Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Thursday, May 23, 2013
 


Home >> Edit Page >>Articles



కోర్టు ఉత్తర్వుల స్ఫూర్తికి భంగం

ఈమధ్య తెలంగాణ ఇంజనీర్లు, మరికొందరు కృష్ణా డెల్టాకు నాగార్జునసాగర్ జలాశయం నుంచి అక్రమంగా నీళ్లు తరలించడంపై హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం(పిల్)వేశారని, వారికి అనుకూలంగా హైకోర్టునుంచి మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయని పేపర్లో చదివాను. వివరాలు చెప్తారా?

-నెల్లికుదురు రాజీవ్, మహబూబ్‌నగర్


SAGAR1 talangana patrika telangana culture telangana politics telangana cinema
మీరు చదివింది నిజమే. నల్లగొండ జిల్లా రైతులు ఐదుగురు, ఆ జిల్లాకు చెందిన ఒక వ్యాపారి, మరో అయిదుగురు, హైదరాబాద్ వాస్తవ్యుడు మొ త్తం పదకొండుమంది కలిసి హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశా రు. అందులో ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థలో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేసి రిటైర్ అయిన వెదిరె వెంకట్‌డ్డి ప్రముఖులు.

నాగార్జున ప్రాజెక్టు నివేదిక అనుసరించి జలాశయ కనీస నీటిమట్టం (ఎండీడీఎల్) 510 అడుగులు. అయితే నాగార్జునసాగర్ చీఫ్ ఇంజనీర్ రిపోర్టు ప్రకారం ఖరీప్ సీజన్ ప్రారంభం నాటికి అంటే జూన్ ఒకటవ తేదీన జలాశయంలో ఉండవలసిన ఎండీడీఎల్ 525 అడుగులు. నాగార్జునసాగర్ జలాశయం నుంచి రెండు ప్రధానమైన కాలువలు 1) జవహర్‌కాలువ(కుడి కాలువ) 2) లాల్ బహుదూర్ కాలువ(ఎడమకాలువ)లు బయల్దేరుతాయి. కుడికాలువ 11లక్షల 18 వేల ఎకరాలకు సాగునీటి సామర్థ్యం కలిగి ఉన్నది. 11 వేల క్యూసెక్కుల అత్యధిక ప్రవాహం మోసుకువెళ్లగలిగే ఈ కాలువ జలాశయంలో 502 అడుగులుంటే చాలు ని ర్ధారిత డిశ్చార్జిని తీసుకెళ్ళగలుగుతుంది. ఇక ఎడమకాలువ విషయానివస్తే.. దాని ఆయక ట్టు 9లక్షల 97వేల ఎకరాలు. దాన్ని కూడా 11వేల క్యూసెక్కుల అత్యధిక డిశార్జికే డిజైన్ చేశారు.కాకపోతే ఈ ప్రవాహాన్ని తీసుకు జలాశయంలో 520 అడుగుల నీటిమట్టం తప్పక ఉండి తీరాలి.

కక్షిదారుల అర్జీ ప్రకారం ప్రభుత్వం ఎడమ, కుడి కాలువకు సమన్యాయం చేసే ఉద్దేశంతో రిజర్వాయర్లో కనీస నీటి మట్టాన్ని 525 అడుగులకు విధిగా అట్టిపెట్టాల్సిన ఆవశ్యకత గురిం చి నిర్ధారించింది. పైపెచ్చు జంటనగరాలకు సాగర్‌నుంచి 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేసే ఏర్పాటు ఉన్నది. ఇందుకోసం రిజర్వాయర్లో 510 అడుగుల పైనే జలాశయమట్టం ఉండి తీరాలి. 510 అడుగులకంటే జలాశయ స్థాయి కిందికి పడి పోతే పంపింగ్ సామర్థ్యం పై ప్రభావం పడి తాగునీటి ప్రయోజనాలకు భంగం కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఈసం వత్సరం వర్షాభావ పరిస్థితులు ఏర్పడి సాగర్‌లోకి నీళ్లు రాక జలాశయ మట్టం జూలై ఒకటన 510 అడుగులకు పడిపోయింది.

జంటనగరాల నీటి సరఫరా సాగర్‌పై ఆధారపడి ఉన్నది.మరోపక్కన నల్లగొండలోని ఫ్లోరైడ్ పీడిత గ్రామాల తాగునీటి అవసరాలున్నాయి. సాగర్‌పైన ఆధారపడ్డ ఎడమ, కుడి కాలువల సాగునీటి ప్రయోజనాలను కాపాడవలసిన అవసరముంది. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణా డెల్టా రైతాంగం నారుమళ్ల కోసం ప్రభుత్వం పైన వత్తిడి చేసిన ఫలితంగా ప్రకాశం బ్యారేజీకి 15టీఎంసీల నీరు ఎగువ నుంచి వదలాల్సిందిగా నిర్ణయించింది. గత ఎనిమిదిరోజులుగా సుమారు 4 టీఎంసీల నీటిని విడుదల చేసింది.అలా ప్రభుత్వం డెల్టా ఆయకట్టుదారుల ప్రయోజనాలు కాపాడే నిమిత్తం సాగర్ నుంచి కృష్ణా జలాలను వదలడం పక్షపాత ధోరణితో తీసుకున్న నిర్ణయం. కనుక 525 అడుగులకు దిగువన జరుగుతున్న నీటి విడుదల ఆపాల్సిందిగా కోర్టుకు విన్నవించుకోవడం జరిగింది.

ఇందుకు కౌంటర్‌గా సాగర్ జలాశయంలో కనీస నీటి మట్టం 525 అడుగులు కాదని, 510 అడుగులని ఇప్పటిదాకా విడుదల చేసిన నీరు సక్రమమేనని, ఎలాంటి నియమాలను ఉల్లఘించలేదని ప్రభుత్వం కోర్టుకు విన్నవించింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు 16-7-2012న వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులలో సాగర్ జలాశయంలో 510 అడుగుల స్థాయికి దిగువన నీటి విడుదలను ఆపాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలిచ్చింది. తక్షణం కోర్టు ఆదేశాలను మన్నిస్తూ అధికారులు సాగర్ నుంచి నీటివిడుదలను ఆపేశారు.

అయితే ఇక్కడో మతలబుంది. హైకోర్టు ఇచ్చిన ఆర్డరు సాగర్‌లో 510 అడుగుల నీటి మట్టాన్ని కాపాడమని మాత్రమే. పైన శ్రీశైలంను ఖాళీ చేసి ఆనీటిని సాగర్‌లోకి వదులుతూ, సాగర్‌లో కోర్టు విధించిన షరతును మన్నిస్తూనే, అంటే 510 అడుగుల కిందికి పడిపోకుండా, లెవల్ మెయింటెయిన్(Maintain) చేస్తూనే డెల్టా కోసం సాగర్ నుంచే కృష్ణా జలాలు వదిలే అవకాశమున్నది. సరిగ్గా ప్రభుత్వం ఇదే చేసింది. శ్రీశైలంలో 834 అడుగుల కంటే దిగువన-ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ప్రయోజనాల కోసమైనా నీరు వదలరాదన్నది జీవో 69 చెప్పుతున్నది. దీన్నే శ్రీశైలం ఎండీడీఎల్ అంటారు.

రాజశేఖర్‌డ్డి ముఖ్యమంవూతిగా ఉన్నప్పుడు ఈ ఎండీడీఎల్‌ని రాయలసీమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జీవో107 ద్వారా 854 అడుగులకు పెంచారు. అయితే మరో జీవో 3 ద్వారా 854 అడుగుల ఎండీడీఎల్‌ను కేవలం పోతిడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తెలుగుగంగకు, శ్రీశైలం కుడిగట్టు కాలువకు నీటిని విడుదలకు అనువుగా ఉండేట్టు విడుదల చేసినప్పటికినీ సాగర్, ప్రకాశం బ్యారేజీకి సాగునీటి కోసం కృష్ణా జలాలను వదిలే విషయంలో జీవో 69 చెల్లుబాటవుతుందని స్పష్టం చేయడం జరిగింది. అంటే జీవో 69 (1996 సంవత్సరంలో జారీ చేసింది) ఇప్పటికీ చెలామణి అవుతుందన్నమాట. ఈ జీవోలో శ్రీశైలంలో 834 అడుగుల కంటే దిగువన నీటిని ఎలాంటి ప్రయోజనాల కోసమైనా విడువకూడదని ఆదేశించడం జరిగింది. అయితే అత్యవసర పరిస్థితుల్లో మాత్రం తాగునీటి ప్రయోజనాల కోసం శ్రీశైలం నుంచి నీరు వదలవచ్చని నియమమున్నది. ఇదే మాదిరిగా అదే జీవో 69లో సాగర్‌లో 510 అడుగులు ఎండీడీఎల్ కంటే దిగువ స్థాయిలో నీటిని వదలకూడదని, హైదరాబాద్‌కు నీటి సరఫరా విషయంలో మాత్రం ఈ నియమాన్ని ఉల్లంఘించవచ్చునని స్పష్టంగా తెలియచేయడం జరిగింది.

అంటే ఇప్పుడు చెలామణి అవుతున్న జీవో 69 ప్రకారం శ్రీశైలంలో 834 అడుగులు, నాగార్జునసాగర్‌లో 510 అడుగుల కనీస నీటిమట్టం విధిగా ఉండి తీరాలన్నమాట. తాగునీటి కోసం అవసరమైతేనే నీటిని ఆయా రిజర్వాయర్ల నుంచి నిర్ధారిత నీటి మట్టాల కంటే తక్కువ ఉన్నా దిగువకు వదలవచ్చు. ఇంత స్పష్టంగా ప్రభుత్వ ఆదేశాలుంటే కృష్ణా డెల్టాకు కృష్ణా జలాల వినియోగంపై ప్రథమ హక్కు ఉన్నది, 150 ఏళ్ల చరిత్ర కలిగిన డెల్టామాది, ఏది ఏమైనా నాగార్జునసాగర్‌ని ఖాళీ చేసైనా సరే మాకు నీళ్ళు వదలాల్సిందే అని అన్నిపార్టీలకు చెందిన కోసాంధ్ర నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి చేయడమేమిటి? అనాలోచితంగా ప్రభు త్వం అధికారులను సంప్రదించకుండా శ్రీశైలం నుంచి 12టీఎంసీలు, నాగార్జునసాగర్ నుంచి 3టీఎంసీలు వెరసి 15 టీఎంసీలు విడుదల చేయమని ముఖ్య మంత్రి ఆర్డరు చేయడమేమిటి? ఇదంతా చూస్తుంటే ‘కర్ర ఉన్నవాడిదె బర్రె’ అనిపించడం లేదూ?

ఇంత అన్యాయం జరిగింది కాబట్టే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయ డం. హైకోర్టు వెంటనే స్పందించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వం ఇప్పటికైనా కోస్తాంధ్ర ఆధిపత్య ధోరణి నుంచి బయటపడిందా? లేదు. హైకోర్టు ఆదేశాల స్ఫూర్తికి భంగంగా కేవలం ఉత్తర్వులను మాత్రమే మన్నిస్తూ, శ్రీశైలం నుంచి నీటిని వదులుతూ, సాగర్‌లో 510 అడుగుల స్థాయిని కాపాడుతూ డెల్టాకు నీరు వదిలే కుతంత్రం కొనసాగిస్తున్నది.

అసలు, డెల్టాకు కృష్ణా జలాల వినియోగంలో ప్రథమ హక్కు ఉందా? సాగర్ ఆయకట్టుదారుల హక్కుకంటే, డెల్టాకు జలాల వినియోగంలో హక్కుపరంగా ప్రాధాన్యత ఉన్నదా అన్నది తేలవలసిన విషయం. కృష్ణా డెల్టా వివాదంలో ప్రామాణిక గ్రంథమైన బచావత్ ట్రిబ్యూనల్ ప్రకారం-ఒకసారి నీటి కేటాయింపులు జరిగాక తుది జాబితాలో ఉన్న అన్ని ప్రాజెక్టులకూ ఒకే ప్రాధాన్యత అని చాప్టర్12లో స్పష్టంగా చెప్తోంది. కానీ వలసవాద ప్రభుత్వం బచావత్ న్యాయపీఠం ఆదేశాలను పక్కనపెట్టి 1996 లో జారీచేసిన జీవో-69లో మూడు అసమంజస అంశాలను పొందుపరిచింది. ఒకటి : శ్రీశైలంలోని నీటిపై మొదటి ప్రాధాన్యత మద్రాసు తాగునీటి ప్రయోజనాలకు ఇచ్చింది. రెండో ప్రాధాన్యం హైదరాబాద్ తాగునీటి ప్రయోజనాలకు. ఇది ఎంత ప్రమాదకరమో ఆలోచించండి. కృష్ణా బేసిన్‌లో ఉన్న జంటనగరాల తాగునీటి అవసరాల కంటే ఎక్కడో ఉన్న తమిళనాడులో ఉన్న మద్రాసు నగరవాసుల దప్పిక తీర్చడం అవసరం అని ఈ ప్రభుత్వం ఆర్డరు పాస్ చేసింది.

మద్రాసు ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకుని తెలుగుగంగ ద్వారా జలాలను మళ్లిస్తున్నాం కాబట్టి, ఫ్రీగా పొందే హైదరాబాద్ వాసుల కన్నా , డబ్బిచ్చి కొనుకున్న మద్రాసు వారికి ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరముంటుందన్న అభివూపాయం సర్కారుది కావచ్చు. రెండో అంశం : బచావత్ స్పష్టంగా అన్ని ప్రాజెక్టులకూ ఒకే ప్రాధాన్యత అని చెప్తున్నా.. నాలుగో ప్రాధాన్యతగా ప్రకా శం బ్యా రేజీ, నాగార్జునసాగర్ ఆయకట్టుగా పేర్కొంటూ, అందులో ప్రకాశం బ్యారేజీకి, సాగర్ కంటే అధిక ప్రాధాన్య త ఉందని సూచించడం. దుర్మార్గమైన మూడో అంశం ఏమంటే- కృష్ణా బేసిన్‌లో నూటికి నూరుపాళ్లు ఉన్న నల్లగొండవాసుల సాగు, తాగునీటి అవసరాలు తీర్చే ఎస్‌ఎల్‌బీసీకి ఆఖరు ప్రాధాన్యతగా చూపెట్టి, కేవలం బేసిన్ వాసుల దయాదాక్షిణ్యాలపైన ఆధారపడ్డ సీమ వాసుల అవసరాలను తీర్చే తెలుగుగంగను ఆరో ప్రాధాన్యతగా పేర్కొనడం. 1996లో జారీ చేసిన ఈ జీవో-96 పట్ల తెలంగాణ నాయకులు, ఇంజనీర్లు తమ వ్యతిరేకతను తెలియచేశారో లేదో ఎవరికీ తెలియ దు.

ఏదైమైనా తెలంగాణ మంత్రులు, అధికారులు ఇట్లా తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగించే జీవోని విడుదల చేస్తే నోరుమూసుకుని ఎలా కూర్చున్నారో అర్థం కావడం లేదు. జీవో-69 గురించి మరోసారి మాట్లాడుకుందాం. డెల్టా ప్రయోజనాలు కాపాడటమే తమ ప్రథ మ కర్తవ్యంగా భావించే ఈ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను మన్నిస్తున్నట్టే నటిస్తూ ఆ ఆదేశాలనే తుంగలో తొక్కింది. జీవో-69ని పక్కనపెట్టి శ్రీశైలంను ఖాళీ చేస్తోంది. ఏమన్నా అంటే హైకోర్టు ఆర్డరిచ్చింది సాగర్ విషయంలోనే కదా? శ్రీశైలం లో నీటి మట్టం కాపాడమని ఇవ్వలేదు కదా అం టోంది. అంటే ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవడం కోసం మరో ప్రజాహిత వ్యా జ్యం హైకోర్టులో వేస్తే తప్ప ఈ జలదోపిడీ ఆగదన్న దృష్టితో వ్యాజ్యం వేయడం జరిగింది. అది బహుశా ఈరోజు అంటే 23-07-2012న హైకోర్టు విచారణకు వచ్చే అవకాశము న్నది. ఈ వలసవాద ప్రభుత్వం తమ ఇష్టమొచ్చినట్టు ఆదేశాలివ్వడం, తమకు అనుకూలంగా ఉన్నప్పుడు వాటిని పట్టించుకోకపోవడం, లేనప్పుడు బుట్ట దాఖలు చేయడం, బాధిత తెలంగాణ ప్రజలు కోర్టుల చుట్టూ తిరిగి న్యాయం చేయమని కోరటం నిరంతరం కొనసాగవలసిందే.

తాజా సమాచారం : హైకోర్టు తాజా ఉత్తర్వు తమ ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందని ఆవేదన చెందిన కోస్తాంధ్ర డెల్టా నేతలు విజయవాడలో సదస్సు నిర్వహించి తమ హక్కు గురించి పోరాడాలని తీర్మానాలు చేసి, హైకోర్టులో పిటిషన్ వేస్తున్నట్టు తెలిసింది.ఇది దోచుకోవడమే తమ హక్కని చెప్పడమే!

-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్
ఈ మొయిల్ : vsrao2010@gmail.com

Other Articles
Namaste Telangana Specials Stories
namaste Videos


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine