HomeEditpage Articles

ఏ గ్రేట్ లీడర్ ఇన్ హర్రీ

Published: Sat,February 18, 2017 01:38 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

సిజేరియన్ ఆపరేషన్‌తో స్వతంత్ర భారతదేశం అవతరించింది. అది సుఖ ప్రసవం కాదు. తొంభై ఏండ్ల నుంచి (1857 నుంచి) విభిన్న దిశలతో నిరంతరంగా కొనసాగుతున్న భారత స్వాతంత్య్ర, జాతీయ ఉద్యమాలు పరాకాష్ఠకు వచ్చిన క్లిష్ట సమయం అది. వివిధ కారణాల వల్ల, ముఖ్యంగా మతోన్మాదశక్తులు విపరీతంగా విజృంభించడం వల్ల ఆసేతు హిమాచలం అశాంతి పాలైంది, అరాచకత్వం చెలరేగింది.

అపార అనుభవజ్ఞుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజల అదృష్టం. సాధారణంగా ఎన్నికల ప్రణాళికలు పార్టీల కార్యాలయాల్లో పంది కొక్కులకు ఆహారమవుతుంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రికి ఎన్నికల ప్రణాళిక ఒక భగవద్గీత.ప్రగతికి మార్గం వేసే ప్రభాత గీతిక. గత ఎన్నికల సమయంలో ఊరూరా నూరుకు మించిన ఎన్నికల సభల్లో ఎన్నికల ప్రణాళికలోని ఒక్కొక్క అంశం గురించి తెలంగాణ నుడికారంతో పాఠం వలె చెప్పిన పరమాచార్యుడు, ప్రబోధకుడు ఆయన. ఆయనకు ఆలోచనలు ఎక్కువ. ఈ ఆలోచనలన్నీ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం, అన్నివర్గాల ప్రజల, విశేషించి అట్టడుగు తరగతుల సంక్షేమం కోసం.


ఎన్ని కుట్రలు జరిపినా, ఎన్ని ఎత్తులు వేసినా, ఎంతటి దమననీతిని అమలు జరిపినా బ్రిటిష్ పాలకులు ఈ దేశాన్ని ఇక పాలించలేని సంభస్థితి ఉత్పన్నమైంది. ఇక మీరు ఈ దేశా న్ని పాలించలేరు. మూటాముళ్లె సర్దుకోవడం మంచిది అని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ వైస్రాయి లార్డ్‌మౌంట్ బాటన్‌తో సూటిగా చెప్పారు. మౌంట్ బాటన్ ప్లాన్‌తో భారత ఉపఖండ విభజన, స్వాతంత్య్ర ప్రకటన చట్టం రూపుదాల్చింది. గత్యంతరం లేక, పరిపాలనా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేక బ్రిటిష్ పాలకులు ఇంటిదారి పట్టారు. ఇంత కాలానికి, రెండు వందల ఏండ్ల పారతంత్య్రం అనంతరం స్వాతంత్య్రం సిద్ధిస్తున్నదన్న సంతోషం లేకుండా, విభజనకు దారితీసిన మతోన్మాదం ఉపఖండ విభజన అనంతరం సహస్ర ఫణాలతో బుసకొట్టింది. దేశమంతటా హింసాకాండ భయంకరంగా చెలరేగింది. పుట్టిన మరుక్షణం నుంచే శైశవ స్వతంత్ర భారతం కొన్ని లక్షలమంది శరణార్థుల పునరావాసం జటిల సమస్య ను ఎదుర్కోవలసి వచ్చింది. మరోవంక అయిదు వందలకు మించిన సంస్థానాల విలీనం, దేశ పునర్నిర్మాణం సమస్యలు. అప్పటి ఆ అత్యంత క్లిష్ట పరిస్థితిలో దేశానికి జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వం ఎంత అవసరమో రాష్ర్టాలకు కూడా అంతటి సమర్థుల నాయకత్వం అవసరమని గాంధీజీ భావించారు. జాతీయస్థాయి గల గోవింద్ వల్లభ్ పంత్, రవిశంకర్ శుక్లా, బి.జి.ఖేర్, మొరార్జీ దేశాయ్, సి.రాజగోపాలచారి, హరేకృష్ణ మెహతాబ్, డీపీ మిశ్రా, బీసీ రాయ్, కైలాస్‌నాథ్ ఖట్జూ వంటి అతిరథ మహారథులు వివిధ రాష్ర్టాల్లో ముఖ్యమంత్రులుగా పరిపాలనా బాధ్యతలను చేపట్టి పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించారు.

శైశవదశలో స్వతంత్ర భారతాన్ని అస్థిరత్వం, అరాచకత్వం, అశాంతి పాలు గాకుండా కాపాడి ఆయా రాష్ర్టాలను అభివృద్ధి పథంలో నడిపించిన, భవిష్యత్ పురోగమనానికి, పునరుజ్జీవనానికి పటిష్టమైన పునాదులు వేసిన చిరస్మరణీయ ముఖ్యమంత్రులు వీరు. ఈ కోవకు చెందిన, కొన్ని విధాల ఈ కోవకు మించిన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే మార్గదర్శకత్వం వహించడం ఒక మహత్తర పరిణామం. దక్షిణాఫ్రికా నుంచి తిరిగివచ్చి గాంధీజీ 1915లో సమర రం గంలో అడుగుపెట్టిన తర్వాత స్వాతంత్య్ర ఉద్యమం కొనసాగింది 32 ఏం డ్లు. హింసాత్మక ధోరణులు ప్రబలుతున్నాయని భావించి గాంధీజీ ఉద్యమాన్ని కొంతకాలం నిలిపివేసిన సందర్భాలున్నాయి. దాదాభాయి నౌరోజీ, బాల గంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలే తదితరులు స్వాతంత్య్ర, జాతీ య ఉద్యమాలకు 1915 ముందు నాయకత్వం వహించినప్పటికీ దాదాపు మూడు దశాబ్దాలు స్థిరంగా నిలిచి ఉద్యమ లక్ష్యాన్ని సాధించింది, స్వాతం త్య్ర ప్రదాతగా ప్రపంచమంతటా పరిగణన, ప్రసిద్ధి పొందింది గాంధీజీయే. అరవై ఏండ్ల తెలంగాణ ఉద్యమంలో అప్పుడప్పుడు ఆవేశం పెల్లుబుకి వేదికలెక్కిన వారు, పతాకాలు ఎగరేసిన వారు అనేకులు. వారెవరు స్థిరంగా నిలువలేదు. ఆశయానికి తిలోదకాలిచ్చి పదవుల ప్రలోభంతో పచ్చిక బయ ళ్ల కోసం పాకులాడారు. నిలిచి, గెలిచి, లక్ష్యాన్ని సాధించింది ఆయన ఒక్కరే. వరుసగా పధ్నాలుగేండ్లు ఎత్తిన జెండా దించకుండా స్థిరంగా నిలిచి, అవరోధాలెన్నిటినో అధిగమిస్తూ, అచంచల ఆత్మవిశ్వాసంతో గమ్యాన్ని చేరిన నాయకుడు ఒక్కడే. తెలంగాణ రాష్ట్రం సాధించిన వారిలో ఆయన కూడా ఒకరు అనడం కళ్ల ముందటి చరిత్రకు మసిబూసి వక్రభాష్యాలు చెప్పడం.

వజ్ర సంకల్పంతో గమ్యాన్ని చేరిన ఆ నాయకుడు స్థితప్రజ్ఞుడు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో శాశ్వత స్థానం పొందడానికి ఆయనకు తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన పేరు ఒక్కటి చాలు. కానీ, ఆయన అంతటితో విశ్రాంతి కోరలేదు, రాజకీయ వాన ప్రస్థానాశ్రమంవైపు వెళ్లలేదు. అనేక పోరాటాలతో, అపార త్యాగాలతో సాధించిన తెలంగాణ రాష్ట్రం అడవిగాచిన వెన్నెల కావొద్దనుకున్నాడు, ఈనగాచిన చేనును నక్కల పాలు చేయవద్దనుకున్నాడు. అదొక మహా సంకల్పం. స్వతంత్ర భారతదేశం తొలి మాసాల్లో ఎదుర్కొన్న సమస్యలు, కష్టాలనే తెలంగాణ రాష్ట్రం అవతరించగానే ముందుకొచ్చినయ్ - అన్నివైపుల అన్నీ సమస్యలే. బ్రిటిష్ పాలకులు దాదాపు వందేండ్ల దుష్ట పాలనతో, రెండు వందల ఏండ్ల దోపిడీతో దేశాన్ని పిప్పి చేశారు. భారతదేశం బానిస బంధనాల్లో చిక్కుకొని సామాజికంగా, రాజకీయంగా, వైజ్ఞానికంగా, సాంస్కృతికంగా, భాషాపరంగా, పరిపాలనా పరంగా తన వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని కోల్పోయింది. కోల్పోయిన అస్తిత్వాన్ని పునరుద్ధరించడం, పునరుజ్జీవింపజేయడం స్వతంత్ర భారత పరిపానా బాధ్యతను చేపట్టిన వారికి భగీరథ ప్రయత్నమైంది. ఇదే పరిస్థితి తెలంగాణ నూతన రాష్ర్టానికీ ఎదురైంది. అంతకుముందు 220 ఏండ్ల రాచరిక పాలనతో, తర్వాత అరవై ఏండ్ల ప్రజాస్వామ్యం ముసుగుతో కొనసాగిన ఆంధ్రుల పాలనలో అస్తిత్వాన్ని కోల్పోయి, అన్నివిధాల దోపిడీకి గురై చిక్కి శల్యమైన తెలంగాణం కంటి తుడుపుగా, లోపభూయిష్టమైన విభజన చట్టంతో ఒక రాష్ట్రంగా ఏర్పడింది. అక్కడికి అది సంతోషదాయకమే. కానీ, చుట్టూర పలు సమస్యల మందు పాతరలతో ఒక నూతన రాష్ట్రం తెలంగాణ ప్రజల చేతికి వచ్చింది. ఆ స్థితిలో అధికారాన్ని చేపట్టడం పూల పానుపు మీద పవళించడం కాదు. ముండ్ల మంచం మీద కూర్చోవడం. సామాన్యులు ఎవరైనా ఆ ముండ్ల కుర్చీని చూసి పారిపోయేవారు.

కానీ, ఎందరో కాదనుకున్న, ఎందరెందరో ఇక రాదనుకున్న స్వరాష్ర్టాన్ని సాటిలేని మహోద్యమాన్ని నడిపి సాధించిన మహా నాయకుడికి, అప్పటికే నాలుగు కోట్ల తన ప్రజల హృదయాల్లో సమున్నత స్థానం అధిరోహించిన విశిష్ట ప్రజా నాయకుడికి తెలంగాణ రాష్ర్టాన్ని అనాథగా వదిలేయడం, అది ఎవరో చింపిన విస్తరి కావడం ఇష్టం కాలేదు. అరణ్యవాసం వలె 14 ఏండ్ల మహోన్నత ఉద్యమానికి ఏకైక అధినేతగా సారథ్యం వహించిన తమ సారథి, తమ సచివుడు సీఎం పదవి గురుతర బాధ్యతను భుజస్కంధాల మీద వేసుకుని కొత్త రాష్ర్టాన్ని - పసికూనను - సర్వతోముఖ ప్రగతి పథంలో నడిపించాలన్నది ప్రజల ప్రగాఢ ఆకాంక్ష. ఎన్ని కష్టాలు ఎదురైనా సహిస్తూ ప్రజాభిప్రాయాన్ని శిరసావహించే సచ్చా ప్రజాస్వామ్యవాది, సమతావాది, మానవతావాది ఆయన. తెలంగాణ ప్రజల నాడీ నిదానంలో, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండె భాషను చదువడంలో ఆయనకున్న ప్రావీణ్యం ఇంకెవరికీ లేదు. తెలంగాణ ప్రజల భాషకు, భావాలకు, ఆశల కు, ఆకాంక్షలకు, ఆవేశాలకు ప్రతిపదార్థ తాత్పర్యాలను, విక్షణ వ్యాఖ్యలతో వివరించిన, విశ్లేషించిన భాష్యకారుడు ఆయన. ఆయనే తెలంగాణ ప్రజా ప్రవక్త. ఆయన జిజ్ఞాసువు, విజ్ఞాన పిపాసి, నిర్విరామ అధ్యయన శీలి, నిరంతర చింతనా తపస్వి. తెలంగాణ సమస్యల పట్ల, అరవై ఏండ్ల దీర్ఘకాలం నేల, నీళ్లు, నిధులు, నియామకాలు, చరిత్ర, భాష, సంస్కృతి విషయాల్లో తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాలు, అక్రమాలపై ఆయనకున్న అవగాహన ఇంకెవరికీ లేదన్నా, ఆ సమస్యల పరిష్కారంలో ఆయనకున్న ప్రతిభ, విజ్ఞత, శక్తి సామర్థ్యాలు నిరుపమానమైనవని చెప్పినా అతిశయోక్తి కాదు. ఒక సవాలుగా బంగారు తెలంగాణ ఆవిష్కరణ బాధ్యతను, సీఎం పదవిని ఆయన స్వీకరించారు. ఆ స్వీకరణ ఒక మహత్తర నిర్ణయం. ఆ రోజు ఆయన ఆ బాధ్యతను చేపట్టకపోతే ఎన్నో పోరాటాల ఫలితంగా ఒక రాష్ర్టాన్ని సాధించుకున్న సంతృప్తి, సంతోషం ఆవిరయ్యేవి.

అపార అనుభవజ్ఞుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజ ల అదృష్టం. సాధారణంగా ఎన్నికల ప్రణాళికలు పార్టీల కార్యాలయాల్లో పంది కొక్కులకు ఆహారమవుతుంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రికి ఎన్నికల ప్రణాళిక ఒక భగవద్గీత.. ప్రగతికి మార్గం వేసే ప్రభాత గీతిక. గత ఎన్నికల సమయంలో ఊరూరా నూరుకు మించిన ఎన్నికల సభల్లో ఎన్నికల ప్రణాళికలోని ఒక్కొక్క అంశం గురించి తెలంగాణ నుడికారంతో పాఠం వలె చెప్పిన పరమాచార్యుడు, ప్రబోధకుడు ఆయన. ఆయనకు ఆలోచనలు ఎక్కువ. ఈ ఆలోచనలన్నీ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం, అన్నివర్గాల ప్రజల, విశేషించి అట్టడుగు తరగతుల సంక్షేమం కోసం. ఉద్యమంలో భాగంగా, ఉద్యమ సరళిలో, ఉధృత రూపంతో ఆయన ప్రభుత్వం గత రెం డున్నరేండ్ల నుంచి అప్రతిహతంగా, అహోరాత్ర తపస్సుగా ముందంజ వేస్తూ పరిశీలకులకు సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తున్నది. ప్రత్యర్థులు పట్టలేని వేగం, వ్యూహం ఆయనవి. నిస్సందేహంగా ఆయన ఏ గ్రేట్ లీడర్ ఇన్ హ ర్రీ. ఆయన వేగం, రెండున్నరేండ్ల నుంచి అతి స్వల్పకాలంలో ఆయన సాధిస్తున్న అనల్ప విజయాలు కొందరికి వేదన కలిగిస్తున్నాయి. రోదన కలిగిస్తున్నాయి. నోట్ల రద్దు వంటి ప్రగతి నిరోధక విధానాలు, తిరోగమన చర్యలు, ఫెడరల్ సూత్రాలకు, సంప్రదాయాలకు విఘాతం కలిగించే ధోరణులు, ప్రాంతీయ ప్రజా శక్తులను అధికార దుర్వినియోగంతో అణచివేసే కుటిలనీతులు ఆయన ప్రగతి ప్రస్థానాన్ని నిరోధించలేకపోతున్నాయి. అనేక రంగా ల్లో ఆయన పరిపాలనా ప్రావీణ్యంతో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానం లో నిలువడం విశేషం. గత ఏడాది కాలంలో అభివృద్ధి రేటు జాతీయస్థాయిలో తగ్గడం, తెలంగాణ రాష్ట్రంలో గణనీయంగా పెరుగడం ఈ రాష్ట్రం సర్వతోముఖ పురోగమనానికి ప్రబల నిదర్శనం. ఓర్వలేమి పిశాచి దేశం మూల్గులను పీల్చేసెనోయ్ అని మహాకవి గురజాడ అన్నారు. చుట్టూరా పొంచి ఉన్న ఓర్వలేమి పిచాశాల ధ్వంస దృక్కుల నుంచి తెలంగాణ రాష్ర్టాన్ని రక్షించగలిగింది ఆయన నాయకత్వమే. ఆయనే మూడు అక్షరాల కేసీఆర్ ఆయనకివే శతమానం భవతి అక్షర శుభాకాంక్షలు.. అభినందనలు.
prabakar

1036
Tags
 ,