HomeEditpage Articles

జల జాతర.. జన జాతర

Published: Tue,March 21, 2017 01:48 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నీ బ్రెజిల్ రియోడిజనెరోలో సమావేశమై 1992లో నీటి ప్రాధాన్యాన్ని గుర్తించి ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచ జల దినోత్సవం జరుపాలని నిర్ణయించాయి. మనదేశంతో సహా అనేకదేశాలు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. రాబోయే రోజుల్లో జలయుద్ధాలు సంభవించే దుస్థితి దాపురిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి నీటి సంరక్షణ, వినియోగం పట్ల ప్రజల్ల అవగాహనను కల్పించడానికి ప్రపంచ జల దినోత్సవం జరుపాలని నిర్ణయించింది.

ప్రభుత్వం కృషి చేసినంత మాత్రాన ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టుకోవడం సాధ్యపడకపోవచ్చును. ప్రజలు అవసరమైన మేరకే నీటిని వినియోగించుకోవాలి. ఒక్క నీటి చుక్కను కూడా వృథా కానివ్వకూడదు. ప్రతి చెరువును సర్కారు చెరువుగా కాకుండా ఊరి చెరువుగా మన చెరువుగా భావించాలి. పొలంలో పడిన చినుకు పొలంలోనే, ఇంటి ఆవరణలో పడిన చినుకు ఇంటి జాగలోని ఇంకేవిధంగా చర్యలు చేపట్టాలి. జల సంరక్షణ సామాజిక బాధ్యత.


ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభు త్వం, వాక్ ఫర్ వాటర్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి రేపు (మార్చి 22) రాష్ట్రంలోని చెరువుల దగ్గర జల జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ది. చెరువు నీటిని వినియోగిస్తున్న ఆయకట్టు రైతు లను మత్స్యకారులను, పల్లె ప్రజలను, విద్యార్థులను, అధికారులను చెరువు కట్టపై సమావేశపర్చి వారికి నీటి ప్రాధాన్యంపై, వినియోగంపై, జల సంరక్షణపై అవగాహన కల్పించడమే జల జాతర ఉద్దేశం. ప్రతి చెరువు దగ్గ ర జల జాతర, జన జాతర జరుపుకోవాలి. నీటి వనరుల చుట్టే నాగరికత, మానవ వికాసం పరిఢవిల్లింది. జనాభా, పశు సంపద, వ్యవసా యం, పరిశ్రమలు పెరుగుతుండటంతో నీటి వనరుల ఒత్తిడి ఎక్కువవుతున్నది. అభివృద్ధి చెందిన దేశాల్లో 2025 నాటికి నీటి వినియోగం 50 శాతం పెరుగవచ్చునని, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సుమారు 18 శాతం జలవినియోగం ఎక్కువయ్యే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ప్రపంచ జనాభాలో 80 శాతం మంది నీటి కొరతను ఎదుర్కొంటున్నారు.
నీళ్ళ గణాంకాలు: భూమిపై వున్న నీటిలో 97 శాతం ఉప్పునీరే. మూడు శాతం మాత్రమే మంచినీరు. ఈ మంచినీటిలో మానవ వినియోగానికి నదుల్లో, చెరువుల్లో అందుబాటులో ఉన్నది 0.3 శాతమే. మిగిలిన మంచినీరు మంచు పర్వతాల్లో, భూగర్భంలో, మానవ శరీరంలో, వాతావరణంలో తేమ రూపంలో ఉన్నది. ఈ నీటిని వినియోగంలోకి తేవడానికి ఎంత నైపుణ్యాన్ని ఉపయోగించినా ఒక్క శాతం నీటిని కూడా వాడుకోవడం అసాధ్యం. ఏటా మానవుల నీటి అవసరాలు పెరిగినట్లు మంచినీటి వృద్ధి జరుగదు. అందుబాటులో ఉన్న నీటికి తగినట్లుగా జీవన విధానాన్ని మార్చుకోవాలి. ఒక్కొక్క వాన చినుకును ఒడిసి పట్టుకొనే విధంగా జల సంరక్షణ చర్యలుండాలి. నదీ జలాలను వందశాతం వినియోగించుకోవాలి. ఒక్క గోదావరి నదీ జలాలే సుమారు రెండు మూడు వేల టీఎంసీలు ఏటా సముద్రంలో కలువడం బాధాకరం.

వివిధ అవసరాలకు ఎంత పరిమాణంలో నీరు వినియోగమవుతున్నదో చూద్దాం. లభ్యమవుతున్న మంచినీటిలో 70 శాతం వ్యవసాయానికి, 22 శాతం పరిశ్రమలకు, 8 శాతం ఇతర అవసరాలకు వినియోగించబడుతున్న ది. ఒక్క కిలో బియ్యానికి నాలుగు వేల లీటర్లు, కిలో పత్తి పంటకు వెయ్యి లీటర్లు, గోధుమకు 4000 లీటర్లు, టమాటాకు 200 లీ. ఒక్క గుడ్డు ఉత్పాదనకు 200 లీ. ఒక గొర్రె జీవితకాలానికి 10,400 లీ., ఎద్దుకు 15,400 లీ. కోడికి 4,300 లీ. పందికి 6 వేల లీటర్ల నీరు అవసరం.

తాగునీటి కోసం ఒక మనిషి వినియోగించేది రోజూ మూడు, నాలుగు లీటర్లే. అయినా ఇతర అవసరాలకు వినియోగిస్తున్నది వంద లీటర్లకుపైనే. మనుషుల శరీరం బరువులో సుమారు 70 శాతం నీరే!
ప్రపంచవ్యాప్తంగా మానవాళి, పశుపక్ష్యాదుల మనుగడ, ప్రకృతి-పచ్చదనం అంతా ఒక్క శాతం లభ్యమయ్యే మంచినీటిపైనే ఆధారపడి ఉన్నదంటే నీటి వనరుల పట్ల ఎంత జాగ్రత్త వహించాలో అర్థం చేసుకోవచ్చు.

జల సంరక్షణలో తెలంగాణ నమూనా: వరద నీటిని ఒడిసిపట్టి మానవాళి మనుగడకు సమర్థవంతంగా ఎలా వినియోగించుకోవాలో తెలంగాణ ప్రపంచానికి చాటింది. కాకతీయులకు పూర్వం నల్గొండ, మహబూబ్‌నగర్, కృష్ణా, కర్నూలు జిల్లాలతో కూడిన రాజ్యాన్ని కందూరు చోడులు పరిపాలించారు. ఈ వంశానికి చెందిన ఉదయనుడు సుమారు 11వ శతాబ్దంలో నల్లగొండ పక్కన ఉన్న ఉదయ సముద్రాన్ని (పానగళ్ చెరువు) నిర్మించాడు. మూసీ నదిపై (వలిగొండ సమీపంలో) కత్వ నిర్మించి అక్కడి నుంచి ఉదయ సముద్రానికి కాల్వను తవ్వించాడు. తదనంతర కాలంలో ఈ కాల్వ ముప్పై చెరువులతో కలుపబడింది. మూసీపై ఉన్న కత్వను ఇప్పుడు ఆసిఫ్‌నహర్ కత్వగా పిలుస్తున్నారు. గొలుసు చెరువుల వ్యవస్థకు అంకురార్పణ ఉదయ సముద్రంతోనే మొదలైందనుకోవచ్చు.
వెయ్యి సంవత్సరాలు తెలంగాణను కరువు కాటకాల నుంచి రక్షించినవి ఈ గొలుసు చెరువులే. వీటిద్వారా ఊటలు పెరిగి భూగర్భ జలాలు సమృద్ధిగా లభ్యమయ్యాయి. తెలంగాణలో ఏ ఊళ్ళో చూసినా వందలాది మోట బావులు, చేద బావులు కన్పించేవి. వానాకాలంలో ఈ బావుల నుంచి బిందె లు, కుండలతో నీళ్ళు ముంచుకొని తీసుకుపోయేవారు. గత అరవై ఏళ్ళలో పరిస్థితుల్లో మార్పు వచ్చింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా గొలుసు చెరువులు ధ్వంసమయ్యాయి. ఒర్రెలు, శిఖం భూములు కబ్జాలకు గురైనవి. చెరువులు కుంటల్లో పూడిక చేరి ఊటలు అంతరించినయి. గంగాళాలను పోలిన చెరువులు తాంబాళాలుగా మారినవి. కాలక్రమేణా భూగర్భ జలాలు అట్టడుగుకు చేరి మోటలు అంతరించినవి. ఈ బావుల స్థానంలో సుమారు 14 లక్షలకు పైగా బోర్లు వేసుకున్నారు రైతులు. బోర్లు ఎండిపోయి అప్పులు తీర్చలేని స్థితిలో రైతులు వేలాదిగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం నియమించిన జయతీఘోష్ కమిటీ కూడా ఈ విషయా న్ని ధృవీకరించింది. చెరువుల ధ్వంసం వల్ల తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. గతంలో ప్రపంచానికి గొలుసు చెరువుల నమూనాను అందించిన తెలంగాణ ఇప్పుడు స్వరాష్ట్రంలో, స్వయంపాలనలో సరికొత్త జల సంరక్షణ విధానాలను ఆవిష్కరిస్తున్నది.

బంగారు తెలంగాణ సారథి, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మార్గదర్శకత్వంలో, భారీ నీటి పారుదల శాఖామంత్రి హరీశ్ రావు గారి సారథ్యంలో గత రెండేళ్ళ కిందట ప్రారంభమైన మిషన్ కాకతీ య ద్వారా తెలంగాణ పల్లెలకు మళ్ళీ పూర్వ వైభవం వస్తున్నది. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి అనేక ప్రాజెక్టుల రిజర్వాయర్ల పనులు కొనసాగుతున్నాయి. ఎల్లంపల్లి దిగువన కాళేశ్వరం దాకా ఎండిపోయి మరో సరస్వతి నదిగా మారబోతున్న గోదావరి నదిలో మేడిగడ్డ అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల ద్వారా ఏడాది పొడవునా నీరు నిలిచి సజీవనదిగా సాక్షాత్కరించబోతున్నది.

ప్రపంచబ్యాంకు నిధులతో నల్గొండ జిల్లా చండూర్ బేసిన్‌లో 2015లో చేపట్టిన హైడ్రాలజీ ప్రాజెక్టు సత్ఫలితాలనిస్తున్నది. ఈ ప్రాజెక్టు ఒక ప్రయోగాత్మకంగా చేపట్టిన పైలట్ ప్రాజెక్ట్. గతంలో వాటర్‌షెడ్‌లో భాగంగా నిర్మించిన చెక్‌డ్యాంల వద్ద రీఛార్జింగ్ షాఫ్ట్‌లను నిర్మించడం ద్వారా వరదనీటిని వడబోసి భూగర్భంలోకి పంపే ప్రక్రియ ద్వారా భూగర్భ జలాలు ఆశించిన రీతిలో లభ్యమయ్యాయి. మిషన్ కాకతీయ అమలైన చెరువుల్లో పూడికతీత వల్ల సుమారు 4 మీ. నుంచి 15 మీ. వరకు భూగర్భ జలాలు పెరిగినట్లు రాష్ట్ర భూగర్భ జల శాఖ గణాంకాలు తెలుపుతున్నాయి.
ఈ పద్ధతిలోనే మిషన్ కాకతీయ మిగిలిన మూడు దశలు పూర్తయి, ప్రతి చెక్‌డ్యాంలోనూ, వరదనీరు లభ్యమయ్యే వాగులు, వంకల్లోనూ రీఛార్జింగ్ షాప్ట్‌ల ను నిర్మిస్తే తెలంగాణలో ప్రతి బోరులో, ప్రతి బావిలో చేతికందే స్థాయిలో నీరు లభ్యమవుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు. తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థను ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంగతి విదితమే. ప్రభుత్వం కృషి చేసినంత మాత్రాన ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టుకోవడం సాధ్యపడకపోవచ్చు. ప్రజలు అవసరమైన మేరకే నీటిని వినియోగించుకోవాలి. ఒక్క నీటి చుక్కను కూడా వృథా కానివ్వకూడదు. ప్రతి చెరువును సర్కారు చెరువుగా కాకుండా ఊరి చెరువుగా మన చెరువుగా భావించాలి. పొలంలో పడిన చినుకు పొలంలోనే, ఇంటి ఆవరణలో పడిన చినుకు ఇంటి జాగలోని ఇంకేవిధంగా చర్యలు చేపట్టాలి. జల సంరక్షణ సామాజిక బాధ్యత.
(వ్యాసకర్త: తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్)
(రేపు ప్రపంచ జల దినోత్సవం)
Prakash

1078
Tags
 ,