HomeEditpage Articles

నర్మదా పేరుతో మరో నాటకం

Published: Wed,February 15, 2017 01:57 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

నర్మదా నదిలోనికి ఎనిమిది కాలువల నుంచి కాలుష్యం ప్రవహిస్తున్నది. కాలుష్య శుద్ధి యంత్రాల కోసం ఈ కాలువలు ఎదురు చూస్తున్నాయి. వీటిని పట్టించుకోకుండా గ్రామాలలో శుద్ధి యంత్రాలు పెడతామనడం నమ్మదగినదిగా లేదు. నదీ సంరక్షణ పేరుతో ప్రజలను మరోసారి మోసం చేయడానికే.

ఎన్నికల్లో లబ్ధి పొందడానికి రాజకీయపార్టీలు మతపరమైన మనోభావాలను తరచుగా వాడుకుంటాయి. బీజేపీ హయాంలో ఇది గతంలో ఎన్నడూ లేనివిధంగా జరుగుతున్నది. మతపరమైన పండుగలకు భారీ ఎత్తున ఏర్పా ట్లు చేస్తుంటారు. ఇందుకు సొమ్ము ప్రభుత్వ ఖజానా నుంచి వస్తుంది. నర్మదా నదిని కాపాడటానికి నర్మదా సేవా యాత్ర పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మధ్యప్రదేశ్ నుంచి ప్రవహించే ఈ నది గుజరాత్ తీరంలో అరేబియా సముద్రంలో కలిసేవరకు దాదాపు 1000 నుంచి 1300 కిలోమీటర్లు అత్యధిక కాలుష్యంతో ప్రవహిస్తున్నది. దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ పరిరక్షణ ఉద్యమంగా చెప్పుకుంటున్నారు.

సింహస్థ మేళా (ఉజ్జయినిలో జరిపే కుంభమేళా) పన్నెండేండ్లకు ఒకసారి వస్తుంది కనుక, దీనిని జరిపిన తరువాత మధ్య ప్రదేశ్ ముఖ్యమం త్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు మరే ఉత్సవం దరిదాపుల్లో కనిపించినట్టు లేదు. దీంతో నర్మదా సేవా యాత్ర ద్వారా ప్రజల నుంచి మంచి మెప్పు పొందవచ్చునని ఆయన చూశారు. హిందూ భక్తి విశ్వాసాలతో ముడిపడిన నదిపై ఇలాంటి ప్రయత్నాలు చేయడంలో కొత్తేమీ లేదు. అయితే ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయం ఉన్నది. ఇదే రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీకి చెందిన ఎంపీ, కేంద్ర పర్యావరణ మంత్రి అనిల్ మాధవ్ దవే నర్మదా నదీ తీరంలో ఈ కొస నుంచి ఆ కొస వరకు ప్రయాణిం చి పరీక్షించారు. ఈ నది పొడుగూతా తన ప్రయాణం, నదిలో కాలుష్యం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడమే కాదు, ఒక గ్రంథమే రాశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఆవగింజంత చర్యలు తీసుకోలేదు. దేశంలో అన్ని నదుల మాదిరిగానే నర్మదా నది కూడా కాలుష్యమయమైంది. పరిశ్రమలు, నగరాలు, పట్టణాల నుంచి కాలుష్యాలు వచ్చి కలుస్తున్నాయి. మంత్రి దవే నివేదికలోని వివరాలు పత్రికలలో కూడా ప్రచురితమయ్యాయి.

సేవాయాత్ర పేరుతో రాజకీయ లబ్ధి పొందడమే. నదిని కాలుష్యం నుంచి కాపాడటానికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్దిష్ట చర్యలేమిటో ఇప్పటి వరకు వెల్లడించలేదు. సేవా సమితులు నది స్వచ్ఛతను కాపాడే పని చేపడుతాయని అంటున్నారు. కానీ అందులో ఉండేది ఎవరు? వాటి స్వరూప స్వభావమేమిటి అనే స్పష్టత లేదు. ప్రతి గ్రామంలో కాలు ష్య శుద్ధి యంత్రాలు పెడుతామని అంటున్నారు. కానీ ఎన్నికల ముందు కనిపించే హడావుడి తరువాత ఉంటుందా? దీనికి నిర్ణీత వ్యవధి ఏదీ లేదు. యాభై మంది పర్యవేక్షణ బృందంలో ఉండేది ఎవరనేది కూడా తెలువదు. ఈ కోర్ టీమ్ సంగతి తెలువకుండా యాత్ర విషయంలో అంచనాకు రాలేము. ప్రభుత్వం ప్రకటిస్తున్న ఈ యాత్ర నామమాత్రంగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి.

118 రోజుల యాత్ర అంటూ హడావుడి చేస్తున్న ప్రభుత్వం కాలుష్య నియంత్రణకు తాను తీసుకోవలసిన చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ఉదాహరణకు నది తీరాల నుంచి ఇసుక తవ్వుక పోవడం పెద్ద ఎత్తున సాగుతున్నది. ఈ సాండ్ మైనింగ్ మాఫియా పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం అనడం లేదు. కొన్నేండ్లుగా ఇసుకను కొంచబోవడం వల్ల నర్మదా నది ఉనికికే ప్రమాదం ఏర్పడుతున్నది. నదీ మధ్య భాగం నుంచి కూడా ఇసుక తరలించడం మొదలైంది. కోర్టులు చెప్పినా చలనం కలుగడం లేదు. ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తున్నట్టు కనిపిస్తూ దాట వేస్తున్నది తప్ప చర్యలు తీసుకోవడం లేదు. ఇసుక తరలించడం వల్ల కలిగే అనర్థాలను గురించి జలవనరుల శాఖ చెప్పగలదు. ఎంతో కాలంగా ఈ శాఖ వివరాలు సేకరిస్తున్నది. దీనిపై ఎన్నో పరిశోధనా పత్రా లు ప్రచురితమయ్యాయి. ఇసుక తరలించడం వల్ల కలిగే నష్టం గురించి బోలెడంత సమాచారం ఇప్పటికే ఉన్నది. అయినా ప్రభుత్వం ఇసుక తరలించడం వల్ల కలిగే నష్టాలపై నిపుణులను ఆహ్వానించి మాట్లాడుతున్నది. ఇది జాప్యం చేయడానికి అనుసరించే ఎత్తుగడ.

రాష్ట్ర రాజధాని భోపాల్‌లో నలభై శాతం ప్రజలకు మంచి నీటి వసతి సమకూర్చే జలాశయాన్ని కాపాడాలనే డిమాండ్ ఎంతో కాలంగా ఉన్న ది. అహ్మదాబాద్‌లోని పర్యావరణ ప్రణాళిక, సాంకేతికత కేంద్రానికి చెం దిన నిపుణులు తమ నివేదికను 2013లోనే సమర్పించారు. దీనిపై ఇప్ప టి వరకు చర్యలు తీసుకోలేదు. ఇంత చిన్న జలాశయాన్ని పరిరక్షించడానికి పూనుకోని రాష్ట్ర ప్రభుత్వం పెద్దదైన నర్మదా నదిని కాపాడుతుందని అంటే ఎవరు నమ్మగలరు. నగరంలోని జలాశయాన్ని పరిరక్షించాలంటే దానికి నీరందించే రెండు నదులను కాపాడాలె. వీటిని కాపాడటానికి చిత్తశుద్ధి లేని ప్రభుత్వం నర్మదా నది గురిం చి మాట్లాడుతున్నది. నర్మదా నదిలోనికి ఎనిమిది కాలువల నుంచి కాలుష్యం ప్రవహిస్తున్నది. కాలుష్య శుద్ధి యంత్రాల కోసం ఈ కాలువలు ఎదురు చూస్తున్నా యి. వీటిని పట్టించుకోకుండా గ్రామాలలో శుద్ధి యంత్రాలు పెడుతామనడం నమ్మదగినదిగా లేదు. నదీ సంరక్షణ పేరుతో ప్రజలను మరోసారి మోసం చేయడానికే.
(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయెన్స్)
 Pralay

718
Tags
 ,