HomeEditpage Articles

రాజా కాలస్య కారణమ్

Published: Fri,February 17, 2017 12:24 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   

కాలో వా కారణం రాజ్ఞో రాజా వా కాలకారణమ్ ఇతి తే సంశయో మా భూద్రాజా కాలస్య కారణమ్ కాలం రాజును శాసిస్తుందా రాజు కాలాన్ని శాసిస్తాడా? అనేది పూర్వకాలంలో ఓ మీమాంస. పండితులైన విజ్ఞులు చెప్పారు. కాలం రాజుకు కారణమా(మార్చగలుగుతుందా?) రాజే కాలానికి కారణమా(మారుస్తాడా?) అన్న సందేహం అవసరం లేదు. రాజే కాలానికి కారణం. పరిపాలకుడే కాలాన్ని మార్చగలుగుతాడు.
Kcr-photo

2009 నాటి మాట..
నిమ్స్‌లో కేసీఆర్ నిరాహారదీక్ష తొమ్మిదిరోజులు దాటింది. ఆరోగ్యం మీద గంటకో వార్త. కేంద్రంలో స్పందనలేదు. ప్రధాని విదేశాల్లో ఉన్నారు. ఎపుడొస్తాడో తెలియదు. సోనియా ఆరోగ్యం బాగాలేదనే వార్తలు. సమస్య ఎలా ముగుస్తుందో తెలియదు. సాక్షి కార్యాలయం. సీట్లలో అయితే కూర్చున్నాం కానీ.. మనసు మనసులో లేదు. టీవీలకేసి మాటిమాటికీ చూస్తున్నాం. బ్రేకింగ్ వార్తల్లో భయం భయంగా ఏదో వెతుక్కుంటున్నాం. అయోమయం. సీట్లో కూర్చోలేము. బయట తిరగనూ లేము. చాయ్.. పిలిచాడు మిత్రుడు రమణాచారి. మూడు నాలుగు ఫ్లోర్ల మధ్య మెట్లమీద ఎస్ప్రెస్సో మిషన్ చాయ్. చాలామంది చేరారక్కడ. ఎడిట్‌పేజీ ఎడిటర్ సురేందర్‌రాజు మిత్రులతో అంటున్నారు కేసీఆర్ క్రిటికల్ అట కదా! అని. ఆయన ముఖంలో ఏ భావమైతే లేదు కాని..నాకైతే గొంతులో జీర వినిపించినట్టు అనిపించింది. ఆ మాట తర్వా త పాటించిన అర నిమిషం నిశ్శబ్దం ఆయన మానసిక పరిస్థితి తీవ్రతను చెప్తున్నది. ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు. వచ్చి సీట్లలో కూర్చు న్నాం. హఠాత్తుగా పక్క సీట్లో గుసగుసలు..అమీర్‌పేటలో మెస్సులు పగులగొడుతున్నారట! గుండె దడదడలాడింది. ఏం జరుగుతున్నది తెలుసుకోవాలన్న ఆత్రుతతో చెవులు అటువైపు అప్పగించినా .. ఇంకేం వింటామేమోనన్న భయం.. తెలంగాణ జర్నలిస్టులకు కొన్ని సందర్భాలు ఎంత దైన్యంగా ఉంటాయంటే ఎమోషన్లు కనపడకూడదు. అక్కడున్న తెలంగాణ ఉద్యోగులందరిదీ అదే స్థితి. మధ్యతరగతి ఉద్యోగి కనపడకూడని బాధను.. ఎవరికి చెప్పుకుంటాడు?
డ్యూటీ అయిందనిపించి ఇంటికి చేరాక..అర్ధరాత్రి దాటాక మిత్రుడి ఫోన్. అవును..ఎవరికీ నిద్రల్లేవు. ఏం జరుగుతుంది సార్? చివరకు ఎలా ముగుస్తుంది? అడుగుతున్నాడు. జవాబు లేదని అతడికీ తెలుసు. ఫోన్ సంభాషణ చాలా వరకు సైలెన్సే.. హఠాత్తుగా అన్నాడు. కేసీఆరే లేకపోతే తెలంగాణ ఎందుకుసార్..? ఊహించడానికి కూడా ధైర్యం చేయలేని ప్రశ్న. అంతా శూన్యంగా కనబడింది. ఆలోచనలు ఎటు పోతున్నాయో తెలియ డం లేదు. కేసీఆర్ లేని తెలంగాణ ఏమిటి? కేసీఆరే లేకుంటే ఇక తెలంగాణ ఏమిటి? ఆ తెలంగాణను ఏం చేసుకుంటాం? ఇంకెవడో వస్తే కృష్ణా, గోదావరి నీళ్లకోసం కొట్లాడుతడా? 610 జీవోలతో న్యాయం జరిపిస్తడా? కేజీ టు పీజీలు, అవమానాల విముక్తి.. అంతా మరచిపోవాల్సిందేనా..? వంద ల సభల్లో నినదించిన తెలంగాణ మరో తరం దాక ఆగిపోవుడేనా..? ఊహించటానికే సిద్ధంగా లేని స్థితి. రాత్రంతా టీవీ నడుస్తూనే ఉంది. అసంకల్పితంగానే రిమోట్ మీద వేళ్లు కదులుతూనే ఉన్నాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం, మలయాళం చానెళ్లు మారుతూనే ఉన్నాయి. ఏం వెతుకుతున్నామో కూడా తెలియదు. కుర్చీలోనే తెల్లారింది. పాలబ్బాయి తలుపుతట్టి ప్యాకెట్ వేశాడు. కిందికి వంగి అందుకుంటుంటే లిప్టుదాకా వెళ్లిన వాడు వెనక్కి తిరిగి అడిగిన ప్రశ్న... ఎట్లుంది సార్..ఇస్తరా.. సంపేస్తరా..? కళ్లు ఫ్లోరింగ్‌ను చూశాయో..రూఫ్‌ను చూశాయో గుర్తు లేదు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చినా వేస్టే కింద షాపులో కస్టమర్‌తో చెప్తున్నాడు షాపతను. చాలామందిలో ఉన్నదీ ఇదే ఫీలింగ్.

తర్వాత కాలంలో విద్యుత్ ఉద్యోగులు నిర్వహించిన బహిరంగసభలో అనుకుంటా అవసరమైతే మళ్లీ దీక్షకు సిద్ధమని కేసీఆర్ ప్రకటించారు. అనంతరం ఏదో టీవీలో ప్రజలతో కేసీఆర్ ఫోన్‌ఇన్ కార్యక్రమం. వరంగల్ జిల్లాకు చెందిన ఓ పోలీసు ఉద్యోగి సీమాంధ్ర అధికారులతో తామెంత ఇబ్బంది పడుతున్నదీ చెప్పాడు. చివరగా ఓ చిన్న రిక్వెస్ట్‌సార్ అంటూ దయచేసి ఎట్టిపరిస్థితిలో దీక్షకు మాత్రం వెళ్లవద్దు సార్ బతిమాలటం ప్రారంభించాడు. మీమీదే ఆశలు పెట్టుకున్నాం సార్. అన్యాయమై పోతాం గొంతుపూడుకుపోయిందతనికి. అవతల ఏడుస్తున్నట్టున్నాడు. కొంత ఉద్వేగం కమ్ముకున్నా తేరుకున్న కేసీఆర్ అతనికి ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించారు. వినలేదు. చివరికి ఏది చేసినా ప్రజలు నిర్ణయించిన ప్రకారమే చేస్తానని హామీ ఇవ్వటంతో ఊరట చెంది అన్నాడు ఉద్యమం చేద్దాం సార్. ఈసారి మేంగూడ వస్తం. తప్పకుండా తెలంగాణ వస్తది. మన తెలంగాణ బాగుపడుతది తృప్తిగా అన్నాడు.

