Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Sunday, May 19, 2013
 


Home >> Edit Page >>Articles



కలం యోధుడు దాశరథి

dasardhi
ఈ శిథాలయమ్మున
జనించిన చిక్కని శర్వరీ తమో
రాశి శిఖరాగ్ర సీమ పదరా
ఒక దీపము పెట్టి వత్తము, ఆ
వేశము లేని ఈ బ్రతుకు
వీధుల వెచ్చని దీప మాలికా
పేశల కాంతి నింపుదము
పెక్కుతరాల తమమ్ము లింకగన్ అని తిమిరంతో సమరం సాగించటమే లక్ష్యంగా రచన సాగించిన దాశరథి కృష్ణమాచార్యులు ‘దాశరథి’ గా సుప్రసిద్ధులు. ‘తెలవారుట కన్న నాకు గల కాంక్ష మరొకండు లేద’ ని చాటిన దాశరథి 1925 జూలై 22వ తేదీన వరంగల్ జిల్లా మహబూబాబాద్ సమీపంలోని చిన్న గూడూరులో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాల యం నుంచి పట్టభద్రులయ్యారు. సంస్కృతం, పార్శీ, ఉర్దూ, హిందీ భాషలను అధ్యయనం చేశారు.
నిజాం పాలనా కాలంలో రైతాంగ ఉద్యమంలో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఉద్యమంలో పాల్గొని ఒక చేత పెన్ను మరొక చేత గన్ను పట్టి పీడిత ప్రజల కోసం పోరాటం సాగించారు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అనేక ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నారు. శిస్తులతో, నజరానాలతో ఖజానా నింపుకొని నిజాం నవాబు నియంతలా చెలరేగిపోవడానికి స్థానిక భూస్వాములు, జమీందారులు కారకులై ప్రజలను పీల్చి పిప్పి చేశారు. ఆదశలో ఆంధ్ర మహాసభ ఆవిర్బవించింది. ఊరూరా జరిగిన సభల ద్వారా ప్రజలు చైతన్య కెరటాలై ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. అణగి మణగి ఉన్న అమాయక జీవులే ఆగ్రహంతో ఆయుధాలు పట్టారు. పాట లు కట్టి, పద్యాలు రాసి నిరంకుశ పాలనను వీరోచితంగా ఎదుర్కొన్నారు. ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో ఆ వీరోచిత ఉద్యమంలో పాల్గొని తెలంగాణ దాస్యశృంఖలాలు తెగిపోయేలా గొంతెత్తిన ఉద్యమ కవి దాశరథి. ‘మా నిజాం రాజు జన్మ జన్మల బూజు’ అని ఈసడించి నిజాం రాజును సూటిగా ఎదుర్కొన్నాడు.
ఓ నిజాము పిశాచమా! కానరాడు
నిన్ను బోలిన రాజు మాకెన్నడేని
తీగలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రతనాల వీణ
అని తెలంగాణ మహోన్నతిని కీర్తించాడు. ‘తెలంగాణమ్ము న గడ్డిపోచయును, సంధించెన్ కృపాణమ్ము’ అని ప్రకటించి కోటి రతనాల వీణను పరిపాలించే అర్హత, అధికారం ‘రైతుదే’ నని ఘంటాపదంగా గానం చేశాడు. రహస్య జీవితం గడుపుతున్న దాశరథి రజాకార్ల బారి నుంచి తప్పించుకుంటూ ప్రజా పోరాటాన్ని కొనసాగించారు.
‘తిమిరంతో సమరం జరిపిన బ్రతుకే అమరం
కవితా తేజో నిలయం అవని శాంతికిది నిలయం’
అంటూ పథ నిర్దేశం చేశారు.
సజీవమైన శబ్ద చిత్రాలతో నవనవోన్మేషమైన భావాలను సరళ సుందరశైలిలో పొదగటం దాశరథి కవిత్వ విశిష్టత. విప్ల వం విరజిమ్మే అగ్నికణాలు, శాంతిని వెదజల్లే హేమంత తుషారాలూ అతని కవిత్వంలో ప్రకాశిస్తాయి. ప్రళయంతో పాటు ప్రణయాన్ని కూడా సమంగా ఆరాధించిన కవి దాశరథి. రామమోహనరావు మాటలలో చెప్పాలంటే ‘తెలంగాణ కవులలో అతిరధి. తెలుగు కవులలో మహారధి. ప్రళయ హాలాహలానికి, ప్రణయ కోలాహలానికి సత్కవితాపయోనిధి దాశరథి’.
అగ్నిధార, రుద్రవీణ, మహాంవూధోదయం, అమృతాభిషే కం, మహాబోధి, తిమిరంతో సమరం, కవితా పుష్పకం, పునర్నవం, ఆలోచనా లోచనాలు’ మొదలైన కవితా సంకలనాలే కాక వందలాది సినిమా పాటలు దాశరథి రాశారు.
దాశరథి జీవకవి. జీవితం తిప్పిన మలుపులన్నీ వెనక్కి తిరిగి చూసుకోకుండా తిరిగినాడు. పాలిచ్చి పెంచిన తల్లినీ, పరుగు నేర్పి పలుకునిచ్చిన గడ్డనూ, ఉత్తేజాన్నిచ్చి తీర్చిదిద్దిన కవిత్వాన్ని ప్రాణవూపదంగా ప్రేమించాడు.చిన్న సంఘటన క్కూడా తల్లడిల్లిపోయే స్వచ్చమైన హృదయం ఆయనది. ఆ సున్నితత్వమే పద్యాల్లో కొత్త సొగసులు పూయించింది. ఆ స్వేచ్చావేశమే అక్షరాల్లో అగ్నులు కురిపించింది. ‘ఆధునికుల్లో పద్యం చెప్పటంలో ఆయనకు సాటి లేరు. మాటకీ, మౌనానికి, శబ్ధానికి, గాయానికి స్పందించే నిర్మల మనస్తత్వం ఆయనది’ అన్నారు దాశరధిని గూర్చి నందిని సిధాడ్డి.
ఛందస్సు ఏదైనా దాశరథి కవిత నిసర్గ సుందరమై పఠితహృదయానికి సూటిగా తగులుతుంది. తనది ‘విద్యుత్ ఛందస్సని అందులోని కవిత్వపు ఎక్స్ కిరణం హృదయాంతస్సుల్ని శోధిస్తుంది’ అని ఆయన సగర్వంగా చెప్పుకొన్నారు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షునిగా దాశరథి సాహిత్య సమావేశాలు అనేకం నిర్వహించి సాహితీ సమావేశాలు, కవి సమ్మేళనాలు జరిపారు. పట్టభవూదుడైన తర్వాత హైదరాబాద్, మద్రాస్ ఆకాశవాణి కేంద్రాలలో అనేక విశిష్ట కార్యక్షికమాలు నిర్వహించి ఆ తర్వాత సినీరంగ ప్రవేశం చేశారు.
దాశరథి మానవతావాది. శాంతివూపియుడు. యుద్దాలు, మతోన్మాదాల మారణహోమాలను నిరసించాడు. ఆయన కవిత్వంలో దురాక్షికమణ చేసిన శత్రువులపై ఎత్తిన హస్తాలేకాదు, స్నేహం కోసం విశ్వమంతటా చాచిన చేతులూ కనిపిస్తాయి. సమకాలీన రాజకీయ, మత, సాంఘిక, వైజ్ఞానిక వ్యవస్థలను వాటి గుణదోషాలను వర్ణించే అభినవ ‘దాశరథి శతకం’(1962) ఆయన వస్తు వైవిధ్యాన్ని ఆవిష్కరిస్తుంది.
దాశరథి రచనల్లో మానవతావాదం మూడు పాయలుగా ప్రవహిస్తుంది. ఒకటి- మనిషి మనిషిని ప్రేమిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంచుకోవడం, మంచిని పంచటం. రెండు- హింసా దౌర్జన్యాలు లేని ప్రజాస్వామ్యవాదంపై ప్రగాఢ విశ్వాసం కలిగి ఉండడం. మూడు-యుద్ద జ్వాలల్లో, రణ దాహంతో నిండిన ప్రపంచానికి శాంతిని ఆహ్వానించడం, విశ్వశాంతి కోసం తపించడం. ఈ మూడు మార్గాల్లో ఏదో ఒకదాన్ని కేం ద్రంగా చేసుకొని విశ్వమానవతావాదానికి అభిముఖంగా దాశరథి రచనలు సాగాయి.నేడు మనిషి దానవ ప్రవృత్తి మితిమీరి పాశవికంగా ప్రవర్తిస్తున్నాడు. ఈలక్షణాన్ని ఇలా సూచించాడు.
మనిషికి-మనిషి అరి /నరునికి-నరుడే ఉరి
తనను తాను చంపుకునే /దౌర్బాగ్యుడు మానవుడు
ఇంతకంటే వేరే దౌర్బాగ్యం అంటూ లేదని మానవజాతి ని హెచ్చరిస్తున్నాడు. మానవుని హృదయంలో మానవతా మందారాలు వికసించవలసినచోట ద్వేషం, క్రౌర్యం, కాఠి న్యం, పగ, ధనదాహం, యుద్ధకాంక్ష అవరించుకొన్నాయి. ఇలాంటి సామాజిక స్థితికి ఆయన ఇలా వాపోతాడు.
నాగమల్లి పొద లోపల /నాగజెముడు మొలిచాడు
కాలకంఠుని గుడి లోపల /కాలయముడు వెలిసాడు
నరుడే నరకాసురుడు /అతని మెదడు-మృతికి పురుడు
అని చెప్పి దీనికి పరిష్కారంగా మనిషిని మనిషి ద్వేషించ ని మార్గం వెతకాలి.జగతిని సుఖశాంతులు గల స్వర్గం చేయా లి అని అందుకోసమే మానవతా వాదము మీద మనిషికి ప్రేమ పెంచాలంటాడు. దాశరథి హింసాపూరితమైన వాతావరణాన్ని అసహ్యించుకొని రజస్తమోగుణాలు కాక సత్తగుణ ప్రధానమైన కారుణ్య భావానికి దాశరథి ప్రాధాన్యం ఇచ్చా డు. అందుకు ప్రతీకలుగా క్రీస్తు, బుద్దుడు, గాంధీలను పేర్కొ ని వారి మార్గంలో నడవమని ప్రజలను ప్రభోదించాడు. హింస నశించాలని, మానవతా వాదమొకటే మహిలో విలసిల్లాలని మానవతావాదం యొక్క ప్రాధాన్యతను నొక్కి చెప్పాడు.
జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణడ్డి తన కవితా లతాంతము పైకి ప్రాకడానికి దాశరథి అండదండలు తనకు లభించాయని చెప్పుకొన్నాడు. ‘జలపాతం’కావ్యం దాశరథికి అంకితమిస్తూ...
‘నా తరుణకావ్య లతిక లానాడు పైకి
ప్రాక లేక దిక్కులు సూడ, నీ కరాలు
సాచి రేకు రేకులకు కెంజాయలద్ది
పందిళ్ల పైకి ప్రాకించినాడు’ అని గౌరవ భావాన్ని ప్రకటించారు.
‘అపారమైన సృజనశక్తి కలిగిన సృష్టికర్తలు తమ సృజనశక్తి విశృంఖలంగా ఉద్దీపింపచేసుకోగలిగిన ధీమంతులు ఎప్పు డూ ఒక సిద్దాంతానికి గాని, భావానికిగాని బానిసలై ఉండ రు. మనస్సును నిరంతరం విస్తరించుకోవడమే వారి ఆద ర్శం’ అని దాశరథి కవితాయావూతను గురించి గోపిచంద్ అన్న మాటలు అక్షర సత్యాలు.
దాశరథిని ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళా ప్రపూర్ణ’ బిరుదుతోను, ఆగ్రా, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్‌లతోను సత్కరించాయి. దాశరథి ‘కవితా పుష్పకం’ కావ్యానికి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు,’తిమిరంతో సమరం’ కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు లభించాయిపముఖ ఉర్దూకవి గాలిబ్ గజళ్లను ఆట తేటగీతి, ద్విపదలలో ‘గాలిబ్ గీతాలు’గా రచించి ప్రశంసలు పొందారు దాశరథి. తెలంగాణ కవులలో అతిరథుడు, తెలుగు కవులలో మహారథుడు, మానవతావాది దాశరథి.

-వలిశెట్టి గాంధీ
కాకతీయ విశ్వవిద్యాలయం
(జూలై 22న దాశరథి జయంతి సందర్భంగా..)

Other Articles
Namaste Telangana Specials Stories
namaste Videos


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine