Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Wednesday, May 22, 2013
 


Home >> Edit Page >>Editorials



భద్రతారాహిత్యం

అస్సాంలో పోయిన నెల చెలరేగిన అల్లర్ల పట్ల, మయన్మార్‌లో ఒక మతం వారిపై దాడుల పట్ల ముంబయిలో శనివారం తలపెట్టిన నిరసన కార్యక్షికమం హింసాయుతంగా మారడం, ఇద్దరి ప్రాణాలు బలికావడం విచారకరం. ముంబయిలో హటాత్తుగా ఇంత ఉద్రిక్తత చెలరేగడానికి మయన్మార్‌లో లేదా అస్సాంలో పరిస్థితులు మాత్రమే కారణమని భావించకూడదు. దేశంలో నెలకొన్న పరిస్థితులకు ఈ ఘటన అద్దం పడుతున్నది. దేశ వ్యాప్తంగా భిన్న వర్గాల మధ్య అపోహలు పెరిగిపోయాయి. కొన్ని వర్గాలలో భద్రతారాహిత్యం నెలకొన్నది. దీనిని రాజకీయ నాయకులు కావచ్చు, దుష్టశక్తులు కావచ్చు ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. ముంబయి సమావేశానికి వెయ్యి మంది మాత్రమే రావచ్చునని నిర్వాహకులు భావించారట! పోలీసులు కూడా అదే స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారట. కానీ అనూహ్యంగా యాభై వేల మంది వచ్చారని అంటున్నారు. ఏ సంస్థల మద్దతు లేకుండానే ఇంత మంది స్వచ్ఛందంగా తరలివచ్చారా అనేది తెలువదు. ఒక వేళ వారంతట వారే తరలి వస్తే దీనిని ఒక వర్గం ప్రజల్లో నెలకొన్న భద్రతా రాహిత్యంగా గుర్తించాలె. ప్రశాంతంగా సాగుతుందనుకున్న సమావేశం హింసాత్మకంగా ఎందుకు మారిందనేది అంతుబట్టని విషయం. ఈ హింసాత్మక ఘటనలో సాధారణ ప్రజలు, పోలీసులు, మీడియా సిబ్బంది గాయపడ్డారు. 1992 నాటి ముంబయి అల్లర్లంతటి ఉద్రిక్తత మళ్ళీ ఏర్పడిందనే భయాందోళనలు నెలకొన్నాయంటే, పరిస్థితి ఒక్కసారిగా ఎంత అదుపు తప్పిందో అర్థం చేసుకోవచ్చు. రెండు వర్గాలపై దాడులు జరపడం ద్వారా అస్సాం అల్లర్లను కొందరు కుట్రపూరితంగా ఎగదోశారనే ఆరోపణ ఉన్నది.

ఇదే విధంగా ముంబయి సమావేశంలో హింస తలెత్తడం వెనుక కూడా- భిన్నవర్గాల మధ్య అపోహలు సృష్టించడానికి దుష్టశక్తులు ప్రయత్నించాయా అనేది తెలువదు. ఈ రెండు అల్లర్ల వెనుక కారణాలను అన్వేషించాలె. సంఘ విద్రోహశక్తు ల సంగతెలా ఉన్నా అస్సాం అల్లర్లకు కొన్ని స్థానిక పరిస్థితులు దోహదపడ్డాయనేది అంగీకరించాల్సిందే. ముంబయిలోని ఒక వర్గం బెంగాలీలు బంగ్లాదేశీయులనే ముద్ర పడి సమస్యలు ఎదుర్కొన్న సందర్భాలు గతంలో ఉన్నాయి. అందువల్ల అస్సాం ప్రభావం ముంబయిలో కనిపించింది. ముంబయిలో ఒక వర్గం ప్రజలు ఇంత పెద్ద ఎత్తున సమావేశానికి హాజరుకావడానికి అస్సాం అల్లర్లు, మయన్మార్‌లో దాడులు తక్షణ ప్రేరకాలు కావచ్చు. కానీ దేశవ్యాప్తంగా తలెత్తిన కొన్ని పరిస్థితులు, ప్రత్యేకించి గుజరాత్ మారణహోమం ఒక వర్గం ప్రజలపై చూపిన ప్రభావం విస్మరించలేనివి.

అస్సాం అల్లర్లు తీవ్ర స్థాయిలో జరిగాయి. దాదాపు డ్బ్భై మంది మరణించడంతో పాటు నాలుగు లక్షల మంది వరకు నిరాక్షిశయులయ్యారు. ఈ అల్లర్లపై ఇప్పటికే సీబీఐ దర్యాప్తు మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తనవంతుగా దర్యాప్తు జరుపుతున్నది. అయితే అస్సాం అల్లర్లు జరిగిన వెంటనే దేశ వ్యాప్తంగా ఈ ఘటన ప్రభావం ఎట్లా ఉంటుందనే విషయమై కేంద్రం కానీ, ఇతర రాష్ట్రాలు కానీ ఆలోచించి ముందు జాగ్రత్తలు తీసుకోలేదు. అస్సాం అల్లర్ల గురించిన ప్రచారం దేశ వ్యాప్తంగా భిన్న మతాల మధ్య అపోహలు సృష్టించేదిగా ఉన్నది. గతంలో ముంబయిలో చెలరేగిన అల్లర్లకు, గుజరాత్ మారణహోమానికి మతపరమైన కోణాన్ని చూపించవచ్చు. కానీ అస్సాంలోని బోడో ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలను దేశ వ్యాప్తంగా జరిగిన మత కలహాలతో పోల్చలేము. అక్కడ రెండు వర్గాల సమస్యను వారి కోణంలో అవగాహన చేసుకుని పరిష్కరించాలె. బోడోలతో పాటు మొత్తం ఈశాన్యంలో జాతులు తమ అస్తిత్వానికి ముప్పు కలుగుతున్నదని ఆందోళనలో ఉన్నాయి. దీనిని సానుభూతితో అర్థం చేసుకుని వారికి భరోసా ఇవ్వాలె. మరోవైపు ఈశాన్యంలోని స్థానికేతరులను అందరినీ బంగ్లాదేశీయులుగా ముద్ర వేయడం సబబు కాదు.

వలస వచ్చిన వారుంటే వారి పరిస్థితిని కూడా సానుభూతితో అర్థం చేసుకోవాలె. అస్సాం లో చెలరేగిన అల్లర్లు మత స్వభావం కలిగినవి కావని దేశ వ్యాప్తంగా గల భిన్న మతస్తుల కు తెలియచెప్పడంలో ప్రసార సాధనాలు, ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ‘స్థానిక’ సమస్యను ప్రభుత్వాలు సకాలంలో గుర్తించి చర్యలు తీసుకోకపోవడం వల్ల తలెత్తిన ఉద్రిక్తతలు ఇవి. ఇటువంటి స్థానిక- స్థానికేతర ఉద్రిక్తతలు దేశంలోని భిన్న ప్రాంతాల మధ్య కూడా తలెత్తుతుంటాయి. ఒకే మతం వారి మధ్య జరగవచ్చు.

అస్సాం అల్లర్లపై ముఖ్యమంత్రి తరుణ్ గగోయి చేసిన తాజా వ్యాఖ్యలు గమనార్హమైనవి. శరణార్థి శిబిరాలలో ఉన్నవారందరూ మన దేశంలోని వారేనని ఆయన అన్నారు. ట్రిబ్యునల్స్ గుర్తించి, పరారీలో ఉన్న విదేశీయులు సమస్యగా మారారని అయనే అన్నారు. విదేశీయుల సమస్య తమ ఒక్క రాష్ట్రానిదే కాదని, దీనిని పరిష్కరించవలసిన బాధ్యత కేంద్రానిదని చివరకు తేల్చారు. విదేశాల నుంచి వచ్చిన వారివల్ల సమస్య వస్తుందనే ప్రచా రం దేశ వ్యాప్తంగా ఇప్పటికే వ్యాపించింది. కానీ స్వదేశంలోని బెంగాలీల ఆధిపత్యం కూడా ఈశాన్యంలోని కొన్ని ప్రాంతాలలో సమస్యగా ఉన్నది. ఒక విదేశీ సమస్యపైనే నొక్కి చెప్ప డం వల్ల దానికి మతం రంగు పులిమినట్టు అవుతున్నది. అసోములు, బోడోలు, అల్పసంఖ్యాకులు ఎవరికి వారు అస్సాంలో భద్రతా రాహిత్యానికి గురవుతున్నారు. వీరి మధ్య వైరుధ్యాలను పరిష్కరించే చిత్తశుద్ధి కేంద్రానికి లేదు, రాష్ట్రానికి లేదు.

ఇదే విధంగా- దేశ వ్యాప్తంగా మత కలహాలకు కారణాలను గుర్తించి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంలో కేంద్రం, సంబంధిత రాష్ట్రాలు విఫలమయ్యాయి. గోధ్రా అనంతర అల్లర్లపై కమిటీలు, కమిషన్‌లు వేస్తూ గందరగోళాన్ని ఎంతగా పెంచిందీ తెలిసిందే. ఈ పాలనా వైఫల్యం అల్పసంఖ్యాకులను భద్రతారాహిత్యానికి గురి చేస్తున్నది. 2014లో సార్వవూతిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాజకీయ పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలువదు. భిన్న మతాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి కొన్ని శక్తులు పనికట్టుకుని ప్రయత్నించవచ్చు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలె. లౌకిక శక్తులు అప్రమత్తంగా ఉండి మత విద్వేషాలు రెచ్చగొట్టే శక్తుల ప్రయత్నాలను వమ్ము చేయాలె.

Other Articles
Namaste Telangana Specials Stories
namaste Videos


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine