HomeEditpage Articles

..నిర్వేదంగా ధర్మపురి

Published: Sun,February 12, 2017 01:12 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

ఒకనాడు ఐదువందల బ్రాహ్మణ కుటుంబాలతో వేదంలా ఘోషించిన ధర్మపురి.. అమరధామంలా వర్ధిల్లిన గోదావరి... నేడు సప్త గుండాలన్నీ మునిగిపోయి ఒక మురికిగుంటగా మారిపోయింది. దాంతో స్థానికుల్లో నిర్వేదం గూడు కట్టుకుపోయింది.

దక్షిణ వాహినిగా పేరొందిన ధర్మపురి ప్రశస్తి నశించకుండా ఉండటం కోసం పక్క గ్రామం దమ్మన్నపేట నుంచి నది దక్షిణా పథం తీసుకుంటుండటాన్ని గమనంలోకి తీసుకోవాలి. అక్కడి నుంచే గోదావరి దక్షణ వాహినిగా మొదలై ధర్మపురిలో ముగుస్తుంది.


అటు క్షేత్రం, ఇటు తీర్థం.. రెండు విధాలా పేరొందిన ధర్మపురి ఇప్పుడు రెండు విధాలుగా సతమతం అవుతున్నది. ఒక కార ణం, ఎల్లంపల్లి వరద నీరు చేరిక తో దక్షిణ వాహినిగా పేరొందిన ధర్మపురి ఇప్పుడు నిలువ నీటితో తన ప్రశస్తిని కోల్పోతూ ఉండటం. రెండవ కారణం- పట్టణ గృహ సముదాయాల నుంచి వ్యర్థ జలాలను తీసుకెళ్లే నాలుగు మురుగు కాలువలు నేరుగా గోదావరి పుష్కర ఘాట్ల వద్దే కలువడం. తద్వారా ధర్మపురి నీళ్లు పవిత్ర నదీ స్నానం చేయడానికి ఎంతమాత్రం అనువుగా లేకపోగా స్నానం చేస్తే ఒళ్లంతా దద్దుర్లు వచ్చేలా మారడం ఒక విషాదం.
చెప్పడానికి మింగుడు పడని వాస్తవం ఏమిటంటే, ఇక్కడి స్థితి తెలియని బయటి వారే ధర్మపురి స్నానం చేస్తున్నారు తప్పా స్థానికులు ఎప్పుడో మానేశారు. మరో విషా దం ఏమిటంటే, ఇక్కడి పవిత్ర యోగ లక్ష్మీనృసింహస్వా మి వారికి నది నుంచి తెచ్చిన నీళ్లతో నిత్యాభిషేకం చేయడమూ ఎప్పుడో ఆపేశారు. బోర్ల నుంచి వచ్చే పాతాళగంగతోనే అభిషేకం జరుగుతోంది. అంతేకాదు, ధర్మపురికి వెళితే యమపురి లేదన్నది నానుడి. కానీ, ఇప్పుడు ధర్మపురే యమపురిని తలపిస్తున్నదని వేద పండితులు వాపోతున్నారు.

ఊర్లో వుండటానికి మనస్కరించడంలేదనీ అం టున్నారు.
రైతులకు మేలు చేసే ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ను, దాని తాలూ కు వరద నీటిని ఎలాగూ ఆపలేం. కాకపోతే స్థానిక డ్రేనైజీ నీటి విషయంలోనే కాదు, పట్టణ అభివృద్ధి విషయంలో నూ భవిష్కత్ కార్యాచరణ రూపొందించాం. తప్పకుండా చర్యలు తీసుకుంటాం అని స్థానిక శాసన సభ్యులు, ప్రభు త్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. కానీ, తరతరాలు గా నదీస్నానంతోనే తమ జీవితాలు ప్రారంభమయ్యే బ్రాహ్మణ పండితుల కుటుంబాలకు ఆయన మాటలు వినిపించడం లేదు. ధర్మపురి పునరుద్ధరణ కోసం ఒక అభివృ ద్ధి కమిటీ పేరిట వంద కోట్లతో ప్రణాళిక రచించి, దాన్ని ముఖ్యమంత్రికి ఇచ్చిన శాసన సభ్యులు అందులో తక్షణ ప్రాధాన్యాలేమిటో నిర్ణయించకపోవడం పట్ల వారు నిరసనతోనే ఉన్నారు. ధర్మపురికి ఒకనాటి వైభవం గురించి ఆశించడం లేదు. కనీస నదీస్నానం కోసం మేం తపించ డం కూడా అత్యాశేనా అని గండి రాజన్న శాస్త్రి విచారంగా అన్నారు.

