Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Sunday, May 26, 2013
 


Home >> Edit Page >>Articles



బీసీల అభివృద్ధిపై ప్రభుత్వ అక్కసు

అధికార కాంగ్రెస్‌పార్టీ రెండేళ్లుగా బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ, వారి ప్రయోజనాలను కాలరాస్తున్నది. దీనిపై అనేకసార్లు మంత్రులతో చర్చలు జరిపినా పరిష్కరించలేదు. రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది బీసీలకు అన్యాయం జరుగుతుంటే బీసీ మంత్రులు, శాసనసభ్యులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 15 బీసీ కులాల ఫెడరేషన్లు నడుస్తున్నాయి. వీటికి నాలుగేళ్లుగా ఛైర్మన్లు, డైరెక్టర్లు, పాలక మండళ్లను ఏర్పాటు చేయలేదు. పాలక మండళ్లు నియమించకపోతే ఈ కులాలకు రుణాలు ఎలా అందుతాయి? వారు ఎలా అభివృద్ధి చెందుతారు? అలాగే బీసీ కులాలకు చెందిన జూనియ ర్ అడ్వకేటు స్టైఫండ్ పెంచకుండా నాలుగు సంవత్సరాలుగా ఆర్థికశాఖ సంబంధిత ఫైలును తొక్కిపెట్టింది. అదే ఎస్సీ, ఎస్టీ అడ్వకేట్ల స్టైఫండ్‌ను నాలుగేళ్ల కిందట 500 నుంచి 1000 రూపాయలకు పెంచింది. ఒక వర్గానికి పెంచి, మరో వర్గానికి పెంచకపోవడం వివక్ష కాదా? ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా ‘బీ’ కేటగిరికి చెంది న విద్యార్థులకు ప్రభుత్వమే కౌన్సిలింగ్‌లో ఫ్రీ సీట్లు ఇచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం ఫీజులు మంజూరు చేయకపోవడం తో విద్యార్థులు హైకోర్టులో కేసు వేశా రు. దీంతో ఈ ఫీజులు వెంటనే మంజూరు చేయాలని హైకోర్టు తీర్పు చెప్పింది. కోర్టు తీర్పు ప్రకారం ప్రభు త్వం జీవో 222 జారీ చేసింది. కానీ ఇంత వరకు నిధు లు విడుదల చేయలేదు.

బీసీలు పదేళ్లు పోరాటం చేసి ఫీజు రీయంబర్స్‌మెంటు పథకాన్ని సాధించా రు. పేద బీసీ కులాల విద్యార్థులు ఉన్నత విద్యలు చదువుతుంటే ఓర్వలేని ప్రభుత్వం ఈ పథకాన్ని ఎత్తివేయడానికి కుట్రలు చేస్తున్నది. అందుకే విద్యా సంవత్సరం ముగుస్తున్నా 26లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల ఫీజులకు రీయంబర్స్‌మెంటు పథకంలో బడ్జెట్ కేటాయించలేదు. నాలుగేళ్ల వరకు బీసీల స్కాలర్‌షిప్, ఫీజు రీయంబర్స్‌మెంట్, ఇతర స్కీంల ఆదాయ పరిమితి లక్ష రూపాయలు ఉన్నది. ఎస్సీ, ఎస్టీల ఆదాయ పరిమితి లక్ష నుంచి రెండు లక్షలకు పెంచిన ప్రభుత్వం బీసీలకు పెంచకపోవడం శోచనీయం.

రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట 300కాలేజీ బీసీ బాలుర హాస్టళ్లను మంజూ రు చేసింది. ప్రభుత్వ జీవో ప్రకారం వీటిని రెండు నెలల్లో ప్రారంభించాలి. కానీ రెండేళ్లు గడిచినా ఇంకా 200 హాస్టళ్లు ప్రారంభంకాలేదు. అలాగే నాలుగేళ్ల కిందట మంజూరు చేసిన బీసీ కాలేజీ బాలికల హాస్టళ్లలో ఇంకా 60 ఆరంభమవలేదు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా హాస్టళ్లు ప్రారంభించకుండా బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నది. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 15 బీసీ స్టడీ సర్కిళ్లు నిర్వహిస్తున్నది. ఈ మధ్య కాలంలో టీచర్, గ్రూప్-1, గ్రూప్-2, బ్యాంకింగ్, సివిల్ సర్వీస్, పోలీస్ ఉద్యోగాలు భారీ ఎత్తున రిక్రూట్‌మెంట్లు జరుగుతున్నాయి. కానీ ఈ స్టడీ సర్కిళ్లలో నామమావూతపు ఉద్యోగాలకు మాత్రమే కోచింగ్ ఇస్తున్నారు. చాలా మంది బీసీ విద్యార్థులు బయట కోచింగ్ సెంటర్ల లో వేల రూపాయలు చెల్లించలేక నానా అవస్థలు పడుతున్నా రు. మరి ప్రభుత్వం ఈ స్టడీ సర్కిళ్లను ఎందుకోసం ఏర్పాటు చేసినట్టు? స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34నుంచి 22 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం అనేక కుట్రలు చేసింది. ఈ చర్యలను బీసీలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టే తగ్గి రిజర్వేషన్ వ్యతిరేకులతో హైకోర్టులో కేసులు వేయించింది. బీసీ జాబితాలో మైనార్టీలకు నాలుగు శాతం ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించినప్పు డు, ఈ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. రాత్రికి రాత్రే ఢిల్లీ నుంచి సీనియర్ న్యాయవాదులను రప్పించింది. కోట్ల రూపాయల ఫీజులు చెల్లించి సుప్రీంకోర్టులో స్టే తీసుకువచ్చి, రిజర్వేషన్లను అమలు చేసింది. కానీ బీసీ రిజర్వేషన్లను రక్షించడానికి నేటి వరకు ఏ ఒక్క చర్య తీసుకో లేదు.

రాష్ట్ర ప్రభుత్వం 2003లో కింగ్ కోఠీలో బీసీ భవన్‌కు ముఖ్యమంవూతిచేత పునాది రాళ్లు వేయించింది. రెండు కోట్ల ఖర్చుతో బీసీ భవన్ నాలుగు అంతస్తులు కట్టారు. ఆ తర్వాత బీసీ భవన్‌ను ముస్లిం సోదరులు కోరగానే యూనాని హాస్పటల్‌కు దానం చేశారు. బీసీల కోసం నిర్మించిన భవన్‌ను ఇతరులకు కేటాయి స్తే, తొమ్మిదేళ్లుగా బీసీ భవన్‌ను మరోచోట నిర్మించి ఇవ్వలేదు. ఇది వివక్ష కాదా?ఇదేనా బీసీల పట్ల చూపే ప్రేమ? సెజ్‌లకు, మల్టీనేషనల్ కంపెనీలకు వందల ఎకరాలు కేటాయించే ప్రభుత్వం బీసీభవన్‌కు ఒక్క ఎకరా భూమి ఇవ్వడానికి మనసొప్పడం లేదా?

బీసీ సంక్షేమ శాఖ బడ్జెట్, ఇతర పథకాలు పెరిగినందున శాఖను పటిష్టం చేయడానికి ముఖ్యమంత్రి 12 డిప్యూటీ డైరెక్టర్ పోస్టులు, 35 అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు, 60 సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మంజూ రు చేశారు. 10నెలలు గడిచినా ఈ పోస్టులు భర్తీ చేయడం లేదు. కింది అధికారులకు ప్రమోషన్లు ఇవ్వడం లేదు. దీంతో బీసీ సంక్షేమ శాఖ కార్యకలాపాలు నత్తనడకన సాగుతున్నాయి. బీసీ సంక్షేమ శాఖలోనే బీసీ ఉద్యోగుల కు అన్యాయం జరుగుతున్నది. బాగా పనిచేసే జాయింట్ డైరెక్టర్లకు ప్రాధా న్యం లేని పోస్టులు ఇచ్చి అణచివేస్తున్నారు. జిల్లాస్థాయి పోస్టులు ఇవ్వడంలో బీసీలకు అన్యాయం చేస్తున్నారు. బీసీలకు అన్ని రంగాల్లో జరుగుతున్న అన్యాయాల్లో ఇవికొన్ని మాత్రమే. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా బీసీ వ్యతిరేక విధానాలకు స్వస్తి చెప్పాలి. బీసీల సమస్యలపై స్పందించి వాటిని పరిష్కరించాలి.

-ఆర్. కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం

Other Articles
Namaste Telangana Specials Stories
namaste Videos


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine