HomeEditpage Articles

ఉద్యోగం అంటే ఉపాధి

Published: Wed,February 15, 2017 02:00 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

ఏ దేశంలో చూసినా జనాభాలో ఒక శాతానికి అటూ ఇటూగా ప్రభుత్వ ఉద్యోగులున్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థికశక్తులుగా నిలబడిన అమెరికా, చైనాలలో కూడా అంతే. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 28 లక్షలు. ఆ దేశ జనాభా(23.6 కోట్లు)లో ప్రభుత్వ ఉద్యోగులు 1.18 శాతం. చైనాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 76 లక్షలు. ఆ దేశ జనాభా(135 కోట్లు)లో ప్రభుత్వ ఉద్యోగాల శాతం 0.56.

ఇక మన దేశానికొస్తే.. కేంద్ర ప్రభుత్వాన్ని కేవలం 30.87 లక్షల మంది నడుపుతున్నా రు. అంటే భారతదేశ జనాభా(125కోట్లు) లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల శాతం 0.24 మాత్రమే. దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య ఒక కోటి 85 లక్షలు. రాష్ర్టాల జనాభాలో ఉద్యోగుల శాతం 1.40 మాత్రమే ఉన్నది. తెలంగాణ విషయానికొస్తే.. ఇక్కడ జనాభా మూడున్నర కోట్లు. ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 4 లక్షల 17 వేలు. అంటే జనాభాలో ప్రభుత్వ ఉద్యోగాల శాతం 1.20 శాతం.

తెలంగాణ వచ్చేనాటికి దాదాపు 50 వేల ఖాళీలున్నాయి. ఆంధ్ర ప్రాంతం వారు వెళ్లిపోవడం వల్ల మరో 30 వేల దాకా ఖాళీలు ఏర్పడ్డాయి. సుమారు 20 వేల మంది ఈ రెండున్నరేండ్లలో రిటైర్ అయ్యా రు. దీంతో తెలంగాణలో లక్షా 7 వేల ఉద్యోగాలు నింపుకొనే అవకాశం వచ్చింది. సరిగ్గా ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలోనే ప్రకటించారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలున్నాయి? అందులో ఎంతమంది ఆంధ్ర ఉద్యోగులున్నారు? ఎన్ని ఖాళీలు ఏర్పడుతాయి? అనే లెక్కలు తేలలేదు. కమలనాథన్ కమిషన్ ఇంకా చాలా శాఖల్లో ఉద్యోగుల విభజనను తేల్చనేలేదు. అయినా సరే, ఉన్న అంచనాల మేరకు ఖాళీలను నింపడానికి రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీని 2014 డిసెంబర్‌లో ఏర్పాటు చేసింది. సిలబస్ రూపకల్పన, ఖాళీల గుర్తింపు, ప్రభుత్వ అనుమతులు తదితర ప్రక్రియలు ముగించుకొని 2015 ఆగస్టులో టీఎస్‌పీఎస్సీ మొదటి నోటిఫికేషన్ ఇచ్చింది. నాటి నుంచి నేటి వరకు రికార్డు స్థాయిలో 24 నోటిఫికేషన్లు ఇచ్చింది. ఎక్కడ ఖాళీలుంటే అక్కడ భర్తీ చేసే ప్రక్రియ చేపట్టింది. వ్యవసాయ, నీటి పారుదల, ఆర్‌డబ్ల్యూఎస్. మున్సిపల్, పోలీసు తదితర శాఖల్లో పెద్ద ఎత్తున నియామకాలు జరిగాయి. మొత్తం 34,498 ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి కూడా తీసుకొని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 6 వేల మంది ఇప్పటికే ఉద్యోగాల్లో చేరారు. మిగతా ఉద్యోగాల నియామకాల ప్రక్రియ నడుస్తున్నది. గ్రూప్ 1, 2 ఉద్యోగాలు ఇం టర్వ్యూల దశలో ఉన్నాయి. వీటిద్వారా 1500 మందికి ఉద్యోగావకా శం వస్తుంది. ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుళ్ల ఫిజికల్ టెస్టులు నడుస్తున్నాయి.

వాటిద్వారా 477 మందికి అవకాశం వస్తుంది. రెసిడెన్షియల్ స్కూళ్లు, డిగ్రీ కాలేజీల్లో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకుల పోస్టుల్లో మొదటి దశ లో 8,500 (మొత్తం 24,000) నియామకానికి నోటిఫికేషన్ విడుదల కాబోతున్నది. వైద్య ఆరోగ్య శాఖలో 2100 మందిని, మున్సిపల్ శాఖ లో 300 మంది హెల్త్ ఇన్‌స్పెక్టర్లకు, 370 మంది శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, వెటర్నరీ అసిస్టెంట్లుగా 489 మందిని, ఇంకా వివిధ శాఖల్లో మొత్తం 34,498 మందిని నియమించడానికి ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీకి అనుమతి ఇచ్చింది. పోలీస్ శాఖలో 12 వేల మంది ఉద్యోగుల నియామక ప్రక్రియ నడుస్తున్నది. మొదటి నోటిఫికేషన్ ఏర్పడిన నాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించే కార్యాచరణ అమలు చేస్తున్నది. రెసిడెన్షియల్ స్కూళ్ల లో వచ్చే రెండేళ్లలో ఇంకా 17 వేల మందిని నియమించనున్నది. దాదాపు 20వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే ప్రక్రి య ప్రారంభమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకా ఎంతమంది ఉద్యోగులు అవసరమవుతారనే అధ్యయనం సాగుతున్నది. దాని తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ కూడా వస్తుంది. కమలనాథన్ కమిషన్ ఉద్యోగుల విభజన పూర్తిచేసిన తర్వాత ఇంకా చాలా శాఖల్లో ఖాళీల వివరాలు తెలుస్తాయి. ఇక సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ సంస్థల్లో కూడా గడిచిన రెండున్నరేళ్లలో పెద్ద ఎత్తున నియామకాలు జరిగాయి. విద్యుత్ శాఖలో 2,681 మందిని, సింగరేణిలో 4,500 మందిని, ఆర్టీసీలో 3,950 మందిని కొత్తగా ఉద్యోగాల్లో నియమించారు. విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలనే నిర్ణయం వల్ల 20వేల మందికి పైగా ఉద్యోగావకాశం పొందుతారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల కోసం ఇప్పటికే 10వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికీ ఉద్యోగం వస్తుంది. వీటన్నింటి లెక్క కలిపితే లక్షా 50 వేల ఉద్యోగాలు రాబోయే రెండేళ్లలో భర్తీ అవుతాయి. ఎన్నికల సమయంలో గానీ, అసెంబ్లీలోగానీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో లక్షమందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఐదేళ్ల కాలంలో లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వం పనిచేస్తున్నది.

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు


టీఎస్‌పీఎస్సీ ద్వారా జరుపుతున్న నియామకాలు: 31,498
టీఎస్‌పీఎస్సీ ద్వారా ఇప్పటికే ఉద్యోగాల్లో చేరినవారు: 5,940
ఆరు నెలల్లో ఉద్యోగాల్లో చేరబోతున్న వారి సంఖ్య: 25,558
ప్రభుత్వరంగ సంస్థల్లో నియామకాలు
విద్యుత్ శాఖ ఉద్యోగాల్లో కొత్తగా చేరిన వారి సంఖ్య: 2,681
సింగరేణిలో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారి సంఖ్య: 4,500
ఆర్టీసీలో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారి సంఖ్య: 3,950
2017 జూన్‌లోగా కొత్తగా ఉద్యోగాలు పొందే వారి సంఖ్య: 74,127
రాబోయే రెండేళ్లలో జరిగే నియామకాలు
20 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్
20 వేల మంది విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్
10 వేల మందికి సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలు
17 వేల మందికి రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉద్యోగాలు
10 వేల మందికి డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు
రాబోయే రెండేళ్ల ప్రణాళిక ప్రకారం ఉద్యోగాలు: 77,000
2014 నుంచి 2017 వరకు మొత్తం ఉద్యోగాల ప్రణాళిక: 1,51,127

చదువుకున్న ప్రతీ ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వడం ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాదు. 60 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలో తెలంగాణలో ఏర్పడిన ఉద్యోగాలే నాలుగు లక్షలు. ఒక్క ఉద్యోగానికి వేల మంది పోటీ పడుతున్నారు. టీఎస్‌పీఎస్సీ జరిపిన ఎన్రోల్‌మెంట్‌లోనే 13 లక్షల మంది విద్యావంతులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లు తేలింది. పేరు నమోదు చేసుకోనివారు ఇంకా లక్షల సంఖ్యలో ఉన్నా రు. గ్రూప్-2లో 1032 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే, 8 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారులందరికీ ఉద్యోగం ఇవ్వడం సాధ్యమవుతుందా?

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ తెలంగాణకు సరికొత్త అభివృద్ధి నమూనా రూపొందించి ముందుకుపోతున్నారు. దీనివల్ల సంప్రదాయంగా ఏర్పడిన ఉద్యోగాలే కాకుండా రాష్ట్రంలో కొన్ని వేల ఉద్యోగాలు కొత్తగా పుట్టుకొచ్చాయి. చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాల అమలు కోసం పెద్ద ఎత్తున ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకాలు జరిగా యి. తెలంగాణ రాష్ర్టాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు విద్యుత్ ఉత్పత్తిని పెద్దఎత్తున చేపట్టిన కారణంగా వేలమంది విద్యుత్ ఇంజినీర్ల ఉద్యోగాలు వచ్చినయ్. ప్రతీ 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయాధికా రి ఉండాలనే లక్ష్యం పెట్టుకోవడం వల్ల రాష్ట్రం లో 1311 మంది వ్యవసాయాధికారులు కొత్తగా వచ్చారు. పశుసంవర్థక శాఖ, మత్స్యశాఖ, ఉద్యానవన శాఖలను బలోపేతం చేయాలనే నిర్ణయం వల్ల వందలాది పోస్టు లు పుట్టుకొచ్చాయి. జిల్లాల పునర్విభజన వల్ల కొత్తగా వేల ఉద్యోగాలు ఏర్పడుతున్నాయి. శాంతి భద్రతలకు పెద్దపీట వేయడంవల్ల వేలా ది పోలీసుల నియామకాలు జరుగుతున్నా యి. దేశంలో ఎక్కడాలేని విధంగా పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ స్కూళ్లు పెడుతున్నందున కొత్తగా 24 వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. గడిచిన రెండున్నరేళ్లలో జరిగిన నియామకాలు, రాబోయే రెండున్నరేళ్లలో చేపట్టే నియామకాలు లెక్క తీసుకుంటే దేశం లో మరే రాష్ట్రం కూడా తెలంగాణతో పోటీ పడే పరిస్థితి లేదు.

కేవలం ప్రభుత్వ ఉద్యోగాల విషయంలోనే కాదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఇతర రంగాల్లో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయి. టీఎస్ ఐపాస్ చట్టం తెచ్చినందువల్ల తెలంగాణలో కొత్తగా 3,312 పరిశ్రమలు వచ్చాయి. వీటివల్ల రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. చెరువుల పునరుద్ధరణ, నీటి పారుదల ప్రాజెక్టులు, మైక్రో ఇరిగేషన్ సబ్సిడీల కారణంగా లక్షలమంది రైతులు ఉపాధి పొందుతున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కూడా వ్యవసాయానికి మళ్లిన వార్తలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రహదారుల నిర్మాణం, డబుల్ బె డ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం తదితర పనుల వల్ల లక్షల మందికి మంచి ఉపాధి లభిస్తున్నది. స్కిల్ లేబర్ (వృత్తి నైపుణ్యం కలవారికి) కూలీ పెరిగింది. గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమ అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారు. ఎకనమిక్ సపో ర్ట్ స్కీమ్ సబ్సిడీ పెంచడం వల్ల వేల మంది యువకులు స్వయం ఉపాధి పొందుతున్నా రు. దీనివల్ల తెలంగాణ ముఖ చిత్రమే మారిపోతున్నది. తెలంగాణ పౌరుల జీవనస్థితిగతుల్లో గుణాత్మక మార్పులు వస్తున్నా యి. తెలంగాణ తలసరి ఆదాయం పెరిగింది. ప్రజల వినిమయ శక్తి పెరిగింది. ఆర్థిక వృత్తిలో దేశంలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలువడానికి కారణం ఇదే. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోకుండా ఉద్యోగమంటే ప్రభుత్వ ఉద్యోగమే. ప్రభుత్వ ఉద్యోగం కాక మరే పనిచేసినా వారు నిరుద్యోగుల కిందే లెక్క అనే అభిప్రాయం హేతుబద్ధమైనది కాదు.

ఇప్పటివరకు ఎన్నడూలేని ఉద్యోగాలను సృష్టించి మరీ యువతకు ఉద్యోగావకాశం కల్పించే ముమ్మర ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది. కానీ కొందరు అసలు తెలంగాణలో ఉన్న ఖాళీలే భర్తీ కావడం లేదనే ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగాలుండి ప్రభు త్వం దాచుకుంటున్నదా? కావాలని ఎక్కడైనా ఖాళీ పెట్టిందా? నిరుద్యోగులందరికీ ఉద్యోగావకాశం కల్పించాలని చెప్పడం బాగానే ఉంటుంది. కానీ అది సాధ్యమేనా? అనే విషయం కూడా మేధావులుగా చెప్పుకునే వారు ఆలోచించాలి. తమకు ఉద్యోగం కావాలనే ఆశ నిరుద్యోగుల్లో తప్పక ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగమే కావాలనే బలమైన కోరిక కూడా ఉంటుంది. అలాంటి మానసిక పరిస్థితుల్లో ఉన్న యువతకు అబద్ధాలు చెప్పి ఆకర్షించడం కూడా సులభమైన పనే. వారి ఆశలను ఆసరాగా తీసుకొని, అలివిగాని డిమాండ్లను ముందుకుపెట్టి, రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చాలనుకోవడం కుట్ర కోణమే.
Gatika

1019
Tags
 ,