Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Sunday, May 19, 2013
 


Home >> Edit Page >>Articles



అలుపెరగని మాటల, పనుల జడి బీఎస్‌ఏ

కార్మికోద్యమంలో, ప్రత్యేకించి ‘పోస్ట్ అండ్ టెలిక్షిగాఫ్’ కార్మికోద్యమం లో, పౌరహక్కుల ఉద్యమంలో, విప్లవోద్యమంలో బీఎస్‌ఏ సత్యనారాయణ అలుపెరుగని యోధుడు. న్యాయవాదవృత్తిలో, రాజకీయ ఖైదీల విడుదల ఉద్యమంలో కార్యకర్తగా, నాయకుడిగా, ఉపాధ్యాయుడిగా, శ్రమజీవి మాసపవూతిక సంపాదకుడిగా బి.ఎస్.ఎ.గా సుప్రసిద్ధుడు. బొమ్మకంటి ఆంజనేయ (బిఎస్‌ఎ) సత్యనారాయణ నాలుగున్నర దశాబ్దాల విరామ మెరుగని మాటల నుంచి, పనుల నుంచి, ప్రజాసేవ నుంచి జూన్ 22 ఉదయం శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు. పోస్టల్‌శాఖ యాజమాన్యమూ, ప్రభుత్వమూ, పోలీసులూ కలిసి పెట్టిన వేధింపులూ, రెండుమూడు సార్లు జైలు నిర్బంధమూ చిత్రహింసలూ, జీవితమంతా ఆర్థిక ఇబ్బందులూ, నిత్యం వెంటాడిన అనారోగ్యమూ కూడా ఆయనను హాస్యచతురత నుంచీ, పని నుంచీ, ప్రయాణాల నుం చీ అడ్డుకోలేక పోయాయి. కానీ జూన్ 22 అర్ధరాత్రి దాటాక వచ్చిన గుండెపోటు మాత్రం ఆయనను అభిమానుల నుంచీ, సహచరుల నుంచీ భౌతికంగా దూరం చేసింది.

ఆయనతో ఒకసారి పరిచయంలోకి వచ్చినవావరైనా ఆయన సంభాష ణా చతురతకు, హాస్యస్ఫూర్తికి సమ్మోహితులై ఆయనతో సాన్నిహిత్యంలోకి రావలసిం దే. ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో చిరకాల అనుభ వం, విస్తృత సాహిత్య, సిద్ధాంత అధ్యయనం వల్ల ఆయన వాదనా పటిమ నిరంతర ధారలా, అవతలివాళ్లను ఒప్పించేలా, జాక్ లండన్ ‘ఉక్కుపాదం’లో చిత్రించిన ఎర్నెస్ట్ ఎవర్ హార్డ్ వాదనలా ఉండేది. అతి మామూలు విషయాలలో లోతైన విశ్లేషణనూ, అతి గంభీరమైన విషయాలలో హాస్యాన్నీ రంగరించ గలిగిన నేర్పు ఆయనది. ఆర్థికఇబ్బందులతో ఆవకాయ పచ్చడితో మాత్రమే భోజ నం చేస్తూ, కమ్యూనిస్టును గదా ఎర్రని అన్నం తినకపోతే ఎట్లా అని చమత్కరించిన వాడాయన. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన అత్యంత ప్రతిభావంతుడైన ఆలోచనాపరుడు. నిరంతర ఆచరణశీలి. అలుపెరగని కార్యకర్త. అత్యంత కష్టభరితమైన జీవితాన్ని అతిసాధారణంగా, పదహారణాల హాస్యం తో కలుపుకుని జీవించినవాడాయన. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో 1940 లో పుట్టిన బిఎస్‌ఎ రైల్వే మెయిల్ సార్టింగ్ ఉద్యోగిగా,అప్పటి పోస్ట్‌అండ్ టెలిక్షిగాఫ్ శాఖలో 1960లలో హైదరాబాద్ చేరారు.

ఆదశాబ్దం చివర నక్సల్బరీ వసంత మేఘగర్జనకు గొంతు కలిపి న కార్మికోద్యమనాయకులలో ఆయన ఒక రు. ఆయన పార్థివదేహం దగ్గర మిత్రులు గుర్తు చేసుకున్నట్టు 1970 నుంచి 75 దాకా హైదరాబాదులో ఏ విద్యార్థి, యువజన, రచయితల సభ జరిగినా దాని ఏర్పాట్లు చూసే బృందంలో ఎల్‌ఎస్‌ఎన్ మూర్తి (ఆ తర్వాత క్రాంతి సంపాదకుడు, ప్రస్తుతం రాజమండ్రి జైల్లో రాజకీయ ఖైదీ), యు శ్రీనివాసులు (తత్వశాస్త్ర అధ్యాపకుడు, అజ్ఞాత జీవితంలో మరణించారు), జంగయ్య మాస్టారు (కొద్ది సంవత్సరాల కింద మరణించిన హైదరాబాద్ విప్లవోద్యమ పెద్దదిక్కు)లతో పాటు బిఎస్‌ఎ కూడ ఉండేవాడు.ఎమ్జన్సీ విధించిన కొన్ని నెలల తర్వాత హైదరాబాదులో రెండో విడత అరెస్టులు జరిగాయి. అవి చట్టబద్ధమైన అరెస్టులు కాదు. విప్లవోద్యమ సానుభూతిపరులందరినీ పట్టుకుపో యి, ఎసి గార్డ్స్ దగ్గర బారక్‌లలో రోజుల తరబడి చిత్రహింసలు పెట్టారు. తర్వాత అందులో కొందరిని ఆంతరంగిక భద్రతా చట్టం కింద జైలుకు పంపా రు. అలా జైలుకు వారిలో బిఎస్‌ఎ ఒకరు.

జైలునుంచి రెండు నెలలలోనే విడుదలయ్యారు గాని ఆ చిత్రహింసల నుంచి తేరుకోవడానికి మాత్రం నాలు గు నెలలు పట్టింది. అప్పటికే ట్రేడ్ యూనియన్ నాయకుడిగా యాజమాన్యం కంటగింపుతో ఉంది గనుక ఈ అరెస్టు కారణాన్ని వాడుకుని సస్పెన్షన్‌కు గురి చేసింది. ఎమ్జన్సీ తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరారు గాని అప్పటికి విప్లవోద్యమ సాన్నిహిత్యం మరింత పెరిగి తత్వశాస్త్ర, కార్మికోద్యమ చరిత్ర అధ్యాపకుడిగా రాష్ట్రమంతా తిరగడం మొదలయింది. అలా రాడికల్ విద్యార్థి యువజనులకు తత్వశాస్త్ర అధ్యాపకుడిగా విజయవాడ వెళ్లినప్పుడు 1984లో ఆయనను, మరొక పదిహేనుమంది విద్యార్థి యువజనులను అరెస్టుచేసి కానూరు కుట్రకేసు పెట్టి రాజమండ్రి జైలులో నిర్బంధించారు. కార్మికోద్యమ నిర్మాణం తో పాటు కార్మిక పథం పత్రిక నిర్వహణ బాధ్యతలలో కూడ ఉన్నారు.

ఆ నిర్బంధం నుంచి విడుదలయ్యాక ఆయన కొన్ని సంవత్సరాలు పూర్తికాలం అధ్యాపకుడిగానూ, విప్లవోద్యమ పత్రికల రచయితగానూ పనిచేసి అనా రోగ్య కారణాలతో 1990ల మొదట్లో బహిరంగజీవితంలోకి వచ్చి మళ్లీ పోస్టల్ శాఖలో చేరారు. ఈ లోగా న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకుని 1995 నాటికి హైకోర్టులో న్యాయవాదిగా పని ప్రారంభించారు. సంపాదకుడిగా ‘శ్రమజీవి’ మాసపవూతిక ప్రారంభించారు. రెండున్నర దశాబ్దాల విప్లవోద్యమ, కార్మికోద్యమ అభినివేశం, కొత్తగా నేర్చుకున్న న్యాయశాస్త్రం కలగలిపి శ్రమజీవిని చాలా ప్రభావశీలంగా తీర్చిదిద్దారు. ‘కార్మిక చట్టాలు ఒక పరిశీలన’, ‘భారత కార్మికోద్య మం నిర్మాణపరమైన పొరపాట్లు’,‘కాంట్రాక్టు లేబర్ నకమబద్ధీకరణ నిషే ధం) చట్టం సుప్రీంకోర్టు తీర్పులు- కొన్ని మార్గదర్శక సూత్రాలు’ వంటి ఎన్నో ముఖ్యమైన వ్యాసాలు రాశారు. ఒక న్యాయమూర్తి అవినీతి గురించి కరపవూతాన్ని తన పత్రికలో పునర్మువూదించి, కోర్టు ధిక్కరణ నేరం కింద చాలకాలం వేధింపును అనుభవించారు. ఈ క్రమంలోనే పౌరహక్కుల రంగంలో కృషి చేస్తూ, మారుమూల గ్రామాలకు వెళ్లి న్యాయ సహాయం అందించడం ప్రారంభించారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు పాలనాకాలంలో పోలీసు నిర్బం ధం మధ్య, రాజశేఖరడ్డి పాలనాకాలంలో ప్రైవేటు హంతకముఠాల హింసా కాండ మధ్య సాహసికంగా విప్లవకారులకు, ప్రజలకు న్యాయసహాయం అం దించిన అతితక్కువమంది న్యాయవాదులలో ఆయన ఒకరు.

గత కొద్ది సంవత్సరాలుగా ఆయన రాజకీయ ఖైదీల హక్కుల పరిరక్షణ మీద కేంద్రీకరించి, అసాధారణమైన కృషి సలుపుతున్నారు. జైలులో ఉన్నవారి కేసులు న్యాయస్థానాలలో వాదించడంతో తమ పని అయిపోయిందనుకునే న్యాయవాదిలా కాక, జైలులో తన కక్షిదారుల హక్కులను కాపాడవలసిన బాధ్యత కూడ తనదేనని ఆయన భావించారు. ఆంధ్రవూపదేశ్ లోని జైళ్లు మాత్ర మే కాదు, కాలికి బలపంకట్టుకుని భోపాల్, నాగపూర్, రాయపూర్, జగ్దల్ పూర్ వంటి జైళ్లకు కూడ వెళ్లి ఖైదీలను కలిసి వారి యోగక్షేమాలు కనుక్కుని వారి అవసరాలుచూసే పని నిర్వహించారు. అందువల్లనే ఆయన ఇటీవల ఏర్పడిన రాజకీయ ఖైదీల విడుదల పోరాట కమిటీకి నాయకుడయ్యారు. అలాగే పోలీసు కస్టడీకి తీసుకున్న ఖైదీలకు తోడుగా న్యాయవాది ఉండాలనే నిబంధనను చాల క్రియాశీలంగా నిర్వహించిన న్యాయవాది ఆయన. అది కేవ లం మొక్కుబడిగానో, పోలీసు ఆంక్షలకు లోబడో కాకుండా సుప్రీంకోర్టు నిబంధనలకు, డికె బసు ఆదేశిక సూత్రాలకు లోబడి నిర్వహించి,ఎందరినో పోలీసు కస్టడీలో చిత్రహింసలకు, హత్యకు గురి కాకుండా కాపాడారు. చిట్టచివరికి ఆజాద్ సహచరి పద్మను, ఆ కేసులోని ఇతర ఖైదీలను వరంగల్ జిల్లా ఖానాపూర్ పోలీసు కస్టడీలో మంగళ, బుధ, గురు వారాలు కంటికి రెప్పలా కాపాడి, గురువారం సాయంత్రం హైదరాబాద్ చేరి, ఆ రాత్రే గుండెపోటుతో మరణించారు.

వ్యక్తిగతంగా నాకు ఆయన 1975లో తొలిపరిచ యం. ఆ సంవత్సరం నాగార్జునసాగర్ విజయపురిలో పోస్టల్ ఉద్యోగులు నిర్వహించిన మేడే సభలో ఆయన వక్తగా వచ్చారు. ఆ సాయంత్రం అక్కడ గెస్ట్ హౌజ్ దగ్గర పార్క్‌లో తిరుగుతుండగా ప్రముఖ రచయిత్రి లత అక్క డే ఉన్నారని తెలిసింది. సంభాషణలో ఆమె అప్పుడే వెలువడుతున్న రామాయణ విషవృక్షం మీద చాల దురుసు వ్యాఖ్యలు చేస్తే, దానికి అంతే దీటుగా జవాబిచ్చి, ఆమె నోరెత్తకుండా చర్చ చేసిన బిఎస్‌ఎ పద్నాలుగేళ్ల వయసులో నా మీద తొలి ప్రభావం. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు మేమిద్దరం ఒకే రంగంలో కలిసి పని చేశాం. వేరువేరు రంగాల్లో ఉన్నప్పుడైనా సన్నిహితంగా ఉన్నాం. మే 27న ఉద్యోగ క్రాంతి సభలో కలిసి ‘ఎల్ ఎస్‌ఎన్‌కు పుస్తకాలు తీసుకెళ్లాలి, ఈ వారంలో వస్తాను’ అన్నవే ఆయన చివరి మాటలు. ప్రతిసారీ ఆశ్చర్యపరుస్తూ, ఆహ్లాదపరుస్తూ సాగిన నాలుగు దశాబ్దాల ఆత్మీయ మిత్రుడికి ఆయన ఎన్నడూ దరిజేరనివ్వని కన్నీటి వీడ్కోలు. ఆయన జీవితమంతా తెలిసిన మిత్రుడన్నట్టు బిఎస్‌ఎ జీవితం చార్లీ చాప్లిన్ సినిమా లాంటిది. ఒక ఆహ్లాదకర, ఉత్తేజకర చిరునవ్వు గాథ. బహుశా ఒక కన్నీటి చుక్క కథ కూడ.

-ఎన్. వేణుగోపాల్

Other Articles
Namaste Telangana Specials Stories
namaste Videos


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine