HomeEditpage Articles

కాంగ్రెస్‌కు మేలుకొలుపు

Published: Tue,March 21, 2017 01:46 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

ఐదు రాష్ర్టాల ఎన్నికలను బీజేపీ సిద్ధాంత, రాజకీయ విజయంగా కాకుండా..అభివృద్ధి ఎజెండాగా ప్రజల ఐకమత్యం ఆధారంగా సాగిన ప్రజానుకూల స్పందనగా చూడాలి. అలాగే సమర్థ నాయకత్వం, అవినీతిరహిత పాలన పట్ల ప్రజల సానుకూలతగా కూడా చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఇకముందైనా రాజకీయ పార్టీలు సమస్యలు, అభివృద్ధి ఎజెండాగా రాజకీయాచరణను రూపొందించుకోవాలి.

ఈమధ్య జరిగిన ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీ ఎన్నడూ లేనివిధంగా పుంజుకొని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో అఖండ విజయం సాధించింది. అంతేగాక గోవా, మణిపూర్ రాష్ర్టాల్లో కావల్సిన మెజారిటీ రాకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిం ది. ఇది దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలన్నీ రాబో యే కాలంలో బీజేపీ అతిపెద్ద, అత్యంత ప్రభావశీలపార్టీగా ఎదుగటం గమనించదగ్గది. ఈ క్రమంలో బీజేపీ సాధించిన విజయంలో పటిష్ట నాయకత్వ ప్రభావమే ఎక్కువని చెప్పకతప్పదు. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ జవసత్వాలు నింపడంలో, ఆపార్టీని విజయతీరాలకు చేర్చటంలో విఫలమైన తీరు ఒకటి కనిపిస్తున్నది. ఇది కాంగ్రెస్ పార్టీకి రాబోయే కాలమంతా గడ్డు పరిస్థితిని చెప్పకనే చెబుతున్నది. ఉత్తరప్రదేశ్‌లో రాహుల్‌గాంధీ ప్రత్యక్షంగా ముందుండి నడిపించినా కాంగ్రెస్ కనీస ప్రభావాన్ని వేయలేకపోయిం ది. కాంగ్రెస్ పార్టీ పోటీచేసిన నియోజకవర్గాల్లో కనీసం 20 శాతం సీట్లను గెలుచుకుంటుందని అనుకున్నారు. తీరా అది సాధించింది కేవలం పదిశాతం సీట్లనే. పంజాబ్‌లో అమరీందర్‌సింగ్ సామర్థ్యం కలిసివచ్చి నెగ్గుకొచ్చినా, మణిపూర్, గోవాల్లో అతిపెద్ద పార్టీగా నిలిచినా అధికారాన్ని దక్కించుకోకపో వడం మింగుడుపడని విషయంగానే కాంగ్రెస్ వర్గాల్లో మిగిలిపోయింది. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీకి రాబోయే కాలంలో ఎదురయ్యే సవాళ్లను ముందుంచినట్లయ్యింది. రాహుల్‌గాంధీ నిజాయితీపరుడు, క్రమశిక్షణ కలిగిన వాడే అయి నా, మోదీ ప్రజాకర్షణ శక్తిముందు నిలువలేకపోయాయి. ఈ నేపథ్యంలో అయినా కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవాన్ని సంతరించుకునేందుకు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. రాబోయే ఎన్నికల నాటికైనా కాంగ్రెస్ జవసత్వాలు పుంజుకోవాలంటే తీసుకోవాల్సిన చర్యలను గుర్తు చేసింది. కాంగ్రెస్‌కు హై కమాండ్ స్థానంలో నాయకత్వ కూటమి కొంత మేలు చేస్తుందేమో ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలి.

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన అందించిందన్న అపవాదు ఉన్నది. అది కేవలం రాజకీయవర్గాల్లోనే గాక, నేటి యువతరంలోనూ ఏర్పడ్డది. ఈ నేపథ్యంలోంచే అనేకవర్గాల నుంచి ఎదుర్కొం టున్నది. ఆధునిక సమాజంలో ఒక రాజకీయపార్టీ ఇలా కొనసాగటం తగదు. పార్టీలో అధికార వికేంద్రీకరణ జాతీయస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా జరుగాలి. ఈ అధికార వికేంద్రీకరణ కాంగ్రెస్‌లోనే కాదు, అటు బీజేపీలోనూ ఉన్నదా అంటే అనుమానమే. కానీ కాంగ్రెస్ అలాంటి అపవాదునుంచి, పరిస్థితి నుంచి బయటపడాల్సిన ఆవశ్యకత ఎదుర్కొంటున్నది. ఈ మధ్య కాలంలోనే కొంతమంది నేతల ఆలోచనలు, ప్రభావాలు కాంగ్రెస్ పార్టీ పనితీరుపై కనిపిస్తున్నా అదే కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలను చేకూర్చలేకపోతున్నది. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో పాటు సమాజ్‌వాదీ పార్టీని బీజేపీ ఆత్మరక్షణలో పడేసింది. బీఎస్పీని అయితే కనుమరుగు చేసింది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఉపయోగపడింది ఎస్పీలోని తండ్రీ కొడుకుల సమరమే పరిస్థితి పార్టీ ఐక్యంగా లేదనే విషయాన్ని తేటతెల్లం చేసింది. అయితే ఎస్పీలో ఎన్నికల సమయంలో జరిగిన ఆధిపత్య పోరులో అఖిలేశ్ యాదవ్ పార్టీపై పట్టుబిగించినా, ములాయంసింగ్ యాదవ్‌కు గత చరిత్ర ఆధారంగా ఉన్న ప్రభా వం తక్కువది కాదు. ఆయన ప్రముఖ సోషలిస్టు నాయకుడు రామ్‌మనోహర్ లోహియా అనుచరుడిగా, ఆ తర్వాత జయప్రకాశ్ నారాయణ్ అనుచరుడిగా పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు. స్థానికంగానేగాక, జాతీయస్థాయిలో నూ గుర్తింపు గౌరవం ఉన్నవాడు. కాబట్టి పార్టీపై ఆధిపత్యం సాధించటంతోనే యూపీ ప్రజల మన్ననలను అఖిలేశ్ పొందలేకపోయాడు.

ములా యంకు తగురీతిలో స్థానం, గౌరవం దక్కి ఉంటే ఎన్నికల ఫలితాలు మరో విధంగా ఉండేవేమో. ఎస్పీ పరిస్థితి ఇంత దయనీయంగా ఉండేది కాదేమో. అలాగే కాంగ్రెస్‌తో జతకట్టడం మంచిదే కావచ్చు. కానీ ఏమాత్రం కార్యకర్త ల బలంలేని కాంగ్రెస్‌కు అన్ని సీట్లు కేటాయించటం ప్రతికూల ఫలితాలనే ఇచ్చింది. అలాగే రాహుల్‌గాంధీ స్థానిక ప్రజల సమస్యలను ప్రజల ముం దుంచటంలో విఫలమయ్యాడన్నది అర్థమవుతున్నది. మరోవైపు ఇలాంటి పరిస్థితులను తనకు అనుకూలంగా మల్చుకున్న మోదీ తనదైన సమ్మోహనశక్తితో ప్రజలను ఆకట్టుకున్నారు. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవట మే కాదు, తనవైపు తిప్పుకున్నారు. అలాగే నరేంద్రమోదీ తనదైన ముద్రతో చేసిన పథకాల ప్రచారంతో కూడా ప్రజలను ఆకట్టుకున్నారు. స్వచ్ఛభారత్, పెద్దనోట్ల రద్దుతో సమాజాన్ని స్వచ్ఛంగా మార్చటమే కాదు, ఆర్థిక అవినీతిని కూడా కడిగేసి సచ్ఛీల సమర్థపాలన అందిస్తానని ప్రజలను ఒప్పించగలిగారు. దీంతో పేదలు కూడా తమ ఆశలు, ఆకాంక్షలు మోదీ పథకాలలో చూసే పరిస్థితి తీసుకురాగలిగారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం బీజేపీ మోదీ నాయకత్వంలో సోషల్ ఇంజినీరింగ్ సమర్థవంతంగా అమలు చేయగలిగింది. దీంతో యూపీలోని వెనుకబడిన తరగతులు, మోస్ట్ బ్యాక్‌వర్డ్ కులాలు, యాదవేతరులు, ఓబీసీలు, జాతవ్ దళితులు అంతా బీజేపీ నీడకు చేరారు. ఇది ఇప్పటిదాకా బీజేపీకి ఉన్న బ్రాహ్మణ అనుకూల పార్టీ అని ఉన్న అభిప్రాయాన్ని, పేదలు, వెనుకబడిన వర్గాల అనుకూల పార్టీగా నిలబెట్టింది. ఇదే బీజేపీ విజయ రహస్యం.

ప్రస్తుత సంకేతాలను బట్టి మునుముందు జరుగబోయే ఎన్నికల్లో ఫలితా లు ఎలా ఉండబోతున్నాయో లీలగా అయినా అర్థమవుతున్నది. రానున్న రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ రాష్ర్టాల్లో బీజేపీకి గట్టి పునాదే ఉన్నది. మోదీ-అమిత్ షా ద్వయం తమ అధునాతన ఎన్నికల ప్రచార, ప్రణాళికాబద్ధమైన ప్రచార సరళి బీజేపీని గెలుపు గుర్రాన్ని ఎక్కించవచ్చు. ఈ పరిస్థితుల్లో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారాన్ని నిలుపుకుంటుందా అన్నదే ప్రశ్న. అలాగే ప్రభుత్వ వ్యతిరేక అనే అంశం ఈ ఎన్నికల్లోనూ ఓ ప్రధాన అంశంగా ఉన్నదన్న విషయాన్ని అంగీకరిస్తే, కర్ణాటకలో కాంగ్రెస్‌కు కష్టాలే ఎదురుకావచ్చు. ఈ పరిస్థితులు ఇలా ఉన్నా చాలామంది విశ్లేషకుల అభిప్రాయం ఏమంటే.. ప్రభుత్వ వ్యతిరేకత కూడా యూపీ, ఉత్తరాఖండ్‌లో పనిచేసింది. ఇది మోదీ ప్రజాకర్షణ శక్తికి తోడై బీజేపీ అఖండ విజయం అందించింది. అన్నింటికన్నా ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో కులాలవారీగా ఉన్న విభజన రేఖలు తొలిగిపోయి, అభివృద్ధి ఎజెండా వెనుక ఓటర్లు సమీకృతమయ్యారు. ఒకరకంగా గత కొంతకాలంగా సాగుతున్న దానికి భిన్నంగా కొత్త మార్గా న్ని చూపడంగానే చెప్పుకోవచ్చు. ఇది రానున్న కాలంలో మంచి పరిణామాలనే సూచిస్తున్నది. కుల సమీకరణాలపై ఆధారపడి రాజకీయ చేయాలనుకునే పార్టీలు ఇప్పటికైనా తమ రాజకీయ దృక్పథాల ను, కార్యాచరణలను మార్చుకోవాలి. ప్రజలను అనేక సమూహాలుగా, కూటములుగా, కులాలుగా చీల్చే రాజకీయాల స్థానంలో అందరినీ ఏకం చేసే రాజకీయ కార్యాచరణవైపు మళ్లడం ఓ శుభసూచకంగా కూడా భావించవచ్చు. ఈ క్రమంలో ఈ ఐదు రాష్ర్టాల ఎన్నికలను బీజేపీ సిద్ధాంత, రాజకీయ విజయంగా కాకుండా.. అభివృద్ధి ఎజెండాగా ప్రజల ఐకమత్యం ఆధారంగా సాగి న ప్రజానుకూల స్పందనగా చూడాలి. అలాగే సమర్థ నాయకత్వం, అవినీతి రహిత పాలన పట్ల ప్రజల సానుకూలతగా కూడా చెప్పుకోవాలి. ఈ నేపథ్యం లో ఇకముందైనా రాజకీయ పార్టీలు సమస్యలు, అభివృద్ధి ఎజెండాగా రాజకీయాచరణను రూపొందించుకోవాలి. ఇదే దేశానికీ, ప్రజలకు మేలు చేస్తుంది.
(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయెన్స్)

586
Tags
 ,