అంటే ఆనాడే తెలంగాణ సాధన మాత్రమే కాదు.. ఆ తర్వాతా.. అనే విషయంమీద ప్రజల్లో తమకు తెలియకుండానే ఓ స్వప్నం ఉంది. తెలంగాణ సాధించాక.. అనేదాని మీద.. తెలిసీ తెలియకుండానే అస్పష్టంగా ఒక రోడ్‌మ్యాప్ కూడా ఉంది. ఉద్యమకాలంలో కేసీఆర్ అనేక బహిరంగసభల ప్రసంగాల్లో..అపుడపుడూ ఇంటర్వ్యూల్లో చెప్పిన అంశాలను ప్రజలు సీరియస్‌గానే తీసుకున్నారు. అవన్నీ..భవిష్యత్తు మీద ప్రజలకు ఒక విజన్‌ను అందించాయి. తెలంగాణ సాధన, భవిష్యత్తు నిర్మాణం కేసీఆర్‌తో అంతగా పెనవేసుకుపోయాయి.

తెలంగాణకు సంబంధించి కేసీఆర్ ప్రస్థానంలో రెండు పార్వాలున్నాయి. ఒకటి ఉద్యమకారుడు. రెండు పరిపాలకుడు. ఉద్యమకారుడిగా కేసీఆర్ గర్జించే సింహం. నిప్పులు చిమ్మే అగ్నిపర్వతం. పాలకులను గడగడలాడించే ఎత్తుగడలు, ఊహకే అందని వ్యూహాలు. ఒక్క పిలుపుతో లక్షల మందిని వీధుల్లోకి రప్పించిన నాయకత్వ పటిమ. అంధకార చరిత్ర అనుకున్న తెలంగాణను మహత్తరవైభవమంతా మనదే అనిపించిన చాతుర్యం. తెలుగుతల్లి భావోద్వేగ సంకెళ్ల ను బద్దలు కొట్టిన, నిజాం వైభవాన్ని కీర్తించిన సాహసం..భావోద్వేగాలు..బలిదానాల మధ్య సాగిన చరిత్ర.

ఇక రెండో పార్శం.. పరిపాలన..
2014 జూన్ 2న ఉదయం రాజ్‌భవన్‌లో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అనే నేను.. అంటూ ప్రమాణం చేసిన కేసీఆర్‌లో కొత్త మనిషి కనిపించాడు. అనేకమంది నాయకులకు జీవితకాలపు స్వప్నమైన ముఖ్యమంత్రి పదవీ స్వీకార మహోత్సవం. ప్రమాణం కాగానే సన్నిహితుల ఆలింగనాలతో ముఖాలు మతాబుల్లా వెలిగిపోయే తరుణం. కానీ కేసీఆర్‌లో అవేవీ లేవు. గాంభీర్యం, వినయం పోటీపడ్డాయి. ఒక కొత్త మనిషి కనిపించాడు. పదవి కొందరికి అలంకారం. కొందరికి బాధ్యత. తాను తలకెత్తుకున్నదెంత బరువైన బాధ్యతో తెలిసినతనం ఆయనలో ఉట్టిపడింది. ఎవరైనా గమనించారో లేదో గానీ..ఆ తర్వాత కాలంలో పరిపాలకుడుగా మనకు కనిపించింది ఆ కొత్త కేసీఆరే. మూడేండ్లు కావస్తున్నా ఆయనలో అదే వినమ్రత.

పదవీబాధ్యతలు స్వీకరించిన తర్వాత కేసీఆర్ పాలకుడిగా తానేమిటో నిరూపించుకున్నారు. ఆయన పాలనను విశ్లేషిస్తే స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు కనిపిస్తాయి. తెలంగాణ అరవై ఏండ్ల కల. ప్రజల ఆశలు ఆకాశంలో ఉన్నాయి. తెలంగాణ పునర్‌నిర్మాణానికి సంబంధించిన దీర్ఘకాల పథకాల ప్రయోజనాలు వెంటనే ప్రజలకు అందవు. అందుకే తొలుత స్వల్పకాల పథకాలు ఆసరా పింఛన్లు, బీడీ కార్మికుల భృతి, ట్రాక్టర్లపై ఆటోలపై పన్ను మినహాయింపు, రైతు రుణమాఫీ, రైతులకు ఎరువు లు, విత్తనాలు అందుబాటులోకి తేవటం వంటి పనులు చేపట్టారు. ఆ తర్వాత మధ్య కాలిక పథకాలు మిషన్ కాకతీయ, రహదారులు, భవనాల నిర్మాణాలు వంటివి ముందుకు తెచ్చారు. ఇవి గాడిలో పడగానే దీర్ఘకాలిక వ్యూహాలమీద దృష్టి కేంద్రీకరించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్.. బహుశా దేశంలో ఏ ముఖ్యమంత్రి ఈ స్థాయిలో కసరత్తు చేసి ఉండకపోవచ్చు. ఓ సందర్భంలో ఢిల్లీలో ఉదయం జలసంఘంతో సమావేశం జరిపి ఆ వెంట నే హైదరాబాద్‌కు వచ్చి గంటల తరబడి సమీక్షలు జరిపారు. రేయింబవళ్లు శ్రమపడి నదుల నీటి నడకల తీరును పరిశోధించి పట్టుకున్నారు. ఎగువరాష్ర్టాల్లో ఎన్నెన్ని బ్యారేజీలు కట్టారో.. ఎంత నీరు ఆగిపోయిందో లెక్కలు వేయించారు. అసెంబ్లీలో సీఎం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కేసీఆర్‌లోని జలవిజ్ఞాన విశ్వరూపమే. సాధారణంగా క్యూసెక్కులు, టీఎంసీ వంటి లెక్కలు ప్రజలకు ఎక్కించడం సాధ్యం కాదని ఆ రంగ నిపుణులే అంటుంటారు. కానీ ఏడు గంటల కేసీఆర్ ప్రజెంటేషన్ ఆ భావనను బద్ద లు కొట్టింది. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావునుంచి మాజీ మంత్రి కోమటిరెడ్డి దాకా ప్రశంసలు కురిపించింది అందుకే. ఇవాళ కాస్త చదువు వచ్చిన ప్రతి తెలంగాణ వారికి గోదావరిలో, కృష్ణా నదిలో ఏం జరుగుతుందో అర్థమవుతున్నది.

సాధారణంగా ఎవరు అధికారంలో ఉన్నా ఉద్యోగులు ఆ ప్రభుత్వంతో అంత సఖ్యంగా ఉండరు. ఏదో విషయం లో ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. కానీ మూడేండ్ల కాలం కావస్తున్నా ఇవాల్టికీ ఉద్యోగులు ఇది మా ప్రభుత్వం అంటుండటం కేసీఆర్ చతురతకు నిదర్శనం. వాస్తవానికి కొన్ని శాఖల్లో ఇవాళ తీవ్రమైన పని ఒత్తిడి ఉంది. ఒకటి వెంట ఒకటిగా అనేక పథకాలు వాటి సర్వేలు లబ్ధిదారుల ఎంపికలు ఇలా ఊపిరి సలుపని రీతిలో వర్క్‌లోడ్ ఉంది. అయినా ఉద్యోగు ల్లో చీకాకు లేదు. ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ అనేది కండ్లముందు కనిపిస్తున్నది.
కేసీఆర్ పాలనలో మరో అంశం. మానవీయ త. ఇప్పటికే 30లక్షల పింఛన్లు ఇచ్చిన ప్రభు త్వం తాజాగా ఒంటరి మహిళలకు కూడా పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. విద్యార్థులకు సన్నబియ్యం, అనాథపిల్లల బాధ్యత, చుక్క సత్తయ్య వంటి ఒగ్గు కళాకారునికి పింఛన్ వంటి అంశాలు ఉండనే ఉన్నాయి.

పరిపాలకుడిగా కేసీఆర్ సాధించింది ఏమిటి? లెక్కలు..శాతాలు..పథకాలు చాలా చెప్పవచ్చు. కానీ అనుభవాలే అసలైన ప్రాతిపదికలు. మరి ఆ అనుభవాలేమిటి? ఏం చెప్తున్నాయి?
నాలుగు రోజుల క్రితం.. వనపర్తి జిల్లాలో పంట చేలలో పనులకు ఇతర రాష్ర్టాల కూలీలు వస్తున్నారన్న వార్త. ఉమ్మడి పాలనలో జిల్లాకు నీరు రాలేదు. హక్కు ఉన్నా రాలేదు. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ పాత పాలమూరు జిల్లాలో నాలుగు లిప్టు లు పూర్తి చేసింది. వనపర్తి ప్రాంతానికి కల్వకుర్తి లిఫ్టునీరు వచ్చింది. పంటలు పండుతున్నాయి. వలసబాట పట్టిన వారు తిరిగి రావటం ప్రారంభమైంది. ఒకప్పుడు పొట్ట చేతపట్టుకొని దేశమంతా వలసపోయిన చోటికి ఎక్కడినుంచో పనులకోసం రావటం కాలంతెచ్చిన మార్పా లేక కాలాన్ని మార్చిన పాలనా?
రెండ్రోజుల క్రితం ఫేస్‌బుక్‌లో మంగళపల్లి వెంకటేశ్వర్ పెట్టిన ఓ పోస్టు. పాలమూరుజిల్లాలోని గోపాల్‌పేట మండలం నాగపూర్‌లో మిషన్ కాకతీయ కింద మరమ్మతు చేసిన చెరువును చూశా. నీటితో నిండుగా ఉంది. పక్కన కనుచూపు మేర అంతా వరి పంట. కల్వకుర్తి ఎత్తిపోతలనుంచి చెరువును నింపారు. ఇక్కడి రైతులను పలుకరిస్తే దాదాపు 30 ఏండ్ల తర్వాత యాసంగి పంట వేశామని చెప్పారు. కరువు జిల్లా. వర్షపాతంలో అట్టడుగున ఉండే జిల్లా. పల్లెపల్లెలో పల్లేర్లు మొలిచాయంటూ పాటలు పాడుకున్న జిల్లా. ఇవాళ యాసంగిలోనూ పంటలు పండుతున్నాయంటే కళ్లు చెమర్చుతాయి. కేసీఆర్ పాలనలో ఏం జరిగింది? అనే ప్రశ్నకు ఇంతకు మించిన జవాబు ఉండక పోవచ్చు.

తెలంగాణ వచ్చిన కొత్తలో కొన్ని అంశాల్లో ఏపీ ప్రభుత్వంతో వివాదాలు వచ్చేవి. కొన్ని పాలనకు సంబంధించినవి..కొన్ని రాజకీయాలకు సంబంధించినవి. అప్పట్లో ఏపీకి చెందిన టీడీపీ మంత్రులు తరుచూ ఓ సవాలు విసిరేవారు. చేతనైతే మాతో అభివృద్ధిలో పోటీపడాలి అంటూ. చంద్రబాబు గొప్ప పాలనా చతురుడని.. ఆయనతో సాటి ఎవరూ రారని వారి ధృఢ విశ్వాసం. తెలంగాణ వారికి అందునా కేసీఆర్‌కు పాలన చేతకాదనే ఓ చులకన భావం వారి మాటల్లో తొణికిసలాడేది. కచ్చితంగా చెప్పలేము కానీ ఆ సవాళ్ల ప్రకటనలు ఆగిపోవడానికి ఆరునెలలు కూడా పట్టి ఉండ దు. ఇవాళ ఆ మాట అనడానికి కూడా వారు సాహసించరు. పైగా కేసీఆర్ పాలనకు ఇవాళ ఏపీలో కూడా విశేష ఆదరణ ఉంది.

కొత్తజిల్లాలు ఏర్పాటైన తర్వాత రెండు నెలలకు ఓ పెండ్లి వేడుకలో పాలమూరు నాయకులతో సంభాషణలో ఓ ఆసక్తికర అంశం తెలిసింది. జిల్లా కలెక్టర్ అంటే ఏడాదికోసారి కూడా మా ఊరికి వచ్చే వాళ్లు కాదు. పోనీ వాళ్లను కలవాలంటే అదో రాజ దర్బారులా ఉండేది. నెలరోజులు కాలేదు. మా ఊరు వచ్చారు. ఇగ ఆర్డీవోలు, ఎమ్మార్వోలైతే అదేదో రాండ మ్ సర్వేఅట. ఇంటింటికి తిరిగి నంబర్లు వేస్తున్నారు అని చెప్పారు. పోలీసుశాఖ ఆధునీకరణ మీద జరిగిన సంభాషణలో చెప్పారు. గ్రామాల్లో క్రైంరేటు బాగా తగ్గిపోయింది. ఉపాధి పథకం వల్ల కావచ్చు..చిన్నచిన్న దొంగతనాలు అసలు లేవు. తాగి కొట్టుకునే కేసులు బాగా ఉండేవి. గవర్నమెంట్ గుడుంబా కంట్రోల్ చేసినంక అవి లేవు. సక్కగ 8 గంటలకు ఇంటికి పోతున్నరు. బుక్కెడంత తిని టీవీలు చూసుకుంటున్నరు.. చెప్పాడు.

ఇంకో సందర్భంలో ఆదిలాబాద్ కాంగ్రెస్ నాయకుడొకరు చెప్పిన మాట. ఆసరా పింఛన్లు తీసుకునేటోడు ఎవరూ మాకు ఓటెయ్యరని చెప్పారు. సరిగ్గానే పంపిణీ జరుగుతుందా? అనే ప్రశ్నవేస్తే.. బయోమెట్రిక్ పెట్టిండ్రు కదా.. అన్నాడు. కాంగ్రెస్ టైంల సర్పంచులు పింఛన్ల పేరుమీద మస్తు సంపాదించుకుంటుండె. వంతులేస్కోని పంచుకునెటోల్లు. కేసీఆర్ బయోమెట్రిక్ పెట్టినంక పురాగ బంద్. మిషన్ సంకల పెట్కోని పోతున్నరు. పైస లు చేతుల పెడుతున్నరు. దయకొద్దీ ధర్మం కొద్దీ పదో ఇరవయ్యే ఇస్తే తీస్కుంటున్నరు.. చెప్పాడు. కల్యాణలక్ష్మిల కొంచెం కిరికిరి ఉన్నదిగని ఓట్లకు బాగ ఫరక్‌రాదు. మా ఆశ ఒక్క ఇండ్ల పథకమే. మస్తు మంది అప్లికేషన్లు పెట్టిండ్రు. ఎట్లిస్తడో చూడాలె అన్నడు.

ఆ మధ్య గవర్నర్ తన పుట్టిన రోజు నాడు చెప్పిన మాట...
29 నెలలుగా రాష్ర్టాన్ని గమనిస్తున్నా.. తెలంగాణ వేగంగా పురోగమిస్తున్నది. ఇంకా ఎంతో ప్రగతిని సాధిస్తామన్న విశ్వాసం మీ ముఖాల్లో కనిపిస్తున్నది. నేను జీవితంలో ఎన్నో పుట్టిన రోజులను జరుపుకొన్నప్పటికీ ఎన్నడూ ఇంత ఆనందంగా లేను.

నీళ్లూ... నెత్తురు
కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పరిశీలనకు ఆ మధ్య పశ్చిమ బెంగాల్ బృందం ఇక్కడ పర్యటించినట్టు వార్తలు వచ్చాయి. చాలా కాలంగా పరిచయమున్న బెంగాలీ మిత్రుడికి అభినందనలు చెప్పా. మన దగ్గర ఫ్లోరైడ్ సమస్య ఉన్నట్టే పశ్చిమ బెంగాల్ ఉత్తర, తూర్పు ప్రాంతాలలో మంచినీటి కాలుష్య సమస్య విపరీతంగా ఉంది. కురుపులు, పుండ్లు పడి డజన్ల కొద్దీ మరణిస్తున్నారు. అయితే తమ దగ్గర ఈ పథకం సాధ్యపడదని ఆయన అన్నాడు. ఎందుకు? భగీరథలో అనేక ఇన్‌టేక్ వెల్స్, పైప్‌లైన్లు, శుద్ధికేంద్రాలు, రిజర్వాయర్లు ఉన్నాయి. చాలా భూమి కావాలి. అక్కడ ఈరోజు ఉన్న రాజకీయాల్లో అంగుళం భూమి తీసుకున్నా రచ్చరచ్చే. మీ నాయకుడు నీళ్లను ప్రేమిస్తాడు. మా నాయకులు నెత్తురును ప్రేమిస్తారు.. నిర్వేదంగా అన్నాడాయన.

- ఎస్‌జీవీ శ్రీనివాసరావు

1852
Tags
 ,