ధర్మపురి వాసుల క్షోభకు కారణం ఒకటని కాదు. గోదావరి స్నానం చేయాలంటే పందుల బెడద బాగా పెరిగింది. భక్తులు నదిలో పారవేసే కొబ్బరి చిప్పలకోసం పందులు నదిలోకి దిగడం ఇక్కడ మామూలే. అలాగే, పిండప్రదానాలు చేసేటప్పుడు వదిలే ఆస్తికలు, బూడిద, రెండేసి బస్తా ల బొగ్గులు నదిలో వదలడమూ ఉన్నది. దీనికి తోడు ఆం జనేయస్వామి, అయ్యప్ప దీక్ష తీసుకునే భక్తులు తమ వ్రతాన్ని వీడే ముందు ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారు. వారు వ్రతాన్ని విడుస్తూ నదిలో పారేసే దుస్తులు, మాలలు, ఫొటోలతో నదిలో కాలు పెట్టలేని స్థితి. ఇక జం తు బలులతో నదిలో రక్తం కలవడమూ ఉన్నది. అయినా గానీ నదీస్నానం తమ జీవనశైలిలో భాగం కావడం వల్ల ఇప్పటికీ పదుల సంఖ్యలో పట్టణ వాసులు ముక్కుముసుకుని మరీ స్నానమాచరిస్తున్నారు. పిదప ఇంటికెళ్లి మరోసారి స్నానం చేస్తున్నవైనం విచారం కలిగిస్తున్నది. ఇక, మకర సంక్రాంతి, ఈ మాఘ మాసాల్లో పవిత్ర నదీస్నా నం తప్పనిసరి. దాంతో స్థానిక నదిని కాదని పక్కనున్న దమ్మన్నపేట, రాజారం గ్రామాలకు వెళ్లి అక్కడ పుణ్యస్నానాలు చేసి వస్తున్న దుస్థితి.

ఇంకా ఎక్కువ చెప్పడం అనవసరం. ఒకనాడు వేద ఘోషతో గలగలా పారిన గోదావరి.... సప్త గుండాలతో విలసిల్లిన గోదావరి, ఇసుక తిన్నెలతో, శంకులు, గవ్వలు, రంగురాళ్లతో కూడి శ్రావ్యనాదంగా భక్తులను పావనం చేసి న గోదావరి నేడు నిర్వేదంగా ఘోషిస్తోంది. ఇక్కడి జీవనది శుద్ధనది కోసం తపిస్తోంది. ఈ పట్టణాన్ని వందకోట్లతో అభివృద్ధి చేసే ప్రణాళిక సంగతి సరే. నదీ ప్రక్షాళన కోసం సివరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు బదులు ముందు నదిలో మురుగు నీరు కలవకుండా ఆ వ్యర్థాలను దూరంగా తీసుకెళ్లి వదలడం తొలి ప్రాధాన్యంగా పెట్టుకోవాలి. అటు పిమ్మట నది లక్షణమైన ప్రవాహ శీలత ఇక్కడ లేనందున, తద్వారా దక్షిణ వాహినిగా పేరొందిన ధర్మపురి ప్రశస్తి నశించకుండా ఉండటం కోసం పక్క గ్రామం దమ్మన్నపేట నుం చి నది దక్షిణా పథం తీసుకుంటుండటాన్ని గమనంలోకి తీసుకోవాలి.

అక్కడి నుంచే గోదావరి దక్షణ వాహినిగా మొదలై ధర్మపురిలో ముగుస్తుంది. కాబట్టి... ఇక్కడ భక్తు లు విడిది చేసి, అక్కడ నదీస్నానం చేసి వచ్చేలా...మళ్లీ దైవదర్శనం చేసుకుని తిరిగి వెళ్లేలా ప్రభుత్వం తగిన చర్యలతో ధర్మపురిని విస్తరించి అభివృద్ధి చేయవచ్చు. అట్లా మన సాంస్కృతిక వైశిష్ట్యాన్ని నిలబెట్టుకుంటూ నాగరికత క్రమా న్ని ముందుకు తీసుకెళ్లడం మంచిది. ఆ దిశగా యుద్ధప్రాతిపదికన పని చేయడం అన్నివిధాలా అవసరమని క్షేత్ర పరిశీలన నుంచి అవగతం అవుతుంది.

చివరగా ఒకమాట. పుష్కర వైభవాన్ని ధర్మపురి నుంచే పెంచిన మన ముఖ్యమంత్రి ధర్మపురి మనుగడ విషయం లో తక్షణం పట్టించుకోవాలని పట్టణంలోని బ్రాహ్మణులం తా ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు. మార్చిలో బ్రహ్మోత్సవాల సమయం ఆసన్నమౌతున్నది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకోకపోతే ధర్మపురి అన్నది బయటి వారికేగానీ మాకు మాత్రం కాదని వారు చెబుతున్నారు. నదీ స్నానానికి నోచుకోని వాళ్లం..మేం ధర్మపురి వాసులం ఎట్లవుతాం అని గుండె జగదీశ్వరశర్మ, శ్రీధర శర్మ మొదలు పట్టణంలోని బాహ్మణులంతా నిర్వేదంగా చెబుతున్నారు. మరి చూడాలి.
(వ్యాసకర్త: నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి)
 kandukuri

1017
Tags
 ,