HomeEditpage Articles

ఫెడరలిజానికి కొత్త సమస్య

Published: Thu,February 16, 2017 01:57 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

తెలంగాణకు ఎయిమ్స్ ఎట్టకేలకు మంజూరు కావటం సంతోషించదగ్గ విషయమే అయినా, ఈ ఉదంతం లోతులలోకి వెళ్లినపుడు దేశంలో ఫెడరలిజానికి ఏర్పడుతున్న ఒక కొత్త సమస్య మన దృష్టికి వస్తుంది. అయితే ఈ సమస్య తలెత్తటంలో కేంద్రంలోని పాలకపక్షం సెంట్రలిస్ట్ పాత్రతో పాటు, వివిధ రాష్ర్టాల్లోని ఫెడరల్ శక్తుల బలహీనతలు కూడా ఉన్నాయన్నది గుర్తించవలసిన విషయం.

ఫెడరలిస్టు శూన్య పరిస్థితుల కారణంగానే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో స్పష్టంగా గల ఎయిమ్స్‌ను తెలంగాణకు ఇవ్వకుండా తాత్సారం చేస్తూ పక్షపాతాన్ని చూపగలిగింది. సహకార ఫెడరలిజం అంటూ కొత్తలో వల్లెవేసిన మోదీ, చాపకింది నీరు వలె సెంట్రలైజేషన్ చర్యలు తీసుకుంటున్నారు. స్వయంగా తన వ్యక్తిత్వంలోనే సెంట్రలిస్టు లక్షణాలున్నాయి.


ఈఫెడరల్ శక్తులు తమ వ్యూహంలోని లోపాల ను సరిదిద్దుకోనట్లయితే మునుముందు రెం డు విధాలైన నష్టాలు జరుగుతాయి. లేదా ఇప్పటికే జరుగుతున్నవి మరింత ఎక్కువవుతాయి. ఆ రెండు నష్టాలలో ఒకటి, కేంద్రంలోని పాలకపక్షాల సెంట్రలిస్టు ధోరణి ఇంకా బలపడటం. రెండు, దేశంలోని ఫెడరల్ పార్టీలు ఒక ఉమ్మడి శక్తిగా ఉండిన గత కాలపు స్థితి ఇటీవలి కాలంలో బలహీనపడుతుండగా, రాగల కాలంలో ఇంకా బలహీనపడే ప్రమాదం.

సెంట్రలిస్టు శక్తులకు, ఫెడరల్ శక్తులకు మధ్య ఘర్షణస్థితి స్వాతంత్య్రానికి ముందునుంచే ఉన్నది. రెండింటి మధ్య సమతులనం కోసం రాజ్యాంగంలో సహకార ఫెడరలిజం దృక్పథాన్ని తీసుకువచ్చారు. ఈ రెండుశక్తులకు గాని, వాటి మధ్య రాజీకి గాని దేశంలోని వాస్తవిక పరిస్థితులే ఆధారం. చరిత్రలో ఎపుడు కూడా ఒకేజాతిగా లేని భారతదే శం, బ్రిటిష్ వలస పాలన 1947లో ముగిసే నాటికి 556 రాజ్యాలు, సంస్థానాలుగా విడిపోయి ఉంది. కొత్తగా, ఆధునికమైన అర్థంలో ఒక జాతి నిర్మాణం కోసం ఒక మేరకు సెంట్రలిస్టు దృక్పథం అవసరం. అదే సమయంలో దేశ విభజన నాటి దురదృష్టకర పరిణామాలు ఈ ఆవశ్యకతను ఇంకా పెంచాయి. మరొకవైపు దేశ వైవిధ్యతను బ్రిటిష్ పాలకు లు, కాంగ్రెస్ నాయకత్వం కూడా గుర్తించినందున ఫెడరలిజం తప్పనిసరి అయింది. ఈ రెండు ధోరణులలో ఏది తీవ్రస్థాయికి వెళ్లినా దేశ సమగ్రతకు, జాతి నిర్మాణ లక్ష్యానికి హాని కలుగుతుంది కనుక రెండింటిని సమతులనం చేస్తూ సహకార ఫెడరలిజం దృక్పథాన్ని మొదటనే ప్రవేశపెట్టారు.
తాను 2014లో అధికారానికి వచ్చినపుడు ప్రధాని మోదీకి ఈ నేప థ్యం తెలుసు గనుకనే, సహకార ఫెడరలిజం అంటూ తొలినాళ్లలోనే మాట్లాడారు. కాని ఆయన మాటలు పైకి మొక్కుబడిగా చెప్పేవే తప్ప, ఆ దృక్పథం పట్ల చిత్తశుద్ధి లేదని గత రెండున్నరేళ్ల పరిపాలన రుజువు చేసింది. మాటలకు చేతలకు పొంతన తక్కువ కావటమన్నది మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాలు చూపుతూ వచ్చిన ధోరణే. ఈ కొరత నెహ్రూ హయాంలో కొంత తక్కువగా ఉండగా, తర్వాత పెరిగింది. ఆ చర్చలోకి ఇక్కడ పోవటంలేదు. రెండు మూడు మాటలు మాత్రం చెప్పుకోవాలి. కేంద్రంలోని పాలకపక్షాలు, బలహీనపడినాకొద్దీ అధికా ర కేంద్రీకరణ కోసం సహకార ఫెడరలిజాన్ని దెబ్బతీశారు. ఇది రాజకీయమైనది. దేశంలో ఆర్థికశక్తులు బలపడేకొద్దీ ఏకీకృత ఆర్థిక వ్యవహరణ కోసం అవసరమైన చట్టాలు చేయసాగారు. ఇది ఆర్థికమైనది, పరిపాలనాపరమైనది కూడా. ఇవన్నీ కలగలిసి రాష్ర్టాల ఫెడరలిస్టు హక్కు లు అధికారాలను తగ్గిస్తూ పోయాయి. ఒకవైపు ఇదంతా జరుగుతుండగా మరోవైపు రాష్ర్టాలలో ఫెడరల్‌శక్తులకు కొత్త బలం రాసాగింది. రాష్ర్టాల స్థాయిలోని ఆర్థికశక్తులు, రాజకీయవర్గాలు, అస్తిత్వవాద శక్తు లు కొత్త ఆకాంక్షలతో ఎదగటం మొదలైంది. ప్రాంతీయ పార్టీలు ఏర్పడి బలపడుతుండగా, సెంట్రలిస్టు పార్టీల ప్రాంతీయ పునాదులు బలహీనపడసాగాయి.

సరిగా ఈ దశలో భారతదేశపు ఫెడరలిజం కొత్తదశలోకి ప్రవేశించిం ది. సెంట్రలిస్టులకు, ఫెడరలిస్టులకు మధ్య స్పష్టమైన ఘర్షణ స్థితి ముం దుకొచ్చింది. ఈ కొత్త దశలో కొన్ని లక్షణాలు కన్పించాయి. ఫెడరల్ పార్టీలకు ఆ విధమైన స్ఫూర్తి, ఆత్మవిశ్వాసం పెరిగాయి. తమ స్థాయిలో తాము ఒంటరిగానైనా తమ హక్కుల కోసం పోరాడాయి. ఇది ఒక కొత్త ధోరణి కావటంతో ఇతర ప్రాంతీయ పార్టీలతో చేయి కలిపి పోరాడా యి. ఎవరి ఫెడరల్ హక్కులకు ముప్పు కనిపించినా ఇతర ప్రాంతీయ పార్టీలు ముందుకు వచ్చి బాసటగా నిలిచాయి. కేంద్రంలో కాంగ్రెస్ దెబ్బతినగా ఆ పార్టీకి బదులు ఏర్పడిన ప్రత్యామ్నాయ వేదికలలో కీలకపాత్ర వహించాయి. అటువంటి వేదికలలో తరచు వీరిదే ఆధిక్యత అయింది. కొన్నిసార్లు వీరే చొరవ తీసుకుని ప్రత్యామ్నాయాలను నెలకొల్పారు. ప్రతిసారి కూడా వీలైనంత ఎక్కువగా ఫెడరల్ హక్కుల సాధనకు ప్రయత్నించారు. ఇందులో మరొక ధోరణి కూడా కనిపించింది. ప్రత్యామ్నాయ వేదికలు కేంద్రంలో అధికారానికి రాలేనపుడు సైతం ఈ ఫెడరల్‌శక్తులు తమస్థాయిలో లాబీలుగా ఏర్పడి కేంద్రంపై ఒత్తిడి తేగలిగాయి. ఈ వివిధ సమన్వయాలు, కార్యకలాపాలు కాకతాళీయం గా జరిగినవి కావు. చర్చల ద్వారా రూపొందినటువంటివి. అందుకు తగినట్లు వారికి ఫెడరల్ ప్రయోజనాలు చేకూరటంతో పాటు, ఆ ప్రభుత్వాలను రద్దుపరిచి రాష్ట్రపతి పాలనను విధించేందుకు సెంట్రలిస్టు పార్టీ లు జంకాయి. కాంగ్రెస్ హయాంలోనే కాదు, ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు కూడా ఇది కన్పించింది. బీజేపీకి సొంత ఆధిక్యతలు లేకపోవటం అందుకొక కోణం.

ఆ కాలాన్ని ఫెడరలిజానికి ఒక మహర్దశగా భావించవచ్చు. ఆ దశ క్రమంగా బలహీనపడింది. అందుకు కొన్ని కారణాలున్నాయి. కేంద్రం లో సొంత ప్రత్యామ్నాయాలకు బదులు కాం గ్రెస్, బీజేపీలలో ఎవరో ఒకరిని బలపరిచే రోజులు వచ్చాయి. ఆ రెండింటికి ప్రత్యామ్నాయాలు అయిన వేదికలు పలు కారణాలవల్ల భంగపడ్డాయి. వాటి పునరుద్ధరణకు 21వ శతాబ్దంలో జరిగిన ప్రయత్నాలు నెరవేరలే దు. కొన్ని ఫెడరల్ పార్టీలు తమ ప్రభుత్వాల పాలనలు సరిగా లేక జనాదరణ కోల్పోయి దెబ్బతిన్నాయి. ఈ పరిణామాల మధ్య జాతీయస్థాయిలో, ఇతరత్రా ఉమ్మడి రాజకీయాలస్థాయిలో వాతావరణాలు మారాయి. ఇటువంటి కొత్త పరిస్థితులలో ప్రాంతీయ పార్టీలు ఎవరికి వారే అన్న ధోరణిలో పడ్డాయి. ఒక్కోసారి ఒకే రాష్ట్ర పరిధిలో పరస్పరం చేతులు కలిపినా, వేర్వేరు రాష్ర్టాల పార్టీలు, అన్నిరా ష్ర్టాల పార్టీలు ప్రాంతీయంగానో, జాతీయంగానో ఒకటిగా ఏర్పడి లాబీయింగ్ చేయటం దాదాపు లేకుండా పోయింది. ఫెడరలిజానికి కొత్త సమస్య అంటున్నది దీనినే.

2014లో తెలంగాణ ఏర్పడి టీఆర్‌ఎస్ అధికారానికి వచ్చే వేళకు ఉండిన పరిస్థితి ఇది. దీనిని ఒక మేరకు ఫెడరల్ శూన్యత అనవచ్చు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఒకటుంది. యథాతథంగా ప్రాంతీయపార్టీల సంఖ్యగా ని, వాటి ఆధ్వర్యాన గల రాష్ట్ర ప్రభుత్వాల సంఖ్య గాని కొద్దిగా అటు ఇటు మారటాలు తప్ప పెద్దగా తగ్గలేదు. సెంట్రలిస్టు పార్టీలకు ప్రాంతీయ పార్టీల అవసరమూ తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే అసోం వంటి చోట్ల బీజేపీ పాగా వేయగలిగినా, పశ్చిమబెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ర్టాలలో మరొక సెంట్రలిస్టు పార్టీ అయిన కాంగ్రెస్, దానితో పాటు కమ్యూనిస్టులు పతన దశలో ఉన్నారు. మహారాష్ట్రలో శివసేన స్వతంత్రించే మార్గంలో ఉండగా ఢిల్లీ నుంచి ఆప్ ఇత ర రాష్ర్టాలకు విస్తరిస్తున్నది. బలపడిపోయిన ప్రాంతీయ పార్టీలను సెంట్రలిస్టులు పడదోయగలుగుతున్నది లేదు. కాకపోతే ఒకటి కన్న ఎక్కువ పార్టీలున్నచోట వాటిలో చదరంగం ఆడగలుగుతున్నాయి. దీనంతటిని బట్టి అర్థమయేదేమంటే ఫెడరలిస్టు ధోరణులు క్షేత్రస్థాయి లో, రాష్ర్టాల స్థాయిలో ఏమీ తగ్గలేదు. కాని ఈ శక్తుల జాతీయస్థాయి ఐక్యతలు, కార్యకలాపాలలో మాత్రం ఇంతకు ముందటి దశలో లేని శూన్యత ఆవరించింది.

ఇటువంటి ఫెడరలిస్టు శూన్య పరిస్థితుల కారణంగానే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో స్పష్టంగా గల ఎయిమ్స్‌ను తెలంగాణకు ఇవ్వకుండా తాత్సారం చేస్తూ పక్షపాతాన్ని చూపగలిగింది. సహకార ఫెడరలిజం అంటూ కొత్తలో వల్లెవేసిన మోదీ, చాపకింది నీరు వలె సెంట్రలైజేషన్ చర్యలు తీసుకుంటున్నారు. స్వయంగా తన వ్యక్తిత్వంలోనే సెంట్రలిస్టు లక్షణాలున్నాయి. లేనట్లయితే అదే విభజన చట్టం ప్రకారం తమ అధికార భాగస్వామి టీడీపీ పాలించే రాష్ర్టానికి వరుసబెట్టి అన్నీ ఇస్తూ, తెలంగాణకు ఎయిమ్స్‌ను ఆర్థికమంత్రి జైట్లీ బడ్జెట్ సమాధానం కూడా ముగిసి, సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించటం కూడా జరిగిన తర్వాత, టీఆర్‌ఎస్ పక్ష నాయకుడు జితేందర్‌రెడ్డి గట్టిగా గుర్తుచేసిన మీదట గాని చివరి వాక్యంగా మంజూరు చేయటంలో కన్పించేది ఏమి టి? మేము ఇంతగా సహకరిస్తుంటే ఇదా చేసేది? అని చెప్పుకోవలసిన దుస్థితి టీఆర్‌ఎస్‌కు ఎందుకు ఎదురుకావాలి ? దేశంలోని ఫెడరలిస్టు బలహీనతలకు ఇది తార్కాణమవుతున్నది. దాని అర్థం సహకార ఫెడరలిస్టు సూత్రాలకు భిన్నంగా వ్యవహరించాలని కాదు. కాని భిన్నంగా వ్యవహరించే వారి తీరు కు తగినట్లు, ఫెడరలిజంలో ఈ బలహీనదశ లో ఉన్నంతకాలం, వ్యూహం మార్చుకోవలసి ఉంటుంది. తెలంగాణలో ఢీల్ మాంజా, ఖీం చ్ మాంజా అనే సామెత ఒకటి ఉండటం తెలిసిందే.
Ashok

829
Tags
 ,