను రద్దు చేయాలన్న డిమాండు ఇవాళ కొత్తగా వస్తున్నది కాదు. అది అనాగరికమైనదని, మధ్య యుగాల దుష్ట సంప్రదాయమని చాలామంది సామాజికవేత్తలు చెప్పి ఉన్నారు. శిక్ష మనిషిని మార్చేదిగానే ఉండాలే తప్ప మనిషినే లేకుండా చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఒక వ్యక్తి ఇంకొకరి ప్రాణాలు తీయడం ఎంత ఘోరమైన నేరమో శిక్ష పేరుతో ప్రాణం తీసేయడం కూడా అంతే నేరమని, అయినా మరణదండనల వల్ల ఏ సమాజం లో కూడా నేరాలు ఆగిపోలేదని నేరశాస్త్ర పరిశోధనలు చెప్తున్నాయి. ఇది గుర్తించి ప్రపంచంలో నూటా ముప్ఫై దేశాలు ఇప్పటికే ఈ శిక్షను రద్దు చేయడమో, అమలు చేయకుండా ఉండడమో చేస్తున్నాయి. కేవలం 80 దేశాలే ఇంకా మరణ శాసనాలు అమలు చేస్తున్నాయి. అలాంటి అనాగరిక సంప్రదాయాన్ని అమలు చేస్తోన్న దేశాల్లో మనదీ ఒకటి. మరణశిక్ష అనేది అసాధరణ కేసుల్లో వాటిలో కూడా అరుదైన సందర్భాల్లో మాత్రమే విధించాలని గతంలో సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పులో సూచించింది. కానీ దాన్నిప్పుడు సాధారణం చేసేశారు.

ఎవరినైనా హత్య చేసిన వ్యక్తికి చట్టం ప్రకారం జీవితఖైదు గానీ మరణశిక్ష గానీ విధిస్తారు. నేర స్వభావం, ప్రేరణ కలిగించిన అంశాలు, సమాజంపైన ఆ నేర ప్రభావం, నేర విస్తృతి, నేరస్తుడి వ్యక్తిత్వం వంటివి పరిగణనలోకి తీసుకోవాలని ఆ తీర్పులో సుప్రీంకోర్టు చెప్పింది. మొత్తంగా ఒక వ్యక్తిని బతకనీయాలా లేక చంపివేయాలా అని నిర్ణయించే అధికారం మానవమావూతుడైన న్యాయమూర్తి చేతుల్లో ఉంటుంది. ఇది మంచిది కాదని చాలా మంది న్యాయకోవిదులు వాదిస్తున్నారు. అనేక కేసుల్లో ఒక న్యాయమూర్తి చెప్పింది మరో న్యాయమూర్తి తప్పు పడుతున్నప్పుడు మరణశిక్షలు అన్నీ న్యాయబద్ధమేనని చెప్పలేం. న్యాయం అనేది మీరు కుదుర్చుకున్న న్యాయవాది చేసే బేరాన్ని బట్టి ఉంటుంది. కొన్నిసార్లు సమాజమంతా చలించిన సందర్భాల్లో న్యాయమూర్తులు చలించ గ్రహం సై్టన్ విషయంలో అదే జరిగింది. విదేశీయుడైన గ్రహంసై్టన్‌ను అతని ఇద్దరి పసిపిల్లల్ని అత్యంత పాశవికంగా హత్యచేసిన ధారాసింగ్‌ను కోర్టు వదిలేసింది. మరాండి కేసులో న్యాయమూర్తి నిజంగానే పైన చెప్పినట్టు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉంటే అతనికి ఉరిశిక్ష విధించే అవకాశం లేదు.

జీతన్ మరాండి ఒక్కడే కాదు, ఇప్పుడు వరుసగా ఉరిశిక్షలు మన ముందున్నాయి. రాజీవ్‌గాంధీ హత్య కేసులో తమిళుల ఉరిశిక్ష రద్దు చేయాలని అక్కడి అసెంబ్లీ తీర్మానించింది. దాదాపు ఇరవై ఏళ్లకు పైగా జైలులో కఠోరమైన శిక్షను అనుభవించిన వాళ్లకు ఇప్పుడు మరణ శిక్ష అమలు చేయడం కేవలం ప్రతికారమే తప్ప న్యాయ సమ్మతం కాదు. అలాగే మరో నూట డ్బై మందికి పైగా తమకు క్షమాభిక్ష పెట్టమని భారత రాష్ట్రపతికి దరఖాస్తు చేసుకుని ఉన్నారు. అవి ఏళ్ల తరబడి అలా మూలుగుతూనే ఉంటాయి తప్ప వాళ్ల కు చావు నుంచి విముక్తి కలుగుతుందని అనుకోలేం. ఇలా వందలాది మంది కి ఇప్పటికే ఉరి ఖరారై ఉంది. కాబట్టి మనుషుల్ని చట్టబద్ధంగా చంపేసే ఈ క్రమం సంవత్సరాల పాటు కొనసాగనుంది. ఇది దేశానికి అంత మంచిది కాదు. అయినా నేరాలకు మూల కారణాలను వదిలేసి ఉరితీస్తూపోతే ఈ దేశంలో ఒక్కడు కూడా మిగలడు.

ఇవాళ ఉరిశిక్ష గురించి మాట్లాడుతున్న వాళ్లకు జీతన్ మరాండి గురించి దిగులు లేదు. నిజానికి అతని చావు గురించి దిగులు అతనికే లేదు. ‘మీకు ఈ కోర్టు మరణ శిక్ష విధిస్తోంది’ అని న్యాయమూర్తి తీర్పు చెప్పినప్పుడు కూడా ఆయన చలించలేదు. ‘ఠీక్ హై’ అన్నాడు. ఎందుకంటే సమస్య ఒక్క జార్ఖండ్‌ది మాత్రమే కాదని అతనికి తెలుసు. బెంగాల్, బీహార్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రవూపదేశ్, కర్ణాటక ఇట్లా దేశమంతటా భూమిని దోచేసుకోవ డం, అడవుల్ని ఆక్రమించుకోవడం కొనసాగుతూనే ఉంది. మైనింగ్ పేరుతో దేశాన్ని లూటీ చేయడం కొనసాగుతూనే ఉంది. దానికి వ్యతిరేకంగా ప్రజలు తప్పక ఏకమై పోరాడుతారని ఆయన ఆశ. అందుకే ‘వో సుబహ్ కభీ థో ఆయేగీ...’ (ఆ ఉదయం ఎప్పటికైనా వస్తుంది) అంటూ తనదైన శైలిలో పాడుకుంటూ ఆయన కోర్టు హాలు నుంచి వెళ్లిపోయాడట. మనం ఆలోచించాల్సింది చట్టాలు, కోర్టులు , ప్రభుత్వాలు ఇంత నిరంకుశంగా, దుర్మార్గంగా వ్యవహరిస్తూ పోతే రేపు ఏ ఉద్యమమైనా నిలబడుతుందా అని!న్యాయం పక్షాన మాట్లాడే మనిషి మిగులుతాడా అని!!

పొ. ఘంటా చక్రపాణి
సామాజిక పరిశోధకులు

Other Articles
